[dropcap]మ[/dropcap]రో పోలికా కుదరని అమ్మ ప్రేమలా
మారుపేరే లేని నాన్న మమతలా
అద్భుతాలన్నీ నిరుపమానాలే
ఎండి బీడైన నేల పచ్చని ప్రకృతిలా
కోయిల పిలుపై వసంతమే ‘కూవూ’ అనేలా
అద్భుతాలన్నీ సహజాతాలే
పరిమళమై రెక్కలు తొడిగి పూవై చెట్లను నిలిచేలా
దగ్ధం చేసే అంగారమూ ఆభరణాన్ని మెరిపించేలా
అద్భుతాలన్నీ సామాన్యాలే
అతడి క్రీగంటి చూపైనా ఆమెను నిలువెల్లా చుట్టేలా
ఆమె చిరునవ్వొక్కటి అతడిని పండు వెన్నెలై ముంచెత్తేలా
అద్భుతాలన్నీ అపురూపాలే