తెనుంగురాయని స్వగతం

3
5

[dropcap]శ్రీ[/dropcap]మంతంబై, సౌభాగ్య సంపత్కరంబై, శ్రీ పంపా విరూపాక్ష, శ్రీశైల భ్రమరాంబాసమేతమల్లికార్జున, తిరువేంగడనిలయ పద్మావతీసమేత శ్రీనివాస, శ్రీకాకుళాంధ్రమహావిష్ణు ఇత్యాది మహాదేవుల కృపకటాక్ష లబ్ధులై వెలుగొందు సమస్త తెనుంగు ప్రజానీకానికి, నాటి విజయనగరసామ్రాజ్యాధీశుండైన తెనుంగు రాయడు వఖానొక్క నాట వఖ తెనుంగు బిడ్డ ఆముక్తమాల్యదకావ్యరసచర్వణంబు చేత హృష్టాంతరంగుండై, నిద్రించిన తరుణాన ఆతని స్వప్నమున పొడ సూపి – తీరిక మేరన చెప్పుకున్న హృదయగతంబైన స్వగతంబు నిరూపరూపంబున నిట్లుండేని.

***

రాచరికం!

రాచరికం అనేది ఒక కృతజ్ఞత లేని కెళసము. పులి మింద స్వారీ. స్వారీ ఆపేదిన్నీ, పులి చేతంబడి మరణం సిద్ధమవును. రాజ్యరక్షణ లో ఏ కొంచెము ఏమరినా దుడుకులు, దునేదార్ల తో ఎక్కడలేని ప్రాల్మాలిక. అడుగడుగునా గండాంతరంబులు, కంపోలంబులూనూ . అమరనాయకులు, సామంత రాజులుం గూడా వఖతూరి ఉన్నట్టు మరి వఖసారి ఉండేరని చెప్పొచ్చే వీల్లేదు. అంత్తఃపురాన కూడా యాయులు, స్థాయులనున్నూ అనుక్షణం ఓ కంటన కనిపెడతా ఉండవలె. బహువృత్తాంతాని రాజకులాని నామ’ . ఇన్ని జంఝాటములున్నూ పడినా వొక్ఖొక్క తూరి కొడిమలు తప్పవు. అంత్తఃపురం సంగతి అట్లా ఉంటే పట్ణములో, పాళ్యముల కార్యములలోను యెన్నో విషయాలు కనిపెట్టుకుని ఉండవలె. శిరః ప్రధాని అప్పాజీ, ఇతర ప్రధానులు, దళవాయి, పురోహితులు, దైవజ్ఞులు, అధికారులు ఇత్యాదులు కార్యసరవి ని అయినకాడికి చూసుకుంటా ఉంన్నప్పటికీ, మహరాజు తనంతట తాను అవుగాములు సెప్పక వ్యవహారమును నిర్వహించవలసిందే. పొద్దన బ్రాంహ్మీ ముహూర్తాన లేచి, దర్పణావలోకనం జేశి, సందిదండలు చేబట్టి వ్యాయామంతో రాచరిక తీరుమానాలు చేసేదారభ్యం, ఎప్పుడో పొద్దు గూంకే సమయం దనుక అంతటానూ ఈ రీతున క్షిప్రగతి ని కార్యములు నడుస్తా ఉండును..

రాచరికం –

అనంగా సింహ్మాసనస్థులు నడిచే దేరీతు, ప్రజలను రక్షించే దేరీతు, పరిజనులను నడిపించ్చే దేరీతు, ధర్మము ఆర్జించే దేరీతు, వ్యయం జేసే దేరీతు, శత్రువుల జయించ్చే దేరీతు, మిత్రువుల పోషించ్చే దేరీతు, ఆప్తజనుల పాలించ్చే దేరీతు, ఆశ్రితులను, కొలిచిన వారిని ఆదరించ్చే దేరీతు, ఆత్మసంరక్షణకు అర్హులైన వారెవ్వరు, అర్థచింత వుపాయం, అర్థవ్యయం సకలమున్నూ తెలిశే దేరీతు, శాశ్వతమైన కీర్తిఖ్యాతులు కలిగే దేరీతు – ఇవన్నీ లెస్సగా తెలియవలె. ప్రధాని, దండనాయకాది గణం రాజుకు నిరంతరమూ ఈ విషయాలను బోధిస్తూ ఉండవలె.

ఈ రాచరికపు కార్యముల నుండి కొంచెం తెరింప్పి నిచ్చేది అపరాహ్ణ వేళలందు జరుగు సాహిత్యగోష్టి, వీలున్నప్పుడు మారువేషంతో వఖళ్ళిద్దరు ఆప్తులతో చేసే సంచారమున్నూ. శ్రీ విరూపాక్షస్వామి దయ మీదను విజయనగర శీమ యందును, విద్యానగరమంద్దునా ఉద్ధండపిండాలైన కవిపండిత, శిల్పచిత్రలేఖన, గాయకనాట్యకళాకారులకు కొదువ లేదు. స్వర్గస్తుడైన మా యప్ప శ్రీ నరసింహరాయల నిర్దేశము మూలాన నేనున్నూ పిన్నవయసులోనే సాంఖ్య, యోగ, మీమాంస, న్యాయ్య వైశేషికాది దర్శనాలను, అన్వీక్షకిని, జ్యోతిశ్శాస్త్రాన్ని, ఇతర శాస్త్రాలను, సంస్కృత కావ్యాలను సాంగోపాంగంగా అభ్యసించి ఉంటిని. నిరుక్త, వ్యాకరణ, ఆలంకారికాది శాస్త్రములు సరేసరి. భువనవిజయ ఆస్థానమున సభ్యులు – కావ్యనాటకాలంకార మర్మజ్ఞ, ధర్మజ్ఞుడు, కవితాస్త్రీలోలుండు, మేధావద సాధారణ బోధాకర హృదయుడు, కవితాప్రావీణ్యఫణీశుడు, సాహితీసమరాంగణ సార్వభౌముడు – ఇట్లు పలు పేర్లతో సమ్మానించుట కద్దాయెను. రాచరికం గనుక, కొంత గలిబిలిపడిననూ యిట్టి బిరుదులను వహించ్చక తప్పదాయెను. ప్రసంగం ఏమంటే – బిరుదముల కంటేనూ, వనరించిన కృతి – రసజ్ఞుడయిన పాఠకుని మెప్పు గొన్నట్లాయెనా? ఆ కవి కృషి సఫలమవును.

శ్రీకృష్ణదేవరాయఁడు

సాహిత్యగోష్టులు కాకుండగా, సదర గా ఉండు ఈ రాచరిక వ్యవహారాల నుండి కొంచెం విరామ పడునది జడి లోనే. అందుకనే ఈ ఋతువంటేను బహుప్రీతి. ఈ సమయాన దునేదార్ల నుండి, సామంతుల నుండి తిరుగుబాట్లు ఉండవు. తఱిలోనే రైతులు వ్యవసాయపు కార్యములు ఆరంభించేరు. విద్యానగరాన్ని ఒరుసుకుని పారాడే తుంగభద్ర ఒరవడి ఈ కాలంలో పట్టనలవి గాదు. చక్రతీర్థం దగ్గిర మటుకు ఈ తుంగభద్ర వంపులు చూచి తీరవలసిందే. పొద్దునే సంది దండలతో సాము అయిన తరవాత నిమ్మళంగా అశ్వారోహణం జేసి, తుంగభద్ర ఒడ్డుననూ, కలమచేల గట్లనూ, పారాడతా ఉంటే అపురూపమైన దృశ్యాలు కానవచ్చీని. ఈ దృశ్యములన్నీ కావ్యరచన సమయమున సకృత్తుగా పొడగట్టీని.

ఈ యెడతెరిపి లేని రాచకార్యాల నడుమను కూడా విజయనగరరాజ్యాన కవిత్వసృష్టి ప్రభావవంతంగా జరుగుతూ వస్తా వుంద్ది. స్వయంగా నేనున్నూ సత్యావధూప్రీణనం, జాంబవతీపరిణయం, సకలకథాసారసంగ్రహం వంటి సంస్కృత కావ్యాలను రచించ్చి యుంటిని. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు స్వప్నమున పొడ జూపి ’మేన్ మును దాల్చిన మాల్యమిచ్చు నప్పిన్నది రంగమందయిన పెండిలి’ ని గూఱిచి కావ్యము సెప్పుడా యన, ఆ ఆనంతి మేరకు ఆముక్తమాల్యద అను రచనకు ప్రయత్నపడితిని.

ఆముక్తమాలికా యేన విష్ణవే గోదయార్పితా |

ఆముక్తమాల్యదా నామ తస్యాస్తే నాభవద్భువి ||

ప్రసన్నామృతమను కావ్యమున గోదాదేవి యను ఆళ్వారు శ్రీరంగవిభుని పరిణయమాడిన కథ యుండీని. ఆముక్తమాల్యద అను పేరు గల ఆ యాండాళ్ళు కథనూ, విశిష్టాద్వైతపు సారమున్నూ తెలియంజెప్పుచూ, పల్లెపట్టు సోయగాలను చిత్తానకు తెచ్చికోవలెనని, ప్రబంధమున నిమంత్రించవలెననిన్ని అభీష్టమయ్యీని.

అందుకు ఈ వానలకాలం మంచి అదను. వర్షం అనేదిన్నీ, మేఘాలు, ఉరుములు మెరుపులూ, ఘాలివాన, కుండపోతగ ధార ఇవీ కవులు వాటంగా పట్టుకునే అందములు. వర్షఋతువు గురించి ఆదికవి వాల్మీకి కవి ఆదారభ్యం, శూద్రకుడు, కాళిదాసు ఇత్యాది అనేక కవులు పారంపరికంగా చాలా గొప్ప సాహిత్యాన్ని సృజిస్తూ వచ్చినారు. పూర్వకవుల కల్పనలలో ఉదాత్తమయిన వస్తువునే యెంచ్చికొనుట కద్దు. కవిసమయములకు, ఉదాత్తప్రకృతికి వ్యతిక్రమముగా వాస్తవప్రపంచ వస్తువులను కావ్యమున చేకొనడం తరచు గాదు. అయితే మంచీ చెడూ తెలిస్తేనే గదా మనిషి. అందమైనది, అందము లేనిదిన్ని – రెండింటిలోనా అందాన్ని చిక్కించుకుంటేనే కదా కవి! అందుకే గదా దశరూపక కర్త ఇట్లా చెప్పవచ్చినాడు –

రమ్యం జుగుప్సిత ముదార మథాపి నీచం

ఉగ్రం ప్రసాది గహనం వికృతంచ వస్తు

యద్యాప్యవస్తు కవిభావక భావ్యమానం

తన్నాస్తియన్నరస భావముపైతి లోకే ||

ఒక వస్తువు రమ్యంగానీ, జుగుప్సాభరితంగానీ, ఉత్తమం లేదా నీచమైనది గానీ, ఉగ్రము లేదా శాంతమైనది, సులభం గహనం, వికృతం యెట్టిదైనా – కవి/భావకునిచేత భావింపబడి, రసముగా గాని, భావముగా గాని పరిణతి చెందనిది లోకాన లేదు.

కనుకనే వర్షం అంటే

వడగండ్లు, ఇంద్రగోపాలు (ఆరుద్ర పురుగులు), పాములు, నీరుకట్టెలు, పుట్టగొడుగులు, ప్రసవంతో బాటు వచ్చే ఉమ్మనీరు, ఏనుగుల తోండముల నుండి ధార, పుడమిపై రేగిన దుమ్ము, కట్లజెర్రి, కప్పల బెకబెకలు, వఖ్కక తూరి వాన రాకున్న్యా సుళ్ళు తిరుగుతూ వచ్చే దుమ్మూ, గాలీ, మేడిపండ్లలోపల గుంయ్యి మనే దోమలు, మొగలిపూలు, నెమళ్ళు, చాతకములు, గూళ్ళలో వణుకుతూ కూర్చున్న పిట్టలు, కయ్యలు దున్నే బీదరైతులు, కాకులు ముక్కున కఱచుకుని పోయే కసవులు, ఇత్యాదులు…

ఇట్లు సౌందర్యసహితము, సౌందర్యవిహితము రెండున్నూ అయిన సమస్తమయిన వస్తువులున్నూ హృదయమున పొడగట్టును. ముఖ్యంగా వడగండ్ల వాన ఎంత సంబరంగా ఉండునో! ఆ వడగండ్లు, కొంగలబారు చూసి ఇలా ఊహించుకొంటిని.

కృతపయఃపాన నవమేఘ పృథుకములకు

రాలె నొయ్యన వడగండ్ల పాలపండ్లు;

మఱి బలాకాద్విజాళి సంప్రాప్తి గలిగెఁ

బెరుఁగఁ బెరుఁగంగ ధ్వనియు గంభీరమయ్యె.

అమ్మ చన్నుల పాలు కుడుచు మొయిళ్ళనే పసిబిడ్డలకు – ఎదుగుతున్న క్రమంలో మెలమెల్లగా వడగండ్లనే పాలపండ్లు రాలిపడినాయి! రాలిపడిన మీంట, తిరిగి కొంగలవరుస అనే పలువరుస మొలుస్త్యా, గొంతు రాటు దేలుతూ, ఆ క్రమంలో మేఘాల నుండి గంభీరమైన వురుములు వురుముతా వుండీని!

సాధారణంగా ప్రజ పులుసుతో అన్నం దిని, ఆపైన పెరుగు కలుపుకుంటా ఉండేరు. మేఘం కూడా ’ఉప్పుతో పులుసు ఒసంగు రసం’ అని మొదట ఉప్పు సముద్రం నుండి రసాన్ని గ్రోలెను. ఆపై అదే మేఘం – పెరుగు సముద్రం నుండి పెఱుగును త్రాగీని. అయితే ఆ పెఱుగు ఏ కాలందో యేమో పాంచిపట్టి పుల్లదై పోయింది. అందుకని ఆ పెఱుగు గెడ్డలను తట్టుకోలేక మేఘం వాటిని వడగండ్లుగా అవని మీదకు ఉమిసీని. అలా పులిసిన పెఱుగుతో చేశినవి కావున ఈ వదగండ్లు నోట పెట్టుకోంగానే జివ్వుమని నాలుక వణకుటకు ఆస్పదమాయెను . (పూర్వం దధి, క్షీర, ఘృతాది సముద్రాలు ఉండేవని పురాణాలు. అగస్త్యుడు వాటిని అన్నిటినీ మింగి వేశెను.)

మరొకతూరి వడగండ్లు రాజహంసలు కొఱికి విడిచిన తామరతూండ్ల కుప్పలలా పొడంగట్టును. ఇంకొక ఊహ –

అమావాస్య నాడు అమృతాంశుడు చంద్రుని కిరణాలు ఉండవు. ఆ కిరణాలను అమావాస్య, చంద్రుని యందు నాటికి దాచుకొన్నది. ఆపై సమయం రాగానే ఆ అమృతకిరణాలను వెదజల్లినట్టు, మేఘం కూడా సూర్యకిరణాలను దాచుకుని తిరిగి వడగండ్ల రూపంలో వెళ్ళగక్కీని. లవణ సముద్రము నుండి పైకెగసిన నీరు మంచి నీరుగా మారి తిరుగా స్వచ్ఛంగా భూమిని చేరటం వఖ ముచ్చట. మేఘములు ఉప్పునీటిని గొని తమలోన చేర్చుకొనెను. ఆ నీట యుప్పు తట్టుగా చేరి ఉప్పుబిళ్ళలు గా పేరికొనెను. మేఘాగ్నులు ఆ నీటిని మండించ్చగా, ఉప్పుబిళ్ళలు మండి పెటపెట ధ్వని బయలుదేరెను. ఆ భయంకరమైన పెటపెట రావములే ఉఱుములై మించులలో నిండినట్లాయెను.

దినముల వెంబడిం జడనిధి న్మును గ్రోలిన నీరిలోనఁ బే

రిన లవణంపు ఘట్టముల దృప్యదిరమ్మద దావముల్ దవు

ల్కొని పెటిలించు నార్భటు లొకో యనఁగా సతటిత్ భయంకర

స్తనితములన్ సృజించె నతిసాంద్రఘనాఘనగర్భగోళముల్.

నల్లని ఆ మబ్బులను జూడంగా – భూమి తన జీవములను సూర్యుడు పానము జేసి హరించినట్టునూ, వాటిని తిరుగా రప్పించుకొన తీర్మానము జేసి సూర్యుని విరోధి రాహువుతో చెప్పినట్టునూ, భూమికి మిత్రుడైన రాహువు, సూర్యుని వీగద్రోలి, సూర్యకిరణాలలో ఉన్న ఉదకములను గ్రహించి వర్షించుటకు ఆరంభించిన రాహుమండలమో యన్నట్టునూ ఉండెను.

ఆరుద్రపురుగులో! ఇవిట్ని జూస్తే ఎన్నెన్ని ఊహలు పొడగట్టుతాయో! విద్యానగరంలో విరూపాక్షస్వామి, నారసింహుడు, బాలకృష్ణుడు, ఇత్యాది దేవాయతనాలతో బాటున్నూ, ’పట్టణద ఎల్లమ్మ’ కూడానూ వాసి. అరమనె కు దాపున హెండమారో గుండు కు ఉత్తరాన ఎల్లమ్మ వెలసి ఉంది. ఎల్లమ్మ అనంగా ఎల్లరకూ అమ్మ. కాళిక రూపిణి. విద్యానగరానికి రక్షణ సేయు దండనాయకురాలు ఎల్లమ్మ. ఈ యమ్మ ను నిలబెట్టినది శ్రీ విద్యారణ్యస్వాముల వారు.

అపరా కాళికాదేవీ విద్యానగర రక్షకా|

విరాజతే ఎల్లమాంబా కృష్ణరాయ సుపూజితా ||

అని అరమనె రాచరికం వారున్నూ ఆమెను పూజించుకొందుము. వాయినములు ఇచ్చుట గలదు. ఆమె గురుంతుకు వచ్చినట్టాయెనా?

గగనరంగస్థలంబున మిగులఁ బ్రౌఢి

మమునఁ గాళిక నిల్చి కోలము నటింపఁ

బొరి మొగంబున రాలు నిప్పుక లనంగ

గుంపులై రాలె మహి నింద్రగోపతతులు.

గగనం అనే నాట్యమంటపాన దిట్టంగా కాళిక నిలబడి నాట్యం శాయగా, ఆమె ముఖం నుంచి రాలిన నిప్పుకణికల ఫణితిని ఆరుద్రపురుగులు రాలీని. ’మేఘజాలేపి కాళికా’ – అమరమున మేఘపంక్తిని గూడా కాళికా అని చెప్పితిరి కదా.

మరొక ముచ్చట. మా ఆస్థానకవి, ఆంధ్రకవితాపితామహుడు అయిన పెద్దన కవి పరమసాత్వికుడు. అందుకనేనేమో ఆ స్వామి స్వారోచిషమనుసంభవంలో ప్రవరాఖ్యుని వంటి సాత్వికుని సృజించినాడు. ఆయన వర్ణనల్లో సంజెకాలపు శోణిమ దక్క మిగిలినది అంతా సాత్వికమైన తెలుపే. రాజకార్యాలలో మునింగి ఎప్పుడో వఖప్పుడు లోకాన్ని చూచే ఈ మనసునకు ఆకుపచ్చ, ఎరుపు, నీలం, తెలుపూ ఇలా భువనం సకల వర్ణసంచితమై కానవచ్చీని. కవిత్వ వస్తువు ఉదాత్తమై ఉంటుందని లాక్షణికులు. ఉదాత్తమైన కవిత్వవస్తువులను సాధారణమైన విషయాలపై/వస్తువులపై ఆరోపించి కవులు మహోన్నత కల్పనలు చేశియున్నారు. అందుకు విరుద్ధమైన కల్పనలూ., అంటే అసాధారణమైన వాస్తవికమైన ప్రపంచానికి చెందిన వస్తువులను, ఉదాత్తమైన ప్రాకృతిక జగత్తుపై ఆరోపించుట – ఆదికవి వాల్మీకి కాలాదారభ్యం ఉన్నా, రాశిలో తక్కువే. ఈ రెండవక్రమంలోనే పోతుంది చిత్తము.

వర్షం ఆగింది. నాకం పైన ఇంద్రచాపం పొడ సూపీని. సప్తవర్ణాల ఆ ఇంద్రచాపమును జూస్తే కట్లజెఱ్ఱి మతికి వచ్చీని.

ఇంద్రధనుస్సు కఱిగి దానిపై ఉన్న రక్తిమము గెన్నెరువు లాగా ఆరుద్రపురుగులూ, ఇంద్రధనుస్సు కరిగి దానిపై ఆకుపచ్చ కరిగి భూమిపైన పచ్చికలుగానూ ఏర్పడీని. ఫెళఫెళమనే మేఘాల వురుముకు భూదేవి భయంపడగా,, పక్కన నిదురలో ఉన్న భర్త మహావిష్ణువును కఱచు కొనడానికి చాపిన చేతుల వలె, నదీప్రవాహాలు ఏకువలో పచ్చికసవును ప్రవాహంపైన తాలిచి సముద్రంలోకి ఉరికీని.

పుట్టగొడుగులను చూసినట్లాయెనా? ఇసీ యనిపించొచ్చునేమో కానీ…

ఘనవృష్టి కతన ఫణు లే

పున నల వల్మీకరంధ్రములు మూయఁగ నె

త్తిన గొడుగు లనఁగ ఛత్రా

కనికాయం బవని నెల్ల కడలం బొడమెన్.

వానలు పడేదిన్నీ, పాములు తమ ఇండ్లు – పుట్టలపైన బొక్కలు మూయడానికి పడగలెత్తి నిలబడినట్లు చూసినంత మేరకూ పుట్టగొడుగులు కానవచ్చీని.

తఱిని దోమల గుంపో!

స్థూలపరిపక్వ కాననోదుంబరాగ్ర

రంధ్రముల వాననీరు సొరంగ వెడలె

మశకపఙ్త్కులు ధావధూమంబు లడఁగ

రచ్చ సేయంగ వెడలె విశ్రాంతి కనఁగ.

అట్టి జడిలోనే అడవిలో పండిన మేడిపండ్ల నుండి బయటపడి దోమలు గుంపులుగా బయలుం దేరును. ఆ దృశ్యము – అడవిలో కాఱుచిచ్చులు అడంగి వాటి పొగరేగి విశ్రాంతి కోసం ఎక్కడికో రచ్చకు వెళ్ళబారినట్టు పొడగట్టును.

ఈ వానలందు కాకులు కూడా నేత్రోత్సవంగా కనిపించీని!

తనరె బలిభుక్ తతులు నిం

డిన గ్రామశ్రీల కఱిఁతి నీలము లగుటం

గనియెఁ దృణగ్రాహిత ననఁ

గొను కసవులఁ జైత్యతరుల గూండ్లిడు భ్రమలన్.

చక్కంగా సానబట్టిన ఇంద్రనీలమణులు, గడ్డిపఱకలను ఆకర్షించీని. కాకులు గూండ్లు పెట్టుటకై భ్రమిస్తూ, చెట్ల నుండి నోట కఱచి గడ్డిపఱకలను తీసుకుపొయ్యీని. అవిట్లను చూడంగా – గ్రామలక్ష్ముల గొంతుకలందు అమరిన ఇంద్రనీల మణుల కరిదిని, కాకుల నోట కసవులు, ఇంద్రనీలమణులకు అంటిన తృణముల వలెనూ ఉన్నట్టు మనసుకు తోచీని.

వర్షం! ఎంత సుందరమయ్యీని! యెంత సంపత్కరమయ్యీని! యెంత పరిమళభరితమయ్యీని! మొగలిపూవును స్మరించనట్టాయెనా, వర్షఋతువు అసంపూర్ణమే అవును గదా!

అనయము నందనంబు దివియందున యుండఁ బ్రసూన వాసనల్

గని పఱతెంచి పోవు నల కాఱు మెఱుంగులె పోవ రాక చి

క్కెనొ వన గంధలుబ్ధభుజగీపరివేష్టన నా మొగిళ్ళ పిం

డునఁ జెలగెం బసిండి తగటుం దెగడుం బువురేకుమొత్తముల్.

నందనోద్యానము ఎల్లప్పుడునూ నాకమందే ఉండును. ఇట్లు తలపోసిన మెఱపులు, వర్షమున భూమిని జారి, తిరుగా వెనక్కు పోవు సమయాన, మొగలిపూల మొదళ్ళలో నెలకొన్న సర్పముల చేత చుట్టంబడి కదలలేక పోయినట్టు – మొగలి ఱేకలు (మెఱపు వలె) ప్రకాశించీని.

వసంతఋతువున రైతాంగము సంపెంగలంతటాను ప్రబలి, మొగలిపూలు కొరవాయెను. అట్టి మొగలిపూలు తిరుగా వర్షాకాలమున తమనుపేక్షించ్చిన జనులను జూసి పరిహాసము జేసినట్టు అంతటా వికసించీని.

ఈ అమృత వర్షాన పరమభాగవతోత్తముడయిన శ్రీవైష్ణవుని ఇంట అతిథి సత్కార సంబారం ఇట్లా జరిగేను.

గగనము నీటిబుగ్గ కెనగా జడి వట్టిననాళ్ళు భార్య క

న్బొగ సొరకుండ నారికెడపుం బొఱియ ల్దవులించి వండ న

య్యగపల ముంచిపెట్టుఁ గలమాన్నము నొల్చిన ప్రప్పు నాలుగే

న్పొగపిన కూరలున్ వడియముల్ వరుగుల్ పెరుగున్ ఘృతప్లుతిన్.

నెమ్మొగిలు పట్టిన వర్షాకాలాన కట్టెలు సరిగ్గా మండవు. పొగ హెచ్చు. ఆ పొగ తో కనులలో పొగ చొరకుండా, ఎళనీరు కాయల్లో నీటిని తొలగించి, వాంటిని మండించ్చి, ఆ మంటలో వండిన వరి అన్నము, పప్పు, నాలుగు పొరంటులు, వడియాలు, వరుగులు, పెరుగు, నేతిధార – ఇన్ని సంబారాలతో అతిథి సత్కారం జరుగుతా ఉండీని.

స్వాముల ఇంటి విందు అట్లా ఉంటే, పేద రైతుల ఇళ్ళలో వర్షాకాలాన మరి వఖ రకమగు ముచ్చట!

గురుగుం జెంచలి, తుమ్మి, లేతగిరిసాకుం, తింత్రిణీపల్లవో

త్కరమున్, గూడ పొరంటినూనియలతో కట్టావికుట్టారుగో

గిరముల్ మెక్కి తమింబసుల్ పొలము వో గ్రేవుల్ మెయిన్నాక, మే

కెరువుం గుంపటి మంచ మెక్కిరి ప్రభుత్వైకాప్తి రెడ్లజ్జడిన్.

శ్రావణమాసములో ఆకుగూరలు సకృత్తు, ఆ కాలాన గురుగు (గునుగు), చెంచలి, తుమ్మి, లేత తగిరిసాకు (తగిరెంత). ఈ నాలుగు అధరువులను, చింతచిగురును కలిపి పొరంటు జేసి ఉప్పు కారము కలుపుని చేర్చి అరికెల అన్నముతో మెసవి, ఆపై కొడుకులను పొలములకు అంపించ్చి మేకగొద్దితో కుంపటి వేసి పెట్టుకుని, రైతుజనం సుఖాన మంచమెక్కుదురు.

(గునుకులు/గురుగులు ఈ పూల నుంచి నల్లగా ఉండే గింజలు వస్తవి. వాటిని కూరలకు/పప్పుకు ఉపయోగిస్తారు. ఫోటో, ఈ సమాచారం తవ్వా ఓబుల్ రెడ్డి గారు)

పేదవాని గృహాన – లేమి కూడా ఎంత సౌందర్యవంతంగా ఉండీని! కుట్టి అరికెలు – గొప్ప ఆరోగ్యదాయకములు. ఇవిట్లను పట్ణ వాసులు – రాజనాల శాల్యోదనములకన్నా మిన్నగా ఆదరింపకపోవచ్చును, కానీ ఆంధ్రదేశమంతటానూ ఆరోగ్యప్రదాయకమైన అరికెల అన్నమును సమస్త ప్రజానీకమున్నూ ఆహారముగా ఒప్పుకొను రోజు వఖటి భవిష్యత్తున రాగలదు.

కవులకు గండపెండేరాలు కలుంగవచ్చు. వానలో బురదను త్రొక్కుతా, వ్యవసాయం జేసే కర్షకులకు నీరుకట్టెలు అనే విషం లేని నీటిపాములు పాదకంకణాలలాగా చుట్టుకుంటూ వున్నాయి!

వరజుబడి రొంపిఁ ద్రొక్కం

జరణంబులఁ బెనఁగి పసిఁడిచాయ కడుపులం

బొరి నీరుకట్టె లమరెను

బిరుదులు హాలికులు దున్నఁ బెట్టిరొ యనఁగన్.

కర్షకుని అట్టి సుందరమైన జీవితంమ్మునకు ఆలంబనగా ఆతని పత్ని. వఖానొక జడివానలో రైతు భార్య వానకు అడ్డుగా జమ్ముగూడ పెట్టుకుని పొలానికి అంబలిని తీసుక వస్తా ఉన్నది.

వసతుల్ వెల్వడి వానకై గుడిసె మోవన్ రాక తా నాని యే

వసగా నిల్చిన జమ్ముగూడఁ బొల మంబళ్మోయుచుం బట్టి పె

న్ముసురం దీగెడు కాఁపు గుబ్బెతల పెన్గుబ్బ ల్పునాసల్ వెలిం

బిసికిళ్ళు బిసికిళ్ళు హాలికుల కర్పించె న్నభ్యసనంబునన్.

భాద్రపదమాసం. వీట నుండి మగనికయి అంబలిని మోసుక వచ్చినది కాపు పెండ్లాము. పొలంలో గుడిసెలోని వచ్చే సందర్భాన వాకిలికి ఆయమ్మి తలపైని జమ్మిగూడ – తగులుకుని, తలుపు మూసుకుపోయ్యీని. ఈ కార్యమంత్తానూ – కాపు, తన భార్య గుబ్బలను, బయట తోటలో కంకులను హాలికుడు మర్దించుటకా? అన్నట్టయీని.

యెంత సామాన్యమైన, సుందరమైన జీవితమది? ‘పగయు వగయును లేక యేపాటి గన్న నలరు సామాన్య సంసారి యగుట మేలు’ – అని వఖానొకసారి హృదయం ఇట్టట్టువడీని. ఈ కర్షకజాతి ఔన్నత్యం మిగుల పదునైనది. ’నృపుల పదహల రేఖలకెల్ల మాభుజాగ్రహల రేఖలే మూలమనుచుఁ గోటికొండలుగ ధాన్యరాసులు ’ – రాజుల పాదచిహ్నాలకు రైతు భుజాలపై యున్న నాగలి కచ్చులే మూలము. అన్న అతిశయంతో కొండలు కోట్లుగా ధాన్యరాశులు పండించు వాడు రైతు. విద్య, గుణము, కులీనత, కీర్తి – వీంటికన్నా సంపదయే పురుషునికి లెస్స. ఈ భావాన్నే జాంబవతీపరిణయ కావ్యంలో ఇవ్విధంగా నొడువ వచ్చితిని.

న విద్యా న గుణోత్కర్షో న కులీనత్వముత్తమమ్ |

శ్రేష్ఠతా మావహేత్పుంసః కేవలం సంపదాగమః ||

రాజుకన్నా రైతు లెస్స! ప్రభువులు మనగలగాలన్నా కర్షకులే మూలధనం. రాజెప్పుడునూ రైతు కృషిని గుర్తించవలె, పెంపొందించవలె.

దేశవైశాల్యమర్థ సిద్ధికిని మూల

మిల యొకింతైన గుంటగాల్వలు రచించి

నయము పేదకు నరిఁ గోరునను నొసంగి

ప్రబలఁ జేసిన నర్థధర్మములు పెరుఁగు.

అట్లే, రాజ్యమున నగరములకు ఆవల, వెలిపాళ్యములలోనూ, గ్రామములలోనూ అటవీ సంపద పెంపొందవలెను. అటవీ సంపద వర్షమునకు మూలము. వర్షము వ్యవసాయమునకు ఆధారము. వ్యవసాయము వలన ధనాదాయము కలుంగును. దేశవ్యాప్తికి ధానాదాయాము మూలము. కయ్యలు కొలదివైనా కుంటలు, చెఱువులు త్రవ్వించి పేదరైతులకు పన్నులు, శిస్తులలో మేలు చేశినట్లాయెనా, ధర్మార్థములు తమంతట తామే వృద్ధి పొంద్దును. రాయల ఏలుబడిలో ఉన్న యీ శీమయందున వర్తమానమంద్దునా, భవిష్యత్తునంద్దునా వనరైన నీటి వసతి గలిగి, వ్యవసాయము, వ్యాపారము, ధర్మము, నీతి – లెస్సగా పెంపొందవలెనని మా ఆభీష్టము.

రాజ్యపరభారకం – బహుకఠినమైనది. అయితే సమాజంలో అన్ని వర్గములకు సరి అయిన నిర్దేశం, వ్యాపకం ఉన్నట్టాయెనా, ఆ సమాజం సర్వతోముఖమగు అభివృద్ధిం బడయును. ప్రజల సంపద వలనే రాజు కార్యసరవి, రాజ్యపరిపాలనమున్నూ సక్రమముగా నడిచీని. అన్ని జాతులు, అన్ని వర్గములున్నూ అభ్యున్నతి పొందవలననే ఆకాంక్షనే ప్రాచీనులు స్వస్తి వచనమున పొందుపరచియున్నారేమో.

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం, న్యాయ్యేణ మార్గేణ మహిం మహీశాః, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాస్సమస్తాః సుఖినో భవన్తు, కాలే వర్షతు పర్జన్యో పృథివీ సస్యశాలినీ, దేశోయం క్షోభనిరతో బ్రాహ్మణాస్సన్తు నిర్భయాః| అపుత్రాః పుత్రణస్సన్తు, పుత్రణస్సన్తు పౌత్రిణః, అధనాః సధనాః సన్తు, జీవన్తు శరదశ్శతమ్ |

ఇట్లు,

స్వస్తిశ్రీమద్రాజాధిరాజ రాజపరమేశ్వర

మూరురాయరగండ, అరిరాయవిభాడ

శ్రీశ్రీశ్రీ

చేవ్రాలు

శ్రీకృష్ణదేవరాయశ్రీ.

**************

[ఈ వ్యాసము రాయలనాటి వ్యావహారిక తెనుంగు కనుగుణముగా ఊహించి వ్రాసినది. ఈ వ్యాసంలోని పలుకుబడులకు, శబ్దాలకు మూలం:-

రాయవాచకము;

హండే అనంతపురం చరిత్ర;

ఆముక్తమాల్యద – వావిళ్ళ వారి ప్రతి;

అభయప్రదానము – పుట్టపర్తి నారాయణాచార్య;

సౌలభ్యం కోసం ఈ వ్యాసంలో కనిపించిన కొన్ని శబ్దాలకు అర్థములు ఈ క్రింద పేర్కొనబడినవి.]

సంది దండలు = వ్యాయామం కోసం ఉపయోగించే రాళ్ళు. (రాయలవారు ఉపయోగించినవి ఇప్పటికీ కామలాపురం మ్యూజియంలో ఉన్నాయి)

కెళసము = ఉద్యోగము;

దుడుకులు = తిరుగుబాటుదార్లు;

దునేదార్లు = విరోధులు;

కంపోలము = అలజడి;

గండాంతరము = అనుకోని ఆపద;

గలిబిలి = అలజడి; ఇబ్బంది;

అరమనె = రాచనగరు;

హెండమారో గుండు = కల్లు అమ్మే చోటు; అక్కడ ఉన్న రాతి గుండు;

ప్రాల్మాలిక = ఇబ్బంది;

యాయులు స్థాయులు = ఇతరులు, స్వజనము.

ప్రసాబడు = ప్రయాసపడు;

శీమ = సీమ; రాజ్యము;

కొడిమ = ఖర్మ;

అవుగాములు సెప్పక = అవునని, కాదని చెప్పక, తనదైన తీరున;

కార్యసరవి = పనితీరు ;

క్షిప్రగతి = వేగంగా;

పొడ = దర్శనము; (పొడగంటిమయ్యా మిమ్ము – అన్నమయ్య కీర్తన)

తీరుమానం = నిర్ణయం;

ఆరెకులు = కాపలా సైనికులు;

మొయిలు = మేఘము;

నెమ్మొగిలు = మేఘము;

వీగద్రోలు = పారద్రోలు;

కఱచు కొనడానికి = ఆలింగనము చేసికొనుటకు;

ఇసీ అనిపించు = అయిష్టము/రోత కలుగు;

ఇట్టట్టు వడు = కొట్టుకులాడు;

వరుమానం = లాభము;

సుద్ది = వ్యవహారం;

ఆస్పదమగు = కారణమగు;

అంపించ్చు = పంపు;

గొద్ది = పెంట;

సంది = తరుణమున; సమయమున;

అవిట్లను = వాటిని;

కచ్చు = ముద్ర:

వీడు = ఇల్లు; వీట = ఇంటి నుండి;

నొడువు = చెప్పు;

వాసి = ప్రసిద్ధి.

ఆదారభ్యం = అప్పట్నించి;

******

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here