[dropcap]యే[/dropcap]ర్లూ నాటే కాడ, పొలం దున్నే కాడ
యేటి గట్టుమీద, మోట బాయి కాడ
సద్ది బువ్వ పట్టుకొచ్చి, ముద్ద ముద్ద తినిపించి
యేమార్చినవే ఓ రంగి, నీ ఒడ్ని చేసినావే
ఏడాది కాలం కింద, పంట నష్టపోతే
అమ్మ నైన సచ్చిపోతే, నే తాగి తూగి పడితే
మంచి మాటలను చెప్పి నన్ను మల్ల దార్ల పెట్టి
మాయజేసినావె ఓ రంగి, నీ మత్తులోకి దించినావే
పొలం కాపు కాసే ఏల, జిమ్మ చీకట్లోన
కీచురాళ్ళ మోతలోన, నే సలికి ఒణుకుతుంటే,
ఊలు చెద్దరిచ్చి, చేతికి తావీజు కట్టి
నువ్వు జల్దీ ఉరికిపోయినావే, ఓ రంగి, నా దిల్ తీస్కపోయినావే
పంట కోత ఏల, వరి కంకి కోసే కాడ
మక్క బుట్టల్ ఏరే కాడ, కందులు పీకే ఏల
చాప కూర జొన్ని రొట్టి తీసుకొచ్చి, ఎండ పొడకు నీ కొంగుకట్టి
ఎంట ఎంట తిప్పుకున్నావే ఓ రంగి, నా మనసులోకి వచ్చినావే
పంట పైసలు చేతికొచ్చే, కౌలు బాకీ పోనూ కొంత మిగిలే
ఇంట్ల గంపెడాన్ని బియ్యం, ఉండనీకి చిన్న గుడిసె
నీకు నాకూ మస్తుగా సరిపోతాయే ఓ రంగి
నిన్నేలు కుంటనే ఓ రంగి
నిను యిడిచి నేనుండలేనే ఓ రంగి
నాతోడే ఒప్పుకోవే నా రంగి
నీ తోడై ఉంటా జీవితాంతం ఓ రంగి!