[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]
శ్లోకం:
అపా ముద్వృత్తానాం నిజ ముపదిశన్త్యా స్థితిపదమ్,
దధత్యా శాలీనా మవనతి ముదారే సతి ఫలే।
మయూరాణా ముగ్రం విష మివ హరన్త్యా మద, మహో।
కృతః కృత్స్న స్యాయం వినయ ఇవ లోకస్య శరదా. (8)
ఇమా మపి –
అర్థం:
ఉత్+వృత్తానం+అపాం=పైకి ఎగిసిపడుతున్న నీటి కెరటాలకు (పొంగులకు), నిజం=తనదైన, స్థితిపదమ్+ఉపదిశన్త్యా=సహజస్థితి బోధపరుస్తున్నదీ, శాలీనాం+ఫలే (సతి)=వరి (చేలు) ఫలవంతములు కాగా (కంకులు బాగా ఏర్పడగా),
అవనతిం+దధత్యా=వంగుబాటును కలిగిస్తున్నదీ, – మయూరాణాం=నెమళ్ళ గుంపులకు, మదం= మత్తును (బలుపును), ఉగ్రం+విషం+ఇవ=మిక్కుటమైన (తీవ్రమైన) విషం మాదిరి, హరన్త్యా=పోజేస్తున్నదీ – (అయిన), శరదా=శరదృతువు చేత, కృత్స్నస్య+లోకస్య=సర్వజగత్తుకు, వినయః=అణకువ, కృతః=సమకూర్చబడినది, అహో=ఆశ్చర్యం.
ఇమాం+అపి = ఈమెను (గంగను) కూడ…
వ్యాఖ్య:
శరదృతువు అన్నిటికీ సర్వజగత్తులో వినయం నేర్పుతున్నట్లుంది. పొంగిపొరలే నదులు సహజస్థితికి వచ్చాయి. పంటలతో బరువెక్కిన వరిచేలు తలలు వంచాయి. వర్షఋతువులో మదమెక్కి క్రేంకారాలు చేసిన నెమళ్ళు ఆ మత్తు నుంచి శాంతించాయి. ప్రశాంతతకి ఉనికిపట్టుగా శరత్కాల ప్రభావం అంతటా నిండి వుంది.
వృత్తం:
శిఖరిణి – య – మ – న – స – భ – లగ – గణాలు.
అలంకారం:
ఉపమ – ఉత్ప్రేక్షల- సంసృష్టి (కలగలుపు) ఇక్కడ ఉన్నది. (ఉపమాయత్ర సాదృశ్య లక్ష్మీరుల్లసతి ద్వయోః అనీ – సంభావన్యాదుత్ప్రేక్షౌ వస్తుహేతు ఫలాత్మనా ఉక్తానుక్తాన్వేదాద్యత్ర సిద్ధా సిద్ధాస్పదే పరే – అనీ కువలయానందం).
శ్లోకంలో – ఉగ్రం విషం ఇవ హరన్త్యా (మదం) అనే చోట ఉపమ. శరత్తుకు కల్పించబడిన ‘వినయ కల్పనం’ -ఉత్ప్రేక్ష.
శ్లోకం:
భర్తు స్తథాకలుషితాం బహువల్లభస్య
మార్గే కథంచి దవతార్య తనూభవన్తీమ్
సర్వాత్మనా రతికథా చతురేవ దూతీ
గంగాంశరన్న యతి సిన్ధుపతిం ప్రసన్నామ్. (9)
అర్థం:
బహువల్లభస్య+భర్తుః=అనేక భార్యల పట్ల ఆదరణ చూపే భర్త పట్ల, తథా+కలుషితాం=ఆ విధంగా మనస్సు కలిగినదీ, తనూ+భవన్తీమ్=కృశించినదీ (అయిన గంగ విషయంలో), కథంచిత్=ఏదో ఒక విధంగా, మార్గే+అవతార్య=ఆమెను సరైన దారికి తెచ్చి, రతి+కథా+చతుర+దూతీ+ఇవ=శృంగార వ్యవహారాలలో నేర్పరి అయిన దూతిక వలె, సర్వాత్మనా=అన్ని విధాలా, శరత్=శరదృతువు, గంగాం=గంగా నాయికను, నయతి=(భర్త వద్దకు) పంపిస్తున్నది.
వ్యాఖ్య:
సాగరుడు బహువల్లభుడు. అనేక నదులకు భర్త. గంగకు సవతుల కారణంగా అతడిపై ఈసు ఆమె మనసు కలగిపోయింది. ప్రణయ వ్యవహారాల్లో మెలకువలెరిగిన దూతి మాదిరి, గంగను దారికి తెచ్చి, శరత్తు- ప్రశాంత స్థితిలో సాగరుడికి దరిచేరుస్తోందని – నాయికా పరంగా అర్థం. వర్షకాలం గడిచాకా, అంత వరకు బురద పారి వున్నదీ, ప్రవాహపు ఒడిదుడుకులున్నదీ – ప్రస్తుతం సన్నబడినదీ అయిన గంగతో శరత్తుకు దూతిక మాదిరి వ్యవహరించి – ప్రశాంత స్థితికి తెచ్చి కలిపిందని – నదీపరమైన అర్థం.
అలంకారం:
ఉపమ – సమాసోక్తిల- సంసృష్టి (కలబోత).
(సమాసోక్తిః పలిస్ఫూర్తిః ప్రస్తుతేఽప్రస్తుతస్య చేత్ – అని కువలయానందం).
(ఉపమాయత్ర సాదృశ్య లక్ష్మీరుల్లసతి ద్వయోః అని కువలయానందం).
శరత్తు రతికథా నిపుణ దూతిక వలె వ్యవహరించిందనడం ఉపమ. అప్రస్తుత శరత్ ప్రసక్తితో ప్రస్తుత రాజకీయం అంశం స్ఫురిస్తున్నది కనుక – సమాసోక్తి.
వృత్తం:
వసంత తిలక – త – భ – జ – జ – గగ – గణాలు.
వ్యాఖ్య:
ఈ శ్లోకంలో వ్యంగ్యంగా స్ఫురించే ప్రస్తుత కథా సూచన ఉన్నదని, యీ నాటకానికి త్రిభాషా వ్యాఖ్యా అనువాదం సమకూర్చిన ఎన్.సి.చక్రవర్తి వ్రాస్తున్నారు.
“మలయ కేతువు మొదలైన పలువురు ప్రభువుల ఆలోచనలు స్వీకరించడం వల్ల, కలుషితమైన రాక్షసమంత్రి బుద్ధిని చతుర దూతిక వంటి చాణక్య నీతితో, సముద్రం వలె లోతైన చంద్రగుప్తుని పట్ల సుముఖంగా చేయబూనడం – ఇక్కడ వ్యంగ్యార్థం” – అని.
అయితే – ఇదే వ్యంగ్యార్థాన్ని ప్రతిపాదించిన సంస్కృత వ్యాఖ్యాత డుంఢిరాజు – ఇక్కడ అలంకారం రూపకాతిశయోక్తి అన్నాడు (రూపకాతిశయోక్తిస్స్యాత్ నిగీర్యాధ్య వసానతః). ఇది సరికాదని – రామదాసయ్యంగారు. ఈ శ్లోకంలో ఉపమా – సమాసోక్తుల సంసృష్టి చెప్పడమే సహజమని తోస్తున్నది.
చన్ద్ర:
(సమన్తాన్నా ట్యే నావలోక్య) అయే! కథ! మప్రవృత్త కౌముదీ మహోత్సవం కుసుమపురమ్! ఆర్య వైహీనరే, అథాస్మద్వచనా దాఘోషితః కుసుమపురే కౌముదీమహోత్సవః?
అర్థం:
(సమన్తాత్=అంతటా [నాలుగు వైపులా], నాట్యేన+అవలోక్య=నాటకీయంగా పరిశీలించి) అయే=ఏమీ? కథమ్=ఎలాగా? కుసుమపురమ్=పాటలీపుత్రం, అప్రవృత్త+కౌముదీ+మహోత్సవం (ఇవ+దృశ్యతే)=వెన్నెల పండుగ జరుపుకొంటున్నట్టు లేదే!, ఆర్య+వైహీనరే=అయ్యా వైహీనరా, అథ+అస్మత్+వచనాత్+కుసుమపురే+కౌముదీమహోత్సవః+ఆఘోషితః=అసలు నా మాటగా ఈ పాటలీపుత్రంలో వెన్నెల పండుగ (జరగాలని) ప్రకటించడమైనదా? లేదా?
కఞ్చుకీ:
అథ కిమ్.
అర్థం:
అథ కిమ్=అయింది (ప్రభూ).
రాజా:
తత్ కిం న గృహీత మస్మద్వచనం పౌరైః?
అర్థం:
తత్=అలాగైతే, అస్మత్+వచనం=నా మాటను, పౌరైః=నగర ప్రజల చేత, కిం+న+గృహీతమ్=ఎందుకు గ్రహింపబడలేదు (వారెందుకు లక్ష్యపెట్టలేదు)?
కఞ్చుకీ:
(కర్ణౌపిధాయ) శాన్తం పాపం, శాన్తం పాపమ్. పృథివ్యా మస్ఖలితపూర్వం దేవస్య శాసనం కధం పౌరేషు స్ఖలిష్యతి?
అర్థం:
(కర్ణౌపిధాయ=రెండు చెవులు మూసుకుని), శాన్తం+పాపం+శాన్తం+పాపమ్=పాపం శమించుగాక! పాపం శమించుగాక!. పృథివ్యాం=(ఈ) నేలలో, అస్ఖలిత+పూర్వం+దేవస్య+శాసనం=ఇదివరలో జారుపాటెరుగని ప్రభువు వారి ఆజ్ఞ, (ఇదానీం=ఇప్పుడు), పౌరేషు+కధం+స్ఖలిష్యతి=పురజనులలో ఎలాగ జారుపాటుకు గురి కాగలదు?
రాజా:
తత్ కథ మప్రవృత్త కౌముదీమహోత్సవ మద్యాపి కుసుమపురమ్?
అర్థం:
తత్=అలాగైతే, అద్య+అపి=ఇప్పటికీ (నేటికీ), కుసుమపురమ్=పాటలీపురాన్ని (పురంలో), కౌముదీమహోత్సవం=వెన్నెలపండుగ, కథం+అప్రవృత్తం=ఎందుకు జరగలేదు?
శ్లోకం:
ధూర్తై రన్వీయమానాః స్ఫుటచతురకథా
కోవిదై ర్వేశనార్యో
నాలఙ్కుర్వన్తి రథ్యాః పృథు జఘనభరా
క్రాన్తిమన్ధైః ప్రయాతైః।
అన్యోన్యం స్పర్ధమానా న చ గృహవిభవైః
స్వామినో ముక్తశఙ్కాః
సాకం స్త్రీభి ర్భజన్తే విధి మభిలషితం
పార్వణం పౌరముఖ్యాః (10)
అర్థం:
స్ఫుట+చతుర+కథా+కోవిదై=స్పష్టమూ, చమత్కార యుతమూ అయిన కథలు చెప్పడంలో నేర్పర్పులైన (పండితులైన), ధూర్తైః=విటగాండ్రతో (కలిసి), అన్వీయమానాః=చెట్టాపట్టాలు వేసుకొంటున్న, వేశ+నార్యః=భోగపడుచులు, పృథు+జఘన+భరా+అక్రాన్తి+మన్ధైః=తమ నడుముల (చట్టల) బరువు వల్ల మెల్లనైన, ప్రయాతైః=నడకలతో, రథ్యాః=వీధులను (బాటలను), న+అలఙ్కుర్వన్తి=ఎందుకు అలంకరించడం లేదు? పౌరముఖ్యాః+స్వామినః=నగర ప్రముఖులైన గృహస్థులు, ముక్త+శఙ్కాః=జంకు విడిచి, అన్యోన్యం+స్పర్ధమానాః=ఒకరితో ఒకరు పోటీ పడుతూ, గృహ+విభవైః= (తమ తమ) ఇళ్ళ వైభవాలకు తగినట్టు, స్త్రీభిః+సాకం=స్వీయ గృహిణులతో కలసి, అభిలషితం+పార్వణ+విధిః=తమకిష్టమైన పూర్ణిమా వ్రతాన్ని, న+భజన్తే=చేసికోవడం లేదేమి?
వృత్తం:
స్రగ్ధర – మ – ర – భ – న – య – య – య – గణాలు.
వ్యాఖ్య:
ఉత్సవపు సందడి ఏది? ఆ ఉత్సాహం, అలంకరణలు, గృహస్థుల వ్రతవిధులు ఏవి? నా మాటలకు ఏమి విలువ ఇచ్చినట్టు? – అని చంద్రగుప్తుడి కినుక.
(సశేషం)