[dropcap]”రా[/dropcap]మం ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్” అని అడిగాడు రాజయ్య.
“అబ్బే ఏమీలేదు, ఇంటి పైకప్పుకి ఏ రేకులు వేద్దామా అని” నవ్వుతూ సమాధానమిచ్చాడు రామం.
“చాల్లే వెటకారం. విషయం చెప్పు.”
“మనం చిన్న నాటి స్నేహితులం. ఒకే వీధిలో ఉంటున్నాం. నా గురించి కొత్తగా చెప్పేదేముంది చెప్పు.”
“అవునవును, ఈయన గురించి తెలియనిదెవరికి.. వాస్తు బాగోలేదంటూ ఈ ఇంటి గుమ్మాలు ముమ్మారు మార్చినట్లు. ఈశాన్యంలో బరువు ఉండకూడదని పూలమొక్కలన్నీ పీకించినట్లు. మా ఆడపడుచులకి, మరుదులకి, మా ఇంటిల్లిపాదికీ సరిపడా కుంకుడు కాయలిచ్చే పచ్చటి మొక్క పెరట్లో ఉండకూడదని ఎవరో సిద్ధాంతి చెపితే నరికించినట్లు అందరికీ తెలిసిందే కదా! ఆస్తి కరిగింది తప్పా అదృష్టం కలిసిరాలేదు.. ఇప్పుడు ఎన్ని అనుకుని ఏమి లాభం అన్నయ్యగారు” అంది రామం భార్య భానుమతి కాఫీ అందిస్తూ.
“నీ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం. పిల్లకి పెళ్లి కాలేదని, పిల్లాడు స్థిరపడలేదని వాళ్ళు చెప్పేరని వీళ్ళు చెప్పేరని ఇల్లు గుల్ల చేసుకుంటావా రామం. ఉన్న డబ్బులన్నీ ఇలా ఖర్చు అయిపోతే పిల్ల పెళ్లి ఎలా చేస్తావో ఆలోచించుకో.”
“నేను హేతువాదిని కానురా! ఏదో ఒకటి నమ్మాలి. కొన్ని ప్రయత్నాలు విఫలమైనంత మాత్రాన నా ఆలోచన తప్పంటే ఎలా? అన్నాడు రత్నాకిళ్ళీ నోట్లో పెట్టుకుంటూ రామం.
“నిజమే నువ్వన్నట్లు నమ్మొచ్చు.. కానీ మనల్ని మనం మోసం చేసుకోకూడదు కదా! శాస్త్రం తప్పు అని నేను అనను. కొంతమంది శాస్త్రాన్ని సరిగ్గా అధ్యయనం చేయక నీలాంటి వారి బలహీనతలే పెట్టుబడిగా వారి జీవనోపాధి సాగిస్తున్నారు” అన్నాడు రాజయ్య.
“అలా చెప్పు అన్నయ్యా! నా మాట ఎలాగో వినరు నీ మాటైనా వింటే మంచిది. లేకుంటే ఇలాగే ముదురు బెండకాయల్ని వదిలేసినట్లు పట్టించుకోకుండా వదిలేస్తారు”.. అంది భానుమతి బెండకాయలు తరుగుతూ..
ఒక్క క్షణం నిశ్శబ్దం ఆవరించింది. ‘నా పిల్లల భవిషత్తుకోసం మార్పులు చేర్పులు చెయ్యడం తప్పా.. అలా అనుకుంటే మార్పులు చేసే వాళ్ళు అందరూ వెఱ్ఱివాళ్ళా..’ ఇలా రామం అంతరంగంలో ఎన్నో ప్రశ్నలు తొలుస్తున్నాయి.
“రామం నువ్వు చదువుకున్న వాడివి తెలివైన వాడివి.. దేనినీ నమ్మొద్దు అనలేదు గుడ్డిగా నమ్మి మోసపోవద్దు అంటున్నాను.. ఇప్పుడు నీ ఇంటికి ఒక రూపు రేఖ ఏమైనా ఉన్నాయా! ఒక సిద్ధాంతి చెప్పాడని వీధి గది కిటికీ మూసేసావు. ఉన్న వెలుతురు కాస్త పోయింది.. ఇంకో సిద్ధాంతి చెప్పాడని వంటింట్లో కిటికీ మూసేసావు. అక్కడ చీకటి అవడమే కాక పోపు ఘాటు ఇంట్లోకి వస్తోంది.. ఇలా ఒక్కొక్కరు చెప్పినదీ చేసుకుంటూ పోతే ఆఖరుకు గోడలు మిగులుతాయి” అన్నాడు రాజయ్య.. స్నేహితుని శ్రేయస్సు కోరి.
“గ్రహ స్థితి బాగోలేనప్పుడు మంచి చేసినా చెడుగానే కనిపిస్తుందిరా ఏమి చెయ్యమంటావు!” అన్నాడు రామం వేదన నిండిన ముఖంతో..
“గ్రహస్థితి బాగానే ఉంది, మానసిక స్థితి బాగోలేదు.. అలా బయటకి వెళ్లి వద్దాం పద” అని రామాన్ని బయటకి తీసుకు వెళ్ళాడు రాజయ్య. అలా శివాలయం దాటి కాలవ గట్టు మీద నడుస్తున్నారు ఇద్దరూ.. సాయం సంధ్య కావడంతో పక్షులన్నీ చెట్లపైకి చేరుకున్నాయేమో ఆ ప్రాంతం రకరకాల అరుపులతో వినసొంపుగా ఉంది. చల్లని గాలి వీస్తోంది.. పశువులు, మేకలు వాటి గమ్యస్థానాలకు ఉత్సాహంగా తిరుగు ముఖం పట్టాయి.. మర్రి చెట్టు దగ్గరికి రానిచ్చి “చూడు రామం ఎంత సందడిగా ఉందో ఇక్కడే ఉండి పోవాలనిపిస్తోంది కదూ!..” అన్నాడు రాజయ్య.
‘నిజమే’నన్నట్లు తలూపాడు రామం.
“రామం ఆ పక్షి గూడు వైపు చూడు.. ఏ వాస్తు ప్రకారం గూడు కట్టుకున్నాయని అవి వాటి పిల్లలతో అంత ఆనందంగా ఉండగలుగుతున్నాయి చెప్పు” అన్నాడు రాజయ్య.
‘నిజమే కదా!’ అనిపించింది రామంకి.
“ఒక్క చిన్న విషయం చెప్తాను విను..” అని చెప్పడం ప్రారంభించాడు..
కాఫీ షాప్‌లో యజమాని ప్రొద్దున్న నుండి చాలా బిజీగా పనిచేస్తున్నాడు. ఒక్క క్షణం కూడా తీరిక లేదు. కాఫీ, టీలు కలుపుతూనే ఉన్నాడు. నిలబడి నిలబడి కాళ్ళు నొప్పులు వచ్చేయి… సాయంత్రం అయ్యేసరికి తలనొప్పి వస్తోంది. చాలా అలసిపోయాడు. సమయం గడిచే కొద్దీ తలనొప్పి ఎక్కువ అవుతోంది. భరించడం కష్టం అనుకున్నాడు. షాప్ కుర్రవాడికి అప్పచెప్పి తలనొప్పికి మాత్ర వేసుకుందాం అని మెడికల్ షాప్‌కి వెళ్ళాడు. తలనొప్పి, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, మాత్ర కావాలని అడిగాడు. మెడికల్ షాప్ అమ్మాయి మాత్ర ఇచ్చింది.
“ఓనర్ గారు ఎక్కడకి వెళ్ళారమ్మా?” అని అడిగాడు.
“తలనొప్పిగా ఉంది. అలా కాఫీ షాప్‌కి వెళ్లి ఒక కాఫీ తాగి వస్తాను అని మీ షాప్‌కే వచ్చారు” అంది అమ్మాయి..
అతడికి నోట మాట రాలేదు. ‘తలనొప్పికి నేను మాత్ర కోసం ఇక్కడకి వస్తే, ఆయన అదే తలనొప్పికి కాఫీ కోసం నా షాప్‌కి వచ్చాడా?? మనలోనే ఉన్నదానిని బయట వెతకడం అంటే ఇదే కదూ!!’ అనుకున్నాడు టీ దుకాణం యజమాని. ఇది కధ.”
“ప్రశాంతత కోసం, ఆనందం కోసం ప్రపంచం అంతా వెతుకుతాము. ప్రశాంతత మనలోనే ఉంటుంది అన్న విషయాన్ని గ్రహించక అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతాం..” అన్నాడు రాజయ్య.
స్నేహితుని మాటల్లో వాస్తవాన్ని గ్రహించి తార్కికంగా ఆలోచించడం మొదలుపెట్టాడు రామం.