[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 61” వ్యాసంలో అమృతలూరు లోని శీతల పుట్లమ్మ తల్లి దేవస్ధానం గురించి, శ్రీ భావన్నారాయణస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
[dropcap]శ్రీ[/dropcap] రామకృష్ణగారు అమృతేశ్వరస్వామి ఆలయం గురించి చెప్పిన వివరాలేమిటంటే.. ఆలయం శాలివాహనుల కాలంనాటిది. ఈ గుడిని ఇప్పుడు పునర్నిర్మిస్తున్నారన్నాను కదా. దానికి ప్రభుత్వ సాయంతో బాటు, భక్తులు, విదేశవాసులయిన కొందరు భక్తుల సహకారం కూడా లభించింది. పునర్నిర్మించేటప్పుడు పాత ఆలయంలాగానే చేశారు. బయట స్లాబ్ వేశారు. లోపల అమ్మవారు బాలాత్రిపుర సుందరి, నందీశ్వరుడు ఇంతకు ముందు విగ్రహాలే. శివుడి లింగం భిన్నమయితే కొత్తది ప్రతిష్ఠించారు.
శ్రీ శీతల పుట్లమ్మ తల్లి దేవస్ధానం
అమృతేశ్వరస్వామి ఆలయంనుంచి శ్రీ శీతల పుట్లమ్మతల్లి ఆలయానికి వచ్చాము. ఈ ఆలయాలన్నీ దగ్గర దగ్గరగానే వున్నాయి. శీతల పుట్లమ్మ తల్లి ఈ ఊరి గ్రామ దేవత. ఈ ఆలయం క్రీ.శ. 1700 ముందు నిర్మింపబడి గ్రామస్తులచే పలుమార్లు అభివృధ్ధి చెయ్యబడింది. అయినా 2006వ సంవత్సరం వరకు పెంకుటింటిలోనే వున్నది. తర్వాత 2007వ సంవత్సరంలో నూతన ఆలయం నిర్మింవబడి దానిలో దసరా పండుగలలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అప్పటినుంచి ప్రతి సంవత్సరం ప్రతిష్ఠ జరిగిన రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి.
ఈ ఆలయం ముందు బొడ్డు రాయి, శాసనాలు వున్నాయి. వాటిలో ఒకటి పాళీ భాషలో వున్నది.
శ్రీ భావన్నారాయణస్వామి ఆలయం
పుట్లమ్మతల్లి ఆలయంనుంచి భావన్నారాయణస్వామి ఆలయానికి వచ్చాము. తలుపులు వేసి వున్నాయిగానీ అప్పటికే వార్త వెళ్ళి పూజారిగారు వచ్చారు. ఈ ఆలయ ఆవిర్భావానికి కూడా ఒక కథ వున్నది.
క్రీ.శ. 1145కి ముందు అమృతేశ్వరస్వామి ఆలయ నిర్మాణం జరిగింది. ఆ తర్వాత జరిగిన సంఘటనతో భావనారాయణ స్వామి ఆలయ నిర్మాణం జరిగింది. అమృతేశ్వరస్వామి ఆలయ నిర్మాణం తర్వాత ఊరు నిర్మాణం జరగటంతో ఒకసారి కొందరు మిరియాల వర్తకులు మార్గం మధ్యలో ఇక్కడ ఆగారు. అప్పుడు భావనారాయణ స్వామి ఒక వైష్ణవ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి తనకి పైత్యం చేసిందని, కొన్ని మిరియాలు పెట్టమన్నాడు. ఆ వర్తకుడు లోభి. దానితో వూరికే మిరియాలు ఇవ్వటం ఇష్టంలేక అవి మిరియాలు కావు, బచ్చలి విత్తులు అని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు కూడా బచ్చలి విత్తులా అనుకుంటూ వెళ్ళిపోయాడు. వర్తకులు తర్వాత తన వ్యాపారం చేసుకోబోగా సంచుల్లో వున్న మిరియాలన్నీ బచ్చలి విత్తులయ్యాయి. వాటిని కొనేవారెవరూ లేక వర్తకులు దిగులుగా తిరిగి వస్తూ మళ్ళీ అదే స్ధలంలో బస చేశారు. అప్పుడు వైష్ణువుడు వచ్చి మిరియాలు అడగటం, తాము బచ్చలి విత్తులని సమాధానం చెప్పటం గుర్తు వచ్చి ఆ వచ్చినవాడు భగవంతుడే అనుకుని తమ అపరాధాన్ని క్షమించమని వేడుకున్నారు. అప్పుడు భావనారాయణ స్వామి తాను భావనారాయణస్వామినని, ఆ ప్రదేశంలో వుండలనుకున్నాను కనుక అక్కడ తనకి ఒక గుడి కట్టిస్తానంటే బచ్చలి విత్తులన్నీ మిరియాలుగా మారుతాయనీ, వారు ఇంకా ధనవంతులవుతారనీ చెప్పాడు. దానికి ఒప్పుకున్న వ్యాపారులు స్వామిని పరిపరివిధాల ప్రార్థించి, వారిచ్చిన మాట ప్రకారం భావనారాయణస్వామి విగ్రహం తయారు చేయించి ఆయనకి గుడి కట్టించారు. అందుకే ఈ స్వామిని మిరియాల భావనారాయణస్వామి అంటారు.
తర్వాత దాని పక్కనే వున్న మదన గోపాలస్వామి ఆలయానికి వెళ్ళాము. ఇది కూడా ఆ కాలంలో నిర్మింపబడ్డ ఆలయమే. ఇది నార్లవారి వంశీయులచే నిర్మింపబడిందని బోర్డుమీద రాసివుంది.
కైఫియత్ ప్రకారం ఈ ప్రాంతాన్ని శాలివాహన శకం ప్రారంభమయిన తర్వాత గజపతులు, కర్ణాటక రాజులు, కృష్ణదేవరాయలు, నవాబులు పరిపాలించారు. తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సమయంలో, క్రీ.శ. 1802లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు వేలంపాటలో ఆ ప్రాంతాన్ని కొని పరిపాలించారు.
ముందుగా సమయాభావం వల్ల చూడలేక పోయిన అమృతలూరు చూశామనుకుంటూ గుంటూరు బయల్దేరాము.