[box type=’note’ fontsize=’16’] ‘సమాజానికి ‘ఫలానా సాహిత్యం మాత్రమే అవసరం’ అని ఎవరూ నిర్దేశించలేరు’ అని విశ్వసించే లక్ష్మీ వసంతని ఇంటర్వ్యూ చేశారు ఆర్. దమయంతి. [/box]
[dropcap]ఫే[/dropcap]స్‌బుక్ పోస్ట్స్ ద్వారా పాఠకుల మనసులని దోచుకుని, తద్వారా పేరు సంపాదించుకుని బహు ప్రాచుర్యం పొందిన రైటర్ కం జర్నలిస్ట్ – శ్రీమతి లక్ష్మీ వసంత. ఫేస్‌బుక్‌ని తను నిర్వహించే సొంత మాగజైన్‌గా చేసుకుని, తన రచనా వ్యాసంగాలతో, విభిన్న ప్రక్రియలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకుంటున్న లక్ష్మీ వసంత అంటే ప్రియమైన పాఠకులకి ఎంతో అభిమానం. ఇంత రీడర్షిప్ ఎలా సాధ్యమైంది అంటే, ‘తన రీడర్సే తన ఫ్రెండ్స్, తన ఫ్రెండ్సే తనకు మంచి క్రిటిక్స్..’ అని అంటున్న లక్ష్మీ వసంతతో నేను జరిపిన ఇంటర్వ్యూలో ఎన్నో.. ఎన్నెన్నో ఆసక్తి కరమైన విషయాలు వెలుగు చూసాయి. అవేమిటో మీరూ ఈ ఇంటర్వ్యూ చదివి తెలుసుకోండి!
***
“యవ్వనంలో చాలా మంది లాగే నేను కూడా కమ్యూనిస్టుని. మా ఊళ్ళో అదే ఏలూరులో ఈ భావజాలంతో సంబంధాలున్న స్నేహితులు నాకు ఎక్కువే ఉండేవారు. అయితే, ఒక వయసు దాటాక కొంచెం దూరం పెరిగింది.
ఇప్పుడు నేను మానవతావాదిని.. ముఖ్యంగా.. ఫెమినిజం కూడా మానవతావాదం కిందే వస్తుంది. స్త్రీలు కూడా మనుషులే అన్నది మానవతా వాదం కిందే వస్తుంది.
నాడూ నేడూ ఎప్పుడూ కూడా సాహిత్యం మేలు చేస్తూనే వుంది. అప్పుడు నా వయసు ఎలాటిదంటే మనసులో ప్రభావాలు పడే వయసు అది. ఇప్పుడు అంత తేలికగా ప్రభావితం అయే వయసు కాదు. అంతే తేడా.”
***
♣ వసంత గారు, ఇంటర్వ్యూలో ముందుగా, మీ కుటుంబ నేపథ్యం గురించి తెలియచేస్తారా?
* తప్పకుండానండి. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగాను. ఆరుగురి పిల్లల్లో పెద్దదాన్ని నేను. చాలా అపురూపంగా పెంచారు మా వాళ్ళు. ఎప్పుడూ దేనికీ లోటు అనేది తెలియకుండా పెరిగాం అని చెప్పాలి. అంటే అప్పట్లో అవసరాలు కూడా చాలా తక్కువే. మా నాన్నగారు అందరినీ బాగా చదివించారు.. చదువు తప్ప మరో లోకం ఉందని కూడా తెలియకుండా పెరిగాను నేను. ఎప్పుడూ ఫస్ట్ రాంక్ రావడమే. క్లాస్ లో ‘టీచర్స్ పెట్’గా ఉండే దాన్ని. స్కూల్ ఫస్ట్ – 10 వ క్లాస్ లో. డిగ్రీ వరకు మెరిట్ స్కాలర్‌షిప్‌తో చదువుకున్నా. చదువు అంటే నన్ను నేను మైమరచి పోతాను. అలాంటిది కాలేజ్ లోకి వచ్చాక లెఫ్టిస్ట్ సిద్ధాంతాలు వేపు ఆకర్షణ కలిగింది. అది కూడా, బాగా చదువుకుంటూనే.. కేవలం సబ్జెక్ట్ బుక్సే కాకుండా, సాహితీ పుస్తకాలు కూడా బాగా చదవడం వల్ల, నాలో ఆలోచనల ‘విస్తృతి’ పెరిగిందని చెప్పాలి.
♣ ఆర్ధిక రాజకీయ సామాజిక కుటుంబ పరమైన అంశాలను చర్చిస్తున్నప్పుడు మీరు పొలిటికల్ సైన్స్ చేసారేమో అనిపిస్తుంది.
* లేదండి. నేను ఆంధ్ర యూనివర్సిటీ లో ఎమ్మెస్సీ చేసాను మూడేళ్లు.. ఆ తరవాత నా బెస్ట్ ఫ్రెండ్ అన్నయ్యతో పెళ్లి జరిగిపోయింది. ఆ పిమ్మట లా చదివి, కోర్ట్‌కి.కూడా వెళ్ళాను. ఇంతలో కువైట్‌కి తరలి రావాల్సి వచ్చింది.
♣ ఇంత చదువూ చదివి ఇంట్లో ఇల్లాలిగా మిగిలి పోయినందుకు నిరాశగా అనిపించేదా?
* అవునండి. చాలా అసంతృప్తితో నలిబిలి అయిపోయే దాన్ని. అయితే సహచరుడు కుమార్ ఎప్పుడూ నన్ను ఓదారుస్తుండేవారు. ‘నువ్వు ఇంటి కోసం చేసే పని వెల కట్ట లేనిది..నా ఉద్యోగ రీత్యా నేను షిప్‌లో ఇరవై నాలుగు గంటలూ వుండాల్సి వచ్చినప్పుడు, ఇల్లు గుర్తొస్తే నువ్వున్నావని, పిల్లల బాగోగులు అన్నీ జాగ్రత్తా చూసుకుంటావని ధైర్యంగా ఉంటుంది నాకు.. నీకు ఉద్యోగం కంటే నీ సేవలు నాకు, పిల్లలకి మన ఇంటికీ చాలా అవసరం’ అంటూ ఓదార్చి నా మనసులోని దిగుల్ని తీసేసే వారు తన మంచి మాటలతో. అంతే కాదు, చాలా వరకూ నాకు నా మీద నాకు నమ్మకం కలిగించే వారు. ఆయన నాకు మంచి స్నేహితుడు అవడం నా అదృష్టం.
తాను షిప్‌లో ఉన్నప్పుడు అంటే 92 లోనే మైక్రోసాఫ్ట్ వర్డ్ లాంటి కోర్సులు, ఎడిట్ మల్టీ మీడియా లాంటి కంప్యూటర్ కోర్సులు, ఒరకెల్ కోర్సులు పూర్తిచేసాను. అయితే ఎప్పుడూ ఉద్యోగాలు చేయలేదు. వాటి అవసరం అంతగా రాలేదు. మీరు అడిగే దాకా నాకిన్ని విద్యార్హతలున్నాయన్న సంగతి కూడా మర్చిపోయా. ( నవ్వులు)
♣ మీ వారేం చేస్తుంటారు?
* అతను మెరైన్ ఇంజినీర్‌గా జాబ్ చేసేవారు. పిల్లల్ని చూసుకునే బాధ్యత నా మీదే వుంది కాబట్టి, కెరీర్ మీద అంత దృష్టి పెట్టలేదు. నాకు ఇద్దరు అబ్బాయిలు. వారిని శ్రధ్ధగా చదివించాను. ఇద్దరూ ఇంజనీరింగ్ డిగ్రీలు చదివి తరవాత తమకి ఇష్టమైన రంగాలను ఎంచుకుని జాబ్స్‌లో సెటిల్ అయ్యారు.
♣ బాధ్యత గల గృహిణిగా ఎంతో బిజీగా వుండే మీరు, ఫేస్‌బుక్ లోకి ఎలా ప్రవేశించారు?
* పిల్లలు చదువు నిమిత్తమై ఇల్లు విడిచి వెళ్లిపోవడం, నేను కువైట్ రావడంతో ఒంటరితనంతో బోర్‌గా వుండేది. అప్పుడు నా కజిన్ ఒకరు ఈ ముఖ పుస్తకం గురించి చెబితే, 2009లో ప్రవేశించాను. మొదట్లో తెలుగు లిపి లేక రాయడం కష్టంగా ఉండేది. తెలుగు లిపి అందుబాటు లోకి రాగానే ఇక నేను విజృభించి ప్రతి రోజూ పోస్ట్స్ పెడుతూ.. అందరితో కలిసి నడుస్తూ.. నాకంటూ ఓ పేరు సంపాదించుకున్నాను.
♣ ఏమేం రాస్తుంటారు ఎక్కువగా?
* పుస్తక సమీక్షలు, సినిమా రివ్యూలు, చిన్న కథలు, వంటలు, జోక్స్, స్వీయానుభవాలు, రాజకీయాంశాలు, వాదనలు, చర్చలు – ఇలా రాయడం బాగా అలవాటు అయింది. ఎంతగా అలవాటైపోయిందంటే – దినవారీ చర్యల్లో ఒక పనిగా రైటింగ్స్ అలవాటయ్యాయి.
♣ మీరు ప్రొఫెషనల్ జర్నలిస్ట్ అయి వుంటే, సంచలనమైన నిజాలను, నిజమైన వార్తలను అందించేవారు. ఎందుకని జర్నలిస్ట్ కాలేదు మీరు?
* మంచి ప్రశ్న వేశారు దమయంతి. నిజానికి నాకు చిన్నప్పుడు జర్నలిజం అంటే చాలా ఇంట్రస్ట్ వుండేది. కానీ, ఇంట్లో వారికి మటుకు కొంచెం చిన్న చూపు.
♣ అవునా? అలా ఎందుకనుకునేవారు?
* జర్నలిజం అంటే వార్తా పత్రికలలో పనిచేయాల్సివస్తే, రాత్రి డ్యూటీస్ ఉంటాయి అని. అంతే. అయితే నా రాతల కార్యక్రమాన్ని నేనెప్పుడూ మానలేదు. ఎక్కడ ఏం జరిగినా, అందరికి టముకు వేస్తూ చెప్పడం బాగా అలవాటు. అప్పుడర్ధమైంది. నాలో జర్నలిస్ట్‌కి కావలసిన క్వాలిటీస్ అన్నీ వున్నాయని. ప్చ్! ఉండీ, అవకాశాన్ని అందుకోలేకపోయానే అనే అనిపించేది. కానీ, ఆ నిరాశ నించి పూర్తి ఉపశమనం – ఇప్పుడ్ నేను రాసే నా ఫేస్‌బుక్ పోస్ట్‌లు.
♣ మీ తెలుగు కూడా బావుంటుంది వసంత. ఇప్పుడు మాటల్లో వాడారు చూసారూ, టముకు అన్న పదం.. మీ ప్రాంతంలో ఎక్కువ గా వాడతారా?
* టముకు.. ఊ..గుర్తు లేదు. మా ఊరి భాషా..ఏమో మరి..అందరూ వాడే పదం అనుకున్నాను. (నవ్వులు) ఈ పదంతో ఒక పాట కూడా వుంది కదూ?
♣ అవును. మీ పోస్ట్స్ ఫాలో అయే వారికి అనిపిస్తుంది. ఇన్నేసి ఆలోచనలు ఎలా వస్తాయి వసంతకి అని. అందుకు మీ జవాబు కావాలి.
* (నవ్వులు) అలవోకగా మాట్లాడడం కన్నా రాస్తూ ఉంటేనే ఆలోచనలు అలలై వూరి, ప్రవాహమై ప్రవహిస్తాయి.
♣ మీ రచనలను నేను అబ్జర్వ్ చేస్తుంటాను. మీరు రాయని ప్రక్రియ లేదని చెప్పగలను. మీరు ఎవరి దగ్గర శిష్యరికం చేసారు? మీ గురువులు ఎవరు?
* ప్రత్యక్ష గురువు అంటూ ఎవరూ లేరు. కానీ, చిన్నప్పటి నుండి రావి శాస్త్రి గారు అంటే మహా ఇష్టం. రచనల్లో ఆయన ఫ్లో అంటే నాకు భలే ప్రీతి.
♣ వారి రచనల ప్రభావం మీ రచనల మీద కూడా ప్రతిబింబిస్తాయని భావిస్తారా?
* అమ్మో అంత పెద్ద మాటే! (నవ్వులు) అలా అనను కానీ ఎంతైనా చదివి ఆరాధించిన వారి స్ఫూర్తి వుంటుంది. మాటే కానీండీ, రచనే కానీండీ! అన్నీ- ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చేవే కదా! నా ఆలోచనల నిండా మహా మహా రైటర్స్ మాటలు, వారి రచనల ప్రభావం తప్పకుండా వుంటుంది.
♣ మీరు నాన్-స్టాప్‌గా మాట్లాడగల వక్త అని అనిపిస్తుంది. వేదికల మీద ప్రసంగిస్తుంటారా?
* ఏమిటీ, నేనా! (నవ్వులు) లేదండి. చిన్నప్పుడు నేను చాలా సిగ్గరిని.. ఎందుకో, ఓపెన్‌గా మాట్లాడలేకపోయేదాన్ని. పెరిగి పెద్ద దాన్నౌతూ, లైఫ్‌లో ఎదుగుతూ నా పరిధిలో నేను అన్నీవిషయాలు చదివి, చూసి, అన్వేషించి నేర్చుకోవడం జరిగింది. ఎక్కువగా రాయడం వల్ల ఏం గ్రహించానంటే – రాతల్లో నేను ఓపెన్ అప్ అవుతున్నానని గమనించాను.
♣ ఫేస్‌బుక్ పోస్టే కదా అని తేలికగా తీసేయరు. ఎంతో శ్రధ్ధగా, సమయానుసందర్భంగా తగు రీతిలో మీ రైటింగ్స్‌ని ప్రెజెంట్ చేస్తుంటారు.. అవన్నీ మీ ఆలోచనలకు ప్రతిరూపాలై వుంటాయి. ఇన్నేసి మెరుపు లాటి ఆలోచనలెలా సాధ్యం మీకు?
* అదే నా బలం. రాయడం ఒక్కటే తెలిసిన నేను ఏం వ్రాయగలనూ, ఎక్కడ నా రాతలను గుమ్మరించగల్నూ అని తపన పడుతున్న తరుణంలో నాకు ఫేస్‌బుక్ ఒక వేదికగా దొరికింది. ఇదొక అద్భుతమైన అవకాశాన్ని కలగచేసింది.
♣ మీ పోస్ట్స్ ని క్షుణ్ణంగా పరిశీలించిన అనుభవంతో అడుగుతున్నాను. మీదైన ఒక ప్రత్యే జీవన సిధ్ధాంతం కూడా దాగి వుంటుంది. ఏమిటనేది మీరు చెబితేనే బావుంటుంది.
* (నవ్వుతూ) హ్యూమర్! హాస్యాన్ని – జీవన విధానంగా చేసుకుంటే ఉంటే జీవితం హాయిగా నవ్వులతో నవ్వుతూ సాగిపోతుంది అని ప్రగాఢ నమ్మకం! నేను ఆ సిద్ధాంతాన్నే అనుసరిస్తూ, అనుకూల ఫలితాలను సాధిస్తూ, సంతోషకరమైన జీవితాన్ని సాగిస్తున్నాను.
♣ మీ నిజ జీవితంలో జరిగే ఘట్టాలను, సన్నివేశాలను దృశ్యీకరిస్తూ రాస్తుంటారు.. ప్రయివేట్ విషయాలు చాలా మంది దాచేస్తారు కదా.. మరి మీరు?
* నేను నా వ్యక్తిగత విషయాలనే కొంచెం ట్విస్ట్ ఇచ్చి నాదైన శైలిలో ఒక ఎపిసోడ్‌గా రాస్తుంటాను. ఎందుకంటే నా అనుభవం చెప్పడం వెనక నాకొక ఆశయం వుంది. అది చదివే వారెవరికి ప్రయోజనాన్ని చేకూర్చాలనే ఆశ. మన రచన ఏదైనా కానీండీ, మెసేజ్ ఓరియెంటేడ్‌గా వుండాలనేది నా ప్రధానమైన లక్ష్యం. ఆ మార్గం లోనే రాస్తుంటాను.
♣ నిజంగా ఇన్ని జరిగిన సంఘటనలా! అని బుగ్గలు నొక్కుకునే వారికి మీ సమాధానం?
* నా స్వీయానుభూతులు కానివి ఏవీ నేను ఊహించి కానీ కల్పించి కానీ రాయలేను. కొన్ని నా అనుభవాలతో బాటు నేను చూసినవి, విన్నవీ, చదివినవీ, ప్రపంచవ్యాప్తంగా నేను దర్శించినవి, ఆ సన్నివేశాలు అన్నిట్నీ నావి గానే భావిస్తాను. అవే నా లిమిట్స్. అంటే అడవుల్లో అనుభవాలు. బార్‌లో కూర్చుని తాగే మగవాళ్ళు, ఆకలి కేకలు ఇలాంటివి నాకు అనుభవంలో లేవు. అయితే, సాటి మనిషిగా అవన్నీ అర్థమై, హృదయాన్ని కదిలిస్తాయి. వీట్ని ఊహించి రాయలా? ఆ బాధ మనసుని తాకి కరుణతో కదిలిపోయిన ఆ క్షణం అది అనుభవం లోకి వచ్చినట్టే కదా. లేని వున్నట్టుగా వున్నవి లేనట్టుగా అభూత కల్పనలు రాయలేను. ఆ పని ఖచ్చితంగా నా వల్ల కాదు. అంతే. గాలరీ కోసమే ఎప్పుడూ రాయలేం. అప్పుడప్పుడు ఏదో వ్యతిరేకంగా రాయవలసి వస్తుంది.. అప్పుడు కూడా కొంత హాస్యం కలిపితే, చేదు మందు తీపి నీళ్లతో కలిపి ఇచ్చినట్టు అవుతుంది. అయితే, షాకింగ్‌గా రాసే వాళ్ళని గేలి చేయడం నాకు ఇష్టం ఉండదు.. అందరిని కలుపుకుంటు వెళ్లడమే నాకు ఇష్టం.
♣ అయితే ఓపెన్ డైరీ అని అనొచ్చంటారా?
* నే రాసే ప్రతి విషయం లోనూ నేను ‘కొంత’ ఉంటాను. నన్ను నేను బహిర్గతం చేసుకుంటూ ఉంటాను. అలా నేను రాసేవాన్ని కొంచెం ఫిక్షన్ కలిసినా నా డైరీలు.. కిందే వస్తాయి. అయితే ఇంట్లో కానీ బయట కానీండీ, ఇతరుల వ్యక్తిగత విషయాలు నాకు తెలిసినా నేను రాయను. నా గురించి తప్ప. (నవ్వులు)
♣ మీలో ఒక రైటర్, ఒక వ్యూయర్, ఒక విమర్శకులు, ఒక పరిశీలకురాలు వున్నారు.
* అవును. సరిగ్గా చెప్పారు. అయితే ఛానెలైజ్ అవలేదు.
♣ తెలుగు సాహిత్యంతో ఎలా స్నేహం కుదిరింది?
* ఇంట్లో తెలుగు పుస్తకాలు బాగా చదివేవాళ్ళం. స్కూల్‌లో ఇంగ్లీష్ మీడియం. లెండింగ్ లైబ్రరీ నుంచే వార పత్రికలు కూడా అద్దెకి తెచ్చుకుని చదివే వాళ్ళం.
♣మీరు కవితలు కూడా రాసి పోస్ట్ చేస్తుంటారు.. కవిత్వం పట్ల ఇష్టమెలా కలిగింది?
* నాకు కవిత్వం అంటే చిన్నప్పుడు – పెద్దగా తెలియదు. పెద్దయ్యాక శ్రీశ్రీ – మహా ప్రస్థానం, ఆరుద్ర – త్వమేవహం రెండూ బాగా చదివాను. అవి చాలా నచ్చేయి. ఆ భావాలని అలా పొందికగా రిథమిక్‌గా కవితలో రాయడం అంటే చాలా ఇష్టం ఏర్పడింది.. అప్పుడే 16 ఏళ్ళ ప్రాయంలోకి అడుగుపెడుతున్న యవ్వన దశలో అన్న మాట. ఆ తరవాత దేవులపల్లి కృష్ణశాస్త్రి పాటలు, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి కవిత్వం..ఇవి కూడా చాలా ఇష్టం. ఇప్పటికీ మంచి కవితలు కనిపిస్తే వదలను. కవితా సంపుటాలు కొంటుంటాను.
♣ కవిత్వం రాసేటప్పుడు ఎలాటి జాగ్రత్తలు తీసుకుంటారు?
* నేను కవిత్వాన్ని సహజమైన భాషలోనే రాస్తుంటాను. అందమైన పదాలు కోసం వెతుకుతూ, నిఘంటువుని ఆశ్రయిస్తూ ఆగను. అప్పటికప్పుడు పొంగుకొచ్చే భావ ప్రవాహంలో – వెంటనే తోచింది రాసేస్తాను. అయితే, భాష కన్నా భావాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. నిజం చెప్పాలంటే తెలుగు భాష మీద అంత పట్టు లేదు నాకు. నేను రాసే దాంట్లో నిజాయితీ ఉండాలనేది నా ప్రగఢ నమ్మకం, విశ్వాసం.
♣ ఫేస్‌బుక్ పోస్ట్స్ ద్వారా మీరింత పాపులర్ అయ్యారంటే, మీ విజయం వెనక గల రహస్యం ఏమై వుంటుందనుకుంటున్నారు?
* నా అక్షరాలలో నిజం వుంటుంది. రచనలో నిజాయితీతో కూడిన ఎక్స్‌ప్రెషన్ వుంటుంది. నేను ఇలా కాకుండా, ఇంకోలా రాయలేను కూడా.. నిజాయితీ వల్లే నా పోస్ట్‌లు హిట్ అవుతున్నాయి. రచన తమ మనసుకు హత్తుకుని, ప్రతిస్పందింప చేస్తాయని నా అభిమానులు అంటారు. అందుకు ఋజువుగా తమ తమ హృదయపూర్వక స్పందనలు తెలియచేస్తుంటారు.
♣ మీ రచనలు పత్రికలకు పంపరెందుకనీ? రచయిత్రిగా ఇంకా పేరు వచ్చేది కదా కదా?
* రైటర్ అంటే కొంచెమైనా, కమిట్మెంట్ ఉండాలి. అని భావించడం వల్ల ఎక్కువగా రాయను పత్రికలకి. ప్రయత్నించి చూసాను. ఉహు. ఒకోసారి రాసినవి తిరిగి చదువుకున్నప్పుడు – నావి నాకే నచ్చవు. ఇక్కడ నే తీసుకున్నంత స్వేచ్ఛ పత్రికలకి పంపే కథలు రాసేటప్పుడు వుండదు. నేనే చొరబడలేనేమో!
♣ మీ కుటుంబంలో సాహితీ వేత్తలు, రచయితలు వున్నారా?
* లేకేం! మా మావయ్య త్రిపుర ఓ కల్ట్ రైటర్‌గా చాలా ఫామస్. నాలో ఆ జీన్స్ ఏమైనా ఉన్నాయేమో మరి.
♣ అద్భుతం. ఇంకేం మరి. మేనమామ చాలు వుంది మీలో..
* అవునేమో, వుంటే వుండొచ్చు. మామయ్య కథల్ని చాలా శ్రధ్ధగా చదువుతాను. ఆయన కథల్లో చాలా లేయర్స్ ఉంటాయి. నేను అంత గుప్తంగా రాయలేను. నావి అన్నీ ఓపెన్ కథలు. అందరికి అర్ధం అవ్వాలని కోరుకుంటాను. అయితే ఎక్స్‌పెరిమెంటల్‌గా కొన్ని నా కోసం, నాలోని రైటర్ ఆత్మ తృప్తి కోసం రాస్తుంటాను.
♣ ఎలాటి కథలని ఇష్టపడుతారు?
* మరీ సంసారం, కుటుంబం కన్నీటి కథలు కన్నా, ఎక్కువగా – సమాజం, పరిస్థితులను ప్రతిబింబించే కథాంశంగా, బ్యాక్‌డ్రాప్‌లో రాసే కథలు ఇష్టం. రావిశాస్త్రి, చలం, కొకు.. రచనలు ఇష్టంగా చదివేదాన్ని. ఇప్పటికీ అంతే. అచ్చులో కథ కనిపిస్తే చాలు. చదవకుండా వదిలి పెట్టను.. చదవాలి.. చదువుతూ ఉంటే కనెక్ట్ అవుతాను బాగా. మర్చిపోయాను బీనాదేవి అంటే మరీ ఇష్టం…
♣ మీ పాఠకుల రెస్పాన్స్ గురించి చెప్పండి. మీ పోస్ట్స్ బహు జనాదరణ పొందుతాయి కదా.. మీ రీడర్స్, రీడర్‌షిప్ మీద మీకు గల అభిప్రాయం?
* నా పాఠకులు అంటే నాకు చాలా గౌరవం. తమ విలువైన సమయాన్ని, ఎనర్జీని వెచ్చించి నా రచనలు చదవడమే కాకుండా వెంట వెంటనే తమ హృదయస్పందనలు తెలియచేస్తూ, చక్కని అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటారు. వారి లైక్స్, రెస్పాన్స్ చూసినప్పుడు చెప్పలేనంత ఆనందంతో మనసు నిండిపోతుంది. తర్వాతి పోస్ట్ కోసం ఎదురుచూస్తున్నాం అని ఉవ్విళ్ళూరే నా పాఠకులకు నేనేమిచ్చి ఋణం తీర్చుకోగలననిపిస్తుంది. అందరనీ కలుపుకుంటూ వెళ్తాను కాబట్టి నాకు రీడర్సే ఫ్రెండ్స్, ఫ్రెండ్సే రీడర్స్ అయ్యారు. కాబట్టి నాకు రీడర్స్‌కి మధ్యన గల అనుబంధం విడదీయరానిదని గర్వంగా చెప్పగలను. ఈ సందర్భంగా నా పాఠకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను సంచిక మాగజైన్ ద్వారా.
♣ రీడర్స్‌తో ఇంతలా ఎలా కనెక్ట్ అవగలిగారు?
* రైటర్ అన్నవాడు సామాన్యులని అర్ధం చేసుకోవాలి. మనిషిలోని బలహీనతలను, మైనస్ పాయింట్స్‌ని బయట పెట్టడానికి కొందరికి మనసు ఒప్పదు. వెనకాడతారు. నేను అలా కాదు. హిపొక్రసీకి ఆమడ దూరం. నా బలహీనతలు నాకు తెలుసు. వాటిమీద సెటైర్లు వేసుకుంటూ వ్యాసాలు రాస్తుంటాను. మనం, హై పెడెస్టల్ మీద కూర్చుని కబుర్లు చెప్తే – కామన్ రీడర్స్ కనెక్ట్ కారు. అంతే కాదు, రైటర్ కూడా వాళ్ళల్లో ఒకరు అయితేనే పాఠకులు కనెక్ట్ అవుతారు.
♣ ఇప్పటిదాకా మీరు ఎన్ని బుక్స్ చదివి ఉంటారు?
* వెయ్యి పైనే చదివి ఉంటాను. నా 50 ఏళ్ల వరకు వారానికి కనీసం 1,2 బుక్స్ చదువుతూ ఉండే దాన్ని.. పుస్తకం చదవక పోతే నిద్ర పట్టదు. నా మంచం వెనక గట్టు మీద ఓ కట్ట బుక్స్ ఉంటాయి ఎప్పుడూ. స్కూల్‌లో, కాలేజ్‌లో ఉండగా.. రోజుకి ఓ బుక్ అయినా చదివేదాన్ని. ఇంకా ఎక్కువ చదివిన రోజులూ ఉన్నాయి.
♣ మిమ్మల్ని వెంటాడే నవల?
* వుంది. చిన్నప్పుడు.. చాలా ఇష్టంగా చదువుతుండేదాన్ని. ఇప్పటికి అదే.. ఉప్పల లక్ష్మణ రావుగారి ‘అతడు ఆమె’. బుచ్చి బాబు గారి – ‘చివరకి మిగిలేది’, వడ్డెర చండీదాస్ గారి ‘హిమజ్వాల’ మరువలేనివి. ఈ మధ్య చదివిన ‘ఒంటరి’, ‘శప్త భూమి’ నవలలు కూడా చాలా బాగున్నాయి.
♣ ఈనాటి సాహిత్యం సమాజానికి ఎంత వరకు ప్రయోజనకరంగా వుందంటారు? ఎలాటి సాహిత్యం అవసరమని భావిస్తున్నారు?
* ‘నేటి సమాజానికి సాహిత్యం ఇలాంటిది అవసరం’ అని ఎవరూ నిర్వచించనక్కరలేదని నా అభిప్రాయం. కాలానుగుణంగా సాహిత్యం తానే సంస్కరించుకుంటూ ముందుకు పోతుంది. ఏ కాలంలోనూ, మానవ నైజంలో ఎలాటి మార్పులు ఉండవు. కాలాన్ని బట్టి సమస్యలు ఉంటాయి. వాటికి అనుగుణంగానే సాహిత్యం – తనని తాను మలచుకుంటూ, తీర్చిదిద్దుకుంటుంది.
ఒకప్పుడు సతీ సహగమనం. స్త్రీ విద్య, బాల్య వివాహాలు సమస్యలు. వాటికి అనుగుణంగానే వుంది ఆనాటి సాహిత్యం. తరువాత కాలంలో ఉమ్మడి కుటుంబాలు, ప్రేమ పెళ్లిళ్లు, వరకట్నాలు, అత్తగారి ఆరళ్ళు సమస్యలు. అప్పటి సాహిత్యం ఆ కోవలోకి చెందినది.
ఇప్పుడు సహ జీవనాలు, ఒంటరి స్త్రీ లు, డైవోర్స్ అయిన వాళ్ళు, పెళ్లి కాక వయసు మీరిన స్త్రీలు, న్యూక్లియర్ కుటుంబాలలో పిల్లల పై బాధ్యతల బరువులు, విద్యా విధానంలో అసంతృప్తులు.. ఇవి నేటి సాహిత్య వస్తువులు.
సమస్యల రూపం మారుతుంది కానీ సాహిత్యం అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే రూపం. సమాజానికి అద్దం పడుతూనే వుంది. వుంటుంది.
♣ కువైట్‌లో స్త్రీల పరిస్థితినెప్పుడైనా పరిశీలించడం జరిగిందా?
* కువైట్‌లో స్త్రీ లను నేను దగ్గరగా చూడడం అంటూ జరగలేదు. అయితే ఇక్కడ కూడా విడాకులు ఎక్కువయ్యాయి అంటున్నారు అందరూ. మగవాళ్ళు మునుపటి లాగా భార్యల్ని పట్టించుకోకుండా తిరిగితే ఉరుకోవటం లేదు. విడాకులు, వారినుంచి తగినంత ధనం తీసుకుని కానీ వదిలి పెట్టటం లేదు అంటున్నారు. దీనికి కారణం విద్య. స్త్రీలు ఉన్నత చదువులను అభ్యసిస్తున్నారు. మగ పిల్లలు కొందరు చదువుని ఆషామాషీగా తీసుకుంటే, ఆడపిల్లలు మటుకు సీరియస్‌గా తీసుకుంటున్నారు. మగవారితో సమానంగా వృత్తి విద్యలు కూడా చదివి మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటూ తమ కాళ్ళ మీద తాము నిలబడుతున్నారు. ఈ మార్పు ఎంతైనా హర్షణీయం!
♣ చాలా సంతోషం వసంత గారు. మీ రచనా వ్యాసంగం ఇలానే నిరాఘాటంగా కొనసాగాలని, రచయిత్రిగా మీరు ఇంకా ఉన్నత స్థానాన్ని అధిగమించాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.
* చాలా థాంక్సండి. సుప్రసిద్ధ ఆన్‌లైన్ మాగజైన్‌గా కొనియాడబడతున్న సంచికలో నా ఇంటర్వ్యూ రావడం ఎంతో ఆనందంగా వుంది. పత్రిక సంపాదకులకు, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. అందరకీ నా నమస్సులు. బై.
***