అనుబంధ బంధాలు-14

0
3

[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల ‘అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 14వ భాగం. [/box]

[dropcap]దీ[/dropcap]క్షితులు నడక దశరథం ఇంటి ముందు ఆగింది.

‘నీ దగ్గరికే వస్తానని బయలుదేరాడు గదా!’ అంది సీతమ్మ.

‘కావచ్చు… అయితే నేను వెళ్తాను’ అంటూ ఇంటికి నడచాడు వేగంగా.

ధశరథం శాంతమ్మతో కూర్చుని మాట్లాడుతున్నాడు.

‘మన ఇంటికి దగ్గరే ఉన్నావనుకుని బయలు దేరాను లెవ్వు, ఎటేళ్ళావేంటి?’

‘పుజారయ్య దగ్గరికి.’

‘ఎందుకు?’

‘మనం పిల్లవాణ్ణి చూసుకొనేందుకు మంచి రోజు చూసిరావాలిగదా?’

‘అడిగావా?’

‘ఆఁ!’

‘ఎప్పుడట?’

‘శుక్రవారం ఉదయం…’

‘మంచిది’ అని ‘స్థిరచరాస్తులను కనుక్కున్నావా?’

‘నాకు పూర్తిగా నచ్చింది సంబంధం’ అని ఆగి… ‘ఈ నచ్చడం నచ్చక పోవడం ఉందే… అది పూర్తిగా మానసికమైనది’ అని నవ్వి ‘నాకు కాళికామాత అంటే చాలా ఇష్టం. కొందరు ఆమెను చూసేందుకే జడుసుకొని చస్తారు. పసి పిల్లలకయితే పులకరాలే వస్తాయి.’

‘అంటే నేను ఇలాంటి భ్రమలకులోనయి… పిల్లదాన్ని ఏ కసాయి వానికో కట్ట బెడుతానట్రా…. అరేయ్ అది నా బిడ్డ. దాని కాలిలో ముల్లు విలిరితే నా గుండె కలక్కుమంటంది. నన్ను… నన్ను… నువ్వు… అసలు ఏమనుకుంటున్నావు. లోకం తెలీని వేధవలా కనిపిస్తున్నానా?’

’అరేయ్ దశరథా, నువ్వు ఎక్కడయినా రాజీ పడి దాన్ని ఏం చెస్తావోనని కంటికి రెప్పలా చూసుకునే వాని కోసం తిరుగుతుంటే…’

‘నాకు అమ్మోరి కథ చెప్పాలని పించిందట్రా… ‘ అన్నడు ఉక్రోషంగా.

‘అవును’ అన్నట్లు చూసాడు.

‘అవునురా అంటావు, అనగలవు అది నీ తప్పు కాదు కాదు… నా పిల్లడు నన్నిలా చేసి చచ్చాడు గదా!… ఆ వాడు పోయిన నాడే’ అని కళ్ళొత్తుకుని….

‘వాడే ఉండి ఉంటే నీ అంతట నువ్వు వచ్చి నా చేతులు పట్టుకొని బ్రతిమాలేవాడివి. సరే ఇక నేను ఎటూపోను… నీ యిష్టం నీ బిడ్డ. ఇష్టం మధ్యన నేనెవడ్ని… ఎవడ్నిరా… బర్రెకు లేదు, దూడకు లేదు… గుంజకొచ్చిందట గురక రోగం. సరే కానియి’ అని చికాకుగా లేచి ఇంట్లికి నడచి మళ్ళీ తిరిగి వచ్చి ‘ఇదిగో ఏవరేం చేసినా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వు నన్ను ఏమనుకున్నా… విజయ కంటి తడిని నేను చూడలేను. అది ఎక్కడున్నా సుఖంగా ఆనందంతో వెలిగిపోతూ ఉండాలి. నిశ్చింతగా ఉండాలి ఆఁ!…’ అంటూ తిరిగి లోనికెళ్ళాడు.

దశరథం దీక్షితులు మాట్లాడినదంతా మౌనంగా వింటూనే ఉన్నాడు.

ఎక్కడా ఎదురురాలేదు.

‘కనీసం నేను ఏమన్నాననీ ఇదంతా’ అని కూడా అనలేదు.

శాంతమ్మ మాత్రం ‘చాల్లెండి సంబండం ఎవరన్నా వింటే నవ్విపోతారు. అయినా అన్నయ్య అన్నదేముంది. ‘మీకు దాని మీద ప్రేమ లేదన్నారా?…’, ‘మీరు తిరగడం లేదన్నాడా?…’ ఈ ఇంటికి రావల్సింది ఇలాగయిందేమిరా దేవుడా అని బాధపడుతుంటే ఎందుకిలా, ఇదయిపోయి మాటాడడం. ఎవరి బాధ వారికుంటుంది. మనకు అది తప్ప ఉన్నదెవరు. ఎవరం ఎలా ఆలోచించినా దానికొరకే. మరి కనీ పెంచినవాడు ఆ మాత్రం శ్రద్ధ తీసుకోవడంలో తప్పేముంది. ఒక్కోకసారి మీ ధోరణి నాకు బొత్తిగా అంతు పట్టదు’ అంది.

‘నువ్వూ అను, వాడి మాటలతోనే కడుపు నిండిదనుకున్నాను. నీకు వెల్తి కనిపించి ఉంటుంది. పూడ్చు తల్లీ పూడ్చు’ అని అరక్షణం ఆగి…

’అయినా నాకు దాని మీద ప్రేమే ఎందుకుటుంది. నా కన్నబిడ్డా కాదు కదా?.. పెంపుడు పిల్లయినా కాదు. నీ కంటే అది బాగా చాలా కావల్సింది. అయనకేమో అసలు కన్నకుతురేనాయే. మీకు దాని పై కారిపోయినంత ప్రేమ నాకుండాల్సిన పని లేదు…. అవునా? అంచేత ఇక మీ ఇష్టం. అది ఒక వేళ మామయ్య అని నా దగ్గరికి వస్తే నాకు తోచింది చేస్తాను. అంతకు మించి జోక్యం చేసుకోను ఆఁ… దాని మేలుకోరే వాళ్ళు గదా, దశరథా శుక్రవారం నాడు నేను వాళ్ళింటికి వస్తానని మాట ఇచ్చాను. పరవాలేదనుకుంటే నువ్వు వెళ్ళు. పిల్లదానికి మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఆపైన నీ యిష్టం’ అన్నాడు.

దశరథం అంతా విని మెల్లిగా లేచాడు.

‘కాఫీ త్రాగి వెళ్దువుగాని కూర్చో’ అని లేచింది శాంతమ్మ.

ధశరథం లేచిన వాడు తిరిగి కూర్చుని… దీక్షితులు వైపుగా చూసి “దీక్షితులూ ఒక్క మాట విను. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నువ్వు అడగలేదు. నా మనస్సేమిటో తెల్సుకోలేదు. లోకపు తీరును నేను ప్రస్తావిస్తే నీకు అంతులేని కోపం ముంచుకొచ్చింది. పైగా నన్ను మాటాడనియ్యకపోతివి” అని ఆగి, ‘విజయ నా కుతురే. నువ్వు వత్తి పలికి చెప్పాల్సిన పని లేదు. నా కుతురే అయినా నీ దగ్గర దానికున్న అనుభుంధం విడదీయ లేదని నాకు తెల్సు.

మామయ్యా అని నిన్ను పిలుస్తుందే గానీ నిన్ను తండ్రిలాగా, తండ్రి కంటే ఎక్కువగా నీతో కలసి మెలసి ఉంటుంది. నా దగ్గర చెప్పుకోలేనివి తండ్రిగా నువ్వు తీరుస్తావని నీ దగ్గరకి పరుగెత్తుకుంటూ వస్తుంది. నీకు దానిపైన ఎలాంటి బాధ్యత ఉందో కూడా నాకు తెల్సు. నీకే ఇంకా ఎక్కువగా తెల్సిన ఆశ్చర్యపడను. నువ్వు దాన్ని గురించి ఎంతగా మనస్సు పెట్టి ఆలోచిస్తావో. నాకు తెల్సు. నువ్వేదో సంభంధం చూసి వచ్చావని దాదాపు ఖాయపర్చుకొని వచ్చావనీ…. అంటే గొఱ్ఱె పోతులా తల ఎందుకు విసిరినట్లు. నాకంటే బాధ్యతగా దాని పట్ల నువ్వు వ్యవహరిస్తావనే గుడ్డి నమ్మకం. అయినా నేను అమ్మవారి ఉదాహరణ ఎందుకు చెప్పానో ఆలోచించావా? ఆలోచించవు. నీకు అక్కరలేదు. అదే అలాంటి పొరపాటే ఎదైనా పిల్లదాని పట్ల తెలిసో తెలియకో జరిగిందే అనుకో, నా పరిస్థితి అలా ఉంచు నువ్వు భరించగలవట్రా? అందుకే చేతులు కాలాక వెనక్కి తిరిగి చూసుకునే బదులు వేసే ప్రతి అడుగూ ఆచి తూచి వెయ్యామని గుర్తు చేసేందుకు అదే నా ఉద్దేశం. ఆఁ నీకిది ఇష్టం లేదు పో అగుదాం. నువ్వు లేకుండా నేను అడుగు కదపడానికి సిద్దంగా ఉంటానని ఎందుకు అనుకుంటావు? నన్ను అర్దం చేసుకున్నది ఇదేనా? నిప్పు అని అర్దమయ్యాక మనం దాన్ని ముట్టుకోం. విషం అని అర్థమయ్యాక దాని జోలికి పోం… వేసే అడుగు నిర్దుష్టంగా వేద్దామని. నీకు తెలీదని కాదు మనసాగక చెప్పి పోదామని వచ్చాను. ఇంకొక మాట నేను ఇక్కడికి వచ్చేసరికే నువ్వు పూజరయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళినట్లు? అంటే నీ మనసులోని ఆరాటం, నిన్ను కూర్చోనివ్వడం లేదన్నమాట. అంతేనా?… ఎంత ప్రేమ…. మమకారం లేంది నువ్వు అట్టా వెడతావురా…’

అంటుండగా ఇద్దరికి కాఫీ తెచ్చి ఇచ్చింది శాంతమ్మ.

మాటడడం ఆపి కాఫీ త్రాగారిద్దరు.

ఖాళీ కప్పులు తీసుకొనిలోనికి వెళ్ళింది శాంతమ్మ.

మెల్లిగా లేచాడు దశరథం…

‘శాంతా నేను వెళ్ళివస్తానమ్మా’ అని దీక్షితులు దగ్గరగా నడచి ‘నేనిక వెళ్తున్నాను. నీకు నన్ను చూస్తేనే అకారణంగా అప్పుడప్పుడు కోపం వస్తుంది’ అని…

‘పూజరయ్యా ఎప్పుడు శుభంగా ఉందంటే అప్పుడు నీ వెంట బయలుదేరుతాను. వెళ్ళిన చోటనే నిర్ణయం చెప్పక వద్దాం, ఆ తరువాత మనిద్దరం కూర్చుని మంచి చెడులను కూలంకుషంగా మాట్లాడుకొని పెండ్లి చూపులకు పిలుద్దాం. నా మనసులోని మాట ఇది. నీకిది నచ్చక పోతే నువ్వేదయిన ఆలోచించి ఉంటే చెప్పు, అలాగే చేద్దాం’ అని నడిచాడు.

‘ఆగు నేను వస్తున్నాను’ అన్నాడు దీక్షితులు లేచి…

అంత త్వరగా free కాలేకపోయాడు. శాంతమ్మ ఇరువుని వింతగా చూసింది. తోవ దాకా దశరథం వెంట నడచాడు.

ఎఱుకల బుఱ్ఱి ఎదురయింది.

ఇద్దర్ని చూసి, ఆగి ‘దొరా పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తరు’ అంది ప్రేమగా.

‘మనం అనుకోగానే సరిపోతదా ఆ ఘడియలు రావాలిగదా’ అన్నాడు దశరథం.

‘అవు దొర అది తోసక రాంది జరగేదేం ఉండదు. ఈడొచ్చిన బిడ్డ ఇంట ఉంది గనుక సంబరంగ అనుకుంటాం’ అని, ‘ఇక పొతెదొర’ అంది.

‘నీ మనుమరాల్ని చదివిస్తున్నావు గదా?’ అడిగాడు దీక్షితులు.

‘పదిలోకొచ్చింది దొరా…’

‘అంటే నీకూ చెప్పులరిగే రోజు దగ్గర పడిందన్నమాట’ అన్నాడు నవ్వుతూ

‘నేను పొద్దు పొడుపుతో లోకం తిరిగే దాన్ని గదా దొరా. ఏడనో ఒక చోట గంతకు తగ్గ బొంత తగులుతది’ అంటూ మొక్కేసి పోయింది.

***

పొద్దు పొడిచింది..

ఆకాశన అంతులేని మబ్బులు కమ్ముకున్నాయి. తుఫానంత ఇదిగా వేగంగా నడుస్తున్నాయి. పొద్దు కొంచెం ఎక్కంగానే మబ్బతునక కనిపించలేదు.

రోజూ వచ్చే పాల వ్యాను రాలేదు…. బస్సు స్టాండు అంత హడావుడిగా లేదు. న్యాయానికక్కడ బస్సు స్టాండు లాంటిదేం లేదు. బస్సులు ఆగే స్థలము గనుక అలా అనాల్సి వచ్చింది.

చెట్లున్నాయి నాల్గు. మంచి నీడనిస్తాయి పొద్దెక్కుతుంటే. ప్యాసింజర్లను దాహం తీర్చేందుకు ఓ చేదబావి ఉంది. ఎడ్ల బండ్లు ఒకటో రెండో చేరతాయి. వాళ్ళు చివరి దాగా ఉంటారు.

ఒక కిళ్ళికొట్టు ఉంది. అది అడపాదడపాగానే తెరుచుకుంటుంది. దానికి తగిలే బేరం కూడా అంతంత మాత్రమే. టీ కొట్టు ఉంది. ఒక్క ‘టీ’ మాత్రమే దొరుకుతది. అప్పుడప్పుడు ‘డబల్ రొట్టెలు, బొంగుండలు’ దొరకుతుంటాయి.

దీక్షితులు దశరథం బస్సు స్టాండు కొచ్చారు.

వచ్చి కూడా గంట అయింది. అంటే….

వారు వెళ్ళదల్చుకున్న బస్సు గంట క్రితం రావల్సిందన్నమాట.

అది ఇంకా రాలేదు గనుక….

వారు చెట్లకిందనే ఉన్నారు.

బస్సు చప్పుడు లాంటిది ఎప్పుడయినా నిక్కి నిక్కి చూస్తూన్నారు. అక్కడ కొచ్చిన బస్సు ఇక్కడికొచ్చేదే గదా! అయినా ఆరాటం. అది దూరంగా నైనా కనిపిస్తే ఇక్కడ హడావిడి పడటం, బస్సు వచ్చి ఆగాకనే గదా ఎవరైనా ఎక్కేది, దిగేది.

ఈ సంగతలు తెలిసి కూడా….

దగ్గర కొస్తుండగానే సామానులను ఎత్తుకుని ఉరుకులు పరుగులు.

దశరథ రామయ్యాకు ఎఱుకలసాని మాట గుర్తుకొచ్చింది.

‘మనం అనుకోగానే సరిపోతదా దొరా దానికది తోసుకొని రావాలి. వయసొచ్చిన కూన ఇంట్లో ఉంది గనుక మనసాగక అనుకుంటం’ అని నిజంగా ఈ మాట కాచి వడపోసిన నిజంలా అనిపించింది.

బస్సు టైం ఆరుగంటలకి. వారు అయిదు ముప్పావుకే వచ్చారు. ఏడు అయినా ఇంకా దాని జాడ మాత్రం లేదు.

మనం చేయగల్గిన వాటి వరకు కరక్టుగా చేయవచ్చు కానీ… అన్నీ మనం చెసే పనులు కావు గదా అంచేత ఎవరు ఎలా చేసినా వాటి ఆటు పోట్లు ప్రక్కన ఉన్న మనపై పడతయి.

కనీసం ఏడు గంటలన్నరకు గానీ బస్సు లేదు. అదే ఎక్కి వెళ్ళాలి గదా…. అంటే… సక్రమముగా అన్నీ నడిస్తే తొమ్మిది గంటలకు చేరాల్సిన ప్రదేశానికి చేరతాం. ఇప్పుడు ఒంటిగంటకు గానీ చేరతాం. పన్నెండు దాటిన తరువాత దుర్ముహూర్తం వస్తుంది.

అక్కడకు చేరకుండా, మనంగా చేయాల్సిన పనులు పూర్తి చేయలేం. ఈ రకమైన విధి క్రమాన్ని ఎరుకల బుఱ్ఱి అలవోకగా చెప్పడం… అప్పుడేమనిపించలేదు గానీ ఇప్పుడు చిత్రంగా అనిపించింది.

ఈ వరవడిలోనే బస్సు రావడం ఎక్కడం,దిగడం మళ్ళీ ఎక్కడం …

ఒంటి గంట దాటాక చేరడం జరిగింది.

వారు దిగింది కూడా పల్లెటూరే…

పాపం అక్కడి వాళ్ళు దీక్షితులు గారి కోసం దుర్ముహూర్తం ప్రవేశించిం దాకా చూసి మరొక నాడు వస్తారేమోలే అనుకొని వచ్చిన నల్గురూ చెదరిపోతుండగా ఈ బస్సు అక్కడ ఆగింది.

దశరథం, దీక్షితులు దిగారు.

కొంచెం దూరం పోయినా వీర్ని గమనించి వెనక్కి మళ్ళారు.

‘ఇవాళ ఇక రారని వెళ్తున్నాం.’ అన్నాడో పెద్ద మనిషి నవ్వు మొఖంతోనే.

‘బస్సుల ప్రయాణం గదా!’ అన్నాడు దీక్షితులు నడుస్తూనే…

ఇంతలో పిల్లవాని తండ్రి, పిల్లవాడు, వారి మేనమామ ఎదురొచ్చారు.

పరిచయాలు అక్కడే అయినయి. పిల్లవాడు చూపరే. బాగానే అనిపించాడు.

‘పద గంటలకే వస్తామని ఆరోజు దీక్షితులు గారు చెప్పారు’ అన్నాడు పెళ్ళి కుర్రాడు.

‘అన్నాను కానీ బస్సుల ప్రయాణం గదా’ అని నవ్వాడు.

మాట తీరు కూడా బాగే ఉంది. అనుకున్నాడు దశరథం.

‘మంచి నీళ్ళు త్రాగుతారా’ అంటూ తెప్పించాడు కుఱ్ఱాడి తండ్రి.

ఎత్తి పోసుకొని త్రాగారిద్దరూ.

‘మీ రిజల్స్ ఎప్పుడొస్తాయి’ అని అడిగాడు దీక్షితులు.

‘పదిరోజులు పట్టవచ్చు’ అన్నాడు కుర్రాడు.

ఇంతలో ఒకమ్మాయి కాఫీ తెచ్చిచ్చింది.

‘శ్రీను ఆ కాఫీలు నువ్వు ఇవ్వరాదు’ అన్నాడు రాజయ్య. కుర్రాడి తండ్రి.

‘అలాగే’ అన్నట్లుగా తల ఊపి కాఫీలందించాడు శ్రీనివాసు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here