ఏ జిందగీ మాంగే మోర్!

1
3

[box type=’note’ fontsize=’16’] ఎంవిఆర్ ఫౌండేషన్ 2019 ఉగాది సందర్భంగా నిర్వహించిన డా. పాలకోడేటి అప్పారావు స్మారక కథానికల పోటీలో ‘ప్రచురణార్హమైన కథల’ని న్యాయనిర్ణేతలు ఎంపిక జేసిన కథ. రచన తిరుమలశ్రీ. [/box]

[dropcap]ఆ[/dropcap] రోజు ఆదివారం. కాలకృత్యాలు తీర్చుకుని వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంట్లోని ఆడ, మగ, పిల్లలు – పనిమనిషితో సహా – టీవీ సెట్ వద్ద స్థిరపడిపోయారు. ‘ముళ్ళపొదలు’ సీరియల్ వస్తోంది మరి! మూణ్ణెళ్ల క్రితం నేను అక్కడకు వచ్చినప్పట్నుంచి చూస్తున్నాను వారి వరుస! చిన్నగా నిట్టూర్చాను. డోర్ బెల్ మోగినా ఆడియన్స్‌లో చలనం లేదు. వెళ్ళి తలుపు తెరిచాను.

గుమ్మంలో ఓ యువజంట. “నమస్కారం, తాతగారూ! పీపుల్ ఫర్ గుడ్ టైమ్స్ సంస్థ నుండి వస్తున్నాము మేము…” అన్నాడు యువకుడు. తన పేరు అనిల్ అనీ, ఆమె పేరు స్వాతి అనీ చెప్పాడు. మా కుటుంబంతో ఓ పది నిముషాలు మాట్లాడాలన్నాడు.

ఆ సమయంలో ఎవరిని కదిపినా కొట్టేలా వున్నారు.. ఆ విషయమే చెబితే నవ్వేసారు వాళ్ళు. ఇంటి ముందున్న లాన్‌లో కూర్చున్నాం మేము. సీరియల్ ముగిసింది కాబోలు, డ్రాయింగ్ రూమ్‌లో చలనం వచ్చింది. విజిటర్స్‌ని లోపలికి తీసుకువెళ్ళాను నేను.

పీపుల్ ఫర్ గుడ్ టైమ్స్ – ఓ స్వచ్చంద సంస్థ. ఆధునిక కాలంలో జనజీవనగతులలో వచ్చిన మార్పులను, అలవడిన అలవాట్లను, వాటివల్ల ఎదురవుతున్న ఇబ్బందులను గూర్చి అధ్యయనం చేయడం, ఆ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం ఆ సంస్థ యొక్క ముఖ్యోద్దేశం. వాటిలోని ఒక అంశం – కుటుంబాల పైన టీవీ ప్రభావం. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఛానెళ్ళలో ప్రసారమయ్యే అనంతమైన సీరియల్స్ కుటుంబసభ్యులలో వ్యసనాన్ని పెంచి, ఇతర కార్యక్రమాలకు ఎలా ఆటంకమవుతోందో, మానవసంబంధాలలో ఏయే మార్పులకు కారణమవుతోందో, ఆ కారణంగా ఏమేమి ప్రత్యక్ష, పరోక్ష సమస్యలు ఉత్పన్న మవుతున్నాయో గుర్తించే ప్రయత్నం చేస్తోంది.

‘ట్రయల్ బేసిస్ మీద కొన్ని ప్రాంతాలలోని కుటుంబాలకు ఓ ఆఫర్ చేయడానికి పూనుకుంది ఆ సంస్థ. అదేమిటంటే – ఆ కుటుంబాలు మూణెల్లపాటు టీవీని మరచిపోవాలి. ఆ యా ఇళ్ళలో ఆ సంస్థ అమర్చే సీక్రెట్ కెమేరాలు వారిని కనిపెట్టివుంటాయి. ఆ టాస్క్‌లో గెలిచే కుటుంబాలు బహుమతికి అర్హమవుతాయి. ఆ మూణెల్లలోనూ టీవీ జోలికి పోకుండా ఉండడమే కాక, ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నారా అన్నది కూడా ముఖ్యం. ఆ రెండు అంశాలలోనూ విజేతలైన కుటుంబాల పట్టీనీ తయారుచేసి, లాటరీ పద్ధతిలో అంతిమ విజేతను నిర్ణయించడం జరుగుతుంది. సదరు కుటుంబానికి ఐదు లక్షల రూపాయల నగదు బహుమతి ఇవ్వబడుతుంది…’

వారు చెబుతున్నది నా వీనులకు వయొలిన్ నాదంలా సోకితే… మిగతావారంతా ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టారు. ‘ఐదు లక్షల బహుమతి’ అంటే ఆశ పుట్టినా – ఒకటి రెండు రోజులు కాదు, ఏకంగా మూడు నెలలు! అదీ, తమ అభిమాన సీరియల్స్‌ను వీక్షించకుండా!!… వారి నడుమ అత్యవసర సంప్రదింపులు జరిగాయి. ‘అమ్మో, నా సీరియల్స్!’ అని కొందరు… ‘నా గేమ్ షోలు!’ అని మరికొందరు…’నా సినిమాలు!’ అని ఇంకొందరు…’మా కార్టూన్ ఛానెలో?’ అంటూ పిల్లలూ… ఎవరికి వారే తమ కలవరపాటును వ్యక్తం చేస్తుంటే… తమాషాగా అనిపించింది నాకు.

“ఇదీ ఓ రకమైన రియాల్టీ షోయే. మీ విల్ పవర్‌కి, అదృష్టానికీ పరీక్ష కూడాను!” అంది స్వాతి.

చాలాసేపు తమలో తామే గుంపుచింపీలు పడ్డాక, తమ అంగీకారాన్ని తెలియపరచారంతా. మళ్ళీ వచ్చి ఇంట్లో కెమేరాలను బిగించి, టీవీ సెట్‌ని ఓ బాక్స్‌లో పెట్టి తాళం వేసి వెళతామని చెప్పాడు అనిల్.

***

డిగ్రీ చదివినా నాన్నకు వ్యవసాయంలో సాయంచేస్తూ, చివరకు అదే వృత్తిగా ఎంచుకున్నాను నేను. ఇద్దరు కొడుకులు, ఓ కూతురూను నాకు. కాలక్రమాన వ్యవసాయం లాటరీగా మారడంతో, చదువుకున్న నా కొడుకులు ఉద్యోగాలకే మొగ్గు చూపితే కాదనలేకపోయాను. మంచి ఉద్యోగాలే వచ్చాయి ఇద్దరికీను. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. అమ్మాయి వేరే రాష్ట్రంలో ఉంటోంది.

పెద్దబ్బాయి కృష్ణమూర్తికి ముగ్గురు పిల్లలు – ఇరవయ్యేళ్ళ సరిత, పదిహేనేళ్ళ గోకుల్, పన్నెండేళ్ళ సాయీనూ… చిన్నవాడు ఈశ్వరరావుకు – పదేళ్ళ కొడుకు రాంబాబు, ఐదేళ్ళ కూతురు సాహితీను…నా కొడుకులు రామలక్ష్మణులనుకుంటే, మా పెద్ద కోడలు లక్ష్మి, చిన్న కోడలు భవాని – తోడికోడళ్ళలా కాక స్వంత అక్కచెల్లెళ్ళలా ఉంటారు… అన్నదమ్ములిద్దరూ కలసి పెద్ద ఇంటిని కట్టుకుని, ఉమ్మడి కుటుంబం పెట్టారు. అన్నదమ్ములు, తోటికోడళ్ళు ఎలాంటి పొరపొచ్చాలూ లేకుండా అలా కలసిమెలసి ఉండడం ఈ రోజుల్లో అరుదైన విషయం.

తమ ఇంట్లో నాకు, మా ఆవిడకు ఓ గదిని కేటాయించారు వాళ్ళు. మమ్మల్ని తమ వద్దకు వచ్చేయమని ఒకటే పోరు. పుట్టిన మట్టిని, పెరిగిన ఊరినీ వదలి వెళ్ళడం సుతరామూ ఇష్టంలేదు నాకు. కాని, మూణెల్ల క్రితం నా భార్యకు బాగా జబ్బు చేసింది. చేసేవాళ్ళు లేరు. నాకా వయసు డెబ్బై పైబడింది. స్వయంగా చేసుకోలేక పొలాన్ని కౌలుకు ఇచ్చేయడం జరిగింది… కొడుకులు, కోడళ్ళూ పట్టుబట్టి మమ్మల్ని పట్టణం తీసుకువచ్చేసారు.

వచ్చినప్పట్నుంచీ చిన్న అసంతృప్తి నాకు. అదేమిటంటే – సందు దొరికితే చాలు పిల్లా పెద్ద టీవీ సెట్‌కి అతుక్కుపోవడం! పెద్దలకు సీరియల్స్ పిచ్చి, పిల్లలకు గేమ్ షోస్, సినిమాలు, కార్టూన్స్ పిచ్చీను! అదొక వినోదంగా కాక, వ్యసనంగా మారింది అందరికీను. టీవీ ముందు కూర్చుంటే ప్రపంచమే తెలియదు.

మంచికి బదులు చెడునే పంచిపెడుతున్నాయి ఛానల్స్. ఏ సీరియల్ చూసినా అత్తాకోడళ్ళు, తోడికోడళ్ళూ, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ మధ్య మనస్పర్థలు, ఎత్తుకు పైయెత్తులు, కుట్రలు-కుచ్ఛితాలు వంటి వ్యతిరేక భావాలు తప్ప, అనుకూలతత్వాలను పెంపొందించేవి మృగ్యమయిపోయాయి. వాటి ప్రభావంతో అన్యోన్యంగా ఉన్న వారు కూడా చెడిపోగలరనిపించింది నాకు. ఇక పిల్లలైతే అన్-కంట్రోల్డ్ వయొలెన్స్‌కీ, సెక్స్ కంటెంటుకీ ఎక్స్‌పోజ్ అవుతున్నారు. బాల్యంలోని సున్నితత్వానికి బదులు పెద్దల కుళ్ళు కుచ్ఛితాలను అలవరచుకునే ప్రమాదం ఉంది. అంతేకాదు, టీవీ రిమోట్ కోసం పిల్లలలో గొడవలు, పోట్లాటలూను. పెద్దలే టీవీకి బానిసలయినప్పుడు, పిన్నలను నియంత్రించే నైతికబలం వారికి ఎక్కణ్ణుంచి వస్తుంది!

రోజు రోజుకూ పెరిగిపోతున్న ప్రైవేట్ ఛానళ్ళు యువత కోసం, వనితాలోకం కోసం అంటూ రకరకాల క్రేజీ ప్రోగ్రామ్స్‌తో వారిని ఆకట్టుకుంటున్నాయి. కాసేపు టీవీ ముందు కూర్చుంటే చాలు, మనిషి మెదడు స్వతంత్రంగా ఆలోచించే శక్తిని కోల్పోతుందినేవారితో నేనూ ఏకీభవిస్తాను.

అలాంటి సమయంలో ‘పీపుల్ ఫర్ గుడ్ టైమ్స్’ ఆ ‘రియాల్టీ షో’ తో ముందుకు రావడము, అందులో పాల్గొనేందుకు మావాళ్ళు అంగీకరించడమూ నాకు ముదావహమయింది…

అప్పుడే వారం రోజులు అయిపోయింది. ఇంట్లో అంతా ఏదో పోగొట్టుకున్న వారిలా కనిపిస్తుంటే… ఇంటిపనులు అయ్యాక ఏమీ తోచనట్టు కాలు కాలిన పిల్లుల్లా ఇల్లంతా తిరుగుతుంటే… వింతగా అనిపించింది నాకు. డెయిలీ సీరియల్స్‌ని మిస్సవడమే అందుక్కారణమని చెప్పింది మా ఆవిడ. పిల్లలైతే, కార్టూన్ సీరియల్స్‌ని మిస్ చేస్తున్నామంటూ ఒకటే గోల!

ఇకి, పనిమనిషి జ్యోతి సంగతి చెప్పనవసరమేలేదు. టీవీ అదృశ్యమైన రెండో రోజున, ‘బువ్వ లేకపోయినా ఉండగలను గాని, సీరియళ్ళు చూడందే ఉండలేనమ్మా! టీవీ ఉన్న మరో ఇంట్లో పనికి కుదురుకుంటున్నాను. రేపటినుంచి పనిలోకి రావడంలేదు నేను…’ అంటూ హఠాత్తుగా వాకౌట్ చేసేసింది. పనిలో కుదిరినప్పుడే, ‘ఎంత పనిలో ఉన్నా, సీరియల్స్ టైమ్‌లో తనను టీవీ చూడనివ్వాలని’ షరతు పెట్టిందట!

‘ఇప్పటికిప్పుడు కొత్త పనిమనిషి ఎక్కడ దొరుకుతుంది?’ అని కోడళ్ళు ఆందోళన చెందుతుంటే, “మనకిప్పుడు బోలెడు సమయం ఉంది. ఈ మాత్రపు పని మనం కలసి చేసుకోలేమూ?” అంది మా ఆవిడ.

“బహుమతికి క్వాలిఫై అవ్వాలంటే సోమరితనంగా గడిపేయకుండా, ఏదో ఒక వ్యాపకానికి శ్రీకారం చుట్టాలి మనం” అంటూ గుర్తుచేసాను నేను.

సరిత డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉంది. తన పుస్తకపఠనాసక్తికి టీవీ వ్యసనం గ్రహణం పట్టించింది. కొన్ని నవలలూ, పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలూ తెచ్చి యిచ్చి, బ్యాంక్, ఎల్.ఐ.సి.లలో ప్రొబేషనరీ ఆఫీసర్ పోటీ పరీక్షలకు తయారుకమ్మని చెప్పాను నేను.

గోకుల్ మూలను పడేసిన క్రికెట్ కిట్‌ని బైటకు తీసి, మునుపటిలా సాయంత్రాలు స్నేహితులతో క్రికెట్ ఆడడానికి వెళ్ళనారంభించాడు… సాయి, రాంబాబులు కూడా స్కూల్ నుంచి రాగానే బూస్ట్ త్రాగేసి ఆటలకు పరుగెత్తసాగారు. తిరిగి వచ్చాక భోంచేసి, హోమ్ వర్క్ చేసుకుని హాయిగా నిద్రపోతున్నారు. ఒక్కసారి సాహితితో కలసి గార్డెన్‌లో ఆడుకోవడమో, వర్డ్ గేమ్ వంటి వాటితో గడపడమో చేస్తున్నారు. ఓ పక్కను పడేసిన క్యారమ్ బోర్డ్ ఇప్పుడు బైటకు వచ్చింది.

తీరిక సమయాన్ని లక్ష్మి అప్పడాలు, ఒడియాలు, పచ్చళ్ళు, వగైరాలను పెట్టడానికి ఉపయోగిస్తుంటే… భవానీ తనకు చేతనైన ఎంబ్రాయిడరీ, అల్లికలతో సద్వినియోగం చేసుకుంటోంది…మా అబ్బాయిలిద్దరూ ఉదయము, సాయంత్రము తప్పనిసరిగా తోట పని చేయడం అలవరచుకున్నారు.

అంతకు మునుపు ఎవరికి వారు భోజనపు పళ్ళాలు పట్టుకుని టీవీ దగ్గర చేరేవారు. ఏం తింటున్నారో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు అంతా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, నవ్వులను పంచుకుంటూ, ఒకరికొకరు కొసరి కొసరి వడ్డించుకుంటూ తింటున్నారు. ‘కలసి తినే కుటుంబం కలసి వుంటుంది!’ అన్న నానుడి జ్ఞప్తికి వచ్చేది నాకు… రోజు డిన్నర్ దగ్గర, ఆనాటి దినపత్రికలో చదివిన ముఖ్యవిశేషాలను నేను చెబుతుంటే, వాటిపైన చర్చ జరుగుతుంది. పడుకునేముందు అంతా కాసేపు లాన్‌లో కూర్చుంటున్నాము. పిల్లలందరూ కథ చెప్పమంటూ నా చుట్టూ చేరతారు. ఆంగ్లమాధ్యపు ఒరవడిలో కొట్టుకుపోతున్న నేటి బాలలకు మన పురాణాలను గూర్చిన అవగాహన పూజ్యమయింది. అందుకే భారతభాగవతాలు, రామాయణాల నుండి కథలు చెప్పసాగాను. వీకెండ్స్‌లో ఔటింగుకు – సినిమాకో, పార్కుకో లేదా స్నేహితులు, బంధువుల ఇళ్ళకో – వెళ్ళసాగాము. దాంతో వాళ్ళు కూడా మా ఇంటికి రాసాగారు. ఆ ఇంటరేక్షన్ పిల్లలను ఉత్తేజపరచడమే కాక, ఆయా కుటుంబాలలోని పిల్లలతో పరిచయం కూడా కలిగేది. తమ స్కూలు, టీచర్లు, స్నేహితుల గురించి ఉత్సాహంగా మాట్లాడుకునేవారు.

ఓసారి చానాళ్ళ తరువాత ఓ పాత స్నేహితుడి ఇంటికి వెళ్ళడం జరిగింది. ప్రసంగవశాత్తూ వాళ్ళు సరితకు తగిన సంబంధం గురించి చెప్పడము, దాన్ని మేము ఫాలో అప్ చేసి, కుదుర్చుకోవడమూ గొప్ప విశేషం!…టీవీ, సెల్ ఫోన్ల ప్రభావంతో మరుగున పడిపోయిన సోషియల్ కాల్స్ యొక్క విలువ మొదటిసారిగా తెలిసివచ్చి అది అందరికీ… కుటుంబ సభ్యులలో వచ్చిన ఆ అద్భుతమైన మార్పు మిక్కిలి సంతోషాన్ని కలిగించింది నాకు…

***

అయిదేళ్ళ తరువాత –

మా ఇంటికి వచ్చే బంధువులు, మిత్రులు మా ఇంట్లో టీవీ పెట్టి లేదని తెలుసుకుని, ఆదిమానవులను చూసినట్టు చూస్తూ, “అయ్ బాబోయ్! ఐదేళ్ళుగా టీవీ చూడకుండా ఎలా ఉంటున్నారండీ బాబూ?!” అనడుగుతుంటే, నవ్వు వస్తుంది నాకు. ‘ఐ కాంట్ బిలీవ్!” అన్నారొకరు. “నిజమే! నేనూ నమ్మలేకపోతున్నాను” అన్నాను నేను. అలా అంటుంటే, ఆనాటి సంఘటన మదిలో మెదిలింది…

మూడు నెలల గడువు ముగియగానే అనిల్, స్వాతిలు వచ్చారు మా ఇంటికి. “మీ విల్ పవర్‌తో పోటీలో నిలదొక్కుకున్నారు మీరు. ఇక మీ టీవీ సెట్‌ని బైటకు తీయడానికి వచ్చాం” అన్నాడు.

“ఎందుకులెండి, మావయ్యగారూ! మరికొన్నాళ్ళపాటు దాన్ని అక్కడే ఉండనివ్వండి” అని మా పెద్దకోడలు అనడంతో ఆశ్చర్యం వేసింది నాకు. “తాతయ్యా! నా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అయేంతవరకు టీవీని బైటకు తియ్యొద్దు” అని సరిత అంటే, నా బుల్లి మనవరాలు వచ్చి నా మెడకు చుట్టుకుపోయి, “టీవీ వద్దు, తాతయ్యా అన్నయ్యలు, నేను ఇంచక్కా ఆటలాడుకుంటాం” అంది గారాలుపోతూ. నా ఆనందానికి మేరలేకపోయింది… అప్పుడు బైటపెట్టాను అసలు సంగతి – ‘అనిల్, స్వాతిలు పీపుల్ ఫర్ గుడ్ లైఫ్ సంస్థకు చెందినవారు కాదనీ, నా స్నేహితుడి పిల్లలనీ, మావాళ్ళ టీవీ పిచ్చిని వదిలించడం కోసం నేను ఆడిన నాటకంలో వారు పాత్రధారులనీను!’. ఆశ్చర్యంతో పాటు అంతా ఆనందం వ్యక్తం చేయడం నాకు సంతృప్తిని ఇచ్చింది. ఆ తరువాత టీవీనే మరచిపోయారంతా….

ఆ ఐదేళ్ళలోనూ కుటుంబాన్ని ఎన్నో అనుకూల పవనాలు సేదదీర్చాయి… నిత్యమూ గార్డెనింగు చేయడంతో మా అబ్బాయిలకు వయసుతో పాటు వస్తున్న చిరుబొట్టలు కరిగాయి… మా పెద్దకోడలు పెట్టే పచ్చళ్ళు, ఒడియాలు, వగైరాలు ఇరుగుపొరుగులకు నచ్చడంతో బల్క్ ఆర్డర్స్ రాసాగాయి. చిన్న కోడలు చేసే ఎంబ్రాయిడరీ, లేస్ అల్లికలు విదేశీ యాత్రికులను ఆకట్టుకోవడంతో, వాటికి లోకల్ షాపులలో గిరాకీ పెరిగింది… వారి వ్యాపకాలు చిరువ్యాపారాలుగా మారిపోయాయి… సరిత పోటీ పరీక్షలలో మెరిట్‌లో పాసై ఓ ఫారిన్ బ్యాంకులో ఆఫీసర్ ఉద్యోగం సంపాదించుకుంది. ఆ తరువాతే అనుకున్న సంబంధంతో దాని వివాహం కూడా అయిపోయింది… పిల్లలు శ్రద్ధగా చదువుకుని ఫస్ట్ మార్కులు తెచ్చుకోవడమే కాక, రోజు ఆటలు, గేమ్స్ ఆడడంతో మానసికంగా శారీరకంగా ఆరోగ్యంతో పెరగసాగారు…..

“ఐదేళ్ళుగా టీవీ వాసన తగులకుండా ఉన్నారంటే… యూ ఆర్ రియల్లీ గ్రేట్!” అనేవారికి నేనిచ్చే సమాధానం ఒకటీ – ‘భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితానికి ఓ పరమార్థం ఉంది. వినోదం పేరిట సోమరితనంతో విలువైన సమయాన్ని వృథా చేసుకోవడానికి కాదు. అంతకంటే సాధించవలసింది, జీవితం కోరేదీ ఇంకేదో ఉందన్న సత్యాన్ని గ్రహించాలి మనం. ఇష్టంతో చేసే ప్రతి పనిలోనూ వినోదం, విశ్రాంతి ఇమిడి ఉంటాయి…’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here