[box type=’note’ fontsize=’16’] “దర్శకుడు కూడా కథంతా ప్రేక్షకుడి ముందు పెట్టి తనకు తోచిన విధంగా తీర్పు మనసులో చెప్పుకోమని వదిలేస్తాడు” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘సెక్షన్ 375‘ చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]
[dropcap]ని[/dropcap]ర్భయ కేస్ వొక ముఖ్యమైన మలుపు అనుకుంటే ఆ తర్వాత వచ్చిన రేప్ కు సంబంధించిన చట్టాలలో వచ్చిన మార్పులలో ముఖ్యమైనది : వొక స్త్రీ గనుక రేప్ జరిగింది అని ఫిర్యాదు చేస్తే కోర్టులో అది రేప్ కాదని నిరూపించుకునే బాధ్యత నిందితుడి మీదే వుంటుంది. అదీ కాక చాలా సూక్ష్మమైన మార్పులు చోటు చేసుకున్నాయి. రేప్ కు గురైన స్త్రీ ఇదివరకు ఎలాంటి జీవితం గడిపింది, అతనితోనే ఎలాంటి సంబంధబాంధవ్యాలు కలిగి వున్నాయి వగైరా అన్నీ పరిగణలోకి రావు. ఆమె వద్దు అన్న తర్వాత జరిగినది రేప్ కిందే లెక్క. దీనిమీద ఈ మధ్య సశక్తమైన సినెమా పింక్ వచ్చింది. ఇప్పుడు ఇదే అంశం మీద మరో చిత్రం.
క్లుప్తంగా కథలోకి వెళ్దాం. రోహన్ కపూర్ (రాహుల్ భట్) వొక దర్శకుడు. అతని దగ్గర అసిస్టెంట్ కాస్ట్యూం డిజైనర్ గా పనిచేస్తుంటుంది అంజలి (మీరా చోప్రా). వొక రోజు సీనియర్ డిజైనర్ చెప్పిన అనుసారం కాస్ట్యూంస్ చూపించడానికి అంజలి రోహన్ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఏకాంతం కల్పించుకుని అతను ఆమెను రేప్ చేస్తాడు. ఆ తర్వాత అంజలి ముందు ఇంటికెళ్తుంది, తర్వాత కుటుంబ సభ్యులతో పోలీసు స్టేషనుకెళ్ళి ఫిర్యాదు నమోదు చేయిస్తుంది. అక్కడ సమయానికి ఆడ పోలీసులు లేకపోతే మగ పోలీసు దగ్గరే ఫిర్యాదు నమోదు చేయించడం, అడిగిన వాటికి సమాధానాలు చెప్పడం, అన్ని పరీక్షలకూ వొప్పుకోవడం చేస్తుంది. ఆ తర్వాత పోలీసులు రోహన్ ని అరెస్టు చేస్తారు. అతని దగ్గర రక్తం, మూత్రం సేంపిల్స్ సేకరించి అన్ని పరీక్షలూ చేస్తారు. పరీక్షలో ఆ రెంటి డి ఎన్ ఏ ఒకటే అని నిరూపణ అవడడంతో సెషన్స్ కోర్టు అతనికి పదేళ్ళ కారాగారశిక్ష విధిస్తుంది. ముంబై నగరంలో బాగా పేరున్న లాయర్ తరుణ్ సలూజా (అక్షయ్ ఖన్నా) ను కలిసి కేసును హైకోర్టుకు అప్పీల్ చేయమని కోరుతుంది రోహన్ భార్య. హీరల్ గాంధి (రిచా ఛడ్డా) అంజలి/స్టేట్ తరపున వాదిస్తుంది. మిగతా కోర్ట్ రూం డ్రామా చివరికి ఎక్కడకు తీసుకెళ్తుంది అన్నది తెరపైన చూడాల్సిందే. నిస్సందేహంగా ఆసక్తికరంగా వుంది.
యోగ్యతను కాసేపు పక్కన పెడితే మనీష్ గుప్తా వ్రాసిన స్క్రిప్టు బాగుంది. అలాగే అజయ్ బహల్ దర్శకత్వమూ. ఇతను ఇదివరకు BA Pass అనే చిత్రం తీశాడు. క్లింటన్ కేరెజో సంగీతం మూడ్ ని బాగా అనుసరిస్తుంది, నైపుణ్యంగా. సాంకేతికంగా లోపాలు ఎంచడానికి ఏమీ లేదు. అందరి నటనా బాగుంది. ముఖ్యంగా అక్షయ్ ఖన్నా, రాహుల్ భట్ (ఇతను ఇదివరకు Ugly లో కనిపించాడు) లది. జడ్జీలగా కృత్తికా దేశాయి, కిశోర్ కదం లు బాగా చేశారు. ఇక చట్టానికీ, న్యాయానికీ సంబంధించి కొంత ఆసక్తికర చర్చ జరుగుతుంది. అక్షయ్ ఖన్నా అంటాడు తాము చట్టపరమైన వృత్తిలో వున్నారు, న్యాయం అందించే వృత్తిలో కాదు అని. అలాగే దర్శకుడు కూడా కథంతా ప్రేక్షకుడి ముందు పెట్టి తనకు తోచిన విధంగా తీర్పు మనసులో చెప్పుకోమని వదిలేస్తాడు. ఇంతకంటే ఎక్కువ వ్రాసి చదువరి సినెమా అనుభూతిని నీరు గార్చను.
ఈ చిత్రం ఇంకా చూడని వాళ్ళు ఇక్కడినుంచి చదవడం దాటెయ్యవచ్చు. చూసిన వాళ్ళకు ఇబ్బంది లేదు. ఈ మధ్య మనం చూసిన వొక పెద్ద సాంఘిక విప్లవం MeToo. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో చాన్నాళ్ళుగా స్త్రీ అవసరాన్ని, నిస్సహాయతనీ, ఆర్థిక బలహీనతనీ అడ్డుపెట్టుకుని, మగవాళ్ళకున్న వృత్తిపరమైన బలాన్ని వాడి లైంగికంగా హింసకు గురిచేయడం జరుగుతూ వుంది. ఇది ఇతర రంగాలలో కూడా జరుగుతున్నదే. ఇన్నాళ్ళకి స్త్రీలు ధైర్యం చేసి బైటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని నమోదు చేయడం, ఆయా పురుషులను చిత్రపరిశ్రమ దూరంగా పెట్టడం అన్నీ చూస్తున్నాము. అలాంటి సమయంలో వచ్చిన వొక చిత్రం పింక్ అయితే, ఇది దాదాపు దానికి విరుధ్ధమైన చిత్రమే. ఇలా జరగడానికి వీలు లేదా అంటే, తప్పకుండా వుంది, కాని ఎంత శాతం? ఎంత తేలికగా? ఇప్పటికీ లైంగిక హింస తగ్గలేదు. నిర్భయ కేసు తర్వాత చట్టాలు బలమైనవిగా తయారైనా, హింసలు పెరుగుతూనే వున్నాయి. వొక కారణం సరైన న్యాయం అందక పోవడమే. రకరకాల మలుపులు తిరిగే ఈ కథలో మనకు తెలిసేది ఏమిటంటే అంజలి రోహన్ ను చూసి మోహం లో పడుతుంది. కాని అతనికి వివాహం అయ్యిందని తెలిసి వెనక్కు తగ్గుతుంది. అతను కట్టు కథలు చెప్పి ఆమెను దగ్గరకు తీసుకుంటాడు. ఆమెకు భార్య స్థానం, లేదా మరే గౌరవకర మర్యాదకర స్థానం ఇచ్చే ఉద్దేశ్యం అతనికి లేదు. ఇది తెలిసేటప్పటికి ఆమె రేప్ కంటే అధ్వాన్నమైన శోషణకు గురైనట్టు భావిస్తుంది. కాబట్టి పధ్ధతి ప్రకారంగా చట్టాని పూర్తిగా అర్థం చేసుకుని అతన్ని ఇరికిస్తుంది. అది రేప్ కాదు కాబట్టి అతను నిర్దోషిగా ఎంచాలా? లేక మోసపూరితంగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు కాబట్టి న్యాయం జరిగింది అనుకోవాలా? నాకు అసంతృప్తి కలగడానికి కారణం కథంతా అతని వైపే మొగ్గుతుంది. అతని లాయర్ గా అక్షయ్ ఖన్నా పాత్ర చాలా బలంగా తయారైంది. అతని నటన కూడా, ముఖ్యంగా అతని శరీర భాష, సంభాషణలు బలంగా వున్నాయి. మనకున్న మంచి నటులలో రిచా ఛడ్డా వొకతె. ఆమె నటించిన చిత్రాలన్నిటిలోనూ ఆమెది బలమైన పాత్రే. కాని ఇందులో ఆమె పాత్రను చాలా బలహీనంగా చూపించారు. అందుకే ఆమె నటన గురించి నేను ప్రస్తావించలేదు. అక్షయ్ ఎత్తులు పై ఎత్తులూ వేస్తుంటే చూస్తూ వుండిపోతుంది, బలంగా ఎదుర్కోదు ఆమె పాత్ర. అధికారం లో వున్న పురుషుడిని వొక సాధారణ స్త్రీ ఎలాంటి సపోర్టు లేకుండా ఇలా ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఎంత మందికి, ఏమాత్రం వీలుంది? దోపిడీ, పీడనలకు సమాజ పరిస్థితులు అనుకూలంగానే వున్నాయి, కాబట్టి అది అలా కొనసాగుతూనే వుంది. సరైన న్యాయం జరగకపోవడం వల్ల మరింత ధైర్యంగా అది రోజురోజుకీ పెరుతూనే వుంది. కాని ఇందులో చూపిన విధంగా ఆమె వున్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో ఇది జరిగే పనేనా? న్యాయం విషయం పక్కన పెట్టినా చాలా కోణాలు బయట పడతాయి ఇందులో. కేసు నమోదయ్యాక కూడా వెంటనే అతన్ని అరెస్టు చెయ్యకుండా ఇన్స్పెక్టర్ అతనితో ఫోను మీద బేరసారాలు సాగిస్తాడు, ఇరవై లక్షలిమ్మంటాడు. కాని అతను ఆశించిన స్పందన లేకపోవడం, కేసు నమోదు చేయక తప్పని పరిస్థితుల్లో చేసి ఇంకా ఆశతో కేసు ను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తాడు. సేకరించిన సేంపిళ్ళని రసాయనశాలకు పంపడానికి అయిదు రోజులు తీసుకుంటాడు. స్త్రీ పోలీసులు, స్త్రీ డాక్టర్లు లేకపోవడం, పురుష పోలీసు, పురుష డాక్టర్ ఆమెను పరీక్షించడం చూపిస్తారు. దాని మీద ఎలాంటి చర్చా వుండదు. చూసేవారు చట్టం పనితీరు, అది ఎటు వైపు మొగ్గుతుంది వగైరా తమకు తాము ఆలోచించుకోవాలి. చాలా చర్చలకు తెర ఎత్తింది ఈ చిత్రం.