[dropcap]అ[/dropcap]ది 1932 వ సంవత్సరం. శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారి షష్టిపూర్తి ఉత్సవం జరిగింది. 1920వ శతాబ్దం తొలి అర్ధభాగాన్ని తిరుపతి వెంకటకవులు.. వారిలో ప్రధానులైన వెంకటశాస్త్రిగారు పరిపాలించారు. అవధానాలతో, పాండవోద్యోగ విజయాల పద్యాలతో తెలుగుదేశాన్ని సమప్రసార ధారానతంగా తీర్చిదిద్ది దానికి వ్యావహారిక భాషా సౌందర్యాన్ని జతచేర్చి అందరి నోళ్లలో నాట్యం చేసేట్లు చేసిన వారు తిరుపతి వేంకటకవులు. ఆ షష్టిపూర్తి ఉత్సవంలో వారి శిష్యులైన పింగళి, కాటూరులు తాము రచించిన సౌందరనందాన్ని అంకితంచేశారు. సౌందరనందం భావకవిత్వానికి భరతవాక్యంచెప్పి నవ్య కవిత్వానికి ప్రారంభంచేసింది.
ప్రేయసి ప్రేమలోన కనిపించేది తీయని స్వర్గమొక్కటే
ధ్యేయముకాదు దీనులతిహీనులు మౌనతలున్ దరిద్ర నా
రాయణులేర్చుచుండిరి తదశ్రువులన్ తుడువంగ బొమ్ము నీ
ప్రేయసితోడ నీకు లభించును కోట్ల కొలంది స్వర్గముల్
ఈ పద్యంతో భావకవిత్వ పరిమితిని ఛేదించి భారత జాతీయోద్యమానికి ప్రధాన ప్రేరణమైన నూతన సమాజ నిర్మాణానికి అంకితమైన గాంధీ తత్వం తెలుగు కవిత్వంలోకి ప్రధానంగా ప్రవేశించింది. గాంధీ తత్వంలోని సర్వజీవ సమభావం, సంస్కృతి మూలాల అన్వేషణ, జాతీయ సమర స్ఫూర్తి ఇవన్నీ భావకవిత్వం తెచ్చిన ఖండకావ్య పరిమితులను ఛేదించి మహాకావ్యాలుగా రూపుదిద్దుకోవడం ప్రారంభమైంది. దీనిలోని దీనజన పక్షపాతం తరువాత అభ్యుదయ కవిత్వంగా ఆవిష్కృతమైంది. ఈ రెండూ ఒక చెట్టుకు పూచిన రెండు శాఖలే. ఒకటి నవ్య సంప్రదాయం. ఒకటి ప్రగతివాదం.
1932 ప్రాంతంలోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రకటించిన వేయి పుటల తెలుగు నవలకు సంబంధించిన పోటీ జరిగింది. ఈ పోటీలో విశ్వనాథ వేయి పడగలు, బాపిరాజు నారాయణరావు.. మొదలైన నవలలు వచ్చాయి. చలం మైదానం కూడా ఈ పోటీకి పంపినట్లు తెలియవస్తుంది. అప్పటికే తన రచనావైభవంతో తెలుగు సాహిత్యాన్ని ఆవరిస్తూ ఉన్న విశ్వనాథ.. గిరికుమారుని ప్రేమగీతాలు, ఏకవీర, నర్తనశాల, కిన్నెరసాని పాటలు, అనార్కలి, ఆంధ్ర ప్రశస్తి.. మొదలైన రచనలు ప్రక్రియా వైవిధ్యంతో, ప్రయోగ వైవిధ్యంతో వెలువడ్డాయి. ఏకవీర నవల 1931లో భారతిలో సీరియల్‌గా వచ్చింది. పరమత ప్రచారం వల్ల కలుగుతున్న నష్టాన్ని ఇది తీవ్రంగా ఖండించింది. ప్రేమ, వివాహాల మధ్య ఉండే సంఘర్షణను చిత్రించి.. ధర్మాన్ని అనుసరించి వీటి మధ్య సమన్వయాన్ని సాధించుకోకపోతే ఎలా విషాదం పాలవుతారో తెలియజేసింది. 1932-35 మధ్యలోనే మద్రాసులో తెలుగు మహాసభవారు విశ్వనాథను సత్కరించినప్పుడు.. ఆ సత్కార పత్రాన్ని ఆంధ్ర మహాపురుషులలో ఒకరైన కాశీనాథుని నాగేశ్వరరావు సమర్పించారు. క్రమంగా జాతీయోద్యమ ప్రాబల్యాన్ని తెలిపే శివభారతము, రాణాప్రతాపసింహ చరిత్ర ఒక దశాబ్దంకాలంలోనే వెలువడ్డాయి. విశ్వనాథ తన చిన్ననాటి నుంచి ఉన్న కోరికను తీర్చుకోవటానికి రామాయణ కల్పవృక్షం ప్రారంభించడం జరిగింది. నాడు భావుకులు ఆయనను కవి సమ్రాట్ అని పిలిచారు. బందర్లో విశ్వనాథ, పింగళి లక్ష్మీకాంతం ఉన్నరోజుల్లో వారిద్దరి మధ్య మిక్కిలి స్నేహం ఉండేది. పింగళివారిని తన అన్నగా.. గురువుగా విశ్వనాథ భావించేవారు. విశ్వనాథ నర్తనశాల రచించిన తర్వాత ఆ వ్రాత ప్రతిని చదివి భాసుని నాటకం వంటి నాటకాన్ని రచించావని పింగళివారు ప్రశంసించినారట.
చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారి శిష్యుల్లో వేటూరి ప్రభాకరశాస్త్రి, వేలూరు శివరామశాస్త్రీ, పీసపాటి చిదంబరశాస్త్రీ.. మొదలైన వైదికులు.. పింగళి కాటూరులు మొదలైన నియోగులు.. త్రిపురనేని రామస్వామి వంటి బ్రాహ్మణ వ్యతిరేకోద్యమ నాయకులు ఉన్నారు. తెలంగాణలో వైదికి నియోగి తగాదాలు మళ్లీ రెచ్చగొట్టిన నెల్లుట్ల రామకృష్ణామాత్యులూ ఉన్నారు. వెంకట శాస్త్రిగారి శిష్యులు వైదికులు.. నియోగులు అని చెప్పడంలో ఉద్దేశం 20వ శతాబ్దపు తొలి దశకాలలో కొప్పరపు కవులకు, రామకృష్ణ కవులకు వైదికి.. నియోగి భేదం ఆధారంగా తగాదా జరగటం. అలాగే ఆ రోజుల్లోనే జస్టిస్ పార్టీ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించింది. 1932లో జరిగిన మరొక విశేషం.. తెలంగాణ అస్తిత్వ పతాక అయిన గోలుకొండ కవుల సంచికను ప్రకటించే సంకల్పం సురవరం ప్రతాపరెడ్డి ద్వారా వ్యక్తమైంది. ఆ సంకల్పం వల్ల తెలంగాణ ప్రాంతంలో తెలుగు కవుల ఉనికి సంశయాస్పదంగా భావిస్తున్న ఆంధ్ర ప్రాంత ప్రజలకు వందలాది మంది కవుల ఉనికి ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది. తరువాత 1955 దాకా ప్రగతివాద కవిత్వం విజృంభించి ప్రవర్తించింది. త్రిపురనేని రామస్వామి గారి సూతపురాణం, భగవద్గీత, ఖూనీ, శంబూక వధ మొదలైన రచనలు.. ముద్దుకృష్ణ అశోకం మొదలైనవి బహుధా చర్చితమవుతూ వచ్చాయి. 1955 నాటికి వామపక్షం రాజకీయాలలో బలహీనపడటం, ప్రగతివాదం బలహీనపడటం.. శ్రీశ్రీలోని ప్రయోగవాద లక్షణం చాంచల్యాన్ని సూచించడం.. ఈ కారణాల వల్ల ప్రగతివాద కవిత్వం బలహీనమైంది. కానీ 1932లో ప్రారంభమైన ఆధునిక జాతీయ మహాకావ్య నిర్మాణం ఆధారంగా సాగిన నవ్య సంప్రదాయం అవిచ్ఛిన్నంగా సాగుతూనే వచ్చింది. 1949లో కృష్ణశాస్త్రి.. పాతికేళ్ల తెలుగు కవిత్వం అన్న వ్యాసంలో వెంకటశాస్త్రి నుంచి ఆరుద్ర దాకా తెలుగు కవులందరినీ ఒక వేదికమీదకు తెచ్చే సంస్థ కావాలని కోరుకోవడం జరిగింది. 1940 ఆ ప్రాంతం నుంచి విజయనగరానికి చెందిన దేవగుప్తాపు విశ్వేశ్వరరావు.. అఖిలాంధ్ర సాహిత్య పరిషత్తును స్థాపించే ప్రయత్నాలను అప్పుడప్పుడూ చేస్తూ వచ్చాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం.. ఆంధ్రప్రదేశ్ ఏర్పడబోయే సమయం ఆసన్నం కావడం.. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతపు కవుల కలయికలు పెరగడం.. ఒక ఆంధ్ర జాతీయ తత్త్వం స్పష్టాస్పష్టంగా రూపొందడం కారణంగా అఖిలాంధ్ర సాహిత్య పరిషత్తు ప్రయత్నం మళ్లీ ముందుకు వచ్చింది. ఆంధ్ర పత్రిక వారి ప్రోత్సాహంతో హైదరాబాద్లో పీవీ నరసింహరావు, దేవులపల్లి రామానుజరావు మొదలైన వారిని కలుపుకొని అఖిలాంధ్ర సాహిత్య పరిషత్ ఏర్పరుచవలెనని ఒక సన్నాహక సమావేశం జరిగింది. ఆంధ్ర పత్రికకు.. విశ్వనాథకు మధ్య ఉన్న దీర్ఘకాల అనుబంధం కారణంగా ఈ సంస్థ ఆయన అధ్వర్యంలో ఏర్పడుతుందేమోనన్న సందేహం సాహిత్య వర్గాల్లో కలిగింది. ఆంధ్రపత్రికకు, ఆంధ్రప్రభకు మధ్య ఉన్న స్పర్థల కారణంగా నార్ల వెంకటేశ్వరరావు దీని ప్రతిక్రియగా మరొక సంస్థను నిలిపేందుకు ప్రయత్నం ప్రారంభించారు. ఎస్‌బీపీ పట్టాభిరామారావు అప్పుడు విద్యాశాఖామంత్రి. అబ్బూరి రామకృష్ణారావు ఈ ప్రయత్నానికి దోహదం చేశారు. ఈ ముగ్గురి ప్రయత్నం కారణంగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1957 ఆగస్టు 7న ప్రారంభమైంది.
రాజకీయ చాణక్యంతో ఆంధ్రపత్రిక ప్రయత్నాన్ని బలహీనపర్చడానికి సాహిత్య అకాడమీకి వివాదరహితుడైన బెజవాడ గోపాలరెడ్డిని అధ్యక్షుడిగా.. విశ్వనాథ సత్యనారాయణను ఉపాధ్యక్షుడిగా ప్రతిపాదించారు. అది త్వరలోనే ప్రారంభ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించింది. అల్ప వ్యవధిలోనే సభ్యులను నామినేట్ చేసి సమావేశానికి రమ్మని ఆహ్వానించారు. హైదరాబాద్ రాష్ట్రపతి విడిదిలో ఉన్న డా. రాజేంద్రప్రసాద్‌తో ప్రారంభోత్సవం చేయించారు. కాళోజీ ఈ సందర్భంలో ఒక గేయం రాశాడు. ‘రామకృష్ణ పట్టాభిరామ చైత్యం.. రాష్ట్రేతర వేంకటేశ్వర మహాత్మ్యం’ అని ఈ ప్రారంభపు అత్యుత్సాహాన్ని వెక్కిరించాడు. విశ్వనాథను ఉపాధ్యక్షుడిగా ప్రతిపాదించిన కారణంగా ఆంధ్రపత్రిక విశ్వనాథకు ప్రతికూలమైంది. కొంతకాలంపాటు ఆంధ్రపత్రిక విశ్వనాథకు వ్యతిరేకమైన వ్యాసాలను కూడా ప్రచురించింది.
ఇలా ఉండగా భారత ప్రభుత్వం 1954 ప్రాంతాల్లో సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ, చిత్రకళ అకాడమీ అన్న మూడు సంస్థలను స్థాపించింది. సాహిత్య అకాడమీకి తొలుత అధ్యక్షుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉండేవారు. అప్పటికి ఆంధ్రదేశంలో ప్రముఖమైన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖాధిపతిగా గౌరవ ప్రతిష్ఠలు పొందిన పింగళి లక్ష్మీకాంతం గారు తెలుగు సాహిత్య ప్రతినిధిగా ఈ సంస్థలో ఉన్నారు. 1955 నుంచి సాహిత్య అకాడమీ ప్రతిభాషలోనూ ఒక ఉత్తమ గ్రంథానికి రూ. 5వేలు బహుమతిగా ప్రకటించాలని నిశ్చయించింది. అకాడమీ బహుమతి ప్రదానానికి రెండుమూడు స్థాయిలలో వడపోత పోసే లక్షణం ఉన్నది. ఆ పద్ధతిలో పురస్కారానికి తగిన గ్రంథాన్ని నిర్ణయంచేసేవారు. పింగళి లక్ష్మీకాంతం గారు అకాడమీ నిర్ణాయక మండలిలో ఉన్నంతకాలం తెలుగుసాహిత్యానికి సంబంధించిన బహుమానాలు సృజనాత్మక రచనలకు కానీ, విమర్శనాత్మక రచనలకు కానీ రాలేదని చెప్పాలి. ఒక అపవాదం తప్ప. మొదటి బహుమానానికి 1925 నుంచి 50 దాకా వచ్చిన రచనల నుంచి ఎన్నుకోవాలని పరిమితి పెట్టుకున్నట్లు నేను విన్నాను. ఈ కాలంలో మాలపల్లి నుండి మహాప్రస్థానం దాకా ఎన్నో అద్భుతమైన సృజనాత్మక రచనలు వచ్చాయి. తెలుగు సాహిత్యం వీటిని ఈనాటికి సగర్వంగా, శిరోధార్యంగా గౌరవిస్తుంది. అయితే విచిత్రమేమంటే ఆ కాల పరిమితిలో వచ్చిన ఐదు బహుమానాల్లో బాలాంత్రపు రజనీకాంతరావు రచించిన శతపత్ర సుందరి అనే గేయరచనకు బహుమానం వచ్చింది. సాహిత్య రంగంలో ప్రసిద్ధమైన ఎంకిపాటలు, కిన్నెరసాని పాటలు, శివతాండవం లాంటి రచనలుండగా వాటిని పక్కకు నెట్టడం దీనిని నెత్తికెక్కించుకోవడం ఎంత సంభావనీయమో చెప్పలేము. అవార్డులు వచ్చిన మిగిలిన నాలుగు రచనలు భారతీయ తత్వశాస్త్రము.. రాధాకృష్ణ పండితుని ఇండియన్ ఫిలాసఫీకి అనువాదము. రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర.. చిరంతనానందస్వామి రచన. పీఎస్ఆర్ అప్పారావు నాట్యశాస్త్ర అనువాదం. ఈ మూడింటిలోనూ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర అంత గొప్ప సాహిత్య రచనేమీ కాదు. రాధాకృష్ణన్ గ్రంథానువాదం కానీ, నాట్యశాస్త్రం కానీ.. మౌలిక తెలుగు సాహిత్య రచనలు కావు. వాటి విలువ వాటిదే. కాదనలేం. సాహిత్య రంగంలో గణనీయమైన గౌరవ స్థానం గల రచనలు తెలుగు సాహిత్య పరిధిలోనివి కావు. ఇక బహుమతి వచ్చింది.. సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర. ఇది మొదటి అవార్డు కూడా. సాహిత్య రచనల ద్వారా సమాజ స్వరూప స్వభావాలు.. దాని పరిణామము తెలుసుకోవడం కోసం చేసిన అద్భుతమైన ప్రయత్నం ఆంధ్రుల సాంఘిక చరిత్ర. చరిత్ర, సాంఘిక చరిత్ర అనేవి సాహిత్యాన్ని ఆకర వస్తువుగా గ్రహించేవి.. దాని ద్వారా నిర్ణయాలు చేసేవి కానీ, సాహిత్య రచనలుగా వస్తవా అన్నవి సందేహానికి ఆస్కారమిచ్చే అంశం. ఈ గ్రంథానికి బహుమతి వచ్చినప్పుడు నార్ల వెంకటేశ్వరరావు ప్రత్యేక సంపాదకీయం రాసినట్లు.. రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ ప్రత్యేకమైన లేఖలు రాసినట్లు తెలియవస్తున్నది. ఇవన్నీ చూస్తే అపారమైన ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సృజనశీలాన్ని, భావుకతని, రచయితల, కవుల ప్రతిభావ్యుత్పత్తులను కాదనే ప్రయత్నం జరిగిందేమోనని అనిపిస్తుంది. సాహిత్య అకాడమీ నిర్ణాయక సంఘంలో పింగళి లక్ష్మీకాంతం విరమించుకొన్న తర్వాత బెజవాడ గోపాలరెడ్డి ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత సృజనాత్మక సాహిత్య రచనలకు పురస్కారాలు రావడం ప్రారంభమైంది.
ఈ పురస్కారాలు రాకుండా చేసేందుకు కొందరు ప్రయత్నాలు కూడా జరిగినట్లుగా మనకు తెలియవస్తున్నది. మొదటి జ్ఞానపీఠ పురస్కారం విశ్వనాథవారి వేయి పడగలకు రావాల్సి ఉండగా చివరి నిమిషంలో తెలుగువారు ప్రయత్నించి దానికి రాకుండా చేశారు. వారి దృష్టిలో అది తిరోగామిశీలమైన రచన. 1958లో ఆధునిక భారతీయ సాహిత్యాలను గురించి సాహిత్య అకాడమీ ఒక పుస్తకం ప్రచురించింది. శ్రీ కోలవెన్ను రామకోటేశ్వరరావు తెలుగు సాహిత్యాన్ని గురించి రాస్తూ వేయిపడగలు నవల కాదని అన్నారు. అప్పట్నుంచీ ప్రగతివాదులలోనూ మద్దుకూరి చంద్రశేఖర్ రావు మొదలుగా అనేకమంది ఆ రచనను నిందిస్తూ వచ్చారు. అయినా అది ఆంధ్రపత్రికలో 1938-39లో సీరియల్‌గా వచ్చినప్పుడు.. దాన్ని చదివి తెలంగాణ అనే పత్రికలో దేవులపల్లి రామానుజరావు గారు ప్రశంసావ్యాసం రాశారు. దాన్ని చదివిన విశ్వనాథ ఆయన్ను మెచ్చుకుంటూ ఒక ఉత్తరం రాశారు. వేయిపడగల ప్రశస్తి ఏమిటంటే.. నిష్కారణమైన నిందలని తోసివేస్తూ.. దినదినమూ ఎదుగుతూ ఉన్నదట. దానిమీద వచ్చిన ఆక్షేపణలు రెండు. అది వర్ణాశ్రమ వ్యవస్థను బలపరుస్తున్నదని.. నేను ఒక పూర్వం ఒక వ్యాసంలో వర్ణాశ్రమ వైఫల్యాన్ని వేయిపడగలు చూపించిందని నిరూపించాను. మరొక ఆక్షేపణ జమీందారీ వ్యవస్థను బలపరుస్తున్నదని.. ఆ జమీందారీ వ్యవస్థలోని దోషాలను కూడా వేయిపడగలు చూపించినంత బలంగా మరే నవలైనా చూపించిందేమో నాకు తెలియదు. వేయిపడగలు 1939 ప్రాంతంలో మొదటి ప్రచురణ వస్తే.. ఇప్పటివరకు 30 ప్రచురణలకు పైగా మార్కెట్లోకి వస్తూనే ఉన్నది. లక్షన్నర కాపీలు పైగా పాఠకులు అందుకున్నారు. ఇటువంటి నవలను చంపే ప్రయత్నం జ్ఞానపీఠ పురస్కార సందర్భంలో జరిగింది. అయితే అప్పుడు కేంద్రమంత్రిగా ఉన్న డా.కరణ్ సింగ్‌ను మన తెలుగువారు.. నిర్ణాయక కమిటీలో వ్యతిరేకంగా వాదించేటట్లు ఒప్పించినారని నాకు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఒక విరోధాభాసం ఏమిటంటే, ఆ కరణ్ సింగ్ జ్ఞానపీఠ పురస్కార సమావేశానికి అధ్యక్షుడుగా ఉన్నప్పుడే విశ్వనాథ రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ బహుమతి లభించింది. నార్లకు విశ్వనాథతో ఉన్న విరోధం ఎప్పుడూ సజీవంగానే ఉన్నది. విశ్వనాథ మధ్యాక్కరలకు పురస్కారం లభించినప్పుడు ఆయన్ను గూర్చి ఒక వ్యాసం రాయమని నార్లను పేట్రియాట్ అనే పత్రికవాళ్లు అడిగితే.. దాన్లో ఆయన వైరుధ్యాన్ని దాచుకోలేదు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో కార్యవర్గ సభ్యులుగా వారిద్దరిమధ్య స్నేహం ఉన్నట్లుగా కనిపించినా.. అది పైపై మెరుగులుగానే ఉండింది. చివరికి విశ్వనాథ మరణించినప్పుడు ఆయనకు విరోధంగా తాను సంపాదకుడుగా ఉన్న ఆంధ్రజ్యోతిలో రెండు మూడు నెలల పాటు విరోధ యుద్ధం కొనసాగించాడు. అదంతా వ్యర్థమైన ప్రయత్నంగానే తర్వాతి సాహిత్య చరిత్ర నిరూపించింది. ఇదంతా చెప్పడమెందుకంటే.. వ్యక్తులకు అంతఃకరణ శుద్ధి లేనప్పుడు సాహిత్యం వంటి సాంస్కృతిక రంగాల్లో ఎంత మహాపచారం జరుగుతుందో మనం ముందు ఊహించలేము. కాలం నిజాన్ని తేల్చడానికి కొంత వ్యవధి తీసుకుంటుంది కానీ ఆ మధ్య భ్రాంతచిత్తంతో అనేకమంది అపమార్గంలో సంచరిస్తారు.