[box type=’note’ fontsize=’16’] “కలకాలం నిలిచిపోయే రచనలు చేసిన సుశీల గారు చిరస్మరణీయులు. అందరికీ అభిమానపాత్రురాలు. ఆమెతో నా ప్రయాణం సదా ఉల్లాస, ఉత్సాహభరితం…” అంటూ సోమరాజు సుశీల గారికి అంజలి ఘటిస్తున్నారు నండూరి సుందరీ నాగమణి. [/box]
ఇల్లేరమ్మ వెడలె, ఇల్లు పొగిలె!
[dropcap]నా[/dropcap]కొక స్నేహితురాలుంది. పుస్తక భక్షకి. కనిపించిన పుస్తకమల్లా నమిలిపారేస్తుంది. పేరు కూడా తన స్వభావానికి తగినట్టే సరస్వతి. ప్రస్తుతం ఏలూరులో జీవితబీమా సంస్థలో పనిచేస్తోంది.
ఆ మధ్య చాలా కాలం క్రితం ఫోన్ చేసినపుడు “ఏం పుస్తకాలు చదివావే ఈ మధ్య?” అని అడిగాను. “ఇల్లేరమ్మ కథలు!” టక్కున చెప్పింది.
“ఎవరు వ్రాసారు?”
“సుశీల సోమరాజు గారని ఇండస్ట్రయలిస్ట్! పుస్తకం చాలా బాగుంది. నువ్వు కూడా చదువు. నేను పంపిస్తాను…”
అన్న నాలుగు రోజుల్లోనే తాను పంపించిన ‘ఇల్లేరమ్మ కథలు’ ఉహు కాదు ‘ఇల్లేరమ్మ కతలు’ పుస్తకం అందింది.
ఆకుపచ్చని బ్యాక్ డ్రాప్ లోంచి ఒక తెల్లని వెలుగు కిరణం! ఆ వెలుగులో ఆనందంగా గంతులు వేస్తున్న ఒక పాప. పైన ‘ఇల్లేరమ్మ కతలు’ అని టైటిల్, దాని కిందనే ‘డా.సోమరాజు సుశీల’ అని రచయిత్రి పేరూ.
‘పుస్తకం గెటప్ చాలా బాగుంది కానీ, ఏమిటో ఈ పుస్తకం పేరు, ఇక కతలు ఎలా ఉంటాయో!’ అని చాలా అనాసక్తంగా చదవటం మొదలు పెట్టిన నేను మరి చివరి కథ పూర్తి అయేదాకా పుస్తకాన్ని కింద పెట్టలేదు. అలా చదువుతూనే ఉండిపోయాను. ఆ ఒక్క పుస్తకంతో ఎవరో తెలియని, ఎప్పుడూ చూడని ఆ రచయిత్రి గారికి అజ్ఞాత అభిమానిగా మారిపోయాను. ఆ తరువాత ‘చిన్న పరిశ్రమలూ పెద్ద కథలు’ అనే పుస్తకం చదివాను. అది ఇల్లేరమ్మ కతలంత ఆకట్టుకోకపోయినా ఇండస్ట్రీ లో ఉండే సాధకబాధకాలు, అవస్థలు కనులకు కట్టింది. సుశీల గారిని ఎలాగైనా కలవాలని తపించిపోయాను. చిరునామా బోయిన్ పల్లి అని ఉంది. ఓ సారి వెళ్ళి రావచ్చు కదా అనుకున్నాను. నాకు అప్పటికి ఆవిడ ఫోన్ నంబరు తెలియదు. ఎవరిని అడగాలో కూడా తెలియదు. ఎందుకంటే అప్పటికి నేనింకా వ్రాయటం మొదలుపెట్టలేదు.
ఆ తరువాత 2010 లో నేను ఫేస్ బుక్ లోకి ప్రవేశించాను. అప్పుడే, అంతకు ముందు ఎప్పుడో అలా తాకి వదిలేసిన కలాన్ని మళ్ళీ పట్టుకున్నాను. 2012 నాటికి నాకు ముఖపుస్తకంలో కొంతమంది రచయిత (త్రు)ల స్నేహితులు ఏర్పడ్డారు. 2013 లో నేను లేఖిని సభ్యురాలనైనాను. రచయితలతో పరిచయం, వారి వారి పుస్తకాల ఆవిష్కరణకు హాజరు కావటానికి నాకు ఆహ్వానాలు కూడా అందసాగినై.
అలాంటి ఒక పుస్తకావిష్కరణ ఒక ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు సిటీ సెంట్రల్ లైబ్రరీ (చిక్కడపల్లి) లో జరగటం, దానికి నేను హాజరు కావటం జరిగింది.అక్కడ టీ బ్రేక్ లో బయట అందరూ టీ తాగుతూ ఉంటే చూసాను ఆవిడను. శ్రీమతి సోమరాజు సుశీల గారు! నిండైన విగ్రహం, గంభీరమైన ఆకృతి, చక్కని పెద్దతరహా చీరకట్టు, విజ్ఞానాన్ని సూచించే కళ్ళజోడు…
గబగబా దగ్గరకు వెళ్ళి, ‘నమస్తే మేడమ్’ అని పలకరించాను.
“నమస్తేమ్మా ఎవరమ్మా?”
“నా పేరు నండూరి సుందరీ నాగమణి అండీ. నేను మీ అభిమానిని. మీ ఇల్లేరమ్మ కథలు చదివి మీ ఫ్యాన్ ని అయ్యాను…”
ఇల్లేరమ్మ పేరు వినగానే ఆవిడ ముఖంలో ఎంతో మెరుపు.
“నా మొహం, నా చిన్నప్పటి జ్ఞాపకాలు ఏదో రాసానంతే…” అన్నారావిడ చప్పరించేస్తూ.
“భలేవారే మేడమ్, ఇల్లేరమ్మ మనందరి బాల్యానికి ప్రతీక… ఎంత బాగా వ్రాసారో… ‘చిన్న పరిశ్రమలు’ కూడా చదివాను మేడమ్. మీరింకా ఎన్నెన్నో కథలు వ్రాయాలి మాకోసం…”
ఆవిడ నవ్వారు.
“చాలా సంతోషం అమ్మా…”
నేనూ రాస్తున్నానని చెప్పాలని అనిపించినా బావుండదు అని ఊరుకుని, నమస్కారం పెట్టి వెళ్ళిపోయాను.
ఆ పరిచయం అక్కడితో ఆగలేదు.
***
లేఖినిలో చేరిన తరువాత, సాహితీ సభలకు, ఆవిష్కరణలకూ ఎక్కువగా వెళ్ళటం, రచయిత్రులతో బాగా స్నేహం ఏర్పడటం జరిగాయి. అలా సోమరాజు సుశీల గారిని తరచుగా కలవటం జరిగింది. వారు కూడా నన్నూ, నా అభిమానాన్ని బాగా గుర్తు పెట్టుకుని చాలా సరదాగా పలకరించేవారు. ఫేస్ బుక్ లో వారు పెట్టే పోస్ట్ లు ఎంతో బాగుంటూ అందరినీ అలరించేవి. వారి కథల పుస్తకం ‘దీపశిఖ’, నవల ‘ముగ్గురు కొలంబస్ లు’ పుస్తకావిష్కరణలకు వెళ్లాను. అంతే కాకుండా 22 మార్చి 2015 న వారింటిలో నిర్వహించిన ఒక సమావేశంలో లంచ్ కి నన్ను కూడా పిలిచారు. ఎంతో సంతోషంగా వెళ్ళి సాయంత్రం వరకూ అక్కడ గడిపి వచ్చాము. బోయిన్ పల్లిలోని వారిల్లు అప్పటికింకా రీమోడల్ కాలేదు. అచ్చ తెలుగు వంటలు! మసాలా వంకాయ కూర, పెద్ద పెద్ద అప్పడాలు, చక్కని చిక్కని పప్పు పులుసు బాగా గుర్తున్నాయి. అందరినీ పేరు పేరునా ఆప్యాయంగా పలకరిస్తూ కొసరి కొసరి వడ్డించారు ఆరోజు.
ఆ తరువాత ఏదో ఒక సభలో సుశీల గారు నన్ను వెదుక్కుంటూ వచ్చి, ‘ఇదిగోమ్మా సుందరీ, ఈ బుక్ అందరికీ ఇచ్చాను కానీ నీవు దొరక్క ఇవ్వలేదు. ఇదిగో నా కొత్త పుస్తకం’ అంటూ పెళ్ళి పందిరి పుస్తకాన్ని ఇచ్చారు. వారి అభిమానానికి నాకు కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి. ఎప్పుడూ అదే పలకరింపు నాకెంతో పులకరింపు కలిగేలా… “అమ్మా సుందరీ…”
ఇల్లు కొన్ని మార్పులతో బాగుచేయించు కోవాలని వారి చెల్లెలి ఇంటి దగ్గరకు కొన్నాళ్ళు షిఫ్ట్ అయ్యారు. సిటీకి దూరం గా ఉండటం వలన, వారు సభలకు రావటం (ఇంచుమించు ఆరునెలల కాలం) బాగా తగ్గిపోయింది. నేను నానీ గారు లేని సభల వెలితిని బాగా ఫీలయ్యేదాన్ని. అవును! నేను మాత్రమే వారిని వారి చిన్నప్పటి ముద్దుపేరు ‘నానీ’ తో ఆవిడను పిలిచేదాన్ని. ఆవిడ ఎంతో సంతోషించేవారు.
ఫేస్ బుక్ లో మాత్రం అందరితో టచ్ లో ఉన్నారు. కంచిలో చీరలు కొన్న వైనం, కొత్తగా ఒక
ప్రొఫెసర్ గారి దగ్గర రీసెర్చ్ లో జాయినైనపుడు ఆ దంపతుల నవజీవనం, ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు ఎంత హృద్యంగానో చెప్పేవారు. (చెబుతారు అని కాకుండా చెప్పేవారు అని వ్రాస్తున్నాను! అయ్యో…)
ఒకరోజు వారింటి నిర్మాణం పూర్తి అయిందని, మళ్ళీ వెనక్కు వచ్చేశామని, రచయితలూ, రచయిత్రులూ ఆత్మీయులు అందరం కలుద్దామని లంచ్ ఏర్పాటు చేసామని, అందరినీ తమ ఇంటికి రమ్మని చెప్పారు సుశీల గారు. సెప్టెంబరు ఎనిమిదో తారీఖున (2018) అందరం ఉదయం పదిన్నరకల్లా అక్కడికి చేరుకున్నాము చేరుకోగానే మంచినీరు, కొబ్బరి నీరు ఇచ్చారు. ఆ తరువాత, కబుర్లు, పాటలు… ఇల్లంతా ఎంతో విశాలంగా, కొత్తగా అనిపించింది, చేసినమార్పుల వలన. అక్కడ చేరిన రచయిత్రులు, కవయిత్రులు, మంథా భానుమతి గారు, సుజల గంటి గారు, కన్నెగంటి అనసూయ, మణి గోవిందరాజుల, అత్తలూరి విజయలక్ష్మి గారు, చెంగల్వల కామేశ్వరి అక్కయ్య, డి కామేశ్వరి గారు ఇంకా ఎందరెందరో లబ్ద ప్రతిష్టులైన రచయిత్రులు వచ్చారు ఆరోజు. పొత్తూరి విజయలక్ష్మి అక్కయ్య ఊరిలో లేరనుకుంటాను. అందువలన రాలేదు. ఆరోజు విందు భోజనం నా జీవితంలో కనీ వినీ ఎరుగను.
అచ్చమైన ఆంధ్ర బ్రాహ్మణుల తెలుగు భోజనం. అప్పడాల పిండి, పచ్చి వడియాలు, కందా బచ్చలి కూర, పనసపొట్టు కూర, పులిహోర, బూరెలు… నవరస భరితం. ఎంత బాగుందో చెప్పలేను. ఆవిడ ప్రతి ఒక్కరి దగ్గరకూ వచ్చి అన్నీ వడ్డించుకున్నామో లేదో చూసి, ‘ఎలా ఉన్నాయమ్మా వంటలు? మీకు నచ్చాయా? కోనసీమ వంటలు ప్రత్యేకంగా చేయించాను’ అని పేరు పేరునా చెప్పారు. అపర అన్నపూర్ణ ఆమె. ఆరోజు అక్కడ భోజనం చేసిన అందరి కళ్ళలోని భావమూ అదే… ఆమెలో ఒక అమ్మ, ఒక పెద్దక్కయ్య కనిపిస్తారు నాకెప్పుడూ.
భోజన కార్యక్రమం అయ్యాక తంబోలా ఆడాము అంతా. కన్నెగంటి అనసూయ నిర్వహించారు. ఆ తదుపరి టీ సర్వ్ చేసారు. అప్పుడు సుశీల గారు తన పుస్తకాలను ఆటో గ్రాఫ్ చేసి ఒక్కొక్కరికీ ఇవ్వటం మొదలుపెట్టారు. నేను వెళ్ళి పక్కనే కూర్చున్నాను.
‘నీకేం పుస్తకం కావాలి సుందరీ?’ అని అడిగారు.
‘మీకు తెలుసు కదా, ఇల్లేరమ్మే…’ అన్నాను నవ్వుతూ.
ఇల్లేరమ్మ బుక్ తీసుకుని ఫ్రంట్ పేజీలో ‘ప్రియమైన సుందరికి ప్రేమతో నీ నానీ’ అని రాసి ఇచ్చారు. ఆవిడ పెదవులపైన వెలిగిపోయే చిరునవ్వు. నాకెంతో సంతోషం కలిగింది. అప్రయత్నంగా వారి పాదాలకు నమస్కారం చేసాను.
***
ఇది జరిగిన నెల రోజులకే (అక్టోబరు 14న) ఇందిరా రావు గారనే రచయిత్రి నేస్తం దసరా సందర్బాన వారింటిలో ఏర్పాటు చేసిన పూజకు, విందుకు ఆహ్వానించారు. అక్కడ నేనూ, సుశీల గారూ కలిసి చాలా సేపు కూర్చున్నాము. అప్పుడు సుశీల గారు నన్ను వారింట్లో అమ్మవారిని చూసి తాంబూలం తీసుకొమ్మని పిలిచారు.
(ఇది జరగటానికి కొద్ది కాలం క్రితం మేము సుశీల గారిని ఫేస్ బుక్ లోనే ఒక కోరిక కోరాము. అదేమిటంటే అపర సరస్వతీ స్వరూపం అయిన ఆవిడ కట్టుకున్న చీర ఒకటి కానుకగా ఇవ్వమని. అలాగే ఇస్తాను కానీ పాతదే ఎందుకు, కొత్తదే కొని ఇస్తానని అన్నారు. కానీ మేము అలా వద్దు, పాతది ఇవ్వమని అడిగితే అందుకు ఒప్పుకున్నారు.)
నేనూ, ఉమాదేవి కల్వకోట అక్కయ్యా సుశీల గారి కారులోనే వారింటికి వెళ్ళాము. వెనుకనే మా అబ్బాయి, మా వారు మాకారులో వచ్చారు. అక్కడ నానీ గారి పూజగదిలో అమ్మవారి దర్శనం చేసుకున్నాము. ఎంతో బాగా అలంకరించారు అమ్మవారిని. కనులకింపైన ఆ మూర్తిని దర్శించుకొని, సుశీలగారిచ్చిన పండు, తాంబూలం స్వీకరించాము. వారింట్లో మేము అంతకు ముందు చూడని హోమ్ థియేటర్ చూపించారు. అక్కడే కాఫీలు తాగాము. ఈసారి ఇక్కడ మంచి సినిమా చూద్దామని అన్నారు. కిందికి వచ్చాక నన్ను లోపలికి పిలిచి, ‘క్రీమ్ కలర్’ పట్టు చీర తీసి, ఇది నీకు బాగుంటుందని అనిపించి తీసి పెట్టాను. కట్టుకుంటావా?’ అని చేతిలో పెట్టారు. వెంటనే అది అందుకుని, ఆవిడ పాదాలు స్పృశిస్తూ, ‘తప్పకుండా నానీ గారు’ అన్నాను. “అది కట్టుకుని ఫోటో తీసుకుని నాకు పంపిస్తావా?” అని అడిగారు. “అలాగేనండీ, తప్పకుండా పంపిస్తాన”ని చెప్పాను.
నా కళ్ళు ఆమె ఆప్యాయతకు చెమరించాయి. మనసు పులకరించింది.
వీడుకోలు చెబుతూ ఉంటే ‘మళ్ళీ మళ్ళీ రండి అమ్మా’ అన్నారు ప్రేమగా.
జనవరి ఒకటవ తారీఖున కొత్త సంవత్సరం సందర్భంగా ఆ చీర కట్టుకుని ఆవిడకు ఫోటో పంపించాను. చాలా సంతోషించారు.
***
ఏప్రిల్ 22 (2019) న ‘తురగా ఫౌండేషన్ పురస్కారాల సభ’ సైఫా బాద్ లోని విద్యారణ్య పాఠశాలలో జరిగినప్పుడు ఆ సభకు నేను వెళ్లాను. ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారికి, ప్రముఖ పాత్రికేయులు శ్రీ ఎంవీ ఆర్ శాస్త్రి గారికీ పురస్కారాలు ఇచ్చారు. ఆ సభలో కలిసాను సుశీల గారిని మళ్ళీ. (ఇంచుమించు ఐదు నెలల తరువాత). మధ్యలో బయటకు వెళ్ళి మంచినీళ్ళు తాగి వస్తుంటే, చివరన కూర్చున్న ఆమె ‘సుందరీ, ఎలా ఉన్నావు?’ అని పలకరించారు.
‘నానీ గారూ బాగున్నారా? ఎప్పుడు వచ్చారు?’ అని అడిగితే ‘ఇప్పుడే… కొంచెం లేట్ అయింది… నాకు కొంచెం నీళ్ళు తెచ్చి పెట్టగలవా?’ అని అడిగితే వెంటనే వెళ్ళి తీసుకువచ్చాను. ఆ తరువాత సభ ప్రారంభం అయిపోవటంతో మాట్లాడుకోవటం కుదరలేదు. అదే నాకు ఆఖరు దర్శనం అవుతుందని కలలో కూడా ఊహించలేదు…
***
జూలై నెలలో లేఖిని అధ్యక్షురాలు శ్రీమతి వాసా ప్రభావతి గారు ఫోన్ చేసి, “అమ్మా, నీకు ఈసారి లేఖిని మాతృ పురస్కారం కథానికా రంగంలో లేఖిని తరఫున సుశీల సోమరాజు గారు వారి తల్లిగారి పేరున ఇస్తున్నారు…” అని చెప్పారు నా ఆనందానికి అవధులు లేవు.
(నిజానికి నేను అప్పటికి హైదరాబాదు నుండి మహబూబ్ నగర్ కు బదిలీ అయి, కొన్ని అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాను. అందువలన సుశీల గారికి భుజం ఫ్రాక్చర్ అయిందని తెలిసి వెళ్లి కలవాలనున్నా కుదరక కలవలేకపోయాను.)
ఆ లేఖిని అవార్డు సభ సరిగ్గా నా పుట్టినరోజు నాడే అంటే ఆగస్ట్ పధ్నాలుగో తారీఖున జరిగింది. సుశీల గారు సభకు వస్తారని ఎంతో ఆశగా ఉన్నాను. సభకు బయలుదేరి వెళుతూ ఆవిడకు ఫోన్ చేయబోతుంటే ఆవిడ దగ్గరనుంచే కాల్ వచ్చింది.
“అమ్మా సుందరీ, ఏమీ అనుకోకు, నేను రాలేకపోతున్నాను. మా చెల్లెలు బుజ్జి నీకు అవార్డ్ ఇచ్చి సన్మానిస్తుంది…” అన్నారు.
“అయ్యో నానీ గారూ, ఏమైంది, మీ ఆరోగ్యం బాగుండలేదా?” అని ఆత్రుతగా అడిగాను.
“ఫరవాలేదు బాగానే ఉన్నాను. కానీ రాలేను. నీకు తీరిక చిక్కాక ఓ ఆదివారం రా, మనం ఫోటో తీసుకుందాము” అన్నారు.
అవార్డ్ ఫంక్షన్ ఎంతో ఘనంగా జరిగింది. శ్రీమతి సోమరాజు సుశీల గారి తల్లిగారైన శ్రీమతి వెలువలి సరోజిని గారి పేరున అవార్డ్ తీసుకోవటం నాలోని రచయిత్రికెంతో గౌరవాన్ని ఆపాదించింది. తప్పకుండా వారి దగ్గరకు వెళ్ళి ఆశీస్సులు తీసుకోవాలని అనుకున్నాను.
ఈలోగా ఆమె మరల హాస్పిటల్లో చేరారని తెలిసింది. ఆవిడ కోలుకోవాలని ఎంతో ప్రార్థించాను. ఇంటికి వచ్చారని బాగున్నారని మిత్రుల ద్వారా తెలిసి సంతోష పడ్డాను. కానీ… కానీ…
విధి ఎంత దుర్మార్గురాలు? మా నానీ గారిని మానుంచి గుండె నొప్పి రూపంలో ది.26.09.2019 ఉదయమే ఎత్తుకుపోయింది. చివరిచూపుకు కూడా నోచుకోలేకపోయాను.
అసలు నేను ఆమెకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. ఆవిడను కలవలేకపోయాను, ఫోటో తీసుకోలేకపోయాను. చాలా దురదృష్టం నాది.
ఏది ఏమైనా కలకాలం నిలిచిపోయే రచనలు చేసిన సుశీల గారు చిరస్మరణీయులు. అందరికీ అభిమానపాత్రురాలు. సర్వులనూ ఆదరించే అమ్మ, అన్నపూర్ణ… ఆమెతో నా ప్రయాణం సదా ఉల్లాస, ఉత్సాహభరితం… శ్రీమతి సుశీల గారిని నాకు పరిచయం చేసిన మా సరస్వతికి నా ధన్యవాదాలు.
శ్రీమతి సుశీల గారి కోసం ఈ చిన్న పద్యం:
కంటిలోని చుక్క కడలియై పొంగితే
దు:ఖ భారమెటులొ దూరమగున?
తలచి తలచి నాని, తరచె నీ స్మృతులెల్ల
ఇల్లెరమ్మ వెడలెనిల్లు పొగిలె!
వారికి నా నివాళులు!