[box type=’note’ fontsize=’16’] ఎంవిఆర్ ఫౌండేషన్ 2019 ఉగాది సందర్భంగా నిర్వహించిన డా. పాలకోడేటి అప్పారావు స్మారక కథానికల పోటీలో ‘ప్రచురణార్హమైన కథల’ని న్యాయనిర్ణేతలు ఎంపిక జేసిన కథ. రచన మౌద్గల్యస. [/box]
[dropcap]సి[/dropcap]టీ బస్ దిగి అడుగులో అడుగు వేసుకుంటూ భారంగా నడుస్తోంది సహస్ర. ఆమె మనసులో ఆందోళన మొహంలో ప్రతిఫలిస్తోంది. రాత్రి భర్త అన్న మాటలు ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి.
“ఇంతకీ ఎవడు వాడు?” లోపలకి అడుగుపెడుతూనే నిలదీశాడు వాసు.
“మీరెవరి గురించి అడుగుతున్నారు?” అర్ధం కాక అడిగింది సహస్ర.
“ఎంత మంది మగవాళ్లతో సంబంధాలున్నా యేంటి నీకు?” వెటకారం చేస్తూ అన్నాడు.
“అసహ్యంగా మాట్లాడకండి. మీరు దేనిగురించి మాట్లాడుతున్నారో తెలియకే అడుగుతున్నాను” కోపాన్ని అణచుకుంటూ చెప్పింది.
“అదే పొద్దున వాడెవడితోనో కులుకుతూ మాట్లాడావే. దాని గురించి అడుగుతున్నా..” ఆమె వైపు అసహ్యంగా చూస్తూ చెప్పాడు.
సహస్రకు గుర్తొచ్చింది. ‘పాటల పల్లవి’ కార్యక్రమం. ప్రేక్షకుల నుంచి కాల్పు ఆహ్వానించి వారికి నచ్చిన పాటలు ప్రసారం చేస్తారు. దానికి తను యాంకర్.
ఫోన్ చేసిన వ్యక్తితో కాస్తంత సరదాగా మాట్లాడుతుంది. కొన్ని జోకులు, చిలిపి మాటలు అందులో జోడిస్తుంది. ఇదంతా ఎంటర్‌టైన్‌మెంటులో భాగం. యాంకర్ గా కార్యక్రమాన్ని రక్తి కట్టించటం తన బాధ్యత.
ఈ మాట చెబితే అతను అర్ధం చేసుకుంటాడా? మనసులో సందేహిస్తూనే..
“టీవీలో ప్రోగ్రామ్ గురించి మీరు అడిగేది?” అంది ఎగదన్నుతున్న ఆవేశాన్ని నిలువరించుకుంటూ.
“అవును. ఇది కాకుండా బయట ఇంకేమయినా చాటుమాటు వ్యవహారాలు సాగుతున్నాయా”
“ఛి..ఛీ..” ఆమె మనసు కుతకుతలాడిపోయింది.
వాసు మాటల దాడి ఆపలేదు. “మదన్.. ఏమయిపోయావ్?.. రెండు రోజుల నుంచి ఫోన్ చేయటం లేదేంటి?” అని నువ్వనటం.. అవతల వాడేమో చొంగలు కార్చుకుంటూ.. “నీ ప్రోగ్రామ్ చూడకపోతే.. నాకు పొద్దుపోదు అనటం..” దానికి నువ్వు సమాధానంగా.. “మరి రెండు రోజులుగా ఎందుకు చేయలేదు?” అని నువ్వు ఎదురుప్రశ్న వేయటం.. “మరేం చేయను.. పండగకి మా పల్లెకి వెళ్లాను. అక్కడ మొబైల్ ఛార్జి అందలేదు. అక్కడ ఉన్నన్ని రోజులూ నీ ఆలోచనలే” అని వాడనటం.. సిగ్గేయటం లేదూ.. పెళ్లయిన ఆడవాళ్లు చేసే పనేనా ఇది?” బూతులందుకున్నాడు.
ఆ మాటలు వింటూ కోపాన్ని తమాయించుకోవటం కష్టమయింది సహస్రకి.
“నా పాటికి నేను గొంతు చించుకుని అరుస్తుంటే అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడిపోయావేమిటి?” అన్నాడు.
ఏమని చెబుతుంది తను. అన్ని కాల్స్ పబ్లిక్ నుంచి రావు. స్టూడియోలో ఉన్న వాళ్లే ఎవరో ఒకరు మారుపేర్లతో ఫోన్ చేస్తారు. ప్రేక్షకులు ఎంజాయ్ చేయటానికి దాన్లో వీలైనంత మషాలా దట్టిస్తారు. ఇందులో యాంకర్ ఎంత యాక్టివ్‌గా ఉంటే అంత బాగా కార్యక్రమం క్లిక్ అవుతుంది.
ఈ రోజు ఉదయం కూడా అంతే.
మదన్ పేరుతో ఫోన్ చేసింది తన కొలీగ్ సురేష్.
అదే విషయం వెనకాముందు ఆలోచించకుండా చెప్పేసింది.
“అంటే.. మదన్ అన్న పేరు గల వ్యక్తి ఎవరూ నీతో మాట్లాడలేదంటావ్?” గుచ్చిగుచ్చి అడిగాడు.
“అవును.. కావాలంటే మా ఆఫీసులో అడగండి” కోపాన్ని దిగమింగుకుని సాధ్యమయినంత మర్యాద ధ్వనించే స్వరంతో చెప్పింది.
“నమ్మమంటావా?”
“మీ మీదొట్టు”..
ఈ మాటకు వాసు లొంగిపోయాడు.
“సరే ఈసారికి వదిలేస్తున్నా.. రేపెప్పుడయినా ఏ మగవాడితో నయినా కులుకుతూ మాట్లాడావా తోలుతీస్తా. కాళ్లూ చేతులు విరగ్గొట్టి ఇంట్లో మూల కూర్చోబెడతా..” హెచ్చరిస్తున్నట్టుగా అని అక్కడ నుంచి వెళ్లిపోయాడు వాసు. ఆ తర్వాత మౌనంగా భోజనం చేసి గుర్రు పెట్టి నిద్రపోయాడు.
తన కార్యక్రమం ఉదయం వేళల్లో ప్రసారం అవుతుంది. సాధారణంగా అతను బారెడు పొద్దెక్కాక గానీ నిద్రలేవడు. అదే తనకు ఇన్ని రోజులూ కలిసొచ్చింది. ఇప్పటికయితే సమస్య నుంచి బయట పడింది కానీ.. ఎన్నాళ్లిలా..?
సహస్రకి చిన్నప్పట్నుంచి టీవీ అన్నా.. అందులో యాంకర్లన్నా చాలా ఇష్టం. తన స్నేహితురాళ్లు సీరియళ్లంటే చెవికోసుకుంటుంటే తను మాత్రం ఇతర ప్రోగ్రామ్ లను ఆసక్తిగా చూసేది. బాగా పేరున్న యాంకర్లు కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తున్నారు? వారి కట్టు బొట్టు, మాట, నడవడిక అన్నీ పరిశీలించేది.
యాంకరయితే చుట్టూ ఉన్న ప్రపంచం సులువుగా గుర్తుపడుతుంది. గౌరవిస్తుంది. డబ్బూ పేరు ప్రఖ్యాతులు వాటంతట అవే వస్తాయి అని బలంగా నమ్మేది..
ఇదే మాట తల్లితో చెప్పింది. “అదేమిటే .. కొత్త వాళ్లని చూస్తే నీకు నోరు పెగలదు. యాంకరవుతావా… పిచ్చి వేషాలెయ్యక నోరుమూసుకుని చదువుకో..” అంటూ ఆవిడ మందలించింది. అంతే కాదు, కూతురిలో ఈ పిచ్చి పెరగకుండా చూడాలని వీలైనన్ని ప్రయత్నాలు చేసింది.
సహస్ర ఇంటికి రాగానే టీవీ ఆన్ చేయకుండా ఉండటం, ఒక వేళ ఆన్ చేస్తుంటే కట్టేసి టీవీ ముందరి నుంచి కూతురిని బలవంతంగా అక్కడ నుంచి పంపించేయటం లాంటివి చేసింది అయినా.. ఆమెలో కోరిక నానాటికీ పెరిగిందే గానీ వీసమెత్తు తగ్గలేదు.
పెద్ద వాళ్లకి ఇష్టం లేని పనిచేయటం దేనికని ఆమె ఇష్టాన్ని చంపుకోలేదు. ఓ వైపు దీక్ష చదువుకుంటూనే రంగుల కలల్లో తేలిపోయేది.
“నా ఫ్రెండు ఇందాక ఫోన్ చేశాడు. వాళ్లబ్బాయి నిన్నేదో పెళ్లిలో చూశాడట. చేసుకుంటే నిన్నే చేసుకోవాలని భీష్మించుకుని కూర్చున్నాడట. ఆదివారం నిన్ను చూసుకోటానికి వాళ్లు వస్తామన్నారు” ఓ రోజున తండ్రి బాంబు పేల్చాడు.
‘పెళ్లయితే యాంకర్ కావటం కష్టం అన్న భయం ఆమెకు కలిగినా.. చాలా మంది పెళ్లయిన తర్వాత రాణిస్తున్నారుగా.. తనూ వాళ్ల జాబితాలో చేరిపోతుంది..’ మనసులో సర్దిచెప్పుకుంది. అవతల వాళ్లు పెళ్లిచూపులకు రావటం, తను నచ్చటం.. నెలరోజుల కల్లా పెళ్లి తంతు ముగిసిపోవటం చకచకా జరిగిపోయాయి. తనకు టీవీలో యాంకరింగ్ అంటే ఎంత ఇష్టమో వాసుకు ఆమె చెప్పాలనుకుంది. అయితే అతని స్వభావం పెళ్లయిన కొద్ది రోజులకే బయటపడింది.
మగవాళ్లు తమకు అందుబాటులో ఉండే ఆడవాళ్లకి వల విసురుతారని.. ఉద్యోగం చేసే ఆడవాళ్లు ఈ ఉచ్చులో ఠక్కున పడతారని అతను నమ్మేవాడు. అదే అభిప్రాయాన్ని మాటల్లో వ్యక్తం పరిచేవాడు కూడా.
ఒకే చోట పనిచేసే మగ, ఆడ మధ్య శారీరక సంబంధాలు ఏర్పడతాయని అతను అంటే, ఒకరిద్దరు అలాంటి వాళ్లుండచ్చు.. అందరూ అలా ఉంటారనుకోవటం పొరపాటని ఆమె చెప్పాలనుకునేది.
ఇలాంటి విషయాల్లో వాదనలకు దిగకపోవటమే మంచిది.. లేకపోతే అనే అనవసర అపార్థాలకు దారితీసే ప్రమాదం ఉందనిపించి ఎప్పుడూ నోరు తెరిచేది కాదు.
ఓ రోజు టీవీ ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన ఆమె కళ్ల పడింది. దరఖాస్తు చేస్తే ఆరునెలల తర్వాత పిలిచారు. ఇంటర్వ్యూ రోజున భర్తకు విషయం చెప్పింది.
“నీలాంటి నోరు లేని దానిదాన్ని ఉద్యోగానికి పిలిచారంటే వాళ్ళెవరో తలకి మాసిన వాళ్లు అయ్యుంటారు. అయినా.. ఇంటర్వ్యూకి పిలిచిన వాళ్లందరినీ ఉద్యోగాలు కట్టబెడతారా? తేలిగ్గా తీసిపారేశాడు.
“నీ కెలాగూ ఉద్యోగం రాదు గానీ.. దారి ఖర్చులు దండగ.. హాయిగా వంట చేసుకోక ఈ గోలంతా దేనికి?” అన్నాడు.
“అది కాదు. ఉన్న ఊరిలో ఉద్యోగం.. ప్రయత్నిస్తే తప్పేముంది? రాకపోతే మీరు చెప్పిన ఇంటి పట్టున ఉంటా..” సహస్ర చెప్పింది. ఆ మాటలెందుకో అతనికి కన్విన్సింగ్‌గా అనిపించాయి.
” ఉద్యోగం పేరు చెప్పి పనంతా నా నెత్తిన రుద్దుదామునకున్నావేమో.. ఆ పప్పులేం ఉడకవు.. వంటావార్పు అన్నీ నువ్వే చేసుకోవాలి” కరాఖండిగా చెప్పేశాడు. ఆమెకు ఎలాగూ ఉద్యోగం రాదన్న బలమైన నమ్మకంతో పంపించాడు గానీ .. నిజానికి అతనికి ఆమె బయటికెళ్లటం ఇష్టం లేదు.
అతను చెప్పిందనికల్లా ఆమె ఒప్పుకోవటంతో కాదనటానికి అతనికి కారణం కనిపించలేదు.
ఆమె ఇంటర్వ్యూకి హాజరయ్యింది.
పెద్దగా అందగత్తె కాకపోయినా చూపులకు ఆమె బావుంటుంది. పైగా ఒద్దిక కల స్వభావం దీనితో టీవీ వాళ్లకి ఆమె నచ్చింది. ఉద్యోగం ఆమెను వరించింది, అదీ యాంకర్‌గా కాదు. స్క్రిప్టు రాయటంలో.
“ఏదో ఒకటి. అసలంటూ టీవీలోకి వెళితే అక్కడక్కడ రకరకాల కార్యక్రమాలు చేసే యాంకర్లను చూడొచ్చు. ఆర్టిస్టులను పరిచయం చేసుకోవచ్చు.. ఆ తృప్తి చాలు” అనుకుంటూ ఆమె ఉద్యోగంలోకి ప్రవేశించింది.
నాలుగయిదు నెలల తర్వాత గానీ ఆమెను అదృష్టం వరించలేదు. పాటల పల్లవి కార్యక్రమం.. రెగ్యులర్ యాంకర్ పెళ్లని నాలుగువారాల సెలవు పెట్టింది. ఆ బాధ్యత వేరెవరికో అప్పచెప్పారు. ఆమె సిటీలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి సమయానికి ఆఫీసుకు రాలేదు. అపద్ధర్మంగా ఆ అవకాశం సహస్రకొచ్చింది.
క్రియేటివ్ డైరక్టర్ హరాత్తుగా పిలిచి విషయం చెప్పేసరికి ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది.
జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా కంటున్న కల.. నెరవేరే సమయం వచ్చింది.
గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది.
ఎలా కార్యక్రమం పూర్తిచేసిందో తెలీదు.
“అద్భుతం. మొదటిసారి చేస్తున్నట్టుగా కాకుండా అనుభం ఉన్నదానిలా చేశావ్.. భేష్” మెచ్చుకున్నాడు క్రియేటివ్ డైరక్టర్. అంతే కాదు.. రెగ్యులర్ యాంకర్ వచ్చేవరకూ ఆ బాధ్యత తననే చూడమని ప్రోత్సహించాడు..
తన కొలీగ్స్ కూడా అభినందనలతో ముంచెత్తారు.
సంతోషంతో ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు.
మనసుకు నచ్చిన పని చేయటంలో ఉన్న ఆనందం ఆమె మొదటిసారి రుచి చూసింది.
ఇంతలోనే భర్త రూపంలో ఈ అవాంతరం.
“ఏమ్మా.. ఇంట్లో చెప్పొచ్చావా?” సడన్ బ్రేక్‌తో ఆపిన టూవీలర్ డ్రైవర్ తిట్లందుకున్నాడు. ఆలోచనలతో తను చూసుకోలేదు.
నడుస్తూ.. రోడ్డు మధ్యకు వచ్చేసింది. జరిగిన పొరపాటుకు నాలిక్కరుచుకుని రోడ్డువారగా నడవసాగింది.
ఇంకో నాలుగు అడుగులు వేస్తే ఆఫీసొచ్చేస్తుంది. ఆలోచనలు పక్కన పెట్టి గబగబా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగింది.
ఆఫీసు పల్చగా ఉంది. ఒక్కొక్కరే వస్తున్నారు.
తన సీట్లో కూర్చుని ఆ రోజు షెడ్యూల్ చూడసాగింది.
“మేడమ్ మిమ్మల్ని బాస్ రమ్మంటున్నారు..”
తలెత్తి చూస్తే ఎదురుగా బాయ్..
సాధారణంగా బాస్ తనను పిలవడు. ‘కొంపతీసి ప్రోగ్రామ్‌లో ఏమైనా మార్పు జరగలేదు కదా.. తన బదులు మరొకరెవరికయినా అవకాశం ఇస్తున్నారా?’ ఆలోచనలతో సతమతమవుతూ బాస్ రూంలోకి అడుగుపెట్టింది..
“కంగ్రాచ్యులేషన్సు సహస్రా…” అన్నాడు తను సీట్లో కూర్చోగానే.
అర్ధం కానట్టుగా చూసింది. బాస్ అసలు విషయం చెప్పాడు.
“వచ్చే వారం ప్రైమ్ టైమ్‌లో గేమ్ షో ప్లాన్ చేశాం. దానికి నువ్వే యాంకర్, నీతో పాటు మేల్ యాంకర్ జానీ ఉంటాడు.. నువ్వు చెలరేగిపోవాలి..” అన్నాడు ప్రోత్సాహకరంగా.
‘జానీనా..’ ఆ మాట పైకే అనేసింది.
జానీ హయస్టు పెయిడ్ యాంకర్. దాదాపు అన్ని గేమ్ షోల్లో అతనే ఉంటాడు. అతనితో ప్రోగ్రామ్ అంటే.. నిజంగా అదృష్టం. తన మార్కెట్ పెరుగుతుంది. అయితే.. “ సహస్రా… ఎనీ ప్రాబ్లమ్” బాస్ నిలదీశాడు.
జానీ లేడీ యాంకరుతో అవసరానికి మించి చనువుగా ఉంటాడు. వాళ్లను బాగా టీజ్ చేస్తాడు. అదంతా చికాకుగా అనిపించినా.. అతనికున్న క్రేజ్ వల్ల పక్కనున్న వాళ్లు అంతగా అభ్యంతర పెట్టరు.. పైగా అతన్ని ప్రోత్సహిస్తారు కూడా. మళ్లీ మళ్లీ అతనితో ప్రోగ్రామ్ చేయాలని ఉవ్విళూరుతారు.
“తను అలా చేయగలదా?” సహస్ర ఆలోచనలో పడింది.
“అలా చనువుగా ఉంటే.. అది వాసు కళ్ల పడితే..” ఆమె గుండెల్లో రాయిపడింది.
ఆమె మౌనం బాస్‌కి మరో రకంగా అర్ధమయ్యింది. “ఎలాగైనా ఈ ప్రోగ్రామ్‌ని సక్సెస్ చేయండి. వచ్చే నెల నుంచి మీ రెమ్యూనరేషన్ని పెంచాలని నిర్ణయించాం.. ఓ సారి హెచ్.ఆర్. వాళ్లతో మాట్లాడండి…” తను చెప్పదలుచుకున్నది పూర్తయినట్టు పైల్ చదవటంలో మునిగిపోయాడు.
ఆమె అక్కడ నుంచి కదలకపోయేసరికి ప్రశ్నార్థకంగా ఆమె వైపు చూశాడు.
“సర్.. నా కొంచెం సమయం ఇవ్వండి..” అతి కష్టం మీద నాలుగు మాటలు చెప్పి రూంలో నుంచి గబగబ బయటకొచ్చింది.
ఈ లోగా స్టూడియ్ నుంచి పిలుపు వచ్చింది. స్కిప్టు పేపరు చదువుకుంటూ నడుస్తుంటే… ఎదురుగా సురేష్.
“మేడమ్.. మన ప్రోగ్రామ్ సూపర్ హిట్ అయినట్టుంది. రేటింగ్ బాగా వస్తోంది” అన్నాడు పలకరింపుగా నవ్వుతూ..
“అవును. ఇంకా చిన్న చిన్న మార్పులు చేస్తే బావుంటుందనిపిస్తోంది…” అంది.
అంతకు ముందెప్పుడూ ఆమె అంత చొరవగా మాట్లాడి ఎరగదు. సురేష్‌కి ఆశ్చర్యమనిపించింది.
“ఏం చేయమంటారో చెప్పండి మేడమ్” అన్నాడు వినయంగా.
“ఫోన్ కాల్ను తీసుకునేటప్పుడు ఆడపేర్లు ఎక్కువ ఉండేటట్టు చూద్దాం. ఇప్పుడు ఎక్కువ మగపేర్లు వాడుతున్నాం. వాళ్లే ఎక్కువ చూస్తున్నారన్న భావన కలుగుతోంది..” అంది.
“అలాగే ” తలాడించాడు సురేష్. “దానిదేముంది. మంచి పేర్లుంటే చెప్పండి. ఈరోజు దంచేస్తాను” అని ఓ నిముషం ఆగి నవ్వుతూ చెప్పాడు.
“లక్షి, పద్మ, సీత లాంటి పాత చింతకాయ పచ్చడి పేర్లు లేకుండా చూడండి.”
బదులుగా ఆమె కూడా నవ్వింది. ఉదయం ఎఫ్.ఎం. వింటున్నప్పుడు తన చెవిన పడిన పేర్లు గబగబా చెప్పింది. సురేష్ ఆమె చెప్పిన పేర్లు గబగబా ఓ కాగితంపైన నోట్ చేసుకున్నాడు.
ఆ తర్వాత… “మీరు చెప్పింది నేను విన్నందుకు నా వైపు నుంచి చిన్న రిక్వెస్టు మేడమ్..” అన్నాడు మర్యాద ఉట్టిపడే స్వరంతో.
“భలేవారే చెప్పండి..” అంది సహస్ర.
“మీతో కాఫీ తాగే అదృష్టాన్ని నాకు కల్పించండి..” అనడిగాడు.
ఆమె వాచీ చూసుకుంది.
“మన ప్రోగ్రామ్‌కి ఇంకా కొంచెం టైముంది. ఈ లోపు క్యాంటీన్‌కి వెళ్ళొచ్చెయ్యచ్చు” అన్నాడు క్యాంటీన్ వైపు కదులుతూ.
ఆమె అతన్ని అనుసరించింది. కాఫీ తాగుతూ అతను చాలా విషయాలు మాట్లాడాడు.
“మీ అంత అదృష్టవంతురాలు లేరు . ఆఫీసులో అంతా అదే మాట చెప్పుకుంటున్నారు” అన్నాడు.
మిగతా మగవాళ్లలా సురేష్ మాటలతో ముగ్గులోకి దింపే స్వభావం ఉన్నవాడు కాడు. అతనికి ఆడవాళ్లంటే గౌరవం. ముఖ్యంగా తనంటే అభిమానంగా ఉంటాడు.
అందుకీ వెనకాముందూ ఆలోచించకుండా అతనితో క్యాంటీన్‌కి వచ్చింది.
“ఇప్పుడున్న పోటీప్రపంచంలో యాంకర్‌గా రాణించటం కష్టం. అవకాశం వచ్చినప్పుడు గబగబా అందిపుచ్చుకోవాలి. నిచ్చెన మెట్లెక్కి పైకి ఎగబాకాలి.” అన్నాడు.
అతను ఇదంతా ఎందుకు చెబుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు.
అయితే ఆమె ఆలోచనల తేనెతుట్టె కదిలింది. ప్రస్తుతం టీవీ రంగాన్ని నలుగురైదుగురు యాంకర్లు ఏలుతున్నారు. వారి సరసన చేరటానికి తనకు మొదటి అవకాశం వచ్చింది. దాన్ని కాలదన్నుకుంటే ఎప్పటికీ తను ముందుకెళ్లలేదు.. ఆ విషయం తనకు అర్ధమవుతూనే ఉంది.
‘కానీ.. తన భర్త .. వాసు.. తన ఎదుగుదలను ఒప్పుకుంటాడా? మగవాళ్లతో రాసుకుపూసుకు తిరుగుతోందని తనని తూలనాడడూ.. అనుమానంతో తనను హింసించడూ.. ఉద్యోగం మానిపించి ఇంటికే పరిమితం చేయడూ.. మనసుకు నచ్చిన పని చేయటంలో ఉన్న ఆనందం ఇప్పుడిప్పుడే రుచిచూస్తోంది. అంతలోనే తన కల చెదిరిపోయే సమయం వచ్చేసిందా?’ భయంతో ఆమె కాళ్లూ చేతులు వణికాయి.
‘ఎంత మాత్రం వీల్లేదు. తను అనుకున్న స్థానానికి చేరాలి. యాంకర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. అందరూ తనను ఆకాశానికి ఎత్తేయాలి…’ సంకల్పం చెప్పుకుంది తనకు తనే.. సురేష్ చెబుతున్నవేమీ ఆమెకు వినిపించటంలేదు.
అప్పటి వరకూ కలవరపడుతున్న వాసు ఆమె ఆలోచనల్లోంచి జారిపోయాడు. గేమ్ షో ఒక్కటే కళ్లముందు కదలాడుతోంది.
‘గెలవాలి.. ఎలాగయినా గెలవాలి..అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలి..’ అనుకుంటూ క్యాంటీన్‌లో నుంచి బయటకు వచ్చింది.
పక్కనున్న ఇంటర్ కమ్ అందుకుంది. బాస్‌కి చెప్పేసింది. తను గేమ్ షో చేస్తున్నట్టు..
గుండెల్నిండా గాలి పీల్చుకుని మెల్లగా పెదవుల నుంచి వదిలింది.
మనసులో గూడుకట్టుకున్న ఆందోళన, భయం మాయమయ్యాయి.
ఒక్కసారిగా ప్రశాంతత చోటుచేసుకుంది.
గబగబా అడుగులు వేసుకుంటూ స్టూడియోలోకి అడుగపెట్టింది…
ఎన్ని అవాంతరాలు వచ్చినా చెక్కుచెదరకుండా ముందుకు సాగే నేటి తరానికి ప్రతినిధిలా..
నిండైన ఆత్మవిశ్వాసంతో..