[dropcap]ఈ[/dropcap] మధ్యనే ఉద్యోగ విరమణ చేసిన సదానంద్ హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకున్నాడు. ఇద్దరు పిల్లలూ పెండ్లిళ్లు చేసుకుని, పిల్లాపాపలతో, ఉద్యోగరీత్యా వేరే పట్టణాల్లో హాయిగా ఉంటున్నారు. ఇక ఇంట్లో ఉండేది ఇద్దరే… తనూ తన శ్రీమతి.
ఆ క్రమంలో సదానంద్ ఆలోచనలన్నీ ఒకే విషయం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాయి. శేషజీవితాన్ని సుఖసంతోషాలతో ఆనందోత్సాహాలతో, ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా గడపడం ఎలా? అందుకోసం నిర్ధారించబడిన సూత్రాలు ఏమైనా ఉన్నాయా? అని వాటికోసం వెతుకుతున్న సమయంలో, ఆ రోజు దినపత్రికలో చదివిన ఒక వ్యాసం తనకో దారి చూపించింది. అనుకున్నట్లే తన జీవితాన్ని ముందుకు నడిపించడానికి పది సూత్రాలను తెలియజేసి ఆ రచయిత ఎంతో పుణ్యం కట్టుకున్నాడు.
నిజానికి ఆ పది సూత్రాలు సదానంద్‌తో సహా ఉద్యోగ విరమణ చేసిన ప్రతి ఒక్కరూ ఆచరించదగినవే. వాటిల్లో ఒకటి సదానంద్‌ని విశేషంగా ఆకట్టుకుంది.
తనకున్న అభిరుచులు, సరదాలు, ఉద్యోగం చేస్తున్నప్పుడు సమయాభావం వల్ల కాని, పని ఒత్తిడి మూలంగా కాని, నెరవేర్చుకోలేనివారు, ఉద్యోగ విరమణ చేసిన తరువాత వాటిని నెరవేర్చుకోడానికి కృషి చేయాలి.
ఆ కోవలో ఆలోచిస్తే సదానంద్‌కి…. సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక రచనలు చేయాలనే కోరిక ఒక తీరని కోరికగా మిగిలిపోయింది. ఇప్పుడా కోరికను తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు సదానంద్. వెంటనే తన ఆలోచనలకు పదును పెట్టి రచనలకు శ్రీకారం చుట్టాడు.
కాలగమనంలో మూడు సంవత్సరాలు వెనక్కి జరిగిపోయాయి. సదానంద్ కలం నుండి రెండు నాటికలు, రెండు నవలలు, పది కథలు జాలువారాయి. వాటిలో కొన్ని వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. మరి కొన్ని ప్రచురణకు నోచుకోలేదు. అయినా సరే తరగని ఉత్సాహంతో తన కలాన్ని కదిలిస్తూనే ఉన్నాడు సదానంద్.
ఆ రోజు పత్రికలో వచ్చిన ఒక ప్రకటన… కుంటుతూ నడుస్తున్న వ్యక్తికి, ఒక చేతి కర్ర ఊతంగా లభించినంత సంతోషాన్నందిచింది సదానంద్‌కి.
“టీ.వి మరియు సినిమా కథల రచనలో మెళకువలు నేర్పించడానికి రాష్ట్ర తెలుగు రచయితల సంఘం శిక్షణా తరగతులను నిర్వహించబోతుంది.
ఔత్సాహిక రచయితలు ఆ శిక్షణా తరగతులలో పాల్గొని, ప్రఖ్యత టి.వి మరియు సినిమా కథా రచయితలు, దర్శకులు ఇచ్చే సూచనలను, సలహాలను, మెళకువలను తెలుసుకోవచ్చు.”
టి.వీలకు సినిమాలకు కథలు వ్రాయాలనే ఉద్దేశం లేకపోయినా, కథా రచనలో మెళకువలు నేర్చుకుని తన రచనా నైపుణ్యానికి మరిన్ని మెరుగులు దిద్దుకోవాలనుకున్న సదానంద్, వెంటనే ఆ కార్యక్రమానికి తన పేరును నమోదు చేసుకున్నాడు.
ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు కార్యక్రమం జరిగే ప్రదేశానికి చేరుకున్నాడు సదానంద్. అప్పటికే సభాస్థలి అంతా శిక్షణకు హాజరైన అభ్యర్ధులతో కిక్కిరిసిపోయింది. సుమారు రెండు వందల మంది ఉన్నారు. వారిలో, పది మంది దాకా మహిళలు, పాతిక మంది దాకా వృద్ధులు ఉన్నారు. వృద్ధులు అనే కంటే సీనియర్ సిటిజన్స్ అంటే బాగుంటుంది.
కార్యక్రమం మొదలైంది. రచనా రంగంలో విశేషమైన కృషి చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు, తనదనంతరం దర్శకులుగా ఎదిగి టీ.వి. మరియు సినిమా పరిశ్రమల్లో తమదంటూ ఒక ముద్ర వేసుకున్నవారు, తమ తమ అనుభవాలను వివరిస్తూ, తాము ఏవిధంగా ఉన్నత శిఖరాలకు చేరుకోగలిగారు…. అనే విషయాలను, ఒక్కరొక్కరుగా వేదిక పైకి వచ్చి మాట్లాడారు.
ఉత్తమ కథా రచనల కోసం పాటించ వలసిన మెళకువలకు వివరంగా విశదీకరించారు. వచ్చిన వారంతా ఎంతో శ్రద్ధాసక్తులతో, ఏకాగ్రతతో అనుభవజ్ఞులు చెప్పిన పాఠాలను విని ఆకళింపు చేసుకున్నారు. సదానంద్ కైతే అక్కడ నేర్చుకున్న విషయాలు, ఉత్తరోత్రా తనకెంతో ఉపయుక్తంగా ఉంటాయనే నమ్మకం కుదిరింది.
కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా ఉల్లాసంగా కొనసాగింది, చివరిగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారి ప్రశ్నలకు రచనా రంగంలో ఆరితేరిన ఆ వ్యక్తుల సమాధానాలు. వివిధ రకాల ఆలోచింపజేసే ప్రశ్నలకు సముచిత సమాధానాలు చెప్పి అడిగిన వారందరి సందేహాలను నివృత్తి చేశారు వక్తలు. అందరి ముఖాల్లో తృప్తి తాలూకూ చిహ్నాలు ప్రస్ఫుటంగా ప్రతిబింబించాయి.
ఆ తరుణంలో ఒక సీనియర్ సిటిజన్ లేచి నిల్చుని…
“సార్ నేనీ మధ్యనే ఉద్యోగ విరమణ చేశాను. అప్పటి నుండి రచానా వ్యాసంగాన్ని ఒక వ్యాపకంగా పెట్టుకున్నాను. పరవాలేదు… ఓ మోస్తరుగా వ్రాయగలుగుతున్నాను. ఈ రోజు నేనిక్కడ తెలుసుకున్న విషయాలు భవిష్యత్తులో నాకెంతో ఉపకరిస్తాయని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన కార్యక్రమ నిర్వాహకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాను.”
“ఇప్పుడు నాదో చిన్న ప్రశ్న. మరేం లేదు సార్!… ఈ మధ్యనే నేను ఒక సినిమా కథ వ్రాయడం జరిగింది. ఆ కథ ఒక సినిమాగా తెరపైకి రావాలంటే ముందుగా నేనెవర్ని కలవాలి?… ఏ విధంగా ముందుకెళ్ళాలి?… ఈ విషయంలో మీ సంస్థ నాకేమైనా సహాయపడగలదా?… దయచేసి తెలియచేయండి….” అని వినయపూర్వకంగా అడిగాడు.
వెంటనే నిర్వాహక సంస్థ కార్యదర్శి నాగరాజు కల్పించుకుని…
“చూడండి సార్…. మీరు ఓ రిటైర్డ్ సీనియర్ సిటిజన్… ఉద్యోగ నిర్వహణలో ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుని, మరెన్నో ఒడుదుడుకులను ఎదుర్కొని, ఇప్పుడు రిటైరయ్యారు. ఈ వయసులో మీరు మీ మనవళ్లు, మనవరాళ్లుతో కలిసి ఆటపాటలతో కాలక్షేపం చేస్తే బాగుంటుంది. అంతే కాని, ఈ రచనా రంగంలోకి వచ్చి మీరు ఏమీ సాధించలేరు. ఇందులోకి రావాలంటే ప్రాణం పెట్టాలి. పూర్తి సమయాన్ని కేటాయించాలి. ఇప్పటికే ఎన్నో సంవత్సరాల నుండి ఈ రచనా రంగంలో వ్రేళ్ళూనుకుని వున్న వారితో మీరు పోటీ పడలేరు. కాబట్టి మీరు మీ ప్రయత్నాన్ని విరమించుకోండి. మీ లాంటి వారు ఈ రంగంలోకి రావడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను…” అంటూ తన మనసులోని అక్కసును బహిర్గతం చేశాడు.
ఈ హఠాత్పరిణామానికి అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఖిన్నులయ్యారు. సదానంద్‌కైతే కోపం కట్టలు తెంచుకుంది. అప్పటి వరకు ఎంతో హుందాగా నడిచిన సభా కార్యక్రమాలకు భంగం వాటిల్లకూడదనే సదుద్దేశంతో తనను తాను నిభాళించుకుని గంభీరంగా కూర్చున్నాడు సదానంద్. అయినా మనసులోంచి పుటుకొచ్చే ఆలోచనలను కట్టడి చేయలేకపోయాడు సదానంద్.
‘నిజానికి నాగరాజు చాలా గొప్ప రచయితగా నిర్మాతగా, దర్శకుడిగా, అందరికీ చిరపరిచితుడు. అలాంటి ఉన్నతమైన వ్యక్తి ఇలా మాట్లాడటమేంటి? అసలు ఆయన ఉద్దేశం ఏమయ్యుంటుంది? సీనియర్ సిటిజన్స్ కొత్తగా రచనా రంగంలోకి ప్రవేశించడానికి అనర్హులనా? వారికి ఆ రంగంలో రాణించడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు ఉండవనా? ఏ విధంగా తను ఆ నిర్ణయానికి వస్తాడు? సీనియర్ సిటిజన్ల గురించి మరీ ఇంత చులకనగా మాట్లాడతాడా? పైగా వాళ్లు ఈ రంగానికి రావడాన్ని తను పూర్తిగా వ్యతిరేకిస్తాడట!… అలాంటి మాటలు వింటుంటే ఏ సీనియర్ సిటిజన్‌కైనా ఒళ్లు మండదా?… పెద్దవారిని వృద్ధులను మరీ అంతగా అవమానిపరచవచ్చా?….’ అనుకుంటూ విపరీతమన కోపంతో ఊగిపోతున్నాడు సదానంద్.
సరిగ్గా అదే సమయంలో నాగరాజు మాటలతో కార్యక్రమంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయనే భయంతో, ఆ సంస్థ అధ్యక్షులు సాయిరామ్ పరిస్థితిని చక్కదిద్దడానికి పూనుకుని మాట్లాడటం మొదలెట్టాడు.
“మీ అందరికి నాదొక విజ్ఞప్తి. దయ చేసి వినండి. నాగరాజుగారు రచనా రంగంలోని సీనియర్ సిటిజన్ల ప్రవేశం గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం. వాటికి మా సంస్థ నియమ నిబంధనలకు ఎలాంటి సంబంధం లేదు. ఆ మాటకొస్తే…. రచనా రంగంలోకి రావడానికి కులం, మంతం, ప్రాంతం, లింగం , చదువు, వయసు అనేవి ప్రామాణికం కాదు. ధనికులు, పేదలు అనే తారతమ్యం లేదు. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఈ రంగంలోకి అడుగు పెట్టొచ్చు. వాస్తవానికి… ప్రస్తుత పరిస్థితుల్లో టీ.వీ మరియు సినిమా పరిశ్రమకి కదా రచయితల అవసరం మిక్కిలిగా వుంది. కాకపోతే…. ఈ రచనా రంగంలోకి ప్రవేశించి రాణిచాలంటే…. నైపుణ్యం, క్రమశిక్షణ, కఠోరశ్రమ, అంకితభావం మరియి సమాజంలో నెలకొనియున్న స్థితిగతులపై పూర్తి అవగాహన తప్పనిసరిగా వుండాలి.”
“ఇవన్నీ దండిగా వున్నా కూడా అంతిమంగా ‘అదృష్టం’ కూడా కొంత మేరకు కలిసిరావాలి. మరి, ఆ ‘అదృష్టం’ ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఎవరి ద్వారా వస్తుందో ఏ రూపంలో వస్తుందో తెలియాలంటే, వేచి చూడ్డం తప్ప… మనమేం చేయలేం. కాబట్టి… ఈ కథా రచనా రంగానికి మీ అందరికి స్వాగతం!… సుస్వాగతం!!”…. అంటూ తన వివరణాత్మకమైన సందేశంతో అందరి ప్రశంసలను కరతాళ ధ్వనుల ద్వారా అందుకున్నాడు సాయిరామ్.
పాలపొంగుపై నీళ్లు చల్లినట్లు సాయిరామ్ మాటలు సదానంద్ ఆలోచనలపై చూపించిన ప్రభావానికి అతనిలోని కోపాగ్ని ఆసాంతం చల్లారిపోయింది. తత్ఫలితంగా ప్రతికూల ధోరణిలో మాట్లాడిన నాగరాజు మాటలను పట్టించుకోకుండా, సానుకూల ధోరణిలో మాట్లాడిన సాయిరామ్ మాటలను మాత్రమే స్ఫూర్తిగా తీసుకుని కథా రచనలో ముందుకు సాగాలనే నిర్ణయానికి వచ్చాడు సదానంద్.
వెంటనే శిక్షణా తరగతులలో నేర్చుకున్న మెళకువల ఆధారంగా, తను రచించిన రెండు నవలల్లో ముందుగా ఒకదానిని స్వల్పమార్పు చేర్పులుతో సినిమాకు సరిపడే కథగా మలచడానికి ఉద్యుక్తుడయ్యాడు సదానంద్.
ఇక్కడే ఒక వ్యక్తిని గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. అతనే జగన్నాథం. ఉద్యోగం చేసేటప్పుడు సదానంద్‌తో కలిసి ఒకే ఆఫీసులో పని చేసేవాడు. ఇద్దరూ మంచి స్నేహితులు. రిటైరయిన తరువాత ఇద్దరూ ఒకే కాలనీలో నివసిస్తున్నారు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా మార్గనింగ్ వాక్‌లో విధిగా కలుస్తుంటారు వాళ్లిద్దరూ. విశేషమేమిటంటే, సదానంద్ తన ప్రతి రచన గురించి జగన్నాధంతో చర్చిస్తుంటాడు. జగన్నాధం కూడా మంచి సలహాలను ఇస్తూ, సదానంద్‌ని నిరంతరం ప్రోత్సహిస్తుంటాడు.
ఆ రోజు సదానంద్ తను పాల్గొన్న కథా రచానా శిక్షణా శిబిరంలో జరిగిన సంఘటనలన్నింటినీ జగన్నాధానికి పూసగుచ్చినట్లు, పొల్లు బోకుండా చెప్పుకొచ్చాడు. పనిలో పనిగా తన నవలను సినిమా కథగా మార్చిన వైనం కూడా చేప్పాడు.
“చాలా మంచి పని చేశావు” అని మెచ్చుకోలుగా అన్నాడు జగన్నాధం కాసేపాగి.
“త్వరలో నీ నవల సినిమాగా రాబోతుంది” నెమ్మదిగా అన్నాడు జగన్నాధం.
“అదేలా!!” ఆశ్చర్యంగా అడిగాడు సదానంద్.
“రేపు కలుస్తాంగా…. అప్పుడు చెప్తాలే…. అందాకా… ఓపిక పట్టు.”
“సరేలే…. తప్పుతుందా మరి.”
బైబైలు చెప్పకుంటూ ఇద్దరూ నిష్క్రమించారు.
మరుసటి రోజు మార్నింగ్ వాక్‌లో ఇద్దరూ కలిశారు.
“ఆ! ఇప్పుడు చెప్పు…. నా నవల సినిమా గురించి” కుతూహలంగా అడిగాడు సదానంద్.
“అదే! మా చిన్నబ్బాయి పెండ్లి విషయం, మన ప్రయత్నం కాని, ప్రమేయంకాని ఏమీ లేకుండానే, వాడి పెండ్లకి వాడే ముహుర్తం పెట్టుకున్నాడు” నింపాదిగా చెప్పాడు జగన్నాధం.
“అదేంటి?… అలా ఎలా జరిగింది!” ఆశ్చర్యంగా అడిగాడు సదానంద్.
“ఆ! ఏముంది…. ఈ రోజుల్లో ఇదంతా మామూలే కదా! తనతో కలిసి ఉద్యోగం చేస్తున్న ఒక అమ్మాయిని ప్రేమించాడట! పెండ్లంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాడట! కొసమెరుపేంటంటే, ఇద్దరి కులాలు వేరు వేరు. నవతరంలోని యువతరం కదా!!… అయితే… అటు పెండ్లి కూతురి తల్లిదండ్రులు ఇటు నేనూ… నా భార్యా… అందరం అభ్యుదయ భావాలున్న వాళ్ళమే కాబట్టి… ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా, కులాంతర వివాహామైనా, అందరం సంతోషంగానే ఓ.కే చెప్పాము. అదన్నమాట సంగతి….” ఓపిగ్గా చెప్పాడు జగన్నాధం.
“మొత్తానికి కథ సుఖాంతం అవుతుంది. చాలా సంతోషం. ఒక ఆదర్శ వివాహం జరిపిస్తున్నందుకు మిమ్మల్నందర్నీ అభినందించాల్సిందే… మరి… పెండ్లి భోజనం ఎప్పుడు పెట్టిస్తున్నావ్…” హుషారుగా అడిగాడు సదానంద్.
“త్వరలోనే… అన్నట్లు నువ్వు సినిమా కోసం తయారు చేసిన నవలా కథ కూడా సుఖాంతం కాబోతుందిలే…. అంటే…. త్వరలో సినిమాగా రాబోతుంది” సంతోషంగా చెప్పాడు జగన్నాధం.
“అర్థం కాలేదు. కాస్తంత వివరంగా చెప్పొచ్చు కదా” ప్రాధేయపూర్వకంగా అడిగాడు సదానంద్.
“మాకు కాబోయే వియ్యంకుడు గురించి మీకు తెలీదు కదూ! మరెవరోకాదు. ప్రఖ్యాత సినిమా దర్శకులు విశ్వంగారు. వాళ్ల చిన్నమ్మాయే మాకు కాబోయే కోడలు. ఆయనకు నీ నవలా కథ గురించి నేనే చెప్పాను. నీ కథ ఆయనకు బాగా నచ్చిందట! అతి త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిద్దామన్నారు విశ్వంగారు…” అంటూ ఉత్కంఠకు తెరదించాడు జగన్నాదం.
‘అదృష్టం’ తనకీ విదంగా కలిసొచ్చినందుకు పెల్లుబికిన ఆనందంతో, జగన్నాధాన్ని గట్టిగా కౌగలించుకున్నాడు, నోటమాట పెగలని సదానంద్.