‘యాత్ర’ చూద్దామా?

1
3

[dropcap]‘యా[/dropcap]త్ర’ చూద్దామా?

మీరు సరిగ్గానే చదివారు. యాత్ర ‘చూద్దామా’ అనే అన్నాను, చేద్దామా కాదు!

ప్రయాణాలలో ఎన్నో రకాలు. ఆశించిన ఉద్దేశాన్ని బట్టి ప్రయోజనాలుంటాయి. ప్రయాణాలు చేసినవారు తమ అనుభవాల్నీ, అనుభూతుల్నీ అక్షరబద్ధం చేసి తమలా ప్రయాణం చేయలేనివారికి తమ పర్యటన వివరాలను వ్యాసాల రూపంలోనో, పుస్తక రూపంలోనే అందిస్తారు. అంటే ‘చేసే’ ప్రయాణాలు కొన్నీ… ‘చదివే’ ప్రయాణాలు కొన్నీ… ‘చూసే’ ప్రయాణాలు కొన్నీ!

కొన్ని యాత్రా రచనలు చదివినప్పుడు మనకీ అలా ప్రయాణాలు చేసి, అనుభూతులను గుత్తిగా పోగుచేసుకోవాలనిపిస్తుంది. కానీ అందరూ అన్ని ప్రయాణాలు చేయలేరు. బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు కొందరిని గడప దాటనీయవు.. మరికొందరు శారీరకంగా ప్రయాణాలు చేయలేని స్థితిలో ఉంటారు. ఇలాంటి వారందరికీ టీవీల్లో వచ్చే పర్యాటక ప్రదేశాల గురించిన షోలు, ట్రావెలర్స్ రాసే యాత్రారచనలే ఆలంబనలవుతాయి. వారి అక్షరాలు/దృశ్యాలు ఆయా ప్రదేశాలలో మనోవిహారం చేయిస్తాయి.

ఒక పుస్తకం చదివి పరోక్షంగా యాత్రానుభూతి పొందగలుగుతున్నప్పుడు – యాత్రకి సంబధించిన టివీ సీరియల్ ఎపిసోడ్స్ చూసినప్పుడు అదే పరోక్షానుభూతి ఎందుకు సాధ్యం కాదు అనిపించింది.

ఒక ట్రావెలోగ్‌లో రచయిత ప్రస్తావించిన ఓ సీరియల్ గుర్తొచ్చింది. వెంటనే వివరాలు సేకరించి, యూ-ట్యూబ్‌లో ఆ సీరియల్ చూశాను. వివరాలివి:

ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగళ్ భారతీయ రైల్వేల కోసం ‘యాత్ర’ అనే ధారావాహిక రూపొందించారు. ఈ సీరియల్‌ని అప్పట్లో దేశంలోకెల్లా అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ‘హిమసాగర్ ఎక్స్‌ప్రెస్’లోనూ, ‘త్రిపుర ఎక్స్‌ప్రెస్’లోనూ చిత్రీకరించారు. 1986లో ఇది దూరదర్శన్‌లో రెండు భాగాలుగా 15 ఎపిసోడ్లుగా ప్రసారమైంది. కన్యాకుమారి నుంచి జమ్మూతావి దాకా ఒక మార్గంలోని ప్రయాణాన్నీ, రాజస్థాన్ లోని జైసల్మేర్ నుంచి అస్సాం లోని ‘డూమ్ డూమా’ వరకు రెండో మార్గంలో ప్రయాణాన్నీ ఈ సీరియల్ చూపిస్తుంది.

ఇది ‘చూసే’ ట్రావెలాగ్! జెహంగీర్ చౌదరి గారి కెమెరా ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలు తెలుస్తాయి, కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. 33 సంవత్సరాల క్రితం నాటి సామాజిక పరిస్థితులు కళ్ళకు కడతాయి. అయితే కొన్ని సంఘటనలు నేటికీ వర్తిస్తాయనిపిస్తుంది.

ఈ సీరియల్ రైల్వే వారి కోసం తీసినది కాబట్టి, రైల్వేశాఖ తక్కువ ధరకే 10 బోగీల రైలుని 50 రోజుల పాటు షూటింగ్‌కి ఇచ్చిందట. అందుకే ఈ సీరియల్‌లో అప్పుడప్పుడు రైల్వే సిబ్బంది విధి నిర్వహణని, వ్యవస్థ పనితీరునీ చూపిస్తారు.

ఓ ట్రావెలాగ్ రాసిన రచయిత పాఠకులని తన వెంట తనెక్కిన వాహనంలో తీసుకువెళ్ళినట్లుగానే ఈ సీరియల్‌లో దేశంలోని దక్షిణం నుంచి ఉత్తరానికి, పశ్చిమం నుంచి తూర్పుకి ప్రయాణించే ప్రయాణీకులు మనల్ని వాళ్ళతో పాటు తీసుకెళతారు. వాళ్ళ కథలు మనకు చెబుతారు. ఆ యా పాత్రలలో కలవడం, మాట్లాడడం, స్నేహం కలపడం, చర్చలు, విడిపోవడం ఇలా ఒక వలయం పూర్తి చేస్తాం.

భౌతిక పర్యటనల గొప్పతనమేమిటంటే… ఆయా పర్యటనలలో మనం సుందరమైన ప్రదేశాలను, ప్రకృతిని చూస్తాము. స్థానికులు, తోటి పర్యాటకుల రూపంలో కొత్త వ్యక్తులను కలుస్తాం. పర్యటనలంటే ప్రకృతి సౌందర్యమే కాదు, జనజీవన సౌందర్యం కూడా అని తెలుసుకుంటాం, దేశం చూడడమంటే మనుషులను చూడడటమేననీ, వారితో సంభాషించి పరిచయం పెంచుకుని, స్నేహంగా మార్చుకోడమే అని అవగతం చేసుకుంటాం. కానీ ‘చూసే’ ప్రయాణాలలో ఇటువంటిది సాధ్యం కాదు కదా అని కొందరు అడగవచ్చు. నిజమే…. కథలు, నవలలోని పాత్రలు కూడా కల్పితాలే కదా… కాని వాటి ప్రభావం పాఠకుల మీద ఉంటోందిగా! అలాగే ఈ వీక్షణ ప్రయాణంలోని… అభౌతిక యాత్రలోని… కొన్ని పాత్రలు మన మీద ముద్ర వేస్తాయి. భవిష్యత్తులో ఈ మార్గంలో ప్రయాణం చేయగలిగితే… ఈ దృశ్యాలు అనుభూతులై మనసులో చిరస్థాయిగా నిలుస్తాయి.

ఈ సీరియల్ ఎపిసోడ్స్… దాదాపుగా ఒక రైల్లోని బోగీలలో జరిగిన కథల సంకలనంలా, బోగీలో – వాళ్ళ చర్యలు, ప్రతిచర్యల ఆధారంగా రైలు ప్రయాణీకుల జీవితాలను కొన్ని అందమైన రేఖలుగా చిత్రిస్తాయి. చాలాసార్లు మనం కూడా ఆ రైల్లో ప్రయాణిస్తున్నట్టు, ఆ వ్యక్తులను స్వయంగా కలుసుకుని మాట్లాడిన అనుభూతి చెందుతాం.

ఈ సందర్భంగా ఓ చక్కని పాటని గుర్తు చేసుకుందాం.

“గాడీ బులా రహీ హై సీటీ  బజా రహీ హై” అంటూ ‘దోస్త్’ సినిమాలో కిషోర్ కుమార్ అద్భుతంగా పాడారో పాట. “ఆతే హైఁ లోగ్, జాతే హైఁ లోగ్” అనీ, “చల్‌నా హీ జిందగీ హై, చల్‌తీ జా రహీ హై” అంటారు గీత రచయిత ఆనంద్ బక్షీ. ఈ పాటని అత్యద్భుతంగా స్వరపరిచింది లక్ష్మీకాంత్ ప్యారేలాల్.

మరి మనం కూడా ఆ రైలెక్కుదామా? వచ్చే వారం వరకు ఆగాలి!!

(ఈ సీరియల్ గురించి ఇప్పటి తరానికి తెలియజేయడానికి ఈ అవకాశం తీసుకుంటున్నందుకు గాను సీరియల్ దర్శక నిర్మాత శ్యామ్ బెనెగళ్ గారికి, దూరదర్శన్ వారికి, ఈ సీరియల్ ఎపిసోడ్స్‌ని యూ-ట్యూబ్‌లో ఉంచిన స్టూడియో ఎస్‌ఎన్ వారికి నా కృతజ్ఞతలు.)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here