పాదచారి-9

3
2

[box type=’note’ fontsize=’16’] భువనచంద్ర గారు వ్రాసిన ‘పాదచారి‘ అనే నవలను సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 9వ భాగం. [/box]

[dropcap]“నే[/dropcap]నీ ప్రకృతి ఒడిలో పుట్టాను. ఈ ప్రకృతి ఒడిలోనే ఆడుకున్నాను! ఈ ప్రకృతి ఒడిలోనే కరిగి కరిగి బిగ్గటిల్లి ఏడ్చాను! ఈ ప్రకృతినే ప్రేమించాను. ఈ ప్రకృతినే ఒక్కోసారి ద్వేషించాను. సర్వాన్నీ ఇందులోంచే సంపాయించాను! సర్వాన్నీ మళ్లీ ఇక్కడే దాచాను!

ఎందుకు సంపాదించాను?

సరే మళ్లీ ఇక్కడే ఎందుకు వదలివెయ్యడం?

అలాంటపుడసలు సంపాదించడం దేనికీ?

సరే పోనీ?

ప్రకృతీ!, నా తల్లీ!, నా చెల్లీ!, నా సర్వస్వమా!

“ఒక సారి మళ్లీ నన్ను బిడ్డగానో తండ్రిగానో ఎలానో ఓలా నీవొళ్లకి తీసుకోవూ?” పాదచారి నడుస్తూ నడుస్తూ అనుకున్నాడు.

ఎదురుగా చెరువులో నీళ్లు లేవు. మనసులో  ఊహల్లాగా ఇంకిపోయాయి.

“యూ ఆర్ ఎగైన్ రైట్” అన్నట్లుగా కసుక్కున గుచ్చుకుదోగరిక పుల్ల.

కళ్ల వెంట గిర్రున నీళ్లు తిరిగాయి.

పళ్లు బిగపట్టి అనుకున్నాడు పాదచారి.

“నేనేడ్వను. నీవు నన్నేడిపించలేవు” అలాగే కుంటుకుంటూ ఎండిన చెరువులో బొరియల్ని చూస్తూ ఆగాడు పాదచారి.

“ఇక్కడ కాసేపు విశ్రమిస్తాను.”

కుక్కపిల్ల నిస్తేజంగా, నీరసంగా ఎండకి నురగలు కక్కుతూ అతని దగ్గరగా ఆనుకుని పడుకుంది.

ఓ రెండు చిన్న జీవాలు అతని కాలి మీదుగా పాకుతూ వెళ్లాయి.

వెల్లకిలా పడుకున్న పాదచారి కళ్లలోకి ‘లే!’ ‘లే!’ అన్నట్లు చికాగ్గా ఒకసారి కిరణాల్ని పంపించాడు సూర్యుడు.

“ఓయీ! నువు అస్తమిస్తావు! నా శాపాన్ని సాయంత్రానికి అనుభవిస్తావు! పోనీలే క్షమించాను! మళ్లీ రేపుదయాన ఉదయిద్దుగానిలే!” సూర్యణ్ని క్షమించి కళ్లు మూసుకున్నాడు పాదచారి.

పై నుండి వేడి!

పుడమి వేడి!

వేడిలో ఊగుతూ వాడిపోయాడు పాదచారి!

అయినా నా లోకంలో వెన్నెలే ఉంది! అయినా నా లోకంలో హిమం వర్షించే శీతల శీతల పవనాలే ఉన్నాయి! నా మల్లెలు అమరజీవులు!

అవి వాడనే వాడవు! ఓ ప్రకృతీ నీ వెంత? నీ వడి ఎంత? రా నా లోకాన్ని చూడు! సిగ్గు పడిపోతావు సుమా!

అవునవునన్నట్లు ‘కుయ్’ మంది కుక్కపిల్ల.

“ఈ దేహం ఇలా వేడితో కాగనీ! నాకేం, నా దేహం నాది! నా దేహం వేరు!”

ప్రకృతి నిశ్శబ్దంగా ‘మాట్లాడుకోనీ వాణ్ణి’ అన్నట్లు ఊరుకుంది.

పాదచారి కోపంగా అరిచాడు.

“విన్నారా! నా దేహం నాది! అది ఎవరిచ్చిన భిక్షా కాదు. అది నా స్వంతం. అది నా అనంతం.”

‘విసిగించకు!’ అన్నట్లు వడగాలి రివ్వున వీచింది.

“హూఁ” కుక్కపిల్ల నెత్తుకుని నడిచాడు పాదచారి.

“నీ నీడ నాకు అక్కరలేదు” చెట్టుతో అన్నాడు.

నా నీడే నాకుంది!

నీ తోడు నా కెందుకు మనసుతో అన్నాడు.

నాకు నేనే తోడు!

నాకు నేనే తోడు!

కుక్కపిల్ల చేతుల్లో నించి చెంగున దూకింది.

“హాయ్! హాయ్!” అనుకుంటూ కుంటుతూనే పరుగు పెట్టాడు పాదచారి

సూర్యడి పై కోపం వచ్చి ఓ నల్ల మబ్బు కిరణాలకి ఆనకట్ట వేసింది.

“అయామ్ సారీ!” అన్నట్లు గాలి మెల్లిగా చల్లగా వీచింది.

“నేను గెలిచాను! నేనే గెలిచాను” పాదచారి నవ్వుకుంటూ ఓ చెట్టును తట్టి అన్నాడు.

“ఊహలు ఇంకిన

మోహం మింగిన

మనసును పిండీ

గుప్పిట బట్టీ

ఊహల జల్లులు కురిపిస్తా

ఆశల స్వారీ చేయిస్తా.”

ప్రకృతికి కవితలు వినిపిస్తూ ముందుకు సాగాడు పాదచారి. చెట్టూ, పుట్టా, చీమా, చిగురూ ఓ క్షణం ఆగి, ఓ క్షణం ఊగి పాదచారి పిచ్చి పాటల్ని విని నోరంతా తెరిచి హాయిగా నవ్వాయి.

“నువు కష్టం తెలియనివాడివి!

అందుకే నా కిష్టం అయినవాడివి” అంటూ ప్రకృతి నవ్వుతూ “నా ఒడిలోకి రా” అన్నట్ల గాలి రాయబారిని గబగబా పంపింది.

మళ్లీ సంధి కుదిరింది.

“పోనీలే! ఇన్నాళ్లూ నన్ను కనిపెట్టి ఉన్నది నువ్వేగా!” గాలితో అని నీడన చేరాడు పాదచారి. కళ్లు మూసుకుంటూ అనుకున్నాడు.

“ఈ శరీరం సరిగ్గా అమరినట్లు లేదు. శరీరాల కర్మాగారానికి వెళ్లి నాకు సరిపడేది ఏమన్నా ఉందేమో చూసి తోడుక్కోవాలి!”

“ఇదుగో నేనూ నీతో వస్తున్నా” ఓ గొంతు వినిపించింది.

“నువ్వెవరివి?”

“నీతోనూ, నీ శరీరంతోనూ ఇంతకాలమూ సావాసం చేసినదాన్ని.”

“నువ్వవరో నాకు గుర్తు లేదు.”

“నాకూ గుర్తుండటం లేదీ మద్య…”

“ఏమయితేనేమి? నీతో ఉన్నాననే అనుకుంటున్నాను. పోనీ లేనేమో కూడా! నీతో తీసుకు వెళ్లరాదా?”

“నీ పేరేమిటి?”

“మానసి.”

“ఓ మానసీ! ఏదో ఓ కొత్త శరీరం వేసుకుందామని నేననుకుంటూంటే నువ్వూ వస్తానంటావేమిటీ?”

“నీతో నేనూ ఇంతకాలం ఉన్నాననుకుంటున్నాను కనుక. ఏమిటో! నాకూ చాలా కోరిగ్గా ఉంది.”

“మేమూ వస్తాం!” సత్యారావు, విప్లవమూర్తి, కవితాకుమారీ, విజ్ఞానాచార్యులూ ఇంకా ఇంకా ఎంతో మంది అరుస్తూ అన్నారు.

చిరాగ్గా లేచి నడుస్తున్నాడు పాదచారి.

“వీళ్లంతా నన్నోదలరు, ఎలా ఒదిలించుకోవడం?” మళ్లీ అనుకున్నాడు. “వీళ్లంతా ఉండని చోటెక్కడుంది?” కొంచెం దూరం నడచి ఆగి అనుకున్నాడు “మళ్లీ అసలు వీళ్లెవరూ లేని చోటున నేనున్నట్లే నాకు గుర్తుంది.”

గుర్తుండట మేమిటీ, ఆ చోటు నాకు బాగా గుర్తుంది!

“అయితే వెళ్లిపో అర్జంటుగా” అన్నాడు ఆత్మారామ్.

ఓ క్షణం నిర్ఘాంతపోయి వెనక్కుగిరుక్కున తిరిగి విహ్వలుడై అరిచాడు పాదచారి.

“అయ్యో! నేనిలా నడుస్తూ నడుస్తూ ఎంతో దూరం వచ్చేశాను. ఎన్ని మలుపులు తిరిగానో, ఎన్ని బాటల నడిచానో! అయ్యో! నేనిపుడెలాగా వెనక్కి వెళ్లడం? నడవటమేగాని దారులను గుర్తుంచుకోలేదు గదా! ఎలా వెళ్లను? ఎలా వెళ్లను? నక్షత్రాల్లారా ఏదీ నాచోటుకి దారి? కొండల్లారా! కోనల్లారా! సెలయేళ్లల్లారా! పక్షుల్లారా! మశువుల్లారా! ఎక్కడోయ్ నా చోటుకు బాట?” అరిచి అరిచి వణికి పోయాడు పాదచారి.

వేదనలత గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని రెండు చేతులా కౌగరించుకోబోయే క్షణాన “భౌ భౌ” మని అరిచింది కుక్కపిల్ల. పాదచారి చొక్కాలాగి దారి చూపుతున్నట్లు వచ్చిన దారి వెంట పరిగెత్తింది. పాదచారి కళ్లు  మణికట్టుతో తుడుచుకుని పకపకా నవ్వాడు.

“నాకు తెలుసు నేస్తం! నాకు తెలుసు! చూడు! చూడు! నిన్ను గుర్తించనే లేదు. ఎంత దానివయ్యావూ? ఎంత బలంగా పరుగెడుతున్నావూ? చూపించు! చూపించు! తొందరగా ఆ చోటుకు నా చోటుకి దారి చూపించు…. ఇక నుంచీ నీ పేరు విశ్వాసం!” తడబడుతూ కుక్క వెనుక పరుగెత్తాడు పాదచారి.

కొండలూ, కోనలూ, వాగులూ, వృక్షాలూ “ఓహో మళ్లీ నిన్ను చూస్తామనుకోలేదు బిడ్డా! రా! రా! ఎన్నాళ్లకెన్నాళ్లకు? ఈ లోకం నిన్ను తన కౌగిట్లో దాచేసుకుందేమో ననుకున్నాం. ఈ లోకపు స్వార్థం, చింతా, నీతీ నియమం, మోహం, ఆశా, అన్నీ నిన్ను తమ చేతుల మాలల్లో దాచి వేశాయనుకున్నాము. ఇదుగో… నీవు వచ్చావు. నీవు మళ్లీ మావాడివయ్యావోయ్! మాదీ నీదీ ఒక లోకమే గబగబా నడుస్తూ నడుస్తూ వెళ్లిపో! నీకోసం పక్షులు దారి చూపిస్తాయిలే! అరే విశ్వాసం కూడ వెంటనే ఉందిగా!”

“మా నీడల్లో విశ్రమించు! మా నీడల జాడల్లో నడిచిపో! నడిచిపో! వాగులు ప్రవహిస్తాయి. దాహం తీర్చుకో సుమా!” అంటూ ఆహ్వానిస్తూ పిలిచాయి.

“నా కాలు నెప్పిగా ఉంది! నడవ లేకపోతున్నాను! అయినా నాకేమి? నేనడుస్తూనే ఉంటాను….” అంటూ ఓ చోట కొంచెం ఆగాడు పాదచారి.

“ఏమిటవి? ఏవేవో గోపురాలు! ఏవేవో ప్రసంగాలు! అవన్నీ నేను చెప్పిన మాటల్లానే ఉన్నాయి. అవన్నీ నాకు వచ్చిన ఊహల్లానే ఉన్నాయి. చిత్రం! చిత్రంగా శరీరంలో ఏదో మార్పు కలుగుతోంది. ఎన్నేళ్లు చిన్నవాడినయ్యానూ? ఈ హారాలూ దండలూ నా మెడలో కెలా వచ్చాయీ? ఈ లోకపు అసూయాదృక్కులు నా మనసు నెందుకు గుచ్చుతున్నాయీ?”

“అదుగో నా భార్యా పిల్లలూ” చిన్నగా నవుకునాడు పాదచారి.

“మీరన్నీ ఇష్టం వచ్చినట్లు ఊహించుకుంటారు. అవే నిజమనీ అనుకుంటారు. రేపటి పాలు పిల్లి తాగుతుందని యీనాడే ఊహిస్తారు. రేపటి బాధకి ఈనాడు నిర్లిప్తత పెంచుకుంటారు అవునా! ఇదిగో నా కళ్లలోకి చూడండి! ఏవి ఆ నయనాలు? శీతకాలపు వెన్నెల్లా తెరలు తెరలుగా అలలురేగే  ఆ కన్నులు ఎక్కడ? ఆ కళ్లు నావేపు చూసినపుడు నా భావావేశం ఎంత ఉవ్వెత్తున ఉరకలు పరుగులు వేసింది? వెచ్చని ఆమె చేతులూ తళుక్కుమని మెరసే ఆ క్రీగంటి చూపులూ నన్నదుముకొని నాకు అనంత విశ్రాంతి నిచ్చే ఆ చిన్ని హృదయమూ యెక్కడ? నన్ను తన వడిలో ఇముడ్చుకుంది? నా మెడలో బాహువుల మాలలు వేసింది. ఏమీ లేని బికారికి ‘నే’ నున్నానని ఆశల వర్షం కురిపించింది. జీవితపు బాటలు చూపించింది. ఎక్కడ? ఓయీ పాదచారీ నడు!… నడు!… కాలం రాల్చిన అశ్రువులు ఏరుకో! పిచ్చి గుండెలో భద్రంగా దాచుకో! పిచ్చి కళ్లలో వెఱ్ఱిగా చూసుకో!

“ఇదిగో నా భార్య! ఈ శరీరం నీదే ఇది సోలిపోయింది! ఇది అలసి పోయింది! కాలంతో పాటుగా కరిగిపోయింది! అయినా ఇదే నీవు కావాలన్నావు!

సరి నాకేమి! ఇదుగో తీసుకోమన్నాను! తీసుకున్నావు!

నీ మనస్సూ నాదేనన్నావు అదీ లాక్కున్నావు! అక్కడక్కడా చిరిగిన దానికి అతుకులు వేసి దాచుకున్నావు! ఆ తరువాత ఆత్మ కావాలన్నావు. నీ తలుపు తెరిచి దాన్ని దాచుకోమన్నాను. ఏం చేశావో ఏం చూశావో అయినా నా సతీ నిన్ను నిన్నుగానే చూసుకున్నాను.

అయినా నా అర్ధభాగమా నిన్ను నీలాగే అదుముకున్నాను. నీ చిట్టి చేతులకీ నీ చిట్టి ఊహలకీ నాకు నేనుగానే లొంగిపోయాను. నన్ను నేను కాల్చుకుని నీ కోసం మరో శరీరం తొడుక్కున్నాను.

అయినా జీవితమా!

అది నాకు సరిపోతదోయూ!

కొంత లూజుగా కొన్ని చోట్ల బిగువుగా కొనుక్కున్న చొక్కాలాగా కొత్తగా ఉంది.

అయినా ఏమరచి ఉండలేదు ఏ క్షణమూ! అర్ధరాత్రిలో ఆకాశంలో నీ కన్నుల కాంతి కోసం వెతికాను. నక్షత్రాల తళతళలో నీకన్నుల మిలమిలలు చూశాను. నీ గుండెల చప్పుళ్లు నాలో నేనే విన్నాను. నీ ఊహల వెచ్చదనం నాలో నేనే అనుభవించాను.”

“నీకూ నాకూ మధ్య దూరం క్షణం, అనంతం ఓ క్షణం అది నా సర్వస్వం! మరో క్షణం మృగ్యం! ఏమంటావిప్పుడు.?”

“ఈ నిశి రాత్రిలో మబ్బు నిండిన ఆకాశాన్ని చూస్తూ అంతటినీ మరచి అన్నిటినీ వదిలి ఒంటరిగా! విరాగిగా నా కోసం నేను ఏడవ లేక నీకోసం పడిగాపులు కాస్తున్నాను. తెలుసా నీకు! తెలుసా నీకు!” నవ్వి అనుకున్నాడు పాదచారి.

కాలపు గడియారం ఏదో ఓ అంకెను చూపించింది. పాదచారి అక్కడ ఆగి విశ్రాంతి తీసుకున్నాడు.

కొన్ని క్షణాలు నెలలుగా, సంవత్సరాలుగా గడిచాయి. పకపకా నవ్వాడు పాదచారి.

పై నున్న పక్షి ‘ఎందుకూ’ అన్నట్లు ‘క్యూం’ అని అరిచింది. నవ్వి అన్నాడు “చూడు విహంగమా చూడు నేస్తం చూశావా అప్పటి నాలో కొన్ని! వరుసగా కదిలి వెళ్లిపోయే ఆమూర్తులను చూడు! ఒకరి వెనుక ఒకరు! అందులో ఒకరికి నేను ప్రియుడ్ని. ఇంకొకరికి శరీర అవసరాన్ని! మరొకరికి సర్వస్వాన్ని! ఇంకొకరికి భర్తని! మరొకరికి కలను. వేరొకరికి అందీ అందని ఆకాశాన్ని! అయితే నేస్తం నేను పాషాణాన్ని! అక్కడే ఉన్నానోయ్ నేను. ఇదుగో ఇప్పుడూ నే విచారంగానే ఉన్నాను. అవునా వారంతా చూడు వరుసగా నీడల జాడల్లా కదిలి పోతున్నారు. వెనక్కే తిరిగి చూడలేదు… ఓహో!” ఓ వృక్షం నిర్లిప్తగా అశ్రువులా ఆకులు రాల్చింది.

నవ్వి పైకి చూశాడు. “ఓ చెట్టు  అన్నా! నీవు నిశ్శబ్దంగా ఆశ్రువులు రాలుస్తావు. అది ఎవరికి కనిపిస్తుందోయూ! సరే! నాకు తెలుసు నీ భాష. అయినా అన్నా! ఎందుకు జాలి? అదంటే నా కెప్పుడూ ఇష్టం లేదుగా? నీది జాలి కాదు. నీది ప్రేమ.  ఓ మూగ జీవీ! మన భాష ఒకటే! అయినా ఏముంది ఇందులో అదెపుడూ నాకు అలవాటయిందే!”

“ఏమిటోయ్ అలవాటయిందీ?” అన్నట్లు నిలదీశాడు గరికవీరుడు నిటారుగా.

“నువ్వూ గుచ్చువుగా నన్ను? ప్రపంచమూ అంతే! చివరి వరకూ అంతే! నన్ను ప్రేమించడం, ఆ  తరువాత నిర్లిప్తంగా ఉండడం. ఆ తరువాత తరువాత మెల్లగా కలలా మళ్లీ లోకంలోకి జారిపోవడం!”

“నా గురించేనా నువ్వు అనేది?” ఆకారం లేని మూర్తి ఓటి బయట పడి అడిగింది.

“ఓహ్! నువ్వా! కొంత కాలం నీలో నువ్వు మండుతూ చివరికి ఓనాడు వచ్చావు. జ్ఞాపకం ఉందా? కొంత కాలం తరువాత చల్లబడి చల్లబడి చక్కబడ్డావు జ్ఞాపకం ఉన్నానా నీకు?”

మెల్లగా ఆకారం లేని వ్యక్తి తప్పుకుంది. మిగతావీ తప్పుకున్నాయి.

గుండె తేలిక తేలిక అయిపోయింది.

“నా జేబులో తాళాలన్నీ పారేశాను. ఎంతో తేలిగ్గా ఉంది. ఇంకా ఉన్నాయేమో మరి. నేను వెతకను గాక వెతకను.” పక్షిలా తేలిగ్గా అడుగులు వేసుకుంటూ హాయిగా సాగాడు.

“మళ్లీ నా చోటుకి నేను పోవడం ఎంత సుఖంగా ఉందీ? ఇంత తేలిగ్గా ఉంటుందని తెలియనే తెలియదు.”

“ఔ! ఔ!” అన్నట్లు “భౌ! భౌ!” మంది కుక్క.

పదవోయ్ పద…

పదవోయ్ పదపద..

పరుగులు తీస్తూ…

ఉరకలు వేస్తూ…

చక చక చక చక…

పక పక నవ్వుతు!

పదవోయ్ పోదాం!

పదవోయ్ పోదాం!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here