[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]
పాల్కురికి సోమన బసవ పురాణం
పాల్కురికి సోమన క్రీ.శ. 1160 – 1230 ప్రాంతం వాడని సాహిత్య చరిత్రకారులు నిర్ధారించారు. సోమ సంస్కృతాంధ్ర కర్నాట భాషల్లో గొప్ప విద్వాంసుడు. శివకవులలో సోమన అగ్రగణ్యుడు. అతడు వీర శైవ కవి. శివతత్వాన్ని బోధించడానికి కవిత్వాన్ని సాధనంగా ఎంచుకున్నాడు. అన్యదేవతలను హేళన చేశాడు. అతనికి గురువు జంగమ మల్లికార్జునుడు. అతని గాథను పండితారాధ్య చరిత్రగా వ్రాశాడు. బసవేశ్వరుని జీవితచరిత్రను బసవ పురానంగా వ్రాశాడు. దేశి ఛందస్సుకు పట్టం గట్టాడు. వృషాధిప శతకంలో అచ్చ తెనుగులో ఒక పద్యం వ్రాశాడు:
చం:
బలుపొడ తోలుసీరయును పాపసరుల్ గిలుపారుకన్ను వె
న్నెలతల సేఁదు కుత్తుకయు నిండిన వేలుపులేఱు వల్గుపూ
సలుగల ఱేనిలెంకవని జానుఁదెనుంగున విన్నవించెదన్
వలపు మదిన్ దలిర్ప బసవా! బసవా! బసవా! వృషాధిపా!
సోమన తిక్కనకు పూర్వుడేయని ఆచార్య పింగళి లక్ష్మీకాంతం తమ ఆంధ్రసాహిత్య చరిత్రలో నిర్ధారించారు.
బసవేశ్వరుడు:
ఈతడు వర్ణవ్యవస్థను తిరస్కరించి శివపారమ్యాన్ని ఉద్బోధిస్తూ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. కర్నటక రాజ్యంలోని మేనమామ ఇంటికి చేరాడు. అతని కుమార్తె గంగాంబతో వివాహం జరిగింది. మామగారి ప్రాపకంలో రాజాస్థానంలో చేరాడు. మామగారి మరణాంతరం బిజ్జలునకు మంత్రి అయ్యాడు. వీరశైవ మత ప్రచారానికి తన ఆస్తిపాస్తులనే గాక, రాజభాండాగారాన్ని వినియోగించాడు. శైవ శాఖలను బలపరిచి శివ సామ్రాజ్యాన్ని ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలలో నెలకొల్పాడు.
బసవేశ్వరుడు సంగీత సాహిత్యాలలో దిట్ట. స్వయంగా ఎన్నో రసవత్తర గీతాలు గొంతెత్తి గానం చేసేవాడు. కృష్ణుని మురళీగానానికి గోపికలు పరవశించినట్లుగా జనం ఆయన చుట్టూ మూగేవారు. మతం పేరుతో మిండజంగాలను పోషించాడు. రాజాజ్ఞను ధిక్కరించాడు. రాజధనాగారం దుర్వినియోగం చేశాడు. శివభక్తులు అత్యాచారాలకు పాల్పడ్డారు.
మహిమలు:
బిజ్జలుని మంత్రిగా వున్న బసవన సంకల్పమాత్రంలో జొన్నలను ముత్యాలుగా మార్చాడు. వంకాయలను ఆనపకాయలుగా మార్చాడు. విషాన్ని అమృతప్రాయంగా త్రాగాడు. శివభక్తుల అరాచకాల వల్ల రాజాజ్ఞ తిరస్కరించబదింది. రాజాగ్రహానికి గురియైన బసవన సకుటుంబంగా నగరాన్ని వదిలి ‘సంగం’లో లింగైక్యం చెందాడు. కోపంతో అతని శిష్యులు బిజ్జలుని వధించారు.
పాల్కురికి:
పాల్కురికి సోమన తెలంగాణా కవులలో ప్రథముడు. ఓరుగల్లునకు 12 క్రోసుల దూరంలో వున్న పాల్కురికి అతని జన్మస్థలం. బసవేశ్వరుడు, మల్లికార్జున పండితారాధ్యుడు సమకాలికులు. ప్రప్రథమ వీరశైవ పురానంగా బసవ పురాణం ప్రసిద్ధి. బసవ పురాణం సప్తపర్ణి వలె ఏడాశ్వాసాల కావ్యం.
కథాకథనం:
నందికేశ్వరుడు బసవేశ్వరుడుగా భూలోకంలో అవతరించాడు. అతడు ఉపనయన సంస్కారాము వదులుకొని వీర మహేశ్వర వ్రతాన్ని స్వీకరించాడు. వివాహితుడై సంగమేశ్వరుని శరణువేడాడు. కర్నాటకలోని బిజ్జలుని వద్ద దండనాయకుడిగా కళ్యాణకటకంలో చేరాడు. చెన్నబసవడు బసవుని దేవుడిగా ఆరాధించాడు. అల్లమ ప్రభువు బసవని విందు ఆరగించి వరాలు ఇచ్చాదు. బసవన ఎన్నో మహిమలు చూపాడు.
జంగమదేవరకు బసవన తన భార్య చీరనిప్పించి జంగమ సేవా నిరతిని ప్రకటించాడు. చెన్నబసవనికి అనేక శివభక్తుల గాథలను బసవేశ్వరుడు వినిపించాడు. అందులోని ముగ్ధ భక్తుల కథలు చిత్ర విచిత్రం. అట్టివారిలో ముగ్ధ సంగయ్య, రుద్ర పశుపతి, బెజ్జమహాదేవి, ఉడుమూరి కన్నప్ప, మాది రాజయ్య, మడివాలు మాచయ్య, నిమ్మవ్వ్య, సిరియాలుడు, సంగళ్ళవ్వ, నరసింగ నయనారు, కొట్టరువు చోడుడు, కిన్నెర బ్రహ్మయ్య, గొరియ, మోళిగ మారయ్య, కన్నడ బ్రహ్మయ్య, ముసిడి చౌడయ్య, ఏకాంత రామయ్య, షొడ్డలదేవు బాచయ్య, శివనాగుమయ్య కథలు ప్రశస్తం.
కన్నప్ప కథను, సిరియాలుని కథను శ్రీనాథుడు తన హరవిలాసంలో అద్భుతంగా చిత్రించాడు. ముగ్ధ భక్తుల స్వభావ చిత్రణ సహజ సుందరంగా కొనసాగింది. మతానికి విశ్వసం ఆధారం. శక్తి, భక్తి, విశ్వాసం ముప్పేటలుగా పెనగొని వీరశైవుల అద్భుత మహిమలను బసవన ద్విపదులలో ఆద్యంతం రమణీయంగా వర్ణించాదు. ముగ్ధభక్తుల కథల ద్వారా భక్తి బీజాలు పాఠకుల హృదయాలలో నాటడానికి బసవన ప్రయత్నించాడు.
మడివాలు మాచయ్య కథ ద్వారా శివభక్తి సిద్ధి వలన కలిగే మహిమలను కీర్తించాదు. ముసిడి చౌడయ్య కథ వలన భక్తులు కూడా ప్రాణప్రదాతలని నిరూపించాడు. ఏకాంతరామయ్య కథ ద్వారా జైనాదులైన ఇతర మతాల ఖండన జరిగింది. శివనాగుమయ్య కథ ద్వారా దళితులు కూడా శివభక్తికి అర్హులని ప్రకటించాడు. భక్తిగల చిత్తంలోనే విశ్వాసం నిశ్చలంగా నిలుస్తుందని బసవన నమ్మాడు. బసవన ఈ కావ్యంలోని నాయకుడైతే, బిజ్జలుడు ప్రతినాయకుడు (విలన్). అతనిది వింతప్రకృతి. బసవని వెలుగు కింది క్రీనీడ వంటివాడు బిజ్జలుడు.
బెజ్జ మహాదేవి:
బెజ్జ మహాదేవి శివునికి తల్లిలేదని ఎంతో బాధపడింది.
“తల్లి గల్గిన నేల తపసి గానిచ్చుఁ?
దల్లి గల్గిన నేల తల జడ ల్గట్టుఁ?
దల్లి యున్న నిషంబుఁ ద్రావ నే లిచ్చుఁ?
దల్లి యుండినఁ దోళ్లు దాల్ప నే లిచ్చుఁ?
దల్లి పాముల నేల ధరియింప నిచ్చుఁ?
దల్లి బూడిద యేల తాఁ బూయ నిచ్చు?
దల్లి వుచ్చునే సుతు వల్లకాటికిని?
దల్లి లేకుండిన తనయుండు గాన
ప్రల్లదుఁడై యిన్నివాట్లకు వచ్చెఁ -” నని చింతించింది.
పరమేశ్వరునికి తానే తల్లిగా భావించిన బెజ్జ మహాదేవి స్వయంగా అభ్యంగన స్నానం చేయించింది. నీళ్ళు ముఖంపై పడకుండా చూచింది. తడిమార్చి విభూతి నొసట పెట్టింది. మూడు కనులలో కాటుక పెట్టింది. ఉగ్గు పెట్టింది. ముద్దాడింది. జోకొట్టింది. అనేక రకాలైన బాల్యోపచారాలు నిర్వహించింది.
ఆమె భక్తిని పరీక్షించేందుకుగా శివుడు జ్వరగ్రస్థుడైనట్లుగా నటించాడు. ఆ తల్లి అలమటించింది. ‘అంగిటి ముల్లు’ అయిందని తల్లడిల్లి ఎందరి వద్దనో వాపోయింది. ‘నీవు ఎందరి భక్తుల యిళ్ళాలోనో విందులు స్వీకరించారు’ అని దెప్పిపొడిచింది. చివరకు ప్రాణాలు విడవడానికి సిద్ధపడింది. వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యాడు. ‘నీకేమి వరం కావాలో కోరుకో’మన్నాడు. “నీ రోగం నయమైతే చాలునని ముద్దరాలు అమాయకంగా పలికింది. “నాకు నీ వంటి తల్లి అండ వుండగా ఏ రోగమూ కలగదు. నీకు నిత్యత్వం కల్పిస్తున్నాను” అని అంతర్ధానమయ్యాడు. అప్పటి నుండి ఆమె ‘అమ్మవ్వ’ అయింది.
మాది రాజయ్య:
అతడు శివభక్తి పరాయణుడు. కారుణ్యమూర్తి, సజ్జన శిఖామణి. ‘నంబె’ అనే పట్టణం రాజధానిగా పరిపాలిస్తున్నాడు. జంగమారాధనలో జీవనం గడుపుతున్నాడు. అతనిని శివుడు పరీక్షింపదలచి కైలాసానికి విచ్చేసిన మాది రాజయ్యకు అడ్డంకులు కలిగించాడు. మల్లికార్జునుదు దారికడ్డంగా నిలబడ్డాడు.
“పరమయోగీంద్రుఁడో? భసితంపుగిరియొ?
ధరఁ బడ్డ రుద్రాక్షధరణీరుహంబొ?
సదమలజ్యోతియో? శంభురూపంబొ?
విదితచిదబ్ధిసముదీతపూరంబొ?
యెచ్చోటఁ బోవరా దెట్లొకో” యనుచు –
మాదిరాజు ఆశ్చర్యపోయాడు. శివుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు.
కన్నప్ప:
శ్రీకాళహస్తి గిరి ప్రదేశంలో ఉడుమూరు గ్రామంలో ఎరుకల యింట జన్మించాడు కన్నప్ప. ఒకనాడు వేతకు వెళ్ళి అలసి నిద్రపోయాడు. శివుడు తపసి రూపంలో వచ్చి అతని నుదుటన విభూతి పెట్టాడు. “కొంతదూరంలో నీకు లింగమూర్తి కనిపిస్తుంది. నీకది ప్రాణలింగం అవుతుంది” అని సెలవిచ్చాడు. కల నిజమైంది. శివలింగం కొంతదూరంలో కన్పించింది. మా పల్లెకు తీసుకొనిపోదమని శివుని బ్రతిమాలాడు.
“అక్కటా! యిది యేమి హరుఁడ యొక్కరుఁడ
విక్కడ నుండుట యేమి గారణము?
తల సూప కేయూరి తమ్మళ్ళ తోడ
నలిగి వచ్చితి సెప్పు మలుక దీర్చెదను” అంటూ వేడుకొన్నాడు.
‘నాతో రావయ్యా’ అని ప్రాధేయపడ్డాడు. చుట్టుపక్కల తిరిగే మృగాలను చంపి ఆ మాంసాన్ని తాను రుచి చూచి, మంచి మాంసాన్ని ఒక దొప్పలో పెట్టి, పుక్కిట జలకం పెట్టుకొని లింగం వద్దకు వచ్చాడు. చెప్పుకాళ్ళతో వచ్చి పుక్కిటి నీళ్ళతో అభిషేకం చేశాడు. మాంసాన్ని ఆహారంగా అర్పించాదు.
కన్నప్పను పరీక్షింపదలచి శివుడు తన కంట నీరు తెప్పించాడు. అది చూసి కన్నప్ప ఆర్తితో రోదించాడు.
“ముక్కంటి వాఁడని మూఁడు లోకముల
నిక్కంబు వెఱతురు నిటలలోచనుఁడ!
యెన్నఁ డు నీకొక బన్నంబు లేదు;
గన్నుఁ జూచిన నిట్టు గై కొండ్రి సురలు;
కంటి చిచ్చున మున్ను గాలిన వారు
కంటివార్తకు నిఁక గనలరే మగుడ;
విను మెంత గన్ను గానని వలపైన
వనిత లి ట్లంగహీనునకు జిక్కుదురె?”
అని తన కన్ను పీకి లింగానికి అమర్చాడు. మరో కంట నీరు రాసాగింది. ‘కంటికి కన్ను మందు’ అని కన్నప్ప తన రెండో కంటిని పెకిలించబోయాడు. పరమశివుడు ప్రత్యక్షమై కన్నప్పను దీవించాడు.
ఈ విధంగా పాల్కురికి సోమన ఎందరో ముగ్ధభక్తుల కథలను రసవత్తరంగా మలచాడు. భక్త కన్నప్ప కథ శ్రీనాథ హరవిలాసంలోనె గాక, ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోనూ అద్భుతంగా వర్ణింపబడింది. శైవకవిత్వోద్యమ నాయకుడు పాల్కురికి సోమన అనడంలో సందేహం లేదు.