[dropcap]వా[/dropcap]మపాదంతోనూ రజత తలాన్ని
కాంక్రీట్ కీకారణ్యాన్ని చేయగలవాళ్ళకు
లోలోపల దాచుకున్న నీటిబుగ్గల్ని
ఉఫ్ న ఊదేయగల వాళ్ళకు
నీ కొండల చేతులు నరికి
నదుల పేగులు మలినాలతో కుళ్ళబెట్ట గలవాళ్ళకు
నీలోని ఖనిజాల బావులను
ఒక్క గుక్కలో తాగేయగలవాళ్ళకు
నీకే తెలియకుండా వాటాలేసి
దేశాలవారీగా అమ్మేయగలవాళ్ళకు
వేవెలుగుల బంతివైన నిన్ను
క్షణంలో చీకటిగోళం చేయగలవాళ్ళకు
అందకు చంద్రుడా అందకు
నీమీద కాలు పెట్టినప్పుడే
జండాలు పాతినవాళ్ళం కదా!