మితమౌ యాహారమ్మును
జతనముతోడుత శ్రమమును సమముగ చేయన్
సతతమునారోగ్యమ్మును
జతకూడుననగ నవెట్టి సందేహమ్ముల్?
చిరువయసున బాలకులకు
మరి బాలికలకును చేయు మంచియు నొకటే
సరియగు వ్యాయామమ్ములఁ
త్వరితముగా నేర్పదగును తప్పకనెపుడున్.
ఆటల పాటల యందున
నోటమి గెలుపుల తెలిపిన నొప్పుగ నెపుడే
చేటులనైనను బ్రతుకున
దీటుగ నెదిరించు నేర్పు తెలియగ వచ్చున్.
పలువిధ వర్తనల కతము
కలుషితమైనట్టి చోటు, గట్టిగ మనమున్
నిలకడగా నుంచు కళలు
తెలియగ వలయును, జగముల తీరెటులున్నన్.
తనువును, మనమును నెప్పుడు
ననువుగ దార్ఢ్యముగఁ నుంచ నక్కఱ తోడన్
పనిబెట్టుక నుండవలయు
ననయము స్వస్థతనుఁ గాచు నదియే నధిపా!