[dropcap]ఇం[/dropcap]కా లెక్చరర్ క్లాస్ లోకి రావడానికి పదిహేను నిముషాలు సమయం ఉంది.
పోకిరీ కుర్రాళ్లమంతా తరగతి గది బయట కారిడార్లో నిలబడ్డాం.
బుద్దిమంతులంతా అక్కడక్కడ బెంచీల్లో కూర్చుని సర్ అడిగే ప్రశ్నలకు కాబోలు ప్రిపేర్ అవుతున్నారు.
బయట నిలబడి కుళ్ళజోకులేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నా ఎదురుచూస్తున్నది ఒకే వ్యక్తి కోసం అని మాకూ తెలుసు… లోపలి వాళ్లకూ తెలుసు.
మేము బయటపడినవాళ్ళం… వాళ్ళు బయటపడకుండా దొంగచూపులు చూస్తూ బయటపడని వాళ్ళు. అంతే తేడా.
మరో మూడు నిముషాల్లో మా ఎదురుచూపులు పళ్లయ్యాయి.
ఆమ్లెట్లు వేసుకునేటంత పెద్ద గుడ్లు కళ్ళల్లోంచి వెల్లుకొచ్చాయి.
విశేషం ఏమిటని అడగరే?
మా వనదేవత వస్తోంది…
అడుగులో అడుగు వేసుకుంటూ.. ఒక చేత్తో తన పుస్తకాలను ఎడమ చేత్తో తన వక్షానికి హత్తుకుని మా మస్తకాల గతి తప్పించేలా కుడి చేత్తో కట్టుకున్న ఎర్రటి పూలు ఎంబ్రాయుడరీ చేసిన అమెరికన్ జార్జిట్ తెల్లచీర కుచ్చిళ్ళు హంసలయల పాదాలు ఒలికించే కులుకు నడకలకడ్డు రాకుండా పట్టుకుని ఒద్దికగా నడుస్తూ బయట నిలబడ్డ మాకేసి చిరునవ్వుల పువ్వులు రువ్వుతూ మాముందునుంచి లోపలికి అడుగు పెట్టి తన సీట్లో కూర్చుంది జయశ్రీ.
వేసుకున్న రెండు జడలలో ఒక జడ లోని తెల్లని పువ్వు ఆమె శిరోజాలలో నిలబడినందుకు గర్వంగా నవ్వుతోంది.
అంతే… అందరం బిలబిలలాడుతూ ఆవిడ వెనుక రెండు బెంచీల్లో స్థిరపడ్డాం. మిగతా తొమ్మిది మంది కామరాజులే… వాళ్ళ చూపులకే శక్తి ఉంటే ఆమె వొళ్ళంతా ఎపుడో చిల్లులడిపోయేది.
అలా అని నేను గొప్పవాడిని కాదండోయ్… కామరాజుని కాదు… ప్రవరాఖ్యుడిని కాదు.
సౌందర్యారాధకుడిని. నిరూపమాన సౌందర్యవతి అయిన ఆమె రాజనర్తకిలా అనిపిస్తుంది నాకు… ఎవడో ఆమె కోసం బంగారు పూలతో పూజ చేస్తున్న రాజు? అనుకుని నిట్టూరుస్తుంటాను.
పువ్వులంటే గుర్తొచ్చింది.
జయశ్రీ బాగా డబ్బున్నవారి ఏకైక కుమార్తె. రోజుకో రకం డ్రెస్‌లో దర్శనమిస్తుంది. ఒకరోజు చుడీదార్, ఒకరోజు గాగ్రా, ఒకరోజు హాఫ్ సారీ, ఒకరోజు పంజాబీ, ఒక రోజు ఫుల్ శారీ… అయినా సరే రెండు జడలూ మానదు… ఒక జడలో తెల్లపూవు అదీ ఖచ్చితంగా టెంకీస్ వైట్ పూవు ఒకటే ఒకటి పెట్టుకుని వస్తుంది.
కాలేజీకి వచ్చాక లేడీస్ రూమ్ నుంచి మెట్లు దిగబోతుంటే ఆ పక్కన ఈ పక్కన వరుసగా ఆమె కోసమన్నట్లు టెంకీస్ పూలచెట్లు వరుసగా నిలబడి ఈరోజు మనలో ఎవరిదోనే అదృష్టం అన్నట్టుగా చూస్తుంటాయి.
వాటిల్లో అరవిరిసిన ఒక పుష్పాన్నీ మాత్రమే కోసుకుని కుడివైపు జడలో పెట్టుకున్నాకనే ఆమె క్లాస్‌లో అడుగు పెట్టేది.
అందరూ ఆమెను జుర్రేసుకుంటుంటే…
యధాలాపంగా ఆమె జడను పరిశీలించాను. రోజూ ఆమె వెనుక సీటు కోసం వంతులు వేసుకున్నాం. ఈరోజు ఆమె వెనుక కూర్చున్నవాడు మరుసటి రోజు స్థానం పక్కకి జరగాలి. సంఖ్యలలో ఒకట్లు, పదులు, వందలు, వేలు… అలాగా. అనుకోకుండా ఈరోజు ఆమె వెనుక కూర్చుని ఆమె సౌందర్యాన్ని ఆరాధించే అవకాశం నాకే వచ్చింది.
ఆమె తలలో ఏదో కొత్త పువ్వు.
తెలుపుదే… ఎక్కడో అపుడపుడు చూసినట్టుంది గానీ ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు. ఇంతలో పాఠ్యబోధనా రాక్షసుడు… అదేనండీ లెక్చరర్ గారు వచ్చేసారు… భౌతిక శాస్త్రము జఢత్వశాస్త్రమనుకుంటే… అంతకన్నా జఢత్వంతో బోధించి తనపని అయినట్టు వెళ్లిపోతాడాయన… జఢత్వంతో మెరిసిపోయే బట్టతలతో…
పాఠం ఎవడు విన్నాడు గనక… మా ఎదుట వరూధిని ఉండగా…
క్లాస్ అయ్యాకా తరువాతి లెక్చరర్ వచ్చేలోగా సినిమా ఇంటర్వెల్‌లో బయటకు వచ్చేవాళ్ళల్లా మా కుర్రాళ్లంతా బయటకు వెళ్లిపోయారు.
జయశ్రీ హఠాత్తుగా నావైపు తిరిగి పలువరుస మెరుస్తుండగా అడిగింది.. “ఉదయ్ గారు… మీరు వెళ్లలేదేం? మీ మంద తోటి?” అని అడిగి నా కళ్ళు మెరవడం చూసి… మళ్లీ తానే…
“ఏమిటంత ఆశ్చర్యంగా చూస్తున్నారూ?” అడిగింది.
సబ్జెక్ట్‌లో అనుమానం వస్తే లెక్చరర్ గారిని చీల్చి చెండాడేసి అనుమానం తీర్చుకునే నేను “మీరు ఈ చీర కట్టులో చాలా బాగున్నారు రోజూ కంటే. అయినా ఒక్కటి అడుగుతాను. ఏమీ అనుకోరుగా” అన్నాను.
“నాకు చీరలంటేనే ఇష్టమండి. మా మమ్మీ అన్నిరకాల ‘ఈ వయసులోనే కట్టుకోవాలిరా…’ అంటుంది. నాకు నా ఆనందం కంటే నన్ను ప్రేమించేవాళ్లంటే ఇష్టం… ఆ ఇపుడు నిర్మొహమాటంగా అడగండి.” అంది బెంచిమీద కుడి చెయ్యి విశాలంగా చాపి.
ఆమె చెయ్యి నేవళికాన్ని పరిశీలిస్తూ అన్నాను.. “ఈరోజు టెంకీస్ పూయలేదా? నాతో చెబితే నేనే తెచ్చేవాడిని కదా.”
ఆమె నాలిక కరుచుకుని తలమీద చిన్నగా కొట్టుకుని నాకు కన్నుకొట్టింది.
“కనిపెట్టేసారన్నమాట…” అంది.
“అది టెంకీస్ కాదు. రోజూ చూస్తున్న పువ్వు కాదు. చెప్పరా ప్లీజ్”అడిగాను.
“ఈవేళ విచిత్రంగా ఒక చెట్టూ పూయలేదండి. మీకు తెలుసుగా…. వైట్ నా సెంటిమెంట్. చెబితే నవ్వరుగా?” అంది మరింత చిలిపిగా నవ్వుతూ…
ఆ మనోహరి ముందు ఏం నవ్వుతాను?
“నవ్వను చెప్పండి”అన్నాను
“అదే… ఏంచేయాలో తోచలేదు… జడలో వైట్ పూవు లేకపోతే ఆ రోజంతా నాకు పిచ్చెక్కుతుంది. మెట్ల దగ్గర నిలబడి చుట్టూ చూసాను. మన పి.డి. గారు మన చేత గార్డెనింగ్ చేయించారుగా. అందులో ఆనపపాదు విరగబూసి ఇపుడే పిందెలు దిగుతోంది. బాగా విరుసిన పువ్వు కోసి పెట్టేసుకున్నాను” అని నవ్వేస్తూ అటు తిరిగిపోయింది…
నేను పగలబడి నవ్విన నవ్వుకి మావాళ్ళంతా ఆరోజు కూలి కూలి ఏడుస్తూనే ఉన్నారు.
ఆ రోజంతా నవ్వుతూనే ఉన్నాను తలుచుకుని తలుచుకుని.
ఇపుడు ఆనపకాయ చూసినప్పుడల్లా ఆ తెల్లని పువ్వులో “జయశ్రీ” కనిపిస్తుంది.
ఎక్కడుందో… ఏం చేస్తోందో…
ఈ అనుభవం మా ఆవిడతో చెబితే నవ్వి నా నెత్తిమీద బుడిపే రాని మొట్టికాయ వేస్తూ…”ఎక్కడో చోట గుమ్మడికాయలా సుఖంగా ఉండి ఉంటుంది” అంది.