ఎండమావులు-1

0
2

[box type=’note’ fontsize=’16’] గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘ఎండమావులు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది మొదటి భాగం. [/box]

1

[dropcap]మి[/dropcap]ట్ట మధ్యాహ్న సమయం. శీతాకాలం ఎండ అంత వేడిగా లేదు, అంత చల్లగా లేదు. సమశీతోష్ణస్థితిలో ఉంది వాతావరణం. ప్రియుని రాక కోసం ఎదురుచూస్తున్న అభిసారికలా, వెన్నెల కోసం ఎదురు చూస్తున్న చకోర పక్షిలా, స్వాతివాన వర్షపు బిందువు కోసం ఎదురు చూస్తున్న ముత్యపు చిప్పలా, మేఘుడు నుండి జారిపడబోతున్న వర్షపు బిందువు కోసం ఆశగా – ఆత్రుతగా నింగివేపు చూస్తున్న చాతక పక్షిలా ప్లాటుఫారం మీద ప్రయాణికులు రైలుబండి కోసం ఎదురు చూస్తున్నారు.

ప్రయాణికుల సహనాన్ని పరిక్షిస్తోందా అన్నట్టు ఆ బండి రెండు గంటలు లేటని ఎనౌన్సుమెంటు వినబడింది. జనాలు ఉస్సూరుమంటూ కూలబడ్డారు, బెంచీలమీద, ఎక్కడ స్థలముంటే అక్కడ.

అలా కూర్చున్న వాళ్లలో సారధి, సుమిత్ర కూడా ఉన్నారు. ‘ఇంత హైరాన పడ్తూ ఈ ప్రయాణం అవసరమా? తనకయితే వెళ్లడం అసలిష్టం లేదు. భర్తమాట కాదనలేక ఇలా బయలుదేరింది’ ఆలోచిస్తోంది సుమిత్ర,

‘ఎంత కాదనుకున్నా ఆ బంధం విడదీయనిది, ఆ బంధానికి కట్టుబడే సుమిత్ర ఏ వ్యక్తినయితే అసహ్యించుకుంటుందో – ఏ వ్యక్తి పేరు ఉచ్చరించడానికి ఇష్టపడదో ఆ వ్యక్తి అంతిమ కోరిక తీర్చడానికి తామిద్దరూ ఇలా బయలుదేరారు’ ఆలోచిస్తున్నాడు సారధి.

ఆమె ముఖ కవళికలబట్టి తను చేస్తున్న పని ఆమెకిష్టం లేదని తెలుస్తోంది. గాఢంగా నిట్టూర్పు విడిచాడాయన.

తను జీవితంలో ఏం సుఖపడ్డాడు? సుమిత్రని ఏం సుఖపెట్టాడు? బాధ్యతలు – బాధ్యతలు. అవసరం లేని బాధ్యతలు. ‘నీవు తప్ప మాకు సహాయం చేసేవాళ్ళు లేరం’టే అన్నదమ్ముల పిల్లల చదువులు, మిగతా పెళ్ళి, పేరంటాళ్ళు అన్ని బాధ్యతలు తన మీద వేసుకున్నాడు. అయితే చివరికి మిగిలిందేంటి? నిష్ఠూరాలూ – నిందలు. అవసరాలు తీరిపోయిన తరువాత అందరూ ముఖం చాటేసేరు.

అదంతా ఎందుకు? తన రక్తం పంచుకుని పుట్టిన కొడుకే తనని, తన భావాల్ని అర్థం చేసుకోలేదు. అపార్థం చేసుకుని తమ సహకారం అందించలేదు. కొడుకు ప్రవర్తనకి తను మనస్తాపానికి గురయ్యాడు. ఎంతేనా బిడ్డల్ని కంటాం కాని వాళ్ల తల రాతల్ని రాయలేం అని బాధగా అనుకున్నాడు. తనని తాను నిందించుకున్నాడు. తన కొడుకు తనని బాగా అర్థం చేసుకోలేదని కొడుకుమీద జాలిపడేవాడు, బాధపడేవాడు.

భర్త ముఖం మీద భావాల్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేస్తున్న సుమిత్ర సానుభూతిగా అతనివైపు చూసింది. అతని చేతిని గట్టిగా పట్టుకుంది.

ఆమె స్పర్శకి ఉలిక్కిపడిన సారధి ఆలోచనా ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టాడు.

“ఏంటి సుమిత్రా!”

“ఇప్పుడు కూడా ఆలోచనలే? మీ ఆలోచనలకి ఆనకట్టవేయండి” చిన్నగా నవ్వుతూ అంది సుమిత్ర.

‘తనని తేలికపరచడానికే సుమిత్ర అలా నవ్వింది కాని ఆ నవ్వు వెనక ఉన్న విషాదం తనని మరింత కలవరపరుస్తోంది’ అనుకున్నాడు అతను.

ప్రయాణికుల సహనాన్ని పరిక్షించి – పరిక్షించి రాకాసిలా పెడబొబ్బలు పెడ్తూ ఎట్టకేలకు రైలు ప్లాటుఫారం మీద వచ్చి ఆగింది. రద్దీ ఆరంభమయింది. దిగే జనాల్సి దిగనీయకుండా ఎక్కే జనాల తోపులాట ఆరంభమయింది. కూలీలు బండిలోకి సామాన్లు ఎక్కిస్తున్నారు. తినుబండారాలు అమ్మేవాళ్ళు వేదం వల్లె వేస్తున్న విద్యార్థుల్లా గట్టిగా అరుస్తున్నారు. తమ సరకులు అమ్ముతున్నారు.

బ్రీఫ్ కేసు పట్టుకుని సారధి తను రిజర్వు చేసుకున్న కంపార్టుమెంటు వేపు అడుగు లేస్తుంటే అతని చేయిపట్టుకుని సుమిత్ర వెనకాలే నడుస్తోంది. ‘కష్టంలోనూ-సుఖంలోనూ నేనూ ఇలాగే ఇప్పటి వరకూ ఉన్నాను. భవిష్యత్తులో కూడా మీ వెంట ఉంటాను’ అన్నట్టు ఆమె అతని వెనక నడుస్తోంది.

రిజర్వేషను కంపార్టుమెంటులో తమకు కేటాయించిన సీట్లలో ఆసీనులయ్యారు. ‘రిజర్వేషను ఉండబట్టి ప్రయాణం చేయగలుతున్నాం. లేకపోతే ఎంత కష్టమయ్యేదో?’ ఆలోచిస్తోంది సుమిత్ర..

బండి బయలుదేరగానే సారది దృష్టి పరుగు పెడుతున్న వృక్షసంపద – కొండలు – గుట్టలు వంక రెప్ప వేయకుండా నిల్చింది. అలా ప్రకృతిని అవలోకిస్తూ ఆలోచిస్తోంది అతని మస్తిష్కం.

‘ఈయనికి ఏ మాత్రం అవకాశం వచ్చినా ఆలోచన్లతోనే కడుపు నింపుకుంటారు’ అనుకుంది సుమిత్ర,

మానవ స్వభావమే విచిత్రమయినది. తనకే మాత్రం అవకాశమొచ్చినా ఆలోచన్లతో సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. ఎంత ఆలోచించినా పరిస్థితుల్లో మార్పు ఉండదు. మనుగడ మారదు. బ్రతుకు బాటలో కొత్తదనం కనిపించదు.

భవిష్యత్ ఊహించడానికే భయంగా ఉందతనికి. వర్తమానం అతని మనస్సుని గజిబిజిగా చేస్తూ ఉంటే భూతకాల స్మృతులు మానిన గాయన్ని కెలికినట్లనిపిస్తోంది.

సుమిత్ర వేపు అపురూపంగా చూశాడు సారధి. విరక్తి – విసుగుదలతో, అవమానంతో దహించుబోతున్న తన జీవితంలో సుమిత్ర ప్రవేశించింది. తనలో ఉన్న భావాల్ని మార్చి తన్నో మనిషిగా చేసింది. హాలాహలాన్ని అమృతంగా మార్చి తనకీ, సుధాకర్‌కి పంచి ఇచ్చింది. ఆదర్శవంతురాలైన భార్యగా తనకి సేవచేసే, సుధాకర్‍కి అమృతమయమైన తన మాతృప్రేమను – వాత్సల్యాన్ని – అనురాగాన్ని పంచి ఇచ్చింది.

బొగ్గు నలుసు అతని కంట్లో పడి కళ్ళు గర గరలాడాయి. కండువా తీసి అదిరి పెట్టుకున్నాడు. పటాపంచలయిన ఆలోచన్లు తిరిగి అతడ్ని చట్టుముడుతున్నాయి.

2

“మాష్టారూ!”

ఆ పిలుపుకి తన చూపు ఆమె వేపు నిల్పి మరింత నిశితంగా ఆమెను పరికిస్తూ ఏఁటన్నట్లు చూశాడు సారధి.

“మా చెల్లెలు మెట్రికేల్యేషను పరిక్షకి ప్రైవేటుగా అపియర్ అవుతోంది. తెలియని పాఠాలు చెప్పాలి ప్లీజ్” అభ్యర్థిస్తున్నట్లు అడిగింది ఆమె.

ఆమె అందమైన కళ్లవేపు చూస్తున్న అతనికి ఆమె అభ్యర్ధన కాదనడానికి మనస్కరించలేదు.

“అలాగే పంపండి” అన్నాడు తన చూపులు మరల్చుకుని.

తల ప్రక్కకి త్రిప్పి జూచిన సారధి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఆ ఉలికిపాటుతో సహా అతని వదనంపై అసహ్యం – క్రోధ ఛాయలు ఒక్కసారి లాస్యమాడాయి.

“ఏఁటో తన తండ్రి సత్యానికీ బుద్ధి” అనుకుంటూ విసుక్కున్నాడు.

“నేనాతని పుత్రరత్నాన్ని వల్లో వేసుకుంటానని కాబోలు అలా మింగేసినట్టు చూస్తున్నాడు ఈ ముసలి నక్క” కసిగా అనుకుంది సరస్వతి.

“ఏమేవ్! మనం ఈ ఇల్లు మార్చేయాలి. మనవాడ్ని వల్లో వేసుకోడానికి ప్రయత్నిస్తోంది ఆ వగలాడి” తండ్రి మాటలు సారధి చెవుల్లో పడున్నాయి.

“అబ్బా! ఏంటండీ! వివరంగా చెప్పండి, ఎవరా వగలాడి?” తల్లి ప్రశ్నల పరంపర కూడా అతనికి స్పష్టంగా వినబడుతోంది.

“అదేనే ఆ సంగీతం మాష్టారు కూతురు సరస్వతి లేదూ…..?” అతను వాక్యం పూర్తి చేయకుండానే తల్లి మధ్యలోనే అందుకుంది..

“చాల్లెండి, సరస్వతి మంచిపిల్ల, అలాంటి వెకిలితనం కనబర్చే మనిషికాదు. మీరు అపోహాబడున్నారు” భర్త మాటలు ఖండిస్తూ సరస్వతి మీద తనకున్న సధాభిప్రాయం తెలియజేస్తూ అంది తల్లి.

తల్లి మాటలకి సారధి మానసవీణ ఉప్పొంగిపోయి ఆమెకి కృతజ్ఞతలు మనస్సులోనే చెప్పుకున్నాడు.

“ఒరే అబ్బాయ్! ఆ సరస్వతి నీతో ఏఁ మాట్లాడిందిరా?” అన్నాడు తండ్రి సారధితో ఉండబట్టలేక,

వయస్సులో ఉన్న ఇద్దరూ ఏఁ మాట్లాడుకుంటారంటే సాధారణంగా ఏఁ మాట్లాడుకుంటారు? అయస్కాంత శక్తికి ఆకర్షింపబడిన వస్తువు పురుషుడు అయితే ఆ అయస్కాంత శక్తి స్త్రీ, పురుషుడు స్త్రీ యడల ఆకర్షింపబడ్డాడు అని ఆ ముసలాయన భావన.

“వాళ్ళ చెల్లెలు మెట్రికేల్యేషను పరిక్షకి ప్రిపేరు అవుతోందిట, తెలియని పాఠాలు చెప్పమంది” తండ్రి మీద కలిగిన అసహ్య భావాన్ని కనబర్చనీయకుండా అన్నాడు సారధి.

“నేను చెప్పేనా, సరస్వతి మంచి పిల్లని, మీదంతా చాదస్తం. మీరు వట్టి అనుమాన మనిషి” తల్లి అంది.

“ఊఁ…!” భార్యవేపు తీవ్రంగా చూసి అచటి నుండి కదలిపోయాడు తండ్రి.

సంగీతం మాష్టారు సుందర్రామయ్యకి ముచ్చటగా ముగ్గురూ ఆడపిల్లలే. మధ్యతరగతి మనిషికి ప్రతిరూపమయిన ఇతను ఇంటింటికి వెళ్ళి సంగీతపాఠాలు చెప్పుకుంటూ – సంగీత కాలేజీలో కూడా ఉద్యోగం చేస్తూ వచ్చిన డబ్బుతో గుట్టుగా జీవితం గడిపేస్తున్నాడు.

పడుకోడానికి పట్టుపరుపులు – విలువైన వస్త్రాలు లేకపోయినా తనకొచ్చిన ఆదాయంతో పస్తులతో పడుకోకుండా ఎలాగో రోజులు నెట్టుకొస్తున్నాడాయన,

వారసత్వంగా అతని పెద్దకూతురు సరస్వతికి మిగతా ఇద్దరు కూతుళ్ళకన్నా తొందరగా తండ్రి విద్య అలవడింది.

విధి మానవ జీవితాల్లో ఆటలాడుకుంటుంది. విధి చేతిలో మనం కీలుబొమ్మలం, ఆ విధి మనల్ని తన ఇష్టం వచ్చినట్లు ఆటలాడిస్తుంది. విధి వక్రీభవించి అదృష్ట జాతకుడిగా చలామణి అవలేకపోయిన సుందర్రామయ్య పక్షవాత రోగంతో మంచం మీద పడ్డాడు. కుడికాలు – కుడిచెయ్యి పడిపోయాయి. అవి తమపని నెరవేర్చటంలో అసమర్థులయ్యాయి.

అటువంటి సమయంలో సరస్వతి ఆ ఇంటికి పెద్ద దిక్కు అయ్యింది. తండ్రి దగ్గర ఆమె నేర్చుకున్న సంగీత పాఠాలే ఆ కుటుంబానికి జీవనాధారమయ్యాయి.

సరస్వతి చదువుకున్నది. అందమైనది, అయితే కొన్ని అందమైన పూలమొక్కలకి ముళ్ళు ఉన్నట్లే అందమైన సరస్వతిలో ఒక్కటే ఒక్కలోపం, అదే ఆమె చంచల స్వభావం. నిలకడలేని మనస్సు, పై పై మెరుగులకి తలవొంచే స్వభావం, దాని ఫలితం ఆలోచించలేని, దూరదృష్టిలేని తొందరపాటు మనిషి,

అదొక పెద్ద భవంతి, అదే అది ఒక పురాతన భవనం అంటే సరిపోతుంది. అందులో ఐదారు కుటుంబాల వాళ్లు అద్దెకుంటున్నారు. అలాంటి కుటుంబాల్లో సారధి కుటుంబం. సరస్వతి కుటుంబం కూడా ఉన్నాయి.

సారధి అన్నయ్య పెళ్లవగానే భార్యని తీసుకుని వేరింటి కాపురం పెట్టాడు. రెండో వాడు సారధి, మూడోవాడు సాయి. చెల్లెలు సుమతి. వీళ్ళే ఆ కుటుంబ సభ్యులు.

సారధి హైస్కూల్లో లెక్కలు మాష్టారయితే సాయి డిగ్రీ చదువుతున్నాడు. సుమతి డిగ్రీ పూర్తిచేసింది, సరస్వతి, సుమతి ఒకే ఈడు వాళ్ళు కావడం వలన ఒకే దగ్గర ఉండటం వలన ఇట్టే మంచి స్నేహితురాళ్ళు అయిపోయారు.

ఒకరిమీద మరొకరికి సానుభూతి. జీవితంలో తనకి ఎలాగూ పెళ్ళి అవదు, తన చెల్లెళ్లకి పెళ్ళిచేసే స్తోమత తన రోగిష్టి తండ్రికి లేదు.

‘సుమతి లక్షణమైన పిల్ల. పైపెచ్చు చాలా బాగుంటుంది. ఇన్ని సంబంధాలు ఆమెకి ఎందుకు తప్పిపోతున్నాయి?’ ఆలోచిస్తూ సుమతి మీద సానుభూతి చూపిస్తుంది సరస్వతి.

‘పాపం ఆడపిల్లల తండ్రికి పెద్దకూతురు సరస్వతి, అందులో తండ్రి రోగిష్టి మనిషి, మంచాన పడ్డాడు, ఆ ఇంటికి సరస్వతే దిక్కు. ఆమె జీవితం అడవిగాచిన వెన్నెల అవల్సిందేనా? కర్పూరంలా ఆమె జీవితం హరించుకు పోవడమేనా?’ ఆలోచిస్తుంటుంది సుమతి. సరస్వతి గురించి ఆమె మీద సానుభూతి మనస్సులో రోజు రోజుకి పెరుగుతోంది.

సరస్వతి సుమతి దగ్గరకి రావడం చాలా సార్లు చూశాడు సారధి. ముఖ పరిచయం మాత్రమే ఉంది.

‘సరస్వతి ఎంత అందంగా ఉంది? ఆ అందమే ఆమెకు ఆయుధం, ఆస్తి కూడా, మొగాళ్ళను పిచ్చెక్కించే అందం ఆమెది’ అనుకుంటాడు సారధి సరస్వతి గురించి మనస్సులో.

3

ఆ పురాతన భవనంలో చిన్నపూల తోట ఉంది. వివిధ రకాల పండ్ల చెట్లు – పూలమొక్కలు ఉన్నాయి ఆ తోటలో, పెరట్లో బాదం చెట్టు క్రింద కుర్చీవేసుకుని తాను మరునాడు క్లాసులో చెప్పబోయే పాఠానికి టీచింగ్ నోటు వ్రాస్తున్నాడు సారధి.

పెరట్లో సన్నజాజి – కనకాంబరం పూలు కోయడానికి వచ్చారు సుమతి, సరస్వతి. అంతవరకూ గలగలమని శబ్దం చేస్తూ ప్రవహించిన సెలయేరులా పకపక నవ్యలో ఆ పరిసరాల్లోకి అడుగు పెట్టిన ఆ ఇద్దరూ సారధిని చూసి ఒక్కసారిగా గంభీరంగా మారిపోయి మౌనంగా వెళ్ళి పూలు కోస్తున్నారు.

వారి గుసగుసలు అతని చెవికి సోకుతున్నాయి.

వ్రాస్తున్నవాడల్లా ఒక్కసారి తల పైకెత్తి చూశాడు. అదే సమయంలో సరస్వతి కూడా అతడ్ని చూసింది. నాలుగు కళ్ళు కల్సుకున్నాయి. ఇద్దరి పెదవుల పైన చిరునవ్వు కదలాడింది. పలకరింపును సూచిస్తూ, ఓరకంట ఇద్దర్నీ గమనిస్తున్న సుమతి ‘ఈ ఇద్దరూ ప్రేమపిచ్చిలో పడ్డట్టుందే!’ అనుకుంటూ చిన్నగా నవ్వుకుంది.

పూలు కోసిన తరువాత వెళ్లబోతున్న సరస్వతి సారధితో “మా చెల్లెలు ఎలా చదువుతోంది?” కల్పించుకుని మాట్లాడింది.

“పరవాలేదు, తెలివైన అమ్మాయి” అన్నాడు సారధి. సుమతి వాళ్లకి ఏకాంతం కల్పిస్తూ అక్కడి నుండి జారుకుంది.

“అడగ్గానే నా విన్నపం మన్నించి మా చెల్లెలకి చదువు చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియటం లేదు” సరస్వతి అంది..

“చెప్పడం మానేయండి” నవ్వుతూ అంటున్న అతని చమత్కార మాటలకి ఆమె కూడా నవ్వింది.

“దీనిలో నేను చేసిన గొప్ప పనేంటో చెప్పండి. నాకొచ్చిన విద్యాదానం చేస్తున్నాను. అలా చేయడంలో నాకు తృప్తి లభిస్తోంది.”

“విద్యను వ్యాపార వస్తువుగా చేసుకుంటున్న ఈ రోజుల్లో మీలాంటి వాళ్లుండడం అరుదు మాష్టారు!” అతని వంక ప్రశంసా పూర్వకంగా చూస్తూ అంది సరస్వతి.

“కూర్చోండి, అలా నిలబడిపోయారు” ఎదురుగా మల్లెపందిరి సమీపంలో ఉన్న బండరాతి మీద చతికిలబడిందామె.

“నేటి నాగరిక-యాంత్రిక-వ్యాపార యుగంలో విద్యకు విలువైపోయింది. సరస్వతి గారూ!”

“నాకూ అలాగే అనిపిస్తోంది” తల పైకెత్తి అతని వంకచూస్తూ అంది సరస్వతి. వాళ్ళకి తెలియకుండానే ఒకరిమీద మరొకరికి ఆకర్షణ భావం కలుగుతోంది. తన్మయత్వంగా ఒకర్ని మరొకరు వీక్షించుకుంటున్నారు.

“ఏఁటలా ఆలోచిస్తున్నారు?”

తనూ ఆ పనే చేస్తున్నా ఆలోచనా ప్రపంచం నుండి చప్పున బయటకు పడ్డ అతను అన్నాడు.

“అబ్బే ఏఁలేదు.” తడబడింది సరస్వతి

“మీ త్యాగానికి చాలా సంతోషిస్తున్నాను. ఆడపిల్లయినప్పటికి ఓ మగ పిల్లవాడిలా బజారున పడబోయిన కుటుంబాన్ని ఆదుకుని శ్రమపడున్నారు.”

“దీనిలో త్యాగమేముంది నన్ను పొగిడేటంత? జన్మనిచ్చిన తల్లిదండ్రుల యడల, తోబుట్టువుల యడల ఆపాటి ఔదార్యం చూపించకపోతే మరి ఈ జన్మకి సార్థకత ఏంటి? కొన్ని సందర్భాల్లో మన కోరికల కన్నా కుటుంబ శ్రేయస్సుకోసం ఈ పాటి త్యాగమేనా చేయాలని నా భావన.”

“మీరన్నది నూటికి నూరుపాళ్ళు నిజం, మీ భావాల్లో నేనేకీభవిస్తున్నాను.

“మనల్ని తల్లిదండ్రులు ఎందుకు కన్నారో వారి కలలు సఫలీకృతం చేకూర్చడానికి శాయశక్తులా ప్రయత్నించి వారికి చేదోడుగా నిలవాలి” నేల మీదకి తన చూపులు నిల్పి అందామె.

ఆమె భావాల్ని అర్థం చేసుకున్నాడు సారధి, ఆ సమయానికి ఆమె భావాలను ప్రశంసించాడు కూడా.

“మీరు డిగ్రీ కంప్లీటు చేయండి”

“మీరు నాకు చదువు చెప్తారా?” ఆమె మాటలకి ఒక్కక్షణం తత్తరబాటుపడి తేరుకున్నాడతను, “తప్పకుండా” ఆమెకు అతను భరోసా ఇచ్చాడు.

 “మీ మీద ఇంకాభారం వేయదల్చుకోలేదు మాష్టారూ! ఇప్పటికే మా చెల్లెలకి చదువు చెప్పే భారాన్ని మీమీదుంచాం. అది యోగ్యురాలయితే నేను డిగ్రీ కంప్లీటు చేసినంత లెక్క.”

ఇద్దరి మధ్యా మౌనం కొంత తడవ రాజ్యమేలింది.

“మాష్టారూ! దేనినైనా భరించవచ్చు కాని లేమిని మాత్రం భరించలేము, పేదరికం మానవ మనుగడకి గొప్ప శాపం లాంటిది. ఉన్నదానితో సర్దుకుని జీవించడం నేర్చుకోవాలంటుంది మా చెల్లెలు. నాకన్నా చిన్నదయినా నా చెల్లెల మాటల్ని సమర్ధించలేకపోతోంది నా అంతరాత్మ.

“మీ చెల్లెలు చెప్పినట్లు నడుచుకుంటే జీవితంలో అశాంతి ఉండదు. లేకపోతే జీవితం అశాంతిపాలై నరకంలా తయారవుతుంది. ఉన్నదానితోనే తృప్తిపడ్డం అలవాటు చేసుకోకపోతే మానసిక రోగంతో కృంగిపోయే అవకాశం కలుగుతుంది”  సారధి మాటలు ఉపదేశంలా ఉన్నాయి. అయితే ఆ ఉపదేశాలు వినేవరకే పరిమితం కాని ఆచరించడానికి ఆమెకి యోగ్యమైనవిగా – సాధ్యపడేవిగా అనిపించడం లేదు. ఆమె మనస్తత్వమే వేరు. ఉన్నదానితో తృప్తిపడక అందని వాటి కోసం అర్రులు జాచే మనస్తత్వం సరస్వతి అని గ్రహించాడతను.

ఆమె మనస్తత్వం మార్చుకోనంత వరకూ జీవితంలో ఆనందం కొరవడుతుంది. ఇల్లు అశాంతి మయమవుతుంది. ఇలాంటి మనస్తత్వం ఆరోగ్యప్రదం కాదని కూడా అనుకున్నాడు సారధి.

ఏ వస్తువయినా, వ్యక్తైనా ఆమెకి అందేవరకే ఆమెకి ఆత్రుత – ఆపేక్ష, ప్రీతి. వస్తువేనా, వ్యక్తి అయినా ఆమెకి లభించిననప్పుడు వ్యక్తిమీద, వస్తువు మీద ఆమెకు ఆపేక్ష ఉండదు, ప్రీతి, అనురాగం, ఆప్యాయత, ఆదరణ మొదలైన భావమనోవికారాలు ఆమెలో కొరవడుతాయని అతను గ్రహించాడు. ‘ఆమెలో ఉన్న ఇలాంటి భావాల్ని తొలగించాలి’ ఇదే అతని ఆలోచన.

ఆమెకీ తనకీ ఏ సంబంధం లేకపోయినా సాటిమనిషిగా ఆమెలో ఉన్న తప్పును చూపించి సరియైన దృక్పధాన్ని కలగచేయడానికి ప్రయత్నించడం తప్పా? ఇదే అతని ఆలోచన, తన మనస్సుకి సర్దిచెప్పుకున్నాడు..

‘అయితే ఎవరి అభిరుచులు – ఆలోచన్లు వాళ్లవి. మనకి మంచిదనిపించినవి ఎదుటివాళ్లకే చెడు అనిపించవచ్చు. ఎదుటి వాళ్ళకి మంచి అనిపించినవి మనకి చెడు అనిపించవచ్చు. ఇది మనలో వున్న దృష్టిలోపం అవచ్చు. భావాల్లో ఉన్న వైవిద్యం అవచ్చు, మన ఆలోచనల్లో ఉన్న లోపం అవచ్చు. ఒకవేలుతో ఎదుటి వారి లోపాన్ని మనం ఎత్తి చూపుతే మిగతా వ్రేళ్ళన్నీ మనలోపాల్ని చూపించి మనల్ని దోషిగా నిలబెత్తాయి. దోషిగా చూపిస్తాయి. అన్న విషయం మరిచి పోకూడదు’ అనుకున్నాడు సారధి.

“నా భావాలు మీకు నచ్చలేనట్లున్నాయి, లోకభిన్నరుచి అని దీన్నే అంటారు. ఎక్కడో కాని ఒకరి భావాల్లో మరొకరి భావాలు కలవడం కష్టం, కల్సినా అట్టే కాలం నిలవవు” అంది సరస్వతి.

సారధి మౌనంగా – గంభీరంగా ఆలోచిస్తున్నాడు. “సరస్వతి… ఓ సరస్వతి!” లోపలనుండి పిలుపు వినిపించింది.

“అమ్మ పిలుస్తోంది, వెళ్తాను మాష్టారూ!” సరస్వతి అంది. సారధి తలూపాడు.

గబ గబా అడుగులేస్తూ ఆమె ఇంటిలోకి దారితీసింది. ఆమె వెళ్ళిన వేపు దీక్షగా చూస్తున్నాడు సారధి.

సంధ్యాసమయం , చీకటి రేఖలు నలుదిశలా అలుముకుంటున్నాయి. పక్షులు మేతనుండి తిరిగి వచ్చి గూళ్ళకి చేరుకుంటున్నాయి. పుస్తకాలు మూసి సారధి కూడా లేచాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here