జాబిల్లి

0
3

[dropcap]అం[/dropcap]దరూ ఆడపిల్లల్ని చందమామతో పోలుస్తుంటారు. మా నాన్న, నేను వెన్నెల్లో మిద్దె మీదే అన్నం తింటాం. ఆయన నాకు గోరుముద్దలు తినిపిస్తూ చందమామ గురించి రకరకాల కథలు చెప్పేవారు. అందరూ ఇష్టపడే చందమామ ఎందుకు ఎప్పుడూ ఒంటరిగా వుంటుందో నాకు అర్థమయ్యేది కాదు. అసలు చందమామ మనసులో ఏముందో వీళ్లెప్పుడన్నా ఆలోచించారా. దానితో సంబంధం లేకుండా వీళ్లపాటికి వీళ్లే తెగ ఆనందించేస్తున్నారు. నన్ను ప్రేమించే వాళ్లు ఎంతమందున్నా నేను జాబిల్లినే.

ఆరోజు మెడికల్ కాలేజీ క్యాంటీన్లో ఉదయం 11.30కి క్లాసు ఇంటర్వెల్లో కాఫీ తాగుతున్నా. మా సార్ నా వైపే నడిచి వస్తుండటంతో లేచి నుంచున్నా.

“కూర్చో” అన్నాడు. కూర్చున్నా.

“నీతో పర్సనల్‌గా మాట్లాడాలి” అన్నాడు.

నా చేతికి ఒక మజా కూల్ డ్రింక్ ఇచ్చి, తనొకటి తాగేదానికి పట్టుకున్నాడు. నాకెందుకో మజా కూల్‌ డ్రింక్స్ అంటే భలే ఇష్టం. అవలీలగా ఒక లీటరు బాటిల్ తాగేస్తా. అప్పటికే కాఫీ తాగినా అతనిచ్చిన కూల్ డ్రింక్ మర్యాద కోసం కాదు, ఇష్టంగానే తీసుకున్నా.

“నీ గురించి అందర్ని కనుక్కున్నా, నువ్వు చాలా మంచిదానివన్నారు” అతను మాట్లాడుతున్నాడు. నాకు చిర్రెత్తుకొచ్చింది. ఒక డాక్టరుగా వుండి నా గురించి ఎంక్వైరీ చేయడమేంటి. నా క్యారెక్టర్‌ను కొంతమంది మాటల ద్వారా విలువ కట్టడమేంటి.

“ఏంది సార్ మీరనేది” కూల్ డ్రింక్ తాగడం ఆపేసి మరీ అడిగా.

“ఏం లేదు. నువ్వు చాలా అందంగా వుంటావు. నేను మీ క్యాస్టే. నా మీద నీ అభిప్రాయం ఏంది” సూటిగా అడిగాడు.

అతని వరుస అప్పుడు అర్ధమైంది. అతను నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అతని పేరు వర్ధన్, 6 అడగులుంటాడు. ఛామనఛాయ, స్లిమ్‌గా వున్నాడు. షార్ట్ ఫిల్మ్ హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. ఎక్సర్‌సైజు బాడీ. చూడటానికి అందంగా వుంటాడు. అయినంత మాత్రాన నచ్చేయరు కదా. సెలబ్రిటీలు అయినంత మాత్రాన అభిమానిస్తాం కానీ, ప్రేమించం కదా.

“మీ మీద నాకెలాంటి అభిప్రాయం లేదు. మీరు నా గురించి ఎంక్వైరీ చేయడమేంటి. మీరెవరు నా మీద నిఘా వేయడానికి” సీరియస్‌గా చెప్పా.

“పెళ్లి చేసుకునే అమ్మాయి గురించి ఆ మాత్రం ఎంక్వైరీ చేయగూడదా” అతను విస్తుపోతూ అన్నాడు.

“ఆడపిల్లలంటే అంత అనుమానమైతే ఎలా సార్. అయినా మీ ప్రవర్తన నాకు నచ్చలేదు. నాకు అలాంటివి ఇష్టం లేదు. వుంటాన్ సార్” సగం తాగిన కూల్ డ్రింక్‌ను టేబుల్ మీద వదిలేసి విసురుగా వెళ్లిపోయా.

మరుసటిరోజు వర్ధన్ సారు తన తల్లిదండ్రులను మా ఇంటికి పంపించాడు. వారు మా నాన్నతో పెళ్లి సంబంధం గురించి మాట్లాడారు.

మా నాన్న “ఆలోచించుకుని చెప్తాం అండీ” అని వారికి సకల మర్యాదలు చేసి పంపించాడు.

కాలేజీ అయిం తర్వాత ఇంటికొచ్చిన నాతో నాన్న ఈ విషయం కదిపారు. మా నాన్నకు 55 సంవత్సరాలు. అతను రెండు లాడ్జీలను స్వంతంగా నడుపుతున్నారు. మాకు ఆస్తిపాస్తులకు కొదవేం లేదు. నేను ఒక్కదాన్నే కూతుర్ని.

“నాన్నా నాకు 22 సంవత్సరాలే. అప్పుడే పెళ్లేందుకు” అన్నా.

“మంచి సంబంధం. అబ్బాయికి తాగుడు, అమ్మాయిలతో తిరగడాలు లాంటి చెడు అలవాట్లు లేవే. వారి కుటుంబానికి మంచి పేరుంది. ఒకే కులం. ఆ సంబంధం వద్దు అనడానికి కారణాలేం దొరకడం లేదు” నాన్న అన్నారు.

“నాకు పెళ్లి ఇష్టం లేదు నాన్నా. అయినా అతను నా గురించి నా స్నేహితులనే అడిగాడు ఎటువంటమ్మాయి అని. అది నాకు నచ్చలేదు. అంతేగాకుండా అతని మీద నాకు ఎలాంటి అభిప్రాయము లేదు” సూటిగా చెప్పాను.

“నేను కూడా అబ్బాయి గురించి ఎంక్వైరీ చేశాను. అతని అలవాట్ల గురించి, అతనికి ఎవరన్నా ఆడ స్నేహితులు వున్నారా, వాళ్లతో ఎప్పడన్నా అసభ్యంగా ప్రవర్తించాడా, అని. దానికి అతను కూడా ఫీల్ అవచ్చుగా” నాన్న సూటిగా అన్నాడు.

“నాన్నా, మీరు విచారించడం వేరు. అతనే స్వయంగా రంగంలోకి దిగి విచారించడం వేరు” అని చెప్పి నా రూములోకి వెళ్లిపోయా. అప్పటినుండి మా నాన్న మళ్లీ పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. అటు తర్వాత వర్ధన్ గురించి చర్చ నా ముందు మా ఇంట్లో జరగలేదు. మా అమ్మే మా నాన్నతో చెప్పింది “దానికి ఇష్టం లేన్నప్పుడు వదిలేయండి” అని.

ఆ మరుసటి రోజు నా స్నేహితురాలు జయ ఫోన్ చేసింది. “మా అమ్మకి గుండె పట్టేసినట్టు వుందంట. బాగాలేదు. ఒకసారి అర్జెంట్‌గా రావే” అంది.

నేను హడావుడిగా బయల్దేరి వెళ్లా. జయ నా పదవతరగతి క్లాస్‌మేట్. నేను హడావుడిగా వెళ్లి, జయ వాళ్లమ్మ నొప్పి గురించి అడిగా. జయ ఆంటీ చెప్పినదాన్ని బట్టి అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని నాకు అర్ధమయింది. గుండెనొప్పి అయితే, కొంచెం నడిచినా ఎక్కువుగా చెమటలు పడతాయి. చిన్న పనులు చేస్తున్నా తొందరగా అలసిపోతారు. రొమ్ముల మధ్యభాగంలో మంట వస్తుంది. ఆ మంట ఎడమ రొమ్ము వైపు పాకుతుంది. ఆ నొప్పి అటునుండి భుజం గుండా ఎడమచేయికి వెళుతుంది. ఎడమ దవడ తిమ్మిరెక్కినట్టు అవుతుంది. ఎడమ చేయి బాగా చెమటలు పట్టి, నీళ్లు పారినట్టు వుంటుంది. ఈ లక్షణాలు గుండె నొప్పికి సంబంధించినవి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే గుండెలో పట్టుకున్నట్టు వుంటుంది. అందుకే జింకోవిట్ టాబ్లెట్ రాసిచ్చా. దానికన్నా ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్లలో చిటికెడు సోడాపొడి, అర టీ స్పూన్ వాము వేసి తాగితే గ్యాస్ ప్రాబ్లమ్ పోతుందని చెప్పా. ప్రతిరోజు సాయంత్రం అరగంట వాకింగ్ చేయమని చెప్పా.

అంతా అయిం తర్వాత జయ వాళ్లమ్మ చిన్నగా వర్ధన్ గురించి మాట్లాడింది. “ఈ వర్ధన్ మాకు దూరపు బంధువు. అతనికి నువ్వంటే చాలా ఇష్టమని చెప్పాడు. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఒకసారి ఆలోచించు అమ్ముడు” అంది.

నేను నవ్వుతూ “అలాగే ఆంటీ. వస్తాను” అని చెప్పా.

ఇంట్లో నుండి బయటకి వచ్చేటప్పుడు జయతో “ఏమే వర్ధన్ సార్ విషయం మాట్లాడటానికి పిలిపించారా. లేదా నిజంగానే ఆంటీకి సమస్య వచ్చిందా” అని అడిగా.

“ఏయ్, మూసుకో” అంటూ జయ సుతిమెత్తగా కోప్పడింది.

రెండు నెలలు గడిచాయి. కాలేజీలో మాకు కొన్ని క్లాసులు వర్ధన్ సార్ తీసుకుంటున్నాడు. 5 బైపాస్ సర్జరీలు కూడా అతని ఆధ్వర్యంలోనే చేశా. అతను పద్దతిగానే వున్నాడు. ప్రేమ, పెళ్లి ప్రస్తావన మళ్లీ తీసుకురాలేదు. నేను “హమ్మయ్య” అనుకొని ఆనందంగా వున్నా. పిజీ కూడా అయిపోవస్తోంది. మేం అప్పుడే గుండె ఆపరేషన్లు చేయడం మొదలెట్టాం. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లి పేషెంట్ చెస్ట్ మధ్య కోస్తున్నప్పుడు మొదట్లో కళ్లు తిరిగేవి. వాంతి చేసుకున్నట్టు అనిపించేది. తర్వాత అలవాటయిపోయింది. ఇప్పుడు నేను 45 నిమిషాల్లో ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేస్తా.

నేను, నా స్నేహితులు వీకెండ్స్‌లో మాకిష్టమైన ప్రదేశాలకు వెళతాం. అప్పుడప్పుడు ఫారిన్ టూర్స్‌కు కూడా వెళ్లి వస్తుంటాం. మెడిసిన్ చదవాలంటే ఎగువ మధ్యతరగతి వాళ్లకే సాధ్యమవుతుందని నా అభిప్రాయం. ఎంబిబిఎస్ చదివేటపుడు సిలబస్ బుక్సే 5 లక్షల వరకు ఖర్చయింది. అదే పిజీ రెండు సంవత్సరాలకు కలిపి పుస్తకాలకే 20 లక్షల దాకా అవుతుంది. ఇదంతా ప్రభుత్వ కోటాలో మెరిట్లో సీటు కొట్టిన వాళ్లకే. మేనేజ్మెంట్ కోటాలో సీటు వస్తే పీజీకి ఖచ్చితంగా మూడు కోట్లు పైన ఖర్చు అవుతుంది. అందుకే మా స్నేహితుల మధ్య టూర్లకి వెళ్లేటప్పుడు గాని, ఇంకెక్కడికి వెళ్లినా డబ్బు సమస్యలు వచ్చేవి కావు.

ఒకరోజు సాయంకాలం కాలేజీ నుండి ఇంటికొచ్చి కారు పార్కింగ్ చేస్తున్నాను. మా అమ్మ అప్పటికే నా కోసం బూస్టు పాలు తీసుకొచ్చింది. నాకు పాలల్లో బూస్టు వేసుకుని తాగడమంటే చాలా ఇష్టం. మా అమ్మ ఎప్పుడూ నీట్‌గా దువ్వుకొని చిన్న కొప్పు పెట్టుకుంటుంది. కాటన్ శారీస్ ఎక్కువు కడుతుంది. నుదుటి మీద పావలా సైజులో బొట్టు పెట్టుకుంటుంది. సైనెస్ కావడం వల్ల దాదాపు కళ్లకు కళ్లజోడు పెట్టుకునే దర్శనమిస్తూ వుంటుంది. ఛామనఛాయ రంగులో వున్న అందం మా అమ్మను చూస్తూనే తెలుస్తుంది.

“ఏమ్మా కూతురి మీది ప్రేమ ఎక్కువైనట్టుందే” కారు దిగి మా అమ్మను కౌగలించుకుంటూ అన్నా. నాకు ఆనందం ఎక్కువైతే మా అమ్మ, నాన్నల్ని కౌగలించుకోవడం అలవాటు. ఇంకా ఎక్కువ ఆనందం వస్తే, జంప్ చేయడం అలవాటు.

“అమ్మడూ, వర్ధన్ వాళ్ల నాన్నకు బాగాలేదంట. ఒకసారి చూసి రాకూడదూ” అంది మా అమ్మ.

“అవునా అలాగే అమ్మా. రేపెళతాలే. అయినా సార్ వాళ్ల నాన్నకు బాగాలేదని, ఎవరు చెప్పారు” అని అడిగా.

“వర్ధన్ ఫోన్ చేశాడమ్మా” అంది.

“అబ్బా” అని రాగం తీస్తూ ఇంట్లోకెళ్లా. మరుసటి రోజు కాలేజీ అవ్వంగాల్లే వర్ధన్ సార్‌కి ఫోన్ చేశా. “నాన్నగారు ఏ హాస్పిటల్ లో వున్నారు. ఇప్పుడు ఎలా వుంది” అని అడిగా. “బాగానే వుంది. నువ్వు ఒకసారి రా. బావుంటుంది” అన్నాడు.

నేనొస్తే, ఎవరికి బాగుంటుంది అని మనసులోనే అనుకున్నా. బాగాలేనపుడు అతన్ని హాస్పిటల్‌కి వెళ్లి చూడటంలో నాకు తప్పేమి అనిపించల. నేరుగా హాస్పిటల్‌కి వెళ్లా. వర్ధన్ వాళ్ల తండ్రి ఐసియులో వున్నాడు. నేను అతని బెడ్ దగ్గరికి వెళ్లినపుడు వర్ధన్ సార్ నన్ను వాళ్ల నాన్నగారికి పరిచయం చేశాడు. అతను నా చేయి పట్టుకుని “బాగున్నావా” అన్నారు. నేను మౌనంగా తలూపాను.

“అంకుల్, మీకేం కాదు. మీరు ధైర్యంగా వుండండి. వర్ధన్ సార్ పెద్ద డాక్టరు. ఇప్పటికే 100కి పైగా ఓపెన్ హార్ట్ సర్జరీలు చేశారు. 20కి పైగా గుండె మార్పిడి అపరేషన్లు చేశారు” అంటూ ధైర్యం చెప్పా.

నా మాటలు నాకే ఫూలిష్‌గా అనిపించాయి. మధ్యలోనే అంకుల్ కల్పించుకుని “నేను చనిపోయే లోపల నా కొడుకు పెళ్లి చూడాలనుకుంటున్నా. నువ్వు మహలక్ష్మిలా వున్నావు, నువ్వే నా కోడలుగా రావచ్చు కదా నాన్నా” అన్నారు.

నేను మొహమాటానికి ఇబ్బందిగా నవ్వా. కొంచెం సేపు వుండి ఐసియు నుండి బయటకి వచ్చా. నా వెనకాలే సార్ వచ్చాడు. నా కారు వరకు ఇద్దరం మౌనంగానే నడుస్తున్నాం.

“మా నాన్న 48 గంటలకి మించి బతకరు. అతనికి ఇదివరకే ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. జరిగి కూడా 8 సంవత్సరాలు అవుతోంది. గుండె చాలా బలహీనంగా వుంది. అతని వయస్సు 65 సంవత్సరాల పై మాటే. గుండె మార్పిడి ఆపరేషన్ జరిగితేనే ఆయన బతుకుతాడు. అయినా అతని శరీరం దానికి సహకరించడం లేదు. మందులకు కూడా రెస్పాన్స్ అవడం లేదు” చెప్పేటప్పుడు సార్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

“మా నాన్న ఫోస్ట్ ఆఫీసులో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నా చదువు కోసం మా నాన్న స్వంత ఇల్లే అమ్మేశాడు. ఈ రోజు నేను ఈ స్థాయికి రావడం వెనుక మా నాన్న కష్టం చాలా వుంది. ఇప్పుడు నాకు డబ్బుకు కొదవలేదు. కానీ ఆ డబ్బు మా నాన్నని బ్రతికించలేకపోతోంది. నా బాధను అమ్మతో పంచుకోలేక పోతున్నాను. ఎందుకంటే ఆమె బాధతో మరింత క్రుంగిపోయింది. ఆమె పరిస్థితి ఇంకా దయనీయంగా వుంది. ఏం చేయాలో కూడా నాకు పాలు పోవడం లేదు” దాదాపుగా వర్ధన్ సార్ ఏడుస్తున్నాడు. నాకు చాలా బాధేసింది.

“సార్ మీరేడవకండి” అంటూ అతని చేతులు పట్టుకుని సముదాయించాను.

మర్నాడు ఆదివారం నేను నిద్రలేచేసరికి మా నాన్న నా ముఖం వైపు చూస్తూ వున్నారు. మా నాన్నకి నిద్ర లేవంగానే నా ముఖం చూడటం అలవాటు. దానికోసం ఆయన నా బెడ్ రూము ముందర హాల్లో చాపేసుకుని కింద పనుకుంటారు. నేను పనుకునేటపుడు నా బెడ్రూమ్ తలుపు దగ్గరికి వేసి పనుకుంటా. తెల్లారగానే కళ్లు తెరవకుండా అలాగే గోడలను తడుముకుంటూ, నా దగ్గరికి వచ్చి నా మొహం చూస్తారు. ఇది విన్న ఎవరైనా నిజానికి నమ్మరు. కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా నాన్న ఇలానే చేస్తున్నారు. నేను ఇంటి నుండి పని మీద దూరమెళ్లినా ఆయనకి ఫోన్‌లో ముద్దులు పెట్టాలి. నాకు చిన్న జ్వరం వచ్చినా ఆయన కంగారు పడిపోయి, ఏడ్చినంత పనిచేస్తాడు. ఇదంతా వినడానికి నమ్మకశ్యం కాకపోవచ్చు మా నాన్న నా నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంటే మెలుకువ వచ్చింది. అతి ప్రేమ ఎక్కువైతేనే మా నాన్న నా నుదుటిపై ముద్దు పెడతారు. నేను నవ్వుతూ కళ్లు తెరిచా. నాన్న కళ్లజోడు లోంచి ఆయన చిన్న కళ్లు నన్నే ఆప్యాయంగా చూస్తున్నాయి. ఎర్రటి రంగులో వుండే మా నాన్న రంగే నాకు వచ్చిందని అందరూ అంటుంటారు. అసలు బొట్టు లేకుండా మా అమ్మ మొహం అసలు చూడలేదు. అలాగే నవ్వు లేకుండా మా నాన్న మొహం అసలు చూడలేదు. మా నాన్న ఇప్పటివరకూ నా ముందర బాధ పడలేదు. మా నాన్న బాధపడి ఏడిస్తే, అమ్మో ఆ ఊహకే నాకు వణుకు పుడుతోంది. నేను కాలకృత్యాలు తీర్చుకుని రెడీ అయ్యేటప్పటికే, మా నాన్న బూస్ట్‌తో రెడీగా వున్నారు. నేను బూస్ట్ తాగుతూ నాన్న వైపు చూస్తున్నా. మా నాన్న ఏదో చెపుదామని నోరు తెరిచేలోపలే…

“హాయ్ అమ్మడూ” అని ఒకేసారి అరుస్తూ మా ఇద్దరత్తలు నా బెడ్ రూమ్ లోకి వచ్చారు.

తాగుతున్న బూస్ట్ కప్పు పక్కన పెట్టి నేను వాళ్లని గట్టిగా వాటేసుకున్నా. మా అత్తలంటే నాకు చాలా ఇష్టం. తమాషా ఏంటంటే మా నాన్నకు ఐదుగురు చెల్లెళ్లు. మొదటి అత్త, నాన్న కవల పిల్లలు. అందరికి మగపిల్లలే పుట్టారు. మా నాన్నకు మాత్రమే నేను పుట్టా. అందుకే హైదరాబాద్లో వుండే వారంతా పండగలకి, పబ్బాలకి మా ఇంటికి వస్తుంటారు. వాళ్లు వస్తే నాకు పొద్దే తెలీదు. ఇప్పుడు ఇద్దరు అత్తలే మిగిలున్నారు. ముగ్గురు చనిపోయారు. వీరు చనిపోయినప్పటి నుండీ మా నాన్నకి నా మీద ప్రేమ మరింత పెరిగింది. నన్ను గారం చేయడం ఎక్కువైంది. నన్ను వేరే వూళ్లకి వెల్లనీయడం లేదు. వెళ్లినా ఆయన నా వెంట రావాల్సిందే.

టిఫిన్లు అయిపోయిం తర్వాత అందరం హాల్లో కుర్చున్నాం. పిచ్చాపాటి మాటలు మొదలెట్టాం.

మా యమునత్త “ఏమే, వర్ధన్ వాళ్ల నాన్నకు బాగాలేదు కదా. కొడుకు పెళ్లిని చనిపోయేలోపల చూడాలనుకుంటున్నాడంట కదా. నువ్వేమో వద్దన్ను వద్దంటున్నావు. కారణమేందో చెప్పొచ్చుగా” అంది.

“అంటే మీరంతా ఆ విషయం మాట్లాడటానికే వచ్చారా” గుర్రుగా మా నాన్న వైపు చూస్తూ అన్నా. మా నాన్న ఏం తెలీనట్టు మొహం అటువైపు తిప్పాడు.

“ నా వయస్సుకి అప్పుడే పెళ్లేంది. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. వర్ధన్ అంటే కూడా ఇష్టం లేదు” అని బింకంగా చెప్పా.

“పోనీ ఎవరంటే ఇష్టం. ఎవరినన్నా ప్రేమిస్తున్నావా” అని అడిగింది మా శకుంతల అత్త.

“అతనంటే ఇష్టం లేదంటే, ఎవరినన్నా ప్రేమిస్తున్నట్టా. పెళ్లి ఇష్టం లేదన్నా. అయినా అప్పుడే పెళ్లేంది. పిజీ అయిపోవాలి. ఏదన్నా పల్లెటూర్లో ప్రాక్టీసు పెట్టాలి. పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలందించాలి. నాన్న కూడా హాస్పిటల్ కట్టిస్తానన్నాడు. మందులు, టెస్టులు అన్నీ ఉచితంగా అందిద్దాం అని చెప్పారు” నేను చెప్పుకు పోతున్నా.

మధ్యలోనే మా యమునత్త కల్పించుకుని “నీకేది ఇష్టమైతే అదే చేయి. ఎవ్వరూ వద్దని చెప్పల. వర్ధన్ కూడా నీ ఇష్టాలను కాదనలేదు. ఇంకో విషయం తెలుసా, పెళైనా నీ కిష్టం లేకపోతే నీ ఒంటి మీద కనీసం చేయి కూడా వేయనన్నాడు. కాబట్టి నీకిష్టమైనప్పుడే సంసారం. పెళ్లైన తర్వాత కూడా నువ్వు మీ నాన్న దగ్గరే వుండొచ్చు. కావాలంటే అతని దగ్గర మాట తీసుకుందాం” అంది.

“నేనేం మాట్లాడినా మీరు ఎవ్వరు అర్థం చేసుకోవడంల. అతనెవరో చనిపోతున్నాడని నా పెళ్లి చేయడమేంది. నా అభిప్రాయంలో ఎవ్వరికీ సంబంధం లేదా” కోపంతో అని విసురుగా వెళ్లిపోయా.

మా ఇంట్లో వాళ్లు నాతో సంబంధం లేకుండా ఊర్లోని గుల్లో పెళ్లి ఏర్పాట్లు చేసేశారు. నాకు వేరే గత్యంతరం లేకుండా చేసేశారు. మరుసటిరోజు సాయంత్రం 7 గంటలకు ముహుర్తం. నా ప్రమేయం లేకుండానే పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. నేను పెద్దగా ప్రతిఘటించా. ఏడ్చి గగ్గోలు పెట్టా. నా మాట ఎవ్వరూ వినడం లేదని కోపంతో ఎవ్వరితో మాట్లాడటంల. వాళ్లకది చిన్నపిల్లల చేష్టగా కనబడింది.

పెళ్లి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మనకు అన్నీ ఇష్టమయి చేసుకుంటేనే కుటుంబానికి మన జీవితాన్ని అంకితం చేయాలి. ఒక చీర కొనాలంటే మా అత్తవాళ్లు ఎన్ని షాపులు తిప్పిస్తారు. ఇంకా బంగారు నగలు కొనాలంటే చెప్పాల్సిన పనేలేదు. కనీసం 5 షాపులు తిరిగి, చివరకి కొనేది కూడా అసంతృప్తితోనే కొంటారు. అలాంటిది మన జీవితాన్ని తీసుకెళ్లి వేరే వ్యక్తి దయా దాక్షిణ్యాలకు వదిలి పెట్టడం వీరికి అన్యాయం అనిపించడంలా. ప్రాణంగా ప్రేమించే నాన్న ఏం మాట్లాడటం లేదు. నన్ను తప్పించుకుని తిరుగుతున్నాడు. కాలేజీ నుండి రావడం కొంచెం ఆలస్యమైతే కంగారుగా నా స్నేహితులకు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు కనుక్కునే అమ్మ పెళ్లి ఏర్పాట్లు చేస్తోంది. నాకిష్టం లేని పెళ్లిచేసి పంపడంలో వీరి ఆనందమేందో అర్దంగాల. వర్ధన్ చాలా తెలివిగా పెళ్లి చేసుకోవడానికి వాళ్ల నాన్నాగారి అనారోగ్యాన్ని వాడుకుంటున్నాడు. లేకపోతే నాకిష్టం లేకపోయినా, వాళ్ల నాన్న పెళ్లి చేయాలని తొందరపడటంతోనే నన్ను పెళ్లిచేసుకోవాల్సి వస్తోందని నా స్నేహితులకు చెప్పడమేంది. నాకు పెళ్లి చేయడమేంది. ఏదో ఆయనకి వేరే గత్యంతరం లేదన్నట్లు, పరిస్థితుల ప్రభావం అన్నట్టు మాట్లాడుతున్నాడు.

నాకు విపరీతమైన తలనొప్పిగా వుంది. “అత్తా నాకు తలనొప్పిగా వుంది. కొంచెం సేపు పనుకుంటా ” అని బెడ్ రూమ్లోకి వచ్చి పనుకున్నా. పనుకున్నా ఆలోచనలు నన్ను చుట్టుముడుతూనే వున్నాయి. నేను ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేసి ఎంతో మంది ప్రాణాలను రక్షించా. ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్ ప్రాణం నా దయ, దాక్షిణ్యాల మీద ఆధారపడి వుంటుంది. నేను సక్సెస్ అయితే అతను బతుకుతాడు. నేను ఆపరేషన్ సరిగ్గా చేయకపోతే అతను చనిపోతాడు. ఆలోచనలతోనే కలత నిద్ర పట్టేసింది.

కలలో నన్ను స్టెచర్లో ఆపరేషన్ థియేటర్లోకి గుండె ఆపరేషన్‌కు పంపిస్తున్నారు. నా చుట్టూ అమ్మ, నాన్న, అత్తలు అందరూ ఆశ్యర్యంగా ఆనందంగా వున్నారు. నవ్వుతూ వున్నారు. ఏంకాదని ధైర్యం చెపుతున్నారు. థియేటర్ లోకి తీసుకొచ్చారు. 6గురు వైద్యులు ఆకుపచ్చ దుస్తులు వేసుకుని సిద్దంగా వున్నారు. అందులో ఒకతన్ని నేను గుర్తుపట్టా అతను వర్ధన్. ఠక్కున మెలుకువ వచ్చింది. ఒళ్లంతా చెమటలు పెట్టాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది. పెదాలు తడారిపోయాయి. నాలికతో తడుపుకున్నా ఆరాటం తీరల. మంచం పక్కనే వున్న వాటర్ బాటిల్ లోని నీళ్లు మొత్తం తాగినా దాహం తీరల..

టౌనుకు దూరంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం వుంది. ఆ ఆవరణలోనే వున్న కళ్యాణమండపంలో పెళ్లి ఏర్పాట్లు చకచక జరిగిపోయాయి. 6 గంటలకల్లా ఇరు వర్గాల బంధువులు సుమారు 100 మంది చేరారు. వర్ధన్ వాళ్ల నాన్నను వీల్‌ఛైర్‌లో తీసుకొచ్చారు. వర్ధన్ వాళ్ల అమ్మ, ఆమె భర్త దగ్గరే కుర్చుంది. పెళ్లికూతుర్ని చేసి తీసుకొచ్చే బాధ్యతను నెత్తినవేసుకున్న అత్తలు తాము మంచి సంబంధం తీసుకొచ్చామని, వర్ధన్‍లో మచ్చుకైనా చెడ్డ లక్షణాలు లేవని మహా ఆనందపడ్తున్నారు. వాళ్ల దృష్టిలో ‘వర్ధన్ మంచివాడు. శాండీకి అన్ని విధాలా తగిన వాడు. బాగా చూసుకుంటాడు. శాండీ వాళ్ల దృష్టిలో చిన్నపిల్ల. తన జీవితాన్ని అందంగా, ఆనందంగా మలుచుకోలేని అమాయకురాలు. వయసు ఉడుకు రీత్యా ఇప్పుడే పెళ్లి వద్దు’ అనుకుంటోందని వారు బలంగా విశ్వసిస్తున్నారు.

***

శాండీ అత్తలు శాండీ బెడ్రూమ్ తలుపు తడుతూ “ తొందరగా రావే” అంటున్నారు. వీళ్లు తలుపు తడుతుంటే గడియ పెట్టని తలుపు పూర్తిగా తెరుచుకుంది. “శాండీ” అని అరుస్తూ బెడ్ రూమ్ వెతికారు. ఇళ్లంతా కలియతిరుగుతున్నారు.

పనిమనిషి వీళ్ల హడావుడి చూసి “ అమ్మగారు శాండమ్మ ఇప్పుడే కారులో మేకప్‌కని వెళ్లారు ” అని చెప్పింది.

“ఇప్పుడు మేకప్ ఏంది” అనుకుంటూ అత్తలు ఫోన్ చేస్తే శాండీ సెల్ స్విచ్చాఫ్ అని వచ్చింది. సమయం సాయంత్రం 6.30 అవుతుంది. శాండీ వాళ్ల నాన్నకి విషయం చెప్పారు. అందర్లో కంగారు ఎక్కువైంది. ముహుర్తం సమయం 7 దాటి 7.30 అయినా శాండీ రాలేదు. పెళ్లిమండపం దగ్గర చిన్న గుసగుస మొదలైంది. “శాండీ లేచిపోయిందంట” అని. ఆ మాట చిన్నగా శాండీ వాళ్ల నాన్న చెవిన చేరింది. ఆయన అప్రయత్నంగా చిన్నగా గొణిగాడు “కాదు. పారిపోయింది”.

అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here