ముద్రారాక్షసమ్ – తృతీయాఙ్కః – 2

0
3

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

చన్ద్ర:

అన్యచ్చ, కృతకకలహం కృత్వాస్వతన్త్రేణ కిఞ్చిత్కాలాన్తరం వ్యవహర్తవ్య మిత్యార్యాదేశః। స చ కథ మపి మయా పాతక మి వాభ్యుపగతః। అథవా శశ్వదార్యోపదేశ సంస్క్రియమాణ మతయః స దైవ స్వతన్త్రా వయమ్, కుతః , 

అర్థం:

అన్యత్+చ=మరొక విషయం, కృతక+కలహం+కృత్వా=ఉత్తుత్తిగా దెబ్బలాట పెట్తుకుని, కించిత్+కాల+అన్తరం=కొంతకాలంపాటు, స్వతన్త్రేణ=నీ అంతట నీవు, వ్యవహర్తవ్యమ్=వ్యవహారాలు నడపవలసి ఉంటుంది, ఇతి+ఆర్య+ఉపదేశః=అని అయ్యవారి (చాణక్యుని) బోధ! – స+చ=అదిన్నీ, కథమ్+అపి=ఎట్టకేలకు, పాతకమ్+ఇవ=పాపము వలె, మయా+అభ్యుపగతః=నా చేత అంగీకరించబడింది (నేను ఒప్పుకొన్నాను) – అథ+వా=అహాఁ, అలాగ కాదు; శశ్వత్+ఆర్య+ఉపదేశ+సంస్క్రియమాణ+మతయః+వయమ్=ఎల్లప్పుడు ఆర్య చాణక్యుని బోధలను ఆచరించడం విషయంలో మనసుపెట్టే మేము, సదా+ఏవ+స్వతన్త్రాః=ఎప్పటికీ స్వతంత్రులమే, కుతః=ఎందుకంటే…

శ్లోకం:

ఇహ విరచయన్ సాధ్వీం శిష్యః

క్రియాం న నివార్యతే;

త్యజతి తు యదా మార్గం మోహా

త్తదా గురు రఙ్కుశః,

పరతర మతః స్వాతన్త్ర్యేభ్యో

వయం హి పరాఙ్ముఖాః  (6)

అర్థం:

శిష్యః=శిష్యుడు, ఇహ=ఇక్కడ, సాధ్వీం+క్రియాం+విరచయన్=మంచిపని చేస్తూ (చేస్తున్నంత కాలం), న+నివార్యతే=(అనవసరంగా) నివారించబడడు. తు=మరి, యదా=ఎప్పుడైతే, మోహాత్=వ్యామోహానికి లోబడి, మార్గం=దారిని (మంచి నడవడిని), త్యజతి=విడిచిపెడతాడో, తదా=అప్పుడు, గురుః+అఙ్కుశః=గురువైన వాడు అంకుశం కాగలడు (ఏనుగును దారిలో పెట్టే సాధనం వలె కాగలడు), తస్మాత్ (కారణాత్)=అందువల్ల, వినయ+రుచయః=వినయ ప్రవర్తన యందు అభిరుచిగల, సన్తః=మంచివ్యక్తులు, సదా+ఏవ+నిరఞ్కుశాః=ఎల్లప్పుడూ స్వతంత్ర్యులే (గురువు అంకుశంగా పరిణమించవలసిన అవసరం లేని వారే). అతః+పరతరం=అంతకు మరీ మించినదేమంటే, వయం=మేము, స్వాతన్త్ర్యేభ్యః+పరాఙ్ముఖాః+హి= స్వతంత్రతను కోరడంలో (కోరవలసిరావడంలో) విముఖులమే కదా!

వ్యాఖ్య:

చంద్రగుప్తుడి ఈ వక్కణ – ‘నేను గుర్వాజ్ఞాబద్ధుడనే సుమా’ అని నిర్ధారిస్తోంది. చేయకూడని పనులు, ఏ వ్యామోహంలోనో పడి చేసే పరిస్థితి తలెత్తితే గురువు ఉన్నదెందుకు? సరిదిద్ది దారిలో పెట్టడానికే కదా! స్వతంత్రత అంటే విచ్చలవిడితనం కాదు కనుక గురువు కనుసన్నలలో ప్రవర్తించినంత మాత్రన తాను అస్వతంత్రునిగా భావించుకోడని – చంద్రగుప్తుడి తీర్మానం. ఇక్కడ వాడిన అంకుశ – నిరంకుశ పదాలు సార్థకాలు.

వృత్తం:

హరిణి – న – స – మ – ర – స – లగ – గణాలు.

చన్ద్ర:

(ప్రకాశమ్) ఆర్య వైహీనరే, సుగాఙ్గమార్గ మా దేశయ!

అర్థం:

(ప్రకాశమ్=పైకి), ఆర్య=అయ్యా, వైహీనరే=వైహీనరా!, సుగాఙ్గ+మార్గమ్+ఆదేశయ=సుగాంగ భవనానికి దారి చూపించు (నిర్దేశించు).

కఞ్చుకీ:

ఇత ఇతో దేవః, (నాట్యేన పరిక్రమ్య) అయం సుగాఙ్గ ప్రాసాదః, శనై రారోహతు దేవః।

అర్థం:

దేవః+ఇతః+ఇతః=దేవరా! ఇటు ఇటు!, (అంటూ – నాట్యేన+పరిక్రమ్య=నాటకీయంగా ముందుకు వెళ్ళి) అయం+సుగాఙ్గ+ప్రాసాదః=ఇదో, సుగాంగ భవనం, దేవః+శనైః+ఆరోహతు=దేవర మెల్లగా ఎక్కుదురు గాక!

రాజా:

(నాట్యే నారుహ్య, దిశోఽవలోక్య,) అహో శరత్సమయ సంభృత శోభానాం దిశా మతిరమణీయతా. కుతః…

అర్థం:

[నాట్యేన+ఆరుహ్య=నాటకీయంగా (భవనంపైకి ఎక్కి), దిశః+అవలోక్య=నాలుగు దిక్కుల చూసి], అహో=ఆహా! శరత్+సమయ+సంభృత+శోభానాం+దిశామ్=శరత్కాల వేళ  నిండైన వైభవం గల దిక్కుల, రమణీయతా=సౌందర్యం (ఎంత బాగున్నదో కద!), కుతః=ఎందుకంటే…

శ్లోకం:

శనైః శ్యానీభూతాః సితజలధర చ్ఛేద పులినాః

సమన్తా దాకీర్ణాః కలవిరుతిభిః సారసకులైః

చితా శ్చిత్రాకారై ర్నిశి వికచ నక్షత్ర కుముదైర్

నభస్తః స్యన్దన్తే సరిత ఇవ దీర్ఘా దశ దిశః (7)

అర్థం:

సిత+జలధర+ఛేద+పులినాః=చెదరిన తెల్లని మేఘాలనే ఇసుక దిబ్బలతోనూ, కల+విరుతిభిః+సమన్తాత్+సారసకులైః+ఆకీర్ణాః=మధుర ధ్వనులతో అంతటా వెదజల్లి ఉన్న బెగ్గురు పక్షులతోనూ, నిశి=రాత్రి వేళ, వికచ=విచ్చిన, నక్షత్ర+కుముదైః=నక్షత్రాలనే కలువపూలతో, చిత్రాకారైః+చితాః=వింత అకారాలతో వ్యాపించి ఉండగాను, నభస్తః=ఆకాశం నుంచి, దీర్ఘాఃదశ+దిశః=వ్యాపించి ఉన్న పది దిక్కులు, సరితః=నదులు, ఇవ=వలె, స్యన్దన్తే=జాలువారుతున్నాయి.

వ్యాఖ్య:

ఈ రాత్రివేళ కనిపించే పది దిక్కులు ఆకాశం నుంచి నదులు మాదిరిగా జాలువరుతున్నాయి.

నదుల్లో ఇసుకదిబ్బలుంటాయి – చెదిరిన తెల్ల మేఘాలే ఆ ఇసుక దిబ్బలు. నదుల దగ్గర బెగ్గురు పక్షులుండాలి కద! నలుదిక్కులా చెల్లాచెదురుగా వ్యాపించి, మధురధ్వనులు చేస్తూ బెగ్గురు పక్షులు ఎగురుతూనే ఉన్నాయి. నదులలో తెల్ల కలువలుండాలి. విచ్చుకున్న తెల్ల కలువల మాదిరి నక్షత్రాలు చిత్ర చిత్ర ఆకారాలతో ఉన్నాయి కద!

ఈ పోలికలన్నీ కలిసి – దిక్కులు ఆకాశం నుంచి నదులవలె భూమిపైకి జాలువారుతున్నాయి.

అలంకారం:

ఉపమేయోపమాలంకారం. – దిక్కులు నదుల మాదిరి ఉన్నాయి. నదులు దిక్కుల మాదిరి ఉన్నాయి (పర్యాయేణ ద్వయోస్త చ్చే దుపమేయోప మతా – అని కువలయానందం).

వృత్తం:

శిఖరిణి – య – మ – న – స – భ – లగ – గణాలు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here