[box type=’note’ fontsize=’16’] “జీవితం ఒక పుస్తకం అనుకుంటే టీనేజ్ రోజులు అందులో అందమైన మొదటి పేజీల్లాంటివి” అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మి “రంగుల హేల” కాలమ్‌లో. [/box]
[dropcap]బం[/dropcap]గారు బాల్యం గొప్పదని అంతా అంటారు. కానీ తెలిసీ తెలియని ఆ వయసులో అమాయకత్వం తప్ప మరేమీ ఉండదు. ఆ నాటి జ్ఞాపకాలు కూడా స్పష్టంగా కాకుండా అల్లిబిల్లిగా ఉంటాయి. అప్పటి సంగతులేవీ మనకి పూర్తిగా వివరంగా గుర్తు ఉండవు ముక్కలు ముక్కలుగా తప్ప.
ఇంటర్, డిగ్రీ చదివే రోజులు బహుశా అవి కౌమార దశ కావచ్చు. అవే బంగారు రోజులు. మన జీవిత చరిత్రలో హైలైట్ చేయదగ్గ సమయం అది మాత్రమే! హై స్కూల్ చదువుల్లో ఏదో బట్టీ కొట్టడం తప్ప అవేవో విజ్ఞానానికి దర్వాజాలని అనుకునేంత తెలివి అప్పట్లో ఉండదు.
కాలేజ్‌లో చేరగానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన పండితులు, పీహెచ్‌డీలు చేసిన గురువులు నడిచే విజ్ఞానపు గనుల్లా క్లాస్ కొచ్చి పాఠం చెబుతుంటే అచ్చెరువుగా ఉంటుంది. “ఏమే అల్లూరీ ఇలా రావే! అంతంత పెద్ద జడలు జుట్టేనా?” అనేంత చనువుగా మాట్లాడే హై స్కూల్ మాష్టార్ల స్థానే “దీనర్ధం మీరు చెప్పండి?” అని మనల్ని మీరు అని గౌరవం ఇచ్చి మాట్లాడే మాష్టార్లు రాగానే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతాం. అందరు లెక్చరర్లూ అలాగే, మీరు అనేటప్పటికి కాస్త పెద్దరికం కాస్త గంభీరత్వం అనుకోకుండా వస్తాయి మనకి.
జీవితం ఒక పుస్తకం అనుకుంటే టీనేజ్ రోజులు అందులో అందమైన మొదటి పేజీల్లాంటివి. కొత్త పుస్తకం మొదట్లో అందంగా గుండ్రంగా రాస్తామే అలా ఉంటాయవి. ఆ కాలపు రంగు రంగుల ఆశలూ, ఆశయాలూ కలగలిసి తియ్యని జ్ఞాపకాలుగా, చక్కని రవివర్మ చిత్రాల్లా జీవం ఒలుకుతూ సదా మదిలో నిలిచి ఉండిపోతాయి.
టెన్త్ తరువాత చదువు మానేసిన చాలామందిని దాటి మనం కాలేజ్‌లో చేరాం అంటే గొప్ప గర్వంగా ఉండేది. ఒక సరస్వతీదేవి లోకంలోకి అడుగు పెట్టినట్టుండేది. కొత్త లంగా వోణీ వేసుకున్నరోజే వర్షం వచ్చేది. సైకిల్ స్కిడ్ అయ్యేది. బట్టలకు ఇసక అంటుకునేది. ఆ వర్షంలో తడిచి కష్టపడి కాలేజ్‌కి వెళ్లిన రోజు హాజరు తక్కువుందని సెలవిచ్చేవారు. ‘అబ్బో! చాలా పెద్ద వర్షం! వెళ్లడం కష్టం! వెళ్లినా క్లాస్‌లు జరగవు’ అనేస్కుని ముసుగెట్టి పడుకున్నరోజు సుబ్బరంగా కాలేజీ నడిచేది. ఆ రోజు జరిగిపోయిన క్లాస్‌ల తాలూకు నోట్స్ అందరినీ అడుక్కుని సేకరించేటప్పటికి వారం పట్టేది. అదో సరదా శ్రమ.
తెలుగు సార్ పానుగంటి సాక్షి వ్యాసం – సారంగధర నాటక ప్రదర్శనం పాఠం చెబుతుంటే పగలబడి నవ్వేవాళ్ళం. ఆయన, నోటికి పూర్తిగా వచ్చిన శ్రీశ్రీ – మహాప్రస్థానం ఆవేశంగా ఆగకుండా చదువుతుంటే ఒళ్ళు పులకరించేది. కన్యాశుల్కం నాటకం డైలాగులు ఆయనే ఆశువుగా చెబుతుంటే అబ్బురంగా అనిపించేది. మాష్టార్ని అడిగే ప్రశ్నలు చొప్పదంటుగా ఉండకూడని బోలెడంత ఎక్సర్‌సైజు చేసి అడిగేవాళ్ళం. అయినా లెక్చరర్స్ వాటిని చెణుకులుగా మార్చి అందరినీ నవ్వించి ఆఖర్న మంచి ప్రశ్నలు అడిగారు అని మెచ్చుకునేవారు.
జువాలజీ సార్ డార్విన్ పరిణామ క్రమం చెప్పినా, బొద్దింకని కోసి చూపించినా, బోటనీ మాస్టారు పూ రేకుల అమరిక లోని స్టైల్స్ చెబుతూ మొక్కల కాండాల క్రాస్ సెక్షన్లను మైక్రోస్కోప్‌లో చూపించినా ముచ్చటగా ఉండేది. ఇప్పుడు రోజూ చంద్రయాన్-2 గురించి చదువుతుంటే విశ్వ రహస్యాలను వివరించే ఖగోళ శాస్త్రాన్ని చర్చించే ఫిజిక్స్ వెంకటపతిరాజు సార్ గుర్తొస్తుంటారు. కెమిస్ట్రీ సత్యనారాయణ సార్ చెప్పే ప్రాణాధారమైన రసాయన శాస్త్రాన్ని వింటుంటే ఆనందంగా ఉండేది. కీట్స్ , షెల్లీల రొమాంటిక్ పోయెట్రీ గురించి ఇంగ్లీష్ సార్ వివరిస్తుంటే ఆశ్చర్యమే ఆశ్చర్యం. ఇది కాక బి.ఏ. క్లాస్ లో వైస్ ప్రిన్సిపాల్ గారు షేక్స్‌పియర్ డ్రామా లోని పాత్రల్ని అభినయిస్తుంటే క్లాస్ బైట నిలబడి ఏమీ అర్ధం కాకపోయినా సంతోషంగా చూసేవాళ్ళం. ఇంకా ఖాళీ అవర్‌లో తెలుగు మాస్టారు ఏ క్లాస్‌లో కనబడితే ఆ క్లాస్‌లో రిక్వెస్ట్ చేసి వెళ్లి కూర్చు ని వినేవాళ్ళం. తెలుగు సాహిత్యం అంటే అంత ప్రేమ.
ఏ సబ్జెక్టు సార్ పాఠం వింటుంటే ఆ సబ్జెక్టులో పీ.జీ. చేసి పీ.హెచ్ డీ. చేసేయాలని ఉవ్విళ్ళూరేవాళ్ళం. అప్పటి లెక్చరర్స్ ఆ సబ్జక్ట్ ల మీద అంత ఉత్సుకత కలిగేటట్టుగా చెప్పేవారు. ఇక మా ఊరి లైబ్రరీకి కొత్తగా వచ్చిన నవల్స్ అన్నీ గబ గబా చదివేసి నేస్తాలతో చర్చలు. ఆ నవలా పాత్రలు ఇప్పటికీ గుర్తే. అసలప్పటి జీవితమే మనది. అచ్చంగా బతికిన రోజులవి. కొత్త సినిమా మొదటి రోజే మొదటి షో చూడాలని ఉత్కంఠ. ఆ సినిమా కధలు మన జీవితాలన్నట్టూ, ఆ హీరో హీరోయిన్ మన ఆప్త మిత్రులన్నట్టూ భావించే వాళ్ళం. ఇప్పటికీ జయప్రదా, జయసుధా, చిరంజీవి, కమల్ హాసన్ మా క్లాస్‌మేట్ లన్నంత దగ్గరితనం. ఆ సినిమాలూ, నవలలూ, కాలేజీ లెక్చరర్స్, టీనేజీ మిత్రులూ, మన ఊరూ, గోదావరీ కదంబంలో ఒదిగిన రంగు రంగుల పూలు సుమా!
నిజంగా బతికిన రోజులవే. పూల తోటలోని విరబూసిన పూల మొక్కల్లా గాలికి దిలాసాగా ఊగేవాళ్ళం. ఇంట్లో పరిస్థితేంటి? మనిష్టం వచ్చిన చదువు మనల్ని చదవనిస్తారా? పెళ్లి చేసి సాగనంపుతారా? అన్న ఆలోచనలే రాని ఉత్సాహం అది. బాగా చదివెయ్యాలి. ఫస్ట్ క్లాస్ తెచ్చుకుని ఇంకా పై చదువులు చదివెయ్యాలి. అదే ఆకాంక్ష, ధోరణి తప్ప మరో ఆలోచనే లేదు.
ఆరంజి రంగుల సంజెవేళ ఆకాశంలో మబ్బుల కిందుగా తేలి యాడుతూ తిరిగే పూల రథంలాంటి జీవితం అది. ఆ జ్ఞాపకాలే జీవితంలో ఎప్పటికీ మన తలపుల్లో వాడకుండా నిలిచి ఉండే కలర్‌ఫుల్ కదంబం. మీరు కూడా ఒకసారి మీ టీనేజీని గుర్తు చేసుకుని ఆ రంగు రంగుల పూలమాలని తలచుకోండి.