[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా కచీ సినిమా ‘ది గుడ్ రోడ్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]
‘ది గుడ్ రోడ్’
దేశంలో కల్లా వయస్సులో అతి చిన్నదైన ప్రాంతీయ సినిమా పరిశ్రమ కచీ సినిమా. గుజరాత్ రాష్ట్రం అరేబియా తీరంలోని జిల్లా కచ్. దీన్నే రాన్ ఆఫ్ కచ్ అని కూడా అంటారు. తెల్లటి ఉప్పు స్ఫటిక మైదానాలు ఇక్కడ ప్రసిద్ధి. ఇక్కడే తెలుగులో ‘మగధీర’ పోరాట దృశ్యాలు కొన్ని తీశారు. కచ్ జిల్లా జనాభా 21 లక్షలు. బాగా వెనుకబడ్డ ప్రాంతం. అయినా సుప్రసిద్ధ వ్యక్తులెందర్నో ఈ ప్రాంతం అందించింది. పారిశ్రామిక వేత్త అజీం ప్రేంజీతో బాటు, సంగీత దర్శకుల్ని అందించింది : కళ్యాణ్ జీ – ఆనంద్ జీ, విజూ షా, సలీం మర్చంట్ – సులేమాన్ మర్చంట్, ఇంకా నాటక రంగ ప్రముఖుడు అలెఖ్ పదమ్సీ, నిర్మాత -దర్శకుడు విపుల్ అమృత్ లాల్ షా, పాకిస్తాన్లో జాతీయ అసెంబ్లీ మొదటి మహిళా స్పీకర్ ఫహెమిదా మీర్జాలతో బాటు, మరెందరో కళాకారుల్నీ, క్రీడా కారుల్నీ, పాత్రికేయుల్నీ అందించిన ఘనత కచ్ కుంది.
ఇక్కడి నివాసితులకి ఇండో – ఆర్యన్ మూలాలుంటాయి. సంచార జాతులూ వున్నాయి. మాట్లాడే భాష గుజరాతీ -సింధీ – అరబిక్ – పర్షియన్ పదాలు కలగలిసిన కచీ భాష. గుజరాత్‌లో గుజరాతీ సినిమాలే చాలా పురాతన పరిశ్రమగా వుంది. అలాటిది కచీ భాషలో కూడా తీయాలనే ఆలోచన వచ్చింది. 2013లో జ్ఞాన్ కొరియా దీనికి శ్రీకారం చుట్టాడు. ఈయన 400 యాడ్ ఫిలిమ్స్ తీసిన తలపండిన దర్శకుడు. 2.25 కోట్ల బడ్జెట్‌తో ప్లాన్ చేశాడు. కచ్ అనే కేవలం ఒక జిల్లా మార్కెట్‌కి కచీ భాషలో ఇంత బడ్జెట్‌లో సినిమా అంటే ఆశ్చర్యమే. కానీ ఇది ఆస్కార్ అవార్డులకి నామినేట్ అయ్యింది. మొదటి కచీ సినిమానే ఆస్కార్‌కి నామినేట్ అయిందంటే దీని గొప్పతనమేమిటో తెలిసి పోతోంది. ఈ గొప్పతనం పేరు ‘ది గుడ్ రోడ్’.
దర్శకుడు జ్ఞాన్ కొరియా ‘ది గుడ్ రోడ్’ తీయడానికి కొన్ని నెలలు ట్రక్కు డ్రైవర్లతో ప్రయాణించాడు, వాళ్లతో కలిసి రోడ్డు పక్క ధాబాల్లో తిన్నాడు. సన్నిహితంగా వాళ్ళ జీవన శైలుల్ని పరిశీలించాడు. వాళ్ళల్లో శ్యాంజీ ధన కేసరియా అనే ఒక డ్రైవర్‌ని ఎంపిక చేసుకుని ప్రధాన పాత్ర నటింప జేశాడు.
ది గుడ్ రోడ్ – ‘రోడ్ మూవీస్’ వర్గంలోకి వస్తుంది. అంటే కథంతా రోడ్డు ప్రయాణంతోనే వుంటుంది. చుట్టూ మైదానాలూ గుట్టలు తప్ప, అక్కడక్కడా రోడ్డు పక్క ధాబాలూ తప్ప, కనుచూపు మేరలో మరేం కన్పించని అనంతమైన రోడ్డు మార్గం. ఆ మార్గంలో సెలవులు ఎంజాయ్ చేసి వస్తూంటుంది ఓ కుటుంబం. డేవిడ్ (అజయ్ గేహీ), కిరణ్ (సోనాలీ కులకర్ణి), వాళ్ళ ఏడేళ్ళ కొడుకు ఆదిత్య (కేవల్ కట్రోడియా). వీళ్ళు ఓ చోట రోడ్డుపక్క ధాబా దగ్గర కారాపి దిగినప్పుడు కుక్క పిల్లని చూసి ఆదిత్య దాని వెంట పరిగెడతాడు. దాన్ని పట్టుకుని దాంతో స్నేహం చేస్తూ ఒకచోట కూర్చుంటాడు. డేవిడ్, కిరణ్ లు కారెక్కేసి వెళ్ళిపోతారు. ఆదిత్య వెనక సీట్లో వున్నాడనుకుంటారు. అది చూసి ఆదిత్య కారు వెంట పరిగెడతాడు. కారు అందక ఏం చేయాలా అని ఆలోచనలో పడతాడు.
లోడ్ వేసుకుని ఒక ట్రక్కు వచ్చి ధాబా దగ్గరాగుతుంది. క్లీనర్ షౌకత్ (ప్రియాంక్ ఉపాధ్యాయ్) దిగి టైర్లు చెక్ చేస్తూంటే ట్రక్కు కింద కుక్క పిల్ల వుంటుంది. దాన్ని తరుముతాడు. ఆదిత్య వచ్చి దాన్ని తీసుకుంటాడు. డబ్బుగల వాడిలా కన్పిస్తున్న ఆదిత్యని వెంటనే ద్వేషిస్తాడు క్లీనర్. పోరా వెళ్ళిపొమ్మని తోసేస్తాడు. ట్రక్కు డ్రైవర్ పప్పు (శ్యాంజీ ధన కేసరియా) డొక్కు ధాబాలో విరిగిన బెంచి మీద కూర్చుని ఎండిన రొట్టె ముక్క తింటూంటాడు. ఎదురుగా ట్రక్కు యజమాని కూర్చుని వుంటాడు. లోడ్ గురించి మాట్లాడుతూంటాడు. డ్రైవర్ పప్పు వేరే ఆలోచిస్తూంటాడు… ట్రక్కుని తీసికెళ్ళి యాక్సిడెంట్ చెయ్యాలి. చేసి చచ్చి పోవాలి. అప్పుడు ఇన్సూరెన్స్ డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో కుటుంబం హాయిగా వుంటుంది. ఇంకా ఇలా చాలీ చాలని సంపాదనతో కుటుంబాన్ని లాగే యాతన పడలేడు గాక పడలేదు…అందుకని చచ్చిపోవాలంతే.
ఈ పథకంతో పప్పు బయల్దేరుతున్నప్పుడు, యజమాని ఒంటరిగా కూర్చుని వున్న ఆదిత్యని చూసి విషయం కనుక్కుంటాడు. ఆదిత్య చెప్పిన నంబరుకి ఫోన్ చేస్తాడు. రెస్పాన్స్ రాదు. వీణ్ణి పోలీస్ స్టేషన్లో అప్పజెప్పమని ట్రక్కు ఎక్కిస్తాడు యజమాని కుక్క పిల్ల సహా.
ఒక తొమ్మిదేళ్ళ పేద అనాధ బాలిక పూనమ్ (పూనం కేసర్ సింగ్) ఒక చోట వేరే ట్రక్కు దిగి నడుచుకుంటూ పోతూంటుంది. ఆమె అమ్మమ్మని వెతుక్కుంటూ తిరుగుతోంది. పోతూంటే ఒక మైదానంలో రంగురంగుల వస్త్రాలు రెపరెపలాడుతూ కన్పిస్తాయి. అక్కడ కొంతమంది అమ్మాయిలు కన్పిస్తారు. అక్కడికి వెళ్తుంది. అది వస్త్రాలకి రంగులద్దే డయింగ్ కేంద్రం. దాని యజమాని పూనమ్‌ని చూసి చేరదీస్తాడు. ఈ డయింగ్ కేంద్రం వ్యభిచార శిబిరం.
డేవిడ్, కిరణ్ లు కారులో చాలా దూరం ప్రయాణించాక ఒక ధాబా దగ్గరాపి చూసుకుంటే కొడుకు ఆదిత్య వుండడు. ఏమయ్యాడు? ఇక కంగారు పుడుతుంది… ట్రక్కు వెళ్లి వెళ్లి ఇంకో ధాబా దగ్గరాగుతుంది. అక్కడ పోలీసు వాహన ముంటుంది. ఆదిత్యని అప్పజెప్పేద్దామని క్లీనర్ అంటాడు. పప్పు మాట్లాడడు. అతడి మనసులో ఏముంది? ట్రక్కుని యాక్సిడెంట్ చేయాలనుకుని ఆదిత్యని ఎందుకు వెంట వుంచుకుంటున్నాడు?
ఆ డైయింగ్ కేంద్రంలో ఆశ్రయం పొందిన పూనంకి అది వ్యభిచార శిబిరమని తెలిశాక ఏమి చేసింది? డేవిడ్. కిరణ్‌లు ఆదిత్య కోసం ఎక్కడెక్కడ గాలించారు? రాత్రి గడిచిపోయి తెల్లారితే ఏం జరిగింది? ఊహించని విధంగా ట్రాక్కుకి యాక్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవర్ పప్పు ఏమయ్యాడు? ఆదిత్య ఏమయ్యాడు?….ఇవన్నీ కథాక్రమంలో వెంటాడే ప్రశ్నలు.
ఈ మూడు కథల ఒక కథ అతి సామాన్యంగా సాగుతుంది. కమర్షియల్ హంగులుండవు. డ్రామా వుండదు, భావోద్వేగాలుండవు, అరుపులుండవు, యాక్షన్ వుండదు. తల్లిదండ్రుల కారు వెంట ఆదిత్య పరిగెడుతున్నప్పుడు అతను కేకలు వేయడు, అరవడు. పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూంటే మనం కూడా ఆలోచనలో పడతాడు. మనల్ని ఆలోచనల్లో పడెయ్యడానికి ఈ తరహా సన్నివేశాలు ఎదురవుతూంటాయి. పాత్రలతో డ్రామా సృష్టిస్తే ఆ డ్రామా మన ఆలోచనలకి అడ్డు పడుతుంది. గురుదత్ తీసిన ‘ప్యాసా’లో ఇలాటి ‘మ్యాటరాఫ్ ఫ్యాక్ట్’ శైలి చిత్రీకరణే ఇక్కడా వుంటుంది. డ్రామా లేకుండా ‘ప్యాసా’ ఎలా ప్రభావితం చేసిందో అదే ఇక్కడ బలాన్ని ప్రదర్శిస్తుంది.
ఒకటి రెండు దృశ్యాల్లో తప్ప కెమెరా వున్నట్టు కూడా అన్పించదు. కెమెరా ఈ హైవే ప్రయాణంలో సామాజిక పరిస్థితిని తన కంటితో గమనిస్తూంటుంది… ప్రయాణాల్లో పిల్లలతో తల్లిదండ్రుల నిర్లక్ష్యం, పోలీసుల అవినీతి, కుటుంబాన్ని పోషించుకోలేని నిస్సహాయ ట్రక్కు డ్రైవర్ల చట్టవ్యతిరేక ఆలోచనలు, అమాయక బాలికలకి ఎరవేసే వ్యభిచార కేంద్రాలు, ధనిక పేద తారతమ్యాలు, ప్రతిఫలం ఆశించకుండా ధనికులకి పేదలు చేసే సాయాలు, హైవేల మీద నిర్లక్ష్యంగా వాహనాల సంచారాలు వగైరా పనిగట్టుకుని చూపిస్తున్నట్టు గాక, పారే సెలయేరంత సరళంగా ప్రవహిస్తూంటాయి. డబ్బున్న ఆదిత్యని మొదట ద్వేషించే క్లీనర్, ఆదిత్య నీళ్ళు వొలకబోసుకుని షర్టు తడుపుకుంటే, డ్రైవర్ పాత బనీను తీసిస్తాడు. అది వేసుకుని ఆదిత్య క్లీనర్ కుర్రాడిలాగే వుంటే, అప్పుడు స్నేహం చేస్తాడు క్లీనర్.
అక్కడక్కడా అవసరమైన శబ్ద ఫలితాలు తప్ప సంగీతం అతి తక్కువగా విన్పిస్తుంది. నటీ నటులెవరిలో నటన కన్పించదు. పరిస్థితి కూడా నాటకీయంగా వుండదు కాబట్టి. ముఖ్యంగా పప్పూ డ్రైవర్ డ్రైవరంత సహజంగా బిహేవ్ చేస్తాడు. టీ తాగి డబ్బులిచ్చే తీరు కూడా డ్రైవర్ల తీరులాగే వుంటుంది. నిజజీవితంలో తను డ్రైవర్ కాబట్టి. రోడ్డు మీద టైరు మార్చాల్సి వచ్చిన ఆపినప్పుడు, చావాలనే ఆలోచనలతో వున్న పప్పూ డ్రైవర్ ముందు అటూ ఇటూ పరిగెడుతూ- “ఛోడో కల్ కీ బాతేఁ … కల్ కీ బాత్ పురానీ…” అని పాత ముఖేష్ పాట పాడుకుంటూ ఆదిత్య ఒక గమ్మత్తయిన సన్నివేశాన్ని సృష్టిస్తాడు.
దర్శకుడు జ్ఞాన్ కొరియా దృక్కోణంలో ఇవన్నీ కొన్ని జీవితాలు. ఈ జీవితాల్ని ఆస్కార్ వరకూ తీసికెళ్ళాడు. అక్కడ గెలవకున్నా జాతీయ పురస్కారంతో ఇంట గెలిచాడు. అతడికి తోడ్పడిన సాంకేతికులు అమితాభ సింగ్ (ఛాయాగ్రహణం), పరేష్ కాందార్ (కూర్పు), రజత్ ఢలోకియా (సంగీతం).
2013 తొలి కచీ సినిమా ఇలా ప్రతిష్టాత్మకంగా ప్రాణం పోసుకున్నా, ఆ తర్వాత 2016 వరకూ ఇంకో ఐదు తీశారు. ఇవన్నీ కమర్షియల్ పంథాలో రెగ్యులర్ కామెడీలే. వీటి తర్వాత మౌనంగా వుంది కచీ ఉప ప్రాంతీయ సినిమా పరిశ్రమ.