[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత డా. శాంతి నారాయణ గారి ‘నాలుగు అస్తిత్వాలు నాలుగు నవలికలు’, ‘నాగలకట్ట సుద్దులు-2’ పుస్తకావిష్కరణ సభ వివరాలను అందిస్తున్నారు డా. జూటూరు షరీఫ్. [/box]
వన మహోత్సవ అనుసంధానంగా వినూత్నంగా జరిగిన శాంతినారాయణగారి పుస్తకావిష్కరణ సభ
15-9-2019 ఆదివారం, అనంతపురంలోని వాల్మీకి భవనం, వినూత్న కాంతులతో సాహిత్య పండగ కళను సంతరించుకుంది. వాల్మీకి భవన వ్యవస్థాపక అధ్యక్షులు వి.పి. ఆదినారాయణ, ఐ.ఎఫ్.ఎస్ గారు పాతతరం డి.ఎఫ్.ఓ.గా గొప్ప సామాజిక సాహిత్య అధ్యయన శీలిగా పేరున్న వ్యక్తి కావడంతో, తమ సామాజిక వర్గానికి చెందిన వాల్మీకి భవన ప్రాంగణంలోకి సుప్రసిద్ధ సాహిత్యవేత్తలు, జిల్లా నలుమూలల నుంచీ, రెండు తరాలకు చెందిన సాహిత్యవేత్తలు, రచయితలు, కవులు, రచయిత్రులు రావడం గర్వంగా భావించి పుస్తకావిష్కరణ సభకు వినూత్న రీతిలో కొత్త శోభను తెచ్చిపెట్టారు.
వాల్మీకి భవన ప్రాంగణంలో ఒక్కొక్క రచయితతో ఒక్కొక్క మొక్కను నాటించి దాదాపు 45 మంది రచయితల పేర్లతో పాటు మొక్కలను గురించి వాళ్ళు పంపిన క్యాప్షన్స్‌తో తయారు చేయించిన ట్రీ గార్డులను పాతించిన తరువాత అతిథులను, రచయితలను మంగళ వాయిద్యాల మధ్య సభలోకి స్వాగతించినారు.
‘జలస్వప్న’ కవి మల్లెల స్వాగత వచనాలూ, తిప్పేస్వామి ‘దేశమును ప్రేమించుమన్నా…’ ప్రారంభ గీతమూ ముగిసిన తరువాత ఆచార్య రాచపాళెం గారి అధ్యక్షతన సభ ప్రారంభమైంది. ముఖ్య అతిథులు శ్రీ తలారి రంగయ్య, డా. దీర్ఘాసి విజయభాస్కర్ చేతుల మీదుగా శాంతి నారాయణ గారి ‘నాలుగు అస్తిత్వాలు – నాలుగు నవలికలు’, ‘నాగలకట్ట సుద్దులు-2వ భాగం’ పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. తదనంతరం, నిరంతరం తన చెవుల్లోకి మాండలిక పదాలను గుమ్మరిస్తున్న నిరక్షరాస్యులైన తన నలుగురు చెల్లెళ్లకు నూతన వస్త్రాలతో పాటు ‘నాగలకట్ట సుద్దులు’ పుస్తకాన్ని అంకితమిచ్చారు శాంతినారాయణ. ఈ అంకిత కార్యక్రమం సభికులందర్నీ చెమ్మగిల్లజేసింది.
ముఖ్య అతిథి తలారి రంగయ్య మాట్లాడుతూ మంచి పుస్తకాలు సమాజాన్ని చైతన్యపరుస్తాయనీ, శాంతి నారాయణ గారి రచనలన్నీ ఆ కోవకు చెందినవనీ, అనంతపురం నుంచీ గొప్ప సాహిత్యం వస్తూ ఉండడం గర్వించదగ్గ విషయమని అన్నారు.
సాహిత్యం ద్వారానే మంచి సమాజం ఏర్పడుతుందని అన్నారు. మరొక ముఖ్య అతిథి డా. దీర్ఘాసి విజయ భాస్కర్ మాట్లాడుతూ, మంచి రచయితల సాహిత్యం సమాజానికి అద్దం లాంటిదనీ, శాంతి నారాయణ గారి రచనలన్నీ అట్టడుగు వర్గాల, రైతుల జీవన గతులన్నింటిని ఉన్నతంగా చిత్రించిన గొప్ప కళాఖండాలనీ, శాంతి నారాయణ గారి సాహిత్యాన్ని గురించి కత్తి పద్మారావు, ఏ. కె. ప్రభాకర్ వంటి వాళ్లు విశ్లేషిస్తూ చెప్పిన మాటలు అక్షర సత్యాలని కొనియాడారు.
అధ్యక్షత వహించిన రాచపాళెం గారు మాట్లాడుతూ శాంతి నారాయణ గారి మాండలిక రచనలు రెండు తెలుగు రాష్ట్రాల సాహిత్య లోకంలో వొక ప్రత్యేకతను సంతరించుకున్నాయని శ్లాఘించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న వి.పి.ఆదినారాయణగారు ప్రసంగిస్తూ శాంతి నారాయణ తమ ఊరివాడు కావడం తనకే కాదు, తమ ప్రాంతానికే గర్వకారణమని, ఆయన ‘నాగలకట్ట సుద్దులు’ సమాజ చైతన్య దీపికలని, వాటిని తన చెల్లెళ్లకు అంకితమివ్వడం అరుదైన విషయమని, భూదేవి ఉత్పత్తులను, మరింత లబ్ధి పొందడానికి మళ్లీ భూదేవికి సమర్పించినట్లు ఉందని ఉద్విగ్నంగా అన్నారు.
ఆచార్య మేడిపల్లి రవికుమార్, కె.పి.అశోక్‌కుమార్ రెండు పుస్తకాలను సమున్నతంగా సమీక్షించారు. నవలికలలోని వస్తు శిల్పాలను, రచయిత తాత్విక దృక్పథాన్ని రవికుమార్ చక్కగా ఆవిష్కరించగా, ‘నాగలకట్ట సుద్దులు’ లోని అధిక్షేపాన్నీ, ప్రాసంగికతనూ, సంఘటన పట్ల, సమకాలీన సమస్యల పట్ల, ప్రభుత్వాల పట్ల రచయితకున్న దృక్పథాన్ని అశోక్‌కుమార్ విశ్లేషించారు. ప్రజాపక్షం వహించిన మహా సాహస రచయిత శాంతి నారాయణ అని శ్లాఘించారు. ఆత్మీయ అతిథులు బండి నారాయణస్వామి, సడ్లపల్లి చిదంబర రెడ్డి, ఉప్పరపాటి వెంకటేశులు రచయితతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. శాంతి నారాయణగారి ‘నాగులకట్ట సుద్దులే’ తన మాండలిక రచనలకు ప్రేరణ అని సడ్లపల్లి, ఆ సుద్దులు నిరంతరం తనను పలకరించే కళాత్మక దృశ్యాలన్నీ ఉప్పరపాటి ఆర్ద్రంగా వివరించారు.
మధ్యాహ్న భోజనానంతరం, సూతరంగస్థలి, అస్తిత్వ సాహిత్య ప్రాముఖ్యత అనే అంశాల పైన రెండు గంటలపాటు ఆలోచనాత్మకమైన చర్చాగోష్ఠి జరిగింది. ప్రసిద్ధ సాహిత్య విశ్లేషకుడు తూముచెర్ల రాజారాం అనుసంధానకర్తగా వ్యవహరించారు. దీర్ఘాసి విజయభాస్కర్, సూతరంగస్థలి రూపాన్నీ, ఆవశ్యకతనూ వివరించారు. ఈ చర్చాగోష్ఠిలో సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ కుమారస్వామితో పాటు రాచపాళెం, కంబదూరి షేక్ నబి రసూల్, జూటూరు షరీఫ్, దాదా ఖలందర్, ఆవుల వెంకటేశులు, కోగిర మొదలయిన 40 మంది రచయితలు పాల్గొన్నారు.
డా. జూటూరు షరీఫ్