[box type=’note’ fontsize=’16’] భువనచంద్ర గారు వ్రాసిన ‘పాదచారి’ అనే నవలను సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 7వ భాగం. [/box]
[dropcap]“న[/dropcap]డుస్తూ నడుస్తూ
నడుస్తూ ఆలోచిస్తూ
ఆలోచిస్తూ నడుస్తూ
జీవితాన్ని జీవిస్తూ
జీవించడమే జీవితం అనుకుంటూ
నడుస్తూనే ఉన్నాను…. జీవిస్తూనే ఉన్నాను.”
“అవును పాదచారీ! జీవించటమే జీవితం అనుకుంటూ నడుస్తున్నావు. నన్ను చూడు…” నిట్టూర్చి అన్నాడు స్వప్నమూర్తి.
“ఎందుకంత నిరాశ?”
“కలలు ఇంకిపోయాయి…”
“ఎలా?”
“కల లాగానే!”
“ఇంకొంచెం విడమర్చి చెప్పవోయ్ నేస్తం!”
“ప్రేమ ప్రేమగా లేదు.”
“నా ప్రేమ ప్రేమలాగానే ఉందిగా…”
“నా ప్రేమ నిజం పాదచారీ! నేననేది లోకం గూర్చి.”
“లోకం ఏం చేసిందీ?”
“ప్రపంచానికి నేను అర్ధం కాలేదోయ్!”
“లేక నీకే ప్రపంచం అర్ధం కాలేదేమో!”
“అదీ నిజం కావచ్చు. కానీ జరిగేది ఒకటే! అది వేదన కౌగిలింత!”
“నీ ఆశల స్కూటరేమయిందీ?”
“పెట్రోల్ అయిపోయింది…”
పకపకా నవ్వాడు పాదచారి. నవ్వుతూ అన్నాడు… “చూశావా స్వప్నా! నీ స్కూటరుకి పెట్రోలు అయిపోవచ్చు…. నా పాదాల్లో శక్తి తగ్గలేదోయ్! రా! నాతోరా!”
“ఇంతకాలమూ నీతోనే నీ వెనకే వచ్చాను. సరేలే కానీ పాదచారీ! వాళ్లందర్నీ చూడు? నీవైపు ఎలా చూస్తున్నారో? నిన్ను కాదోయ్ చూసేది నన్నే!”
పాదచారి చుట్టూ చూశాడు. ఎన్నో కళ్లు! కొన్ని దీనంగా. కొన్ని మౌనంగా, కొన్ని కన్నీటితో, మరి కొన్ని ఓ కంట ఆనందం, మరో కంట అశ్రువుల్తో.
నిట్టూరుస్తూ అన్నాడు “అవన్నీ నేను పెంచిన వృక్షాలే! అందుకే అలా నా వేపు చూస్తున్నారు. చూసేది నిన్నే కావచ్చు కాని చూపు నా వైపే స్వప్నమూర్తీ! నేనెంత అదృష్టవంతుణ్ని?”
“అయ్యో? నేనెంత దురదృష్టవంతుణ్ణి?”
“రెండు భావాలు ఒకే చోట! గోడమీద పిల్లి! వహ్ వా!” విప్లవమూర్తి హేళనగా అన్నాడు.
“ప్రతి పిల్లి ఎప్పుడో ఓసారి గోడ మీద ఎక్కుతుంది. కానీ విప్లవమూర్తీ! అదక్కడే ఉండిపోదు. ఏదో ఓ వైపుకి ఖచ్చితంగా దూకుంది” చిరాగ్గా అనాడు పాదచారి.
“నిజమే! ఏ వైపుకు దూకితే దానికి ప్రమాదం ఉండదో ఆవైపే దూకుతుంది” విప్లవమూర్తి స్వరంలో ఇంకా హేళన.
“రైట్! కానీ ప్రమాదం నుంచి దూరంగా ఉండటం సర్వజీవ లక్షణం. ప్రతి జీవి ప్రమాదరహితమైన బ్రతుకునే కోరుకుంటుంది. అలానే ప్రవర్తిస్తుంది. ప్రమాదరహితంగా ఉండాలనుకోవటం వేరు. ఇతరులకి ప్రమాదం సృష్టించం వేరు” పాదచారి గొంతులో చిరాకు మరింత అయింది.
“లాజికే మై బోయ్!… లాజిక్”
“విప్లవమూర్తీ! నీవు జవాబు చెప్పలేని దానికి లాజిక్ అని పేరు పెట్టి పలాయన వాదం సాగించకు.”
“అది నాకు అసహ్యం…”
విప్లవమూర్తి ముఖం చిన్నబుచ్చుకున్నాడు.
“నా ఆర్తి ఎవరూ వినరా!…”
“వింటాను స్వప్నా చెప్పు!…”
“ఆ కళ్ల చూపులు నేను భరించలేను!”
“నేనూ భరించలేనోయీ!…”
“మరేం చేద్దాం?”
“మౌనం. మనసులో కదిలిన ప్రతి ఊహకీ ఆకారమూ, రూపమూ ఉన్నాయి. Of course అది తెలిసినవారికి, అప్పుడు నీ మనస్సే కాదు… ఎదుటి మనస్సు కూడా సుస్పష్టంగా తెలుస్తుంది.”
“ఓహో తెలిసి ఏం చేయ్యడం? ఈ కాలం ఓ క్షణంలో రాక్షసి… ఓ క్షణంలో బలహీనపు రోగీ…”
“అదే ఆవహించిందోయ్! మౌనాన్ని శరణు వేడు”
స్వప్నమూర్తి నిస్తేజంగా అడుగులు వేస్తూ నడిచాడు.
పాదచారి మౌనంగా అతన్ని వైపు చూస్తూ అనుకున్నాడు “ఒకప్పుడు ఇతని వేగం చెప్పరానిది. ఈ క్షణం ఈతడు ఇంకిత ప్రవాహం.”
“అవును పాదచారీ అవును నాలోనూ జాలి ఉంది” తలదించుకుని అన్నాడు విప్లవమూర్తి.
“విప్లవా! నిన్నిలా చూడ్డం నేను భరించలేను. తల ఎత్తే ఉండు! నీ తేజాన్ని నిర్వికారం చెయ్యకు” విప్లవమూర్తి భుజం తట్టి అన్నాడు పాదచారి.
మెల్లగా కళ్లు తుడుచుకుని అన్నాడు విప్లవమూర్తి “నీలో అసంఖ్యాకమైన భావాలున్నాయి పాదచారీ! నిన్ను నేను ప్రేమిస్తాను… హేళన చేస్తాను…. కానీ నేస్తం! ఎపుడూ నీతోడు గానే ఉండాలని కోరుకుంటాను. నువ్వు నాకు హద్దులు ఏర్పరుస్తావు మిత్రమా! అవి నాకిష్టం లేకపోయినా అనుసరిస్తాను…. ఎందుకో తెలుసా నువ్వు నీ హద్దులోలనే ఉంటావు. నిన్ను నువు చిత్రవద చేసుకుంటావు.”
***
“నేను ముందరే చెప్పాను ప్రాణమా! నువు ఎవర్ని దగ్గరికి తీసుకుంటావో వారే నిన్ను దూరం చేస్తారు” జాలిగా అతని తలని నిమురుతూ అంది అమృత.
“నిజమే ఆ మాట ముమ్మాటీకీ నిజమే. కానీ అమృతా! నీవు మాత్రం నాకుంటే చాలు. ఇక మిగతా ప్రపంచమా? దాన్ని నేనేనాడో కొలిచాను. స్వార్థం కూడా సర్వజీవ లక్షణమే. అందుకే ప్రపంచాన్ని క్షమించాను.”
“నా పిచ్చీ! అందు వల్ల నీకు మిగిలేదేమిటో తెలుసునా? అవమానం! అవహేళనా! ”
“నేను గుర్తించనే గుర్తించను.”
“లోకులు గుర్తిస్తారు.”
“My foot to them! What the hell should I care for” కోపంగా అన్నాడు పాదచారి.
“ఈ లోకం, ఈ ప్రపంచం నువు క్షమించినంత తేలిగ్గా నిన్ను క్షమించదు. అది గిల్లి నవ్వుతూనే ఉంటుంది.”
“So what? అది దాని మూర్ఖత్వం.”
“కానీ జమకట్టేది మూర్ఖుడుగా నిన్నే”
“అలాగే కానీ! నష్టం ఏమిటి? నేను మౌనంగా సర్వాన్నీ చూస్తూనే ఉంటూను. గ్రహిస్తూనే ఉంటాను.”
“నేను భయపడను. నేను బాధపడను. నేను నన్ను చులకన చేసుకోను.”
“లోకం నిన్ను చులకన చేస్తూంది.”
“లోకమా అమృతా! నా లోకం వేరు. అక్కడి స్వరూపమే వేరు! అది వీళ్లకు అర్ధం కాదు. పోనీలే!”
అమృత అతన్ని దయగా స్పృశించి అన్నది “నన్ను గుర్తుచుకో నా పాదచారీ! ఏనాడో ఓ నాడు నువ్వు ఒంటరివి ఔతావు, అపుడు?”
“నువు నా ఆత్మలో జీవిస్తావు.”
అమృత నవ్వింది.
“ఆ ఆత్మ స్వరూపం నీవూ నేనూ చూడగలం.”
“అది చాలు ప్రపంచం సంగతి నాకెందుకూ?”
“నీ బంధాలన్నీ ప్రపంచంతోనోగా.”
“కావచ్చు అవి నా చేతనున్న నులకతాళ్లు త్రెంపి వెయ్యగలను.”
“కానీ అవి బలీయమైనవి. నీ శక్తి ఎపుడూ నీకుండదు.”
“నా శక్తి శారీరికంగాదు. మానసికం”
“నీ మనస్సే చలించవచ్చు.”
“కానీ నా ఆత్మ చలించదు.”
అమృత మళ్లీ నవ్వి అతన్ని దయగా ముద్దు పెట్టి కౌగిలించింది.
“నీ విశ్వాసం అచంచలం! అయినా అది కాలప్రవాహపు ఒరవడిని చూడలేదు ఇంత వరకూ.”
పాదచారి నవ్వి అన్నాడు “కాలం నా బానిస. ఎందుకో తెలుసా కాలం నా శరీరాన్నే శాసించగలదు నా అత్మను కాదు.”
***
పాదచరి నడుస్తూనే ఉన్నాడు. రోజులూ, నెలలూ మాలలై మెడను పెనవేశాయి. ఆ దారి అనంతం. అలసటా, అలజడీ లేనే లేదు. అంతా శూన్యమే చెట్టూ – చేమా పుట్టా – పురుగూ లేనే లేవు. ముందుకు నడుస్తూనే ఉన్నాడు.
అనుభవాల మూటలు మోస్తూనే ఉన్నాడు.
ఓ చోట “శుమైతాంగి”
తన బరువుని ఓ క్షణం దాని పై నుంచి ఓ అరక్షణం వెనక్కి చూశాడు.
తన వెనకే వస్తున్న కన్నులు.
“ఓహో మీరూ నా వెంటనే ఉన్నారా! రండి! రండి!”
“కానిపుడు ఒంటరిని!”
కొన్ని కన్నులు నిర్జీవాలయ్యాయి. కొన్ని ఆర్తిగా అతన్ని చుట్టి వేశాయి. వాటితో తానూ అశ్రువులు రాలుస్తూ అన్నాడు పాదచారి “మీరంతా నా వెనకే ఉన్నారు… ఎంత పిచ్చివాణ్ని నేను? వెనుదిరిగే చూడలేదు. ముందుకే నడిచాను. నా జీవితాల్లారా! నా ఉచ్ఛ్వాసాల్లారా! నాలో ప్రవేశించండి. నా నిశ్వాసాలతో నన్ను దాటి పోవద్దు! మళ్లీ మళ్లీ నా శ్వాసలోనే నిండి ఉండండి! మీ నీడలే నా నీడ! మీ జాడలే నా తోడు.”
ఆ కళ్లన్నీ ఆనందంగా నవ్వాయి. విశ్వాసం కుక్క పిల్ల ఆనందంగా తోకాడిస్తూ ఎక్కడ్నించో వచ్చింది. ప్రేమగా దాన్ని ఎత్తుకుని అనుకున్నాడు – నీవు నాలో బాగనివోయ్ నేస్తం. కుక్కపిల్ల వయితే నేం నీలోనూ జీవమూ సౌందర్యం ఉన్నాయి. నాతోనే ఉండు.
కుక్కపిల్ల చెంగున దూకి అతని పాదాలు నాకి తోకాడిస్తూ ముందుకి నడిచింది.
నడుస్తూ నడుస్తూ
తనలో తను జీవిస్తూ
మందుకు ముందుకు
ముందుకే సాగాడు.
(సశేషం)