[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల ‘అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 12వ భాగం. [/box]
[dropcap]“పెం[/dropcap]డ్లి అంటే నూరేళ్ళ పంట” అంటారు మనవాళ్ళు. ఎం చేతనో ఏమోగానీ, ఈ పెండ్లిని మాలావు పవిత్ర బంధంగా ఎంచారు, కూర్చారు. పెద్దలు తాముగా చేసిన పెళ్ళి అయినా, ప్రేమ పెళ్ళి అయినా మరే పద్ధతిలో జరిగినా… దీనికో ఉన్నతమైన పవిత్రమైన విలువనిచ్చారు. భార్యభర్తలు విడిపోవడాన్ని సామాన్యంగా ఎక్కడా హర్షించిన దాఖలాలు లెవ్వు. సమర్ధించలేదు. పైగా విడివడని బంధంగా ‘దైవేచ్ఛ’గా మాత్రమే చూస్తారు. అందుకే “అర్థేచ, కామేచ నాతి చరామి” అన్నది దాంపత్యపు తీయని అనుబంధాన్ని…. శాశ్వత బంధంగా బాధ్యతగా భావించడం మనం చూస్తాం.
పిల్లనిచ్చేడప్పుడు రెండు మూడు తరాల్ని, వారి స్థితిగతుల్ని అనుబంధాల్ని పరిశీలించి మరీ ఇచ్చేందుకు సుముఖతను వ్యక్తం చేసేవారు. సాంప్రదాయం పద్ధతులు నచ్చితే ఆర్థికపరమైన వాటిని ఆ తరువాత మాత్రమే చూసే ఆచారం మనకుంది.
ఇప్పుడు బాగామార్పు వచ్చింది. అర్థిక పరమైన స్థితిగతులకు ప్రాధాన్యత పెరిగింది. వాటి ఫలితాలూ మన ముందుకు వస్తూనే ఉన్నాయి.
దీక్షితులుగారు కాలుకు బలపం కట్టుకొని పదిహేను రోజులు తిరిగి ఓ సంబంధాన్ని నచ్చి దాదాపు ఖాయం చేసుకొని మరీ వచ్చాడు. ఇంటికైనా వెళ్ళకుండా దశరథాన్ని కలిసాడు.
సీతను కూర్చుండ బెట్టి ఇతగాడు చూసిన ‘వరుని’ వివరాలు మంచి చెడులూ వివరంగా చెప్పాడు. చివరగా “నాకు ఇది మనకు సరిపోయే సంభంధంగా అనిపించింది. మీరు చూద్దాం, అనుకుంటే మంచి రోజు చూసి బయలుదేరుదాం” అన్నాడు.
‘దీక్షితులుకు అంతగా నచ్చాక చూడక తప్పదు’ అనుకున్నారు దశరథం దంపతులు.
పిల్లవాడేం చేస్తున్నాడన్నావ్వూ అని అడిగాడు దశరథం. అంత విన్నాక…. “MSC వ్రాసి వచ్చాడు. నీటుగా ఉన్నాడు. కలుపుగోలుగా ఉంటాడు. చదువుతోపాటు బ్రతుకు తెరువుకు అయిదెకరాల ‘వరి’ పొలం ఉంది. పిల్లవాడు ఒక్కడే. మన కట్నకానుకులకు అందుతారు” అని ఆగాడు.
“మంచిది మనం ఒక సారి చూసి వచ్చాక…” అంది సీతమ్మ.
“అలాగే” అని ఇంటికి చేరాడు దీక్షితులు.
శాంతమ్మ పక్కింటి పిన్నిగారితో పిచ్చాపాటిలో ఉంది.
వచ్చిన దీక్షితుల్ని చూసి లేచి వచ్చి, లోనికి నడచింది. పిన్నిగారు వీళ్ళిద్దరిని చూస్తూ తన స్వస్థానానికి చేరుకుంది.
‘ఇప్పుడే వస్తున్నారా…’ అడిగింది శాంత.
తలూపాడు.
మంచి నీళ్ళిచ్చింది త్రాగి లేచాడు.
‘మళ్ళీ ఎటు?’
‘ఊర్కే అలా…’ అన్నాడు.
‘వెళ్ళిన పని కాయా?…. పండా?…’
‘చెప్తాను’ అంటూ గడపదాటాడు.
‘ఏమిటో బజాట్లో అంతగా తరగని వ్యవహారాలు’ అని నసుగుతూ పిన్నిగారు ఉందేమోనని అటుగా తొంగి చూసింది. ఆవిడ కనిపించలేదు.
మళ్ళీ వస్తున్న దీక్షితుల్ని చూసాడు దశరథం.
లేచి ‘ఏంట్రా మళ్ళీ ఏమయింది స్నానం చేసి ఇంత తిన్న జాడ కూడా లేదు’ అన్నాడు.
“దశరథా! విజయ నీ కూతురే కాదనను, కానీ నేను ఎప్పుడైతే విజయను నా పిల్లవాడికి చేసుకుందామనుకున్నానో బిడ్డయినా కోడలయినా విజయే అనుకున్నానురా. పైగా విజయ నా దగ్గరే నాతోనే చివరి దాకా ఉంటుందనుకున్నాను” అని కళ్ళలో ఊరిన నీటిని కండువాతో వత్తుకుని “భగవంతుడు కరుణా సుముద్రుడని, దయామయుడని, అలా పిలువగానే వచ్చి గజేంద్రుడ్ని రక్షించాడని చానా గప్పాలు చెప్పుకుంటాం. ఆశలు పెంచుకొని ఆయనేదో తవ్వి తలకెత్తుతాడని నిశ్చింతగా ఉంటాం… కానీ భగవంతుడు అనేది ఒట్టి భ్రమరా!”
“అతగాడేం చేయగలడు చెప్పు? ఆ రాతి బొమ్మను నమ్ముకొన బట్టే కదా నా కన్న కొడుకు పోయింది? వాడు లేని కారణానే కదా మనకీ వెతుకులాట! దశరథా మనం ఇద్దరం ఇంత వెతుకులాడి పసిదాన్ని ఇద్దరి దగ్గర ఉంచుకొనలేకపోతున్నాం. చిత్రంగా లేదు? ఇప్పటి మన శ్రమ అంతా దాన్ని పరాయి పంచకు పంపడానికే గదా” అని అదోలా నవ్వి.
భుజం పై చెయ్యేసి “దశరథా నాకు ఆ ‘భావనే’ ఉన్న చోట ఉండనివ్వడం లేదురా. ఇంత కాలం మన చేతులలో పెరిగి మనతో ఆటలాడిన పిల్లని వదలి ఉండగలమా?” అని పిచ్చోడిలా చూస్తుండిపోయాడు. దీక్షితులు గుండె పగిలి పోతుందనీ ఈ భావననే ఖండించలేనివాడు, ఇది పరాయి పంచకు చేరితే వీడేం అవుతాడోనని భయం కల్గిన దశరథం – “దీక్షితులూ ఏమిట్రా పసిపిల్లవానిలా? విజయ మన పిల్ల. అందుకే అపురూపంగా పెంచుకున్నాం. భుజాలెక్కించుకొని తిరిగాం, అది అరక్షణం కనిపించకపోతే తోచక విలవిలలాడిపోయాం. అంతులేని మమకారాన్ని పంచాం. కాదనను కానీ విజయ ఇప్పుడు చిన్న పిల్లగాదు. యుక్తవస్కురాలైంది. చదువుకుంది, అందుచేత దాని వయసుకు కావల్సిన ఏర్పాట్లు మనం విధిగా చేయాలి, మన బాధ్యత అది. దానికి మనకు వయస్సులో కల్గిన కోరికలు లాంటివి కల్గుతాయి అది సహజం, వాటికి పరిష్కారం చెప్పడమే పెళ్ళి. భగవంతుడు పిల్లాడ్ని ఉంచినట్లయితే మనకు ఈ బాధ, వెతుకులాట ఉండేది కాదు. అంతా ఏక కుటుంబంగానే బ్రతికే వాళ్ళం. పిల్లది పిల్లాడు తప్ప మనకు వేరే ఎవ్వరూ లేరు గనుక. కానీ అలా జరగాల్సిలేదు. మరో రకంగా ఉంది మన రాత. కొన్ని మర్చిపోలేని విషయాలుంటాయి. వాటిని మర్చిపోవాలి. ఒక వేళ్ళ అది సాధ్యం కాకపోతే ఆ బాధే మనని చంపేస్తుందిరా” అని దీక్షితుల్ని పట్టుకొని
“నీకో విషయం తెల్సునా? ఈ సృష్టిలోని ప్రతి ప్రాణీ ఎవడికి వాడిగానే పుడుతుంది. చావు అంతే… మధ్యన మాత్రమే ఈ మమతాను బంధాలు, ప్రేమ, ఆపేక్ష, అదీగాక, ఈ మనిషి అన్నవాడు సమగ్రమైన వాడు కాదు. మంచి చెడుల కలయిక.”
“ఇదిగో దశరథా భగవంతుడనే వాడు ఎలా ఉంటాడో, ఎలాంటి వాడో బొత్తిగా తెలీదు. మరి తెలీని మనిషిపైన మన మంచి చెడులను పెట్టడం నాకు అంత మంచిగా అనిపించదు. శ్రీరామ చంద్రుణ్ణి నేను భగవంతుడు అనలేను. ఈ సమాజం సుభిక్షంగా క్రమబద్దంగా ఉండేందుకు కావాలసిన మాల్ మసాలాని ఆయన తన జీవిత కథ ద్వారా తెలిపాడు. దాన్ని ఆధారంగా తీసుకొని మనం బ్రతుకు ప్రారంభించాం. దాన్ని అనుసరిస్తూ వచ్చాం. అందుకే నాకు ఆయనంటే గౌరవం. మనం అన్నింటి కన్న తల్లిదండ్రులకు నమస్కరిస్తాం. ఎందుకు? కని, జ్ఞాన బీజం వేసి సాకి సంభాళించినందుకు, అలాగే శ్రీరామచంద్రుడికే దండం పెడ్తాం. మనకు మంచేదో చెప్పి మార్గం చూపినందుకు అంతే” అని ఆగాడు దీక్షితులు.
“ఎవడెంతటి వాడైనా గుండె బండలు చేసుకొని బ్రతకాల్సిన క్షణాలే మన బ్రతుకుల్లో ఎక్కువగా ఉంటాయి. వాటిని తప్పుకొని బైటపడినప్పుడే.
మన విజయ మనది కాదు, ఇక పై మనతో ఉండదు. దాని కోసం సంసారాన్ని మనంగా ఏర్పాటు చేయాలి. అలాటి బాధ్యత మనది. దానికి సుఖం కలగాలని దీవించాల్సిన వాళ్ళం… విజయ ఎక్కడుంటే అక్కడ సుఖం ఉండాలనీ… మనతో మనలో ఉన్నట్లుగా లెఖ్క అని… అది ఆనందించిన ప్రతి క్షణమూ మన ఆనందమేననీను… సీతను రామునికిచ్చి చేసిన జనకునికీ మన కంటే ఎక్కువ ప్రేమే ఉంది. మమతానురాగాలు ఉన్నాయి.
అదే రామచంద్రునితో సీత అడవికి వెళ్ళిన నాడు కూడ పెదవి విప్పిన జాడ ఎక్కడా లేదు. భర్తకు నీడలా ఉందా సీత అన్న గర్వం బాధ ఒకే అయినా. ఆడపిల్లకు భర్త తోడిదే లోకంరా!… అదే నిండుతనాన్నిచ్చి పిల్ల బ్రతుక్కు పరిపూర్ణత నిస్తుందేమో?” అని ఆగాడు…. కాని ఆయనకంటా తడి ఉన్నది.
“దశరథా, మనం లక్ష అనుకున్నా నా మనస్సు దాన్ని వదలి వెళ్ళడం లేదురా” అని ఏడ్చాడు దీక్షితులు.
“ఛ. ఏమిట్రా ఇదీ, ఇందు కట్రా ఇంత దూరం వచ్చింది. కన్నవాళ్ళకు మాకు ప్రేమ ఉంది గదా. నీవు ఇన్ని రోజులు చేసిన ప్రయత్నమేమిటి” అని ఓదార్చుతూ దీక్షితుల్ని వాటేసుకొని దశరథం కూడా వెక్కి వెక్కి ఏడ్చాడు. తేరుకొని….
‘ఏమిట్రా బజారున పోయేవాళ్ళేమనుకుంటారు. రా!….’ అన్నాడు.
‘రాను రా! వెళ్తాను!’ అని వెనక్కి మళ్ళి ‘దశరథా నిన్ను సీత పిలుస్తుంది’ అన్నాడు.
‘మా పిచ్చిది కూడా సణుకుంటూ నా కోసం ఎదురు చూస్తూంటుంది’ అంటూ ఆగక తోవకు నడిచాడు దీక్షితులు.
దశరథం మెల్లిగా లోనికొచ్చేది సీతమ్మ చూసింది. ‘వీడేమిటే సీతా విజయకు పెళ్ళి చేసి అత్తగారింటికి పంపడాన్ని కూడా వాడి మనస్సు, అసలీ ప్రేమ పాశాన్ని వీడు ఎందుకింత బలంగా పెంచుకున్నట్లు ?’
‘పిల్ల సుఖంగా ఉండాలి కళ్ళెదుట ఉండాల.’
‘దానికి పిసరంత బాధ కల్గరాదు.’
‘అది అంటే మనింట్లో లేదా వానింట్లో ఉండాల.’
‘అసలివేం కోరికలు? తీరేవేనా?’ అని అదోలా అర్థంకాని నవ్వు నవ్వి…
‘పెండ్లయ్యాక భర్తతో ఆడపిల్లను పంపాలి…’
“మంచి వరుడు కావాలి. పిల్లది సుఖపడాలి. ఇక్కడే ఉండాలంటే కుదిరేదెట్లాగో చెప్పు?” అని ఆగి అంతా విన్న సీతమ్మకు దీక్షితులు తనకు అన్న అయినందుకు గర్వం మెదిలింది. విజయ గది కిటికి దగ్గర నిల్చునే ఉంది. ఇది ఎప్పటుంచి మమ్మల్ని గమనిస్తూంది. చూసి మనసులో ఎమనుకుంటున్నది? భగవంతుడా!… మనిషిని మనిషి ప్రేమించడం తప్పుకాదు కదయ్యా?… అనురాగాన్ని పంచడము పొరపాటేనంటావా? పిల్లదాని మనస్సు చెడపకు. దాని మంచి పై ఆదారపడి ఉన్న బ్రతుకులు మావి అనుకున్నది.
***
దీక్షితులు త్రోవన నడుసున్నాడు.
సూర్యుడు అప్పుడే నడక ప్రారంబించాడు.
ఊరు… అప్పుడే మగతను వీడి… చీకటి భయాలనూ కలలను విడచి ఒళ్ళు విరుచుకొంటున్నది. నడిబాట మీద ఊర కుక్క ఒకటి లెక్కచేయక ముడుచుకొని పడుకొని ఉంది. మనిషి అలికిడి విని గమనించాక కూడా ఒక్క సారి కళ్ళు తెరిచి చూసి తిరిగి మూసుకుంది.
దీక్షితులు దాన్ని గమనించి ప్రక్క నుంచి నడచాడు.
గుడి గంట వినిపించింది… అరక్షణం నడక ఆపాడు. పూజారయ్య గుడికి వెళ్ళినట్లే గదా అనుకున్నాడు. వెళ్ళే ఉంటాడు. కాకపోతే వెనకో ముందో వస్తాడు కూర్చుందాం అక్కడే అనుకుంటూ నడచాడు.
సింగరాయ్య ఆవును తోలుకుని పోతూ ఎదురయ్యాడు…
దండం పెడత ‘బాబాయ్య! పొద్దటే ఎక్కడికి పోతన్నారు’ అన్నాడు.
‘గుడికి’
“ఇవ్వాళ్ళేదన్నా మంచి రోజా?”
“రోజులలో ఉన్న మంచి చెడేంది? రోజులు ఎప్పుడు ఒక్క తీరుగానే ఉంటాయి. మంచి చెడులు మనని పట్టి వచ్చేవే. మనకు మహర్ధశ పట్టిననాడు – కాటికి ప్రయాణమైననాడూ తెల్లారడానికీ పొద్దుగూకడానికీ తేడా లేమి ఉండవు” అని నవ్వి “నువ్వు గానీ గుడి వైపు నుంచి రావడం లేదు గాదా?” అని అడిగాడు.
అవునన్నట్లుగా తల ఊపాడు.
“మన పూజారయ్య గడిలో ఉన్నాడా?”
“గుడి మెట్లు ఎక్కుతుంటే ఇప్పుడే చూసిన బాబయ్యా” అని, “ఆవు పోతన్నది, నేపోత” అని వెళ్ళిపోయాడు.
‘షికారుకా?’ అన్నాడు దీక్షితులు
పనులు లేని కాలం గదా రోజూ అట్టా వెళ్తేనే ఇల్లు ఎల్లుతుంది.
మనిషి ఈ సృష్టిలో అన్నింటికన్నా తెలివిమంతుడు. ప్రకృతిలోని అనేక అంశాలపై అదుపు ఏర్పాటు చేసుకోగలిగాడు. అటు పులిని బంధించగలడు, ఇటు ఆవుపాలు పితకగలడు. దాని దూడతోను పని తీసుకోగలడు అనిపించింది. ఆవును మన వాళ్ళు పూజిస్తారు. ఈ సింగారయ్య ఆ సాధు జంతువుకు షికారు నేర్పి పిట్టలు పడుతున్నాడు. వాటిని అమ్ముకొని జీవయాత్ర నడుపుకుంటాడు.
పాము లాడించి బ్రతికేవాడు… దాని విషం పిండి బ్రతికేవాడు…. పులుల్ని ఆడించి బ్రతికేవాడు…. కోతులతో, ఎలుగొడ్లతో కలిసి మెలసి ఉండేవాడు. మనిషి… నిజంగా మనిషే… ఈ చరాచర వర్తనానికి దాదాపు అధిపతి…
మనస్సు ఇలా ప్రయాణం చేస్తుండగా గుడి మెట్లు కనిపించినయి.
గుడి ముందుకొచ్చాను అనుకున్నాడు.
ఆలోచన తెగిపోయింది. మెట్లెక్కి గర్భాలయం వైపుగా చూసాడు. దైవం కనిపిస్తున్నాడు. సర్వమంగళ రూపంలో పూర్తిగా ముస్తాబయి నమస్కరించాడు.
ఇంతలో…
“దీక్షితులుగారా” అన్న పూజారయ్య కంఠం వినిపించింది వెనక నుంచి. కళ్లు తెరిచి మాట వినిపించిన వైపు చూసాడు.
నీళ్ళ బిందె నెత్తుకొని గుడిలోకి వస్తున్న పూజారయ్య కనిపించాడు.
నమస్కరించాడు దీక్షితులు.
దిక్షితులేనని నిర్ధారించుకున్నాక “ఏమిటీ అకాల వర్షం?” అన్నాడు .
‘మీ కోసమే…’
‘అలాగా ఇప్పుడే వస్తాను’ అంటూ గుళ్ళోకెళ్ళి నీళ్ళు దించి…
బయటకొచ్చి ‘చెప్పండి’ అన్నాడు.
“అమ్మాయి విజయకు సంబంధం చూసి రావాలనుకుంటున్నాం” అన్నాడు.
‘శుభం..’
“మంచి రోజు చూసి చెప్తారనీ పూర్తి శుభఘడియలున్న రోజుయితే మరీ మంచిదనీ వచ్చాను.”
‘శుక్రవారం బయలుదేరండి’ అన్నాడు.
‘ఇవ్వాళ్ళ శుక్రవారమే గదా…’
‘ఇవ్వాళ్ళ కాదు వచ్చే శుక్రవారం…’
‘మంచిది.’
(ఇంకా ఉంది)