[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
అష్టావింశతి మే భావీ బుద్ధో నామ జగద్గురుః।
పుణ్యయుక్త నిశానాథే వైశాఖే మాసి కాశ్యప॥
[dropcap]2[/dropcap]8వ కలియుగంలో వైశాఖ మాసంలో పౌర్ణమి రోజు జగద్గురువు బుద్ధుడిని పూజించాలి.
ఇది జాగ్రత్తగా విశ్లేషించాల్సిన అంశం.
నీలమత పురాణంలో నీలుడు ఒక దేవుడిని ఎలా పూజించాలో వివరిస్తూ వస్తున్నాడు. ఎవరినీ వదలడం లేదు. శ్రీ మహా విష్ణువు వైశాఖ పౌర్ణమినాడు బుద్ధుడిగా జన్మించాడని చెప్తూ బుద్ధుడిని పూజించే విధానం చెప్తోంది నీలమత పురాణం.
ఇక్కడ మనం ఒక్క నిమిషం ఆగి ఆలోచించాల్సి ఉంటుంది.
పాశ్చాత్యుల లెక్కల ప్రకారం క్రీ.పూ. ఆరవ శతాబ్దం వాడు బుద్ధుడు. కల్హణుడి రాజతరంగిణి ప్రకారం కశ్మీరులో బౌద్ధం అతి ప్రాచీనమైనది. కల్హణుడి లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే క్రీ.పూ. 15వ శతాబ్దం నుండీ కశ్మీరంలో బౌద్ధం పరిఢవిల్లుతున్నట్లు తేలుతుంది. కల్హణుడి లెక్కలను పాశ్చాత్యులకు అర్థమయ్యే లెక్కలలో కుదించినా క్రీ.పూ.3వ శతాబ్దం ముందు నుంచీ కశ్మీరంలో బౌద్ధం ఉంది. ముఖ్యంగా అశోకుడి తరువాత దేశమంతా బౌద్ధం విస్తరించిందని అధికులు నమ్ముతారు. అశోకుడి మంత్రి ‘మొగ్గలిపుత్ర తిస్స’, వారణాసికి చెందిన మఘంతికను కశ్మీరు, గాంధారంలలో బౌద్ధాన్ని విస్తరింపజేసేందుకు నియమించాడు. ఇతడిని చైనీయులు ‘మధ్యంతిక’ అంటారు. ఇతడు ఆనందుడి శిష్యుడు. కశ్మీరంలో బౌద్ధం విస్తరింపజేసింది ఈ మధ్యంతికుడని చైనీయులు రశారు. కశ్మీరులో కుంకుమ పువ్వు వ్యవసయాన్ని ఆరంభించింది ఇతడేనని అని అంటారు. బౌద్ధంలో అత్యధికుల ఆమోదం పొందిన సర్వాస్తివాదాన్ని ప్రతిపాదించింది మధ్యంతికుడే అంటారు. కశ్మీరు నుంచి ఈ సిద్ధాంతం నలు మూలలకు ప్రాకింది. ఉత్తర భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిందీ సిద్ధాంతం. సర్వాస్తివాద, వైభావికం రాసింది కశ్మీరులోనే. ఈ వ్యాఖ్యానాన్ని వాసుబంధు కశ్మీరులోనే రచించాడు. ఆ వ్యాఖ్యానం రాయడానికి వాసుబంధు అయోధ్య నుంది అశ్వఘోషుడిని కశ్మీరుకు పిలిచాడు. కశ్మీరులో 12 ఏళ్ళు నివసించాడు అశ్వఘోషుడు. బౌద్ధ గ్రంథాలను చైనా భాషలోకి అనువదించిన కుమార జీవుడు కశ్మీరుకు చెందినవాడే. క్రీ.పూ. 383లో విభాష చైనాలోకి తర్జుమా అయింది. కశ్మీరులో పర్యటించిన హుయాన్ త్సాంగ్, కశ్మీరంలో అయిదు వందల బుద్ధ పండితులున్నారనీ, ఆ పండితుల చర్చల ఫలితమే ‘సూత్ర పిటక’, ‘వినయ పిటక’, ‘అభిధర్మ పిటక’ వంటి రచనలనీ రాశాడు.
బౌద్ధ గ్రంథాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన ‘మిళింద పన్హా’ కశ్మీరు నుంచి 12 యోజనాల దూరంలో ఉన్న స్థలంలో గాంధార గ్రీకు రాజు మినాందర్, కశ్మీరు పండితుడు నాగసేనుడికి నడుమ జరిగిన చర్చల సారం. ఈ చర్చల ఫలితంగా మినాందర్ బౌద్ధం స్వీకరించి మిళిందుడయ్యాడు. ఇది క్రీ.పూ. రెండవ శతాబ్దంలో జరిగిందని అంచనా. బౌద్ధ పండితుడు నాగార్జునుడు కశ్మీరుకు చెందినవాడే. మరో వాదం ప్రకారం నాగార్జునుడు కశ్మీరుకు చెందిన ‘నాగ’ జాతి వాడు. అంటే ఒక దశలో నాగులు, పిశాచాలు, మానవులు, సనాతన ధర్మానుయాయులు. అందరూ కశ్మీరులో కలిసి సహజీవనం సాగించేవారన్న మాట. నిజానికి కల్హణ రాజతరంగిణి ప్రకారం కశ్మీరులో బౌద్ధ ధర్మానికి చెందిన మొదటి రాజు సురేంద్రుడు. సౌరక నగరంలో (ఇప్పుడు జోజీలా పాస్ దగ్గర ఉంది) నరేంద్ర భవనం అనే విహారాన్ని కట్టించాడు. ఇలా తవ్వుతూ పోతే కశ్మీరులో బౌద్ధం, సనాతన ధర్మం కలిసి సహజీవనం చేసిన దృష్టాంతాలు కోకొల్లలు కనిపిస్తాయి. ఎప్పుడయితే బౌద్ధులు రాజులయి, సనాతన ధర్మాన్ని అణచివేయాలని ప్రయత్నించారో, అప్పుడు మళ్ళీ శైవం, వైష్ణవం ప్రత్యేకతను నిలుపుకున్నాయి. వారు రాజ్యాధికారం సాధించి బౌద్ధులపై ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ ప్రతీకార చర్యల నుంచి తప్పించుకునేందుకే నాగార్జునుడు దక్షిణాదికి తరలి వచ్చాడు. కశ్మీరు జనజీవనంపై బౌద్ధం ప్రభావం ఎంతగా ఉన్నదంటే, ఇస్లాం స్వీకరించిన బౌద్ధులు బుద్ధుడి లాగా, మహమ్మద్ ప్రవక్త వెంట్రుకకు ఒక మసీదు కట్టి దాన్ని ‘హజ్రత్ బాల్’ మసీదు అన్నారు.
(ఇంకా ఉంది)