[dropcap]తె[/dropcap]లంగాణ తొలినాటి కవయిత్రులలో శ్రీమతి ఇందుమతి ఒకరు. 1936లో వారు రచించిన ‘కావ్యావళి’ అనే పుస్తకాన్ని ‘ఇందుమతి కవిత్వం’ పేరిట సంగిశెట్టి శ్రీనివాస్ సంపాదకత్వంలో 80 ఏళ్ళ తర్వాత తిరిగి ప్రచురించింది ‘తెలంగాణ ప్రచురణలు’ సంస్థ.
***
“1933 నాటికే తెలంగాణ నుంచి ఒక స్త్రీ ప్రణయ కవిత్వం రాయడం విశేషం. ఈ కావ్యం పేరు ‘కావ్యావళి’. దీనిని ఖమ్మం జిల్లాకు చెందిన ఇందుమతీదేవి రాసినారు. ఈ కవితా సంపుటి 1936లో విశ్వనాథ సత్యనారాయణ, చిలకమర్తి లక్ష్మీనరసింహారావు తదితరుల ముందుమాటల్తో వెలువడింది.
ఈ పద్యాల్లో ఒక వైపు భర్తను, మరోవైపు దేవుడిని ఇద్దరినీ కొలుస్తూ (శ్లేష) వచ్చేలా విధంగా కవిత్వమల్లింది.
నిజానికి స్త్రీలు కవిత్వం రాయడమే తక్కువ. అందునా భావకవిత్వ రీతిలో రాయడం మరీ అరుదు. అయితే ఈ అరుదైన రికార్డును తెలంగాణకు చెందిన ఇందుమతీదేవి ‘కావ్యావళి’ ద్వారా దక్కించుకుంది.
తెలుగు సాహిత్యంలో స్త్రీలు ప్రణయ కవిత్వం అందులో విరహం గురించి రాయడం తక్కువ. అట్లాంటిది ఇందుమతీదేవి తన భర్త మీద పద్యాలు రాసింది. ద్విపదలో రాసిన ఈ పుస్తకంలో గోపాల శతకము, పతిభక్తి, రంగనాథస్తుతి పేరిట వేరు వేరు రచనలున్నాయి. కొత్తగా పెళ్ళయిన స్త్రీకి అత్తవారింట కలిగే అనుభవాలను, మరదలు ఆటపట్టింపులు, పతిపట్ల భక్తి, ఇంకా చెప్పాలంటే పతియే ప్రత్యక్ష దైవంగా భావించి రచనలల్లింది.
ఈ పుస్తకం అచ్చయిన 80 ఏండ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు పునర్ముద్రణ చేస్తున్నాము. దాదాపు 80-90 ఏండ్ల క్రితమే ఒక స్త్రీ ప్రణయ/భావ కవిత్వం రాయడం, అది అచ్చు కావడం, ఆ పుస్తకాన్ని తండ్రి దగ్గరుండి ముద్రింప జేయడం చాలా అరుదైన విషయం” అన్నారు సంగిశెట్టి శ్రీనివాస్ తమ ముందుమాట ‘తెలంగాణ స్త్రీల కవిత్వంపై ఒక వెలుగు’ లో.
***
“శ్రీమతి సోమరాజు ఇందుమతీదేవిగారు రచించిన ‘కావ్యావళి’ని ఆమూలాగ్రము చదివితిని. ఇందు పతిభక్తి, శ్రీరంగనాథస్తుతి, వేణుగోపాల శతకము అనెడి మూడు ప్రకరణములు గలవు. ఈ మూడింటను, అంతర్వాహినిగా ప్రసరించుచున్న భావ మొక్కటియే. అది స్వచ్ఛమైన అనురాగము. ఈ భావమే పతిగతమైనపుడు ప్రణయముగాను, పరమేశ్వర గతమైనపుడు భక్తిగాను వ్యక్తమగుచున్నది. పరమార్థమున ఈ రెంటికిని భేదము లేదని ఆర్యుల తలంపు. కవయిత్రికి ఈ ధర్మరహస్యము చక్కగా అవగతమైనటుల గ్రంథము సర్వత్ర విదితమగుచున్నది. ఈ రచన కావ్యగుణముచేతను, వస్తుతత్వముచేతను సాత్త్వికమై యెప్పారుటచే సర్వధా ఉత్తమశ్రేణి నధిష్ఠించుచున్నది. శైలియు, సుబోధకమై, ప్రసన్నమై, ఆపేలవమై పూలమాలవలె వాసించుచున్నది. ఈమె యింతకంటెను గుణాధికత గల కావ్యముల రచించి ఆంధ్రభారతి నలంకరించుగాక” అన్నారు పింగళి లక్ష్మీకాంత కవిగారు.
***
“రంగనాథస్తుతి మృదువైన పాకములోనున్నది. దీనికి రెండు కారణములు. కవయిత్రి స్త్రీ ఛందస్సు ద్విపద. ఆమెకు వృత్తరచనయందు చేయితిరుగలేదు. ద్విపదలో తిరిగినట్లు కనిపించుచున్నది. దీనికి కారణము రచయితృశక్తి, ఛందశ్శక్తి, సన్నిహితములుగా నుండుట. ఈమె పతిభక్తి యందు గీతములలో చూపించిన శిల్పచాతుర్యము ద్విపదలో ప్రదర్శించినచో నది యెక్కువ పరిణతమై కన్పించవచ్చును. ఆమె బుద్దియు శక్తియు సుకుమారములు. ద్విపదయొక్క ఛందస్సు కొద్దిది; సుకుమారమైనది. రెంటికి నెక్కువ సన్నిహితత్త్వము గలదు.
ఈమె యాధునిక కవుల రచనల బాగుగ నెరుగును ‘నీకు పూవులు గ్రుచ్చి దండవేయుదును’ అన్న శతక సీసపద్యమున పానుగంటి వారి రాధాకృష్ణ యందలి యొక సీసపద్యములోని ఛాయ; మరికొన్నిచోట్ల చిలకమర్తి వారి ఛాయలు గలవు. పూర్వ శతకకవుల మార్గములును ననుసరింపబడినవి. మొత్తముమీద ననుకరణము తక్కువ; స్వతంత్రత యెక్కువ.
తెలుగునాటికి తొల్లిటి గొప్పతనము సిద్ధించవలయునన్నచో నిట్టి స్త్రీలు బహుధా వెలయవలయును” అన్నారు ఈ సంపుటి గురించి విశ్వనాథ సత్యనారాయణగారు.
***
ఇందుమతి కవిత్వం
రచన: సోమరాజు ఇందుమతి దేవి
ప్రచురణ: తెలంగాణ ప్రచురణలు
పుటలు: 120, వెల: ₹ 70/-
ప్రతులకు:
- తెలంగాణ ప్రచురణలు, ఇందిరా నివాస్, 3/97, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్ 500010. ఫోన్: 9849220321
- అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు