ఎండమావులు-3

0
4

[box type=’note’ fontsize=’16’] గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘ఎండమావులు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది మూడవ భాగం. [/box]

6

[dropcap]త[/dropcap]ను జీవితంలో ఏ సుఖపడింది? నిజంగా సుఖపడిందా? తన ఆశలు, ఆకాంక్షలు నెరవేరాయా? నిజమైన ఆనందం తన జీవితంలో లభించిందా? ఊహూఁ….. ! లేదే! అలా ఆత్మవిమర్శ చేసుకుంటున్న సరస్వతికి నిజమైన సుఖం జీవితంలో లభించక పోయినా మాతృత్వం మాత్రం లభించింది. పండంటి పిల్లవాడికి తల్లిగా సమాజంలో ఆమె ఓ మెట్టు మీదకి ఎదిగినా అసంతృప్తితో ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్న సరస్వతి సుఖం – సంతృప్తి స్థానం నుండి కొద్దిగా క్రిందకు దిగజారినట్లనిపించిందామెకి.

తన జీవితమే సంతృప్తిగా గడవటం లేదు. తనకి సంతానమా? తన సంతానమే సుఖపడ్తుంది? ఏం సుఖం బాపుకుంటుంది? ఇప్పటి నుండి పిల్లలు వద్దంటే తన మాటేవరేనా వింటే కదా! ముసలాళ్ళకంటే చాదస్తం. మరి అతనో తను అబార్షన్ చేయించుకుంటానంటే అతను విన్నారా? ఈ విషయంలో తను పట్టుపట్టినా ఓడిపోయింది. అతనిదే పై చేయి అయింది. ఇలా సాగిపోతున్నాయి సరస్వతి ఆలోచన్లు.

“ఈ లేమికి ఆర్థిక ఇబ్బందులకి తోడు ఇక సంతానం పుట్టుకొస్తే ఇల్లూ-వొళ్ళు అంతా గుల్ల. తను అనుకున్నట్టే అయింది. పిల్లడు పుట్టాడు. వాడికి సరస్వతి పాలు ఇవ్వడానికి ఇష్టపడలేదు. అందుకే చంటి వాడికి పోతపాలు అలవాటు చేయవల్సి వచ్చింది. ఈ విషయం మీద అత్తగారు ఎంత రాద్దాంతం చేసింది?

పిల్లలకి పాలిస్తే తన అందం తరిగిపోతుంది. శక్తి సన్నగిల్లుతుంది అన్నదే తన భావన నా భావాన్ని ఖండిస్తూ అత్తగారు చాలా హంగామా చేసింది. “మా కాలంలో ఇలా ఎరగవమ్మా! బిడ్డకి పాలిస్తే అందం తరిగిపోతుంది, శక్తి సన్నగిల్లిపోతుందని మేము అనుకునే వాళ్ళమి కాదు. మూడేళ్ళు వచ్చే వరకూ నా దగ్గర పిల్లలు పాలు త్రాగేవారు. తల్లిపాలలో ఉన్న తృప్తి-ఆనందం-ఆరోగ్యం పోత పాలలో లభిస్తుందా?” సణుగుతూ చిరాకు పడ్తూ ముఖం చిట్లించేది అత్తగారు. సరస్వతి అత్తగారి సణుగుడు వినీ విననట్లు ఊరుకునేది. అలా సమాధానం ఇయ్యకుండా ఉండడం ఈ మధ్య క్రొత్తగా నేర్చుకుంది సరస్వతి.

ఆ తరువాత కూడా రెండు మూడు సందర్భాల్లో సారధి సరస్వతితో తల్లిపాలు బిడ్డకి త్రాగించటం చాలా మంచిది. ఆరోగ్యం కూడా! అని అన్నాడు సారధి మాటలు ఆమెకి నచ్చేవి కావు.

“నేను ఈ మాత్రం కూడా అందంగా ఆరోగ్యంగా ఉండటం మీకిష్టం లేదా? నేను పాల డబ్బాలు కొనలేను, నాకు కొనే శక్తి తాహత లేదు అని ముక్కుసూటిగా చెప్పచ్చుకదా! ఎందుకొచ్చిన ఈ ఆర్గ్యుమెంటు?” సరస్వతి సారధిని తక్షణంగా సూటిగా చూస్తూ అడిగింది. మాట్లాడకుండా అచటి నుండి కదలిపోయాడు అతను.

“నేను సంగీత పాఠాలు చెప్పి డబ్బు సంపాదిస్తాను. వేన్నీళ్ళకి చన్నీళ్ళు తోడయినట్లు ఉంటుంది. సంపాదించేవారు మీరొక్కరు; పంచుకుని తినేవాళ్ళమి చాలామందిమి. మీరు ఎంతకని కష్టపడ్డారు?” ముందరి కాళ్ళకి బంధం వేస్తూ అడిగింది సరస్వతి ఓ రోజు సారధిని. అతను ఆలోచనలో పడ్డాడు.

అవును సరస్వతి చెప్పింది నిజమే ఎంతకని తనొక్కడే కష్టపడగలడు? ఇవతల తనవారిని, అవతల అత్తగారి తరుపువాళ్ళని ఆదుకోవడం ఆర్థికంగా తనకి కష్టంగా ఉంది.

పిల్లడికి పాలడబ్బాలు కొనలేక-కొనలేనని చెప్పలేక మథన పడ్తున్నాడు తను సరస్వతి కొచ్చిన విద్యను ఎందుకు సార్ధకం చేసుకోకూడదూ? ముక్తి-మొక్షం రెండు లభిస్తాయి. ఇలా ఆలోచిస్తున్నాడు సారధి అతను తన మాటలకి అనుకూలంగా స్పందిస్తూ ఉండడం అనిపించిన సరస్వతి ఏదో అనబోయింది.

“సరే! నీవన్నట్లే చేద్దువుగానివులే!” గిర్రున తిరిగి చకచకానడుచుకుంటూ అచటి నుండి కదిలిపోయాడు సారధి.

సారధి మెదడు నిండా రకరకాల ఆలోచన్లు నిజమే! సరస్వతిలో ఉన్న సంగీత కళ సార్థకం అవుతుంది. కళకళకోసం అన్న వాదన ఉన్నా తమలాంటి మధ్య తరగతి మనునష్యుల జీవితాల్లో కళ కళకోసం అని అనుకుంటే జరిగే పనికాదు. తమలాంటి వాళ్ళకి కళ కాసుల కోసమే అనే పరిస్థితి కూడా తటస్థపడుతోంది. దీని వలన తన కుటుంబం యొక్క ఆర్థిక ఇబ్బందులు పరిష్కారమౌతాయి.

తన భార్య సరస్వతి తన ఆర్థిక పరిస్థితికి బాసటగా నిలుస్తుందన్న ఆలోచన సారధికి ఆనందాన్ని కలిగించింది.

కాని సరస్వతి భావాలే వేరు, ఆమె ఆలోచనలు వేరు. ఆమె ఆలోచనల ప్రకారం ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు మధ్యతరగతి కుటుంబాల్లో మామూలే. అవకాశం ఉన్నప్పుడు భోగాలు అనుభవించడానికి వెనకాడ కూడదు. భోగాలు అనుభవించాలంటే కావలసింది డబ్బు. ఈ సమాజంలో అదిలేని మనిషికి విలువలేదు. డబ్బుకి లోకం దాసోహం అంటారు. డబ్బు సంపాదించడమే ప్రాధాన్యం కాని అది ఎలా సంపాదించే మన్నది ప్రాధాన్యం కాదు కొందరికి ఇలా సాగిపోతున్నాయి సరస్వతి ఆలోచనలు.

తండ్రికి సంగీత కళ మీద ఉదాత్తమైన భావాలు కలిగి ఉంటే అదే కళ మీద కూతురు భావాలు మరోలా ఉన్నాయి. సరస్వతి వివాహవ్యవస్థ అంటే ఏంటో కూడా ఆలోచించి అర్థం చేసుకునే స్థితిలో లేదు. ఆ సమయంలో ఆమె దృష్టిలో వివాహం అంటే తినడం, త్రాగడం, అవకాశం ఉంటే భోగాలు అనుభవించడం. అలాంటి జీవితమే ఆమె కోరుకుంటోంది. ఎలాంటి చీకూచింత లేని జీవితం ఆమెకు కావాలి. సమస్యలతో కూడిన జీవితం ఆమెకు అక్కర్లేదు. అయితే ఆమెకి ఆర్థిక ఇబ్బందులు పుట్టినింట్లో అవే సమస్యలు, మెట్టినింట్లో అవే సమస్యలు ఒకే విధంగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఆమెకి నిజమైన ఆనందం జీవితంలో ఎలా లభిస్తుంది?

వివాహ వ్యవస్థ గురించి సరస్వతి ఆలోచన్లు ఒకలా ఉంటే సారధి ఆలోచనలు మరోలా ఉన్నాయి ఇద్దరి ఆలోచనలో ఎంత తేడా?

సారధి ఉద్దేశ్యంలో వివాహం రెండు ఆత్మల యొక్క పవిత్ర బాంధవ్యం. వాస్తవిక గృహస్థ జీవనానికి వివాహంతో శుభారంభం అవుతుంది. సరస్వతి అహం ఆమె వైభవ వ్యామోహం ఒక్కొక్క సమయంలో అతడిని వ్యాకుల పరిచేది. అది ఒక విధమైన మానసిక రోగం, ఎక్కువ ధనవంతురాలిగా చలామణీ అయి వైభవం అనుభవించాలనే మానసిక రోగం సరస్వతిది అని అనుకొనేవాడు.

ఒక్కొక్క పర్యాయం సారది చలనం లేని మట్టిబొమ్మ, ప్లాస్టిక్ బొమ్మ అని అనుకునేది సరస్వతి. మనో విజ్ఞానం ప్రకారం మానవ వ్యక్తిత్వం రెండు విధములు బహుర్శుఖి, అంతర్శుఖి. సరస్వతి వ్యక్తితం బహుర్శుఖి. ఇటువంటి వ్యక్తులు బయటకు చూడడానికి బయట ఆడంబరాలవేపు ఆసక్తి ఉన్న వాళ్ళలా కనిపిస్తారు. ఇటువంటి వాళ్ళు భావనలు, కోరికలు, అనే కల్పనా ప్రపంచంలో విహరిస్తారు, సంకుచితమైన స్వార్ధపరత్వ వలన సుఖమైన దాంపత్య జీవితం బీటలు పడుతుంది. భౌతిక ఆనందం కోసం కళను హ్యేయంగాను, విలువలేనిదిగా ఇలాంటి మానసిక రోగులకు అనిపిస్తుంది. .

సారధిని భర్తగా పొందిన తరువాత ఏదో రాజ్యాన్ని జయించినట్టుగా, సంపద పొందినంతగా సరస్వతి సంబర పడిపోలేదు. ఆ రాజ్యాన్ని సంపదని సురక్షితంగా ఉంచడం ఆమెకి తెలియదు. ఆమె మానసిక స్థితి ఇలా తయారవడానికి కారణం పరిస్థితులు, పరిసరాలు. ఆమె స్వభావం లేమిలో పుట్టి పెరిగింది. తన స్వభావానికి తగ్గ కోరికలు, అభిరుచులు నెరవేరలేదు. పోనీ పెళ్ళి అయిన తరువాత అయినా తన జీవితంలో మార్పులేదు తనకి ఏ లోటూ లేకుండా చూసుకుంటానని సారధి ఆమెకి మాట ఇచ్చాడు.

పెళ్ళయిన తరువాత తనమాట నిలబెట్టుకోడానికి అతను శాయాశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నాడు కాని అతని ఆ ప్రయత్నం ఆమెకి సంతృప్తి నివ్వలేదు. తను చేసే పనిలో సరస్వతికి సంతృప్తి కలుగుతుందన్నప్పుడు ఆమె మాట తనేందుకు కాదనాలి ఇదే సారధి ఆలోచన. అందుకే సర్వతి సంగీత పాఠాలు డబ్బు సంపాదిస్తానంటే వద్దని అనలేకపోయాడు. అంతేకాదు ఊరికే కూర్చున్నవాళ్ళు మనసులో అనేక ఆలోచనలు ప్రవేశించి అసంతృప్తికి గురి చేస్తాయి. అందుచేత ఏదో వ్యాపకం ఉంటే ఆ అసంతృప్తిని మరిచిపోవడానికి అవకాశం కలగుతుందని కూడా అనుకున్నాడు సారధి.

7

సత్యమూర్తి గవర్నమెంట్ లాయర్ ఆ పట్టణానికి. అందుకే ఆ ఊరంతటలో అతని పేరు మారు మోగుతోంది. లక్ష్మి సరస్వతుల కలయిక చాలా అరుదు అనే నానుడి ఉంది, కాని దాన్ని తప్పని బుజువు చేస్తూ అతని ఇల్లు లక్ష్మి సరస్వతుల కాణాచిగా విరాజిల్లుతోంది. లక్ష్మి ఉంటే చాలు సరస్వతిని కొనవచ్చు, లక్ష్మికి సాధ్యం కానిదీ, తలవొంచని పనైనా, వస్తువయినా ఏదీ లేదన్నదే అతని భావన.

ఇంటర్ అత్తెసరు మార్కుల్లో పాసయిన మేనల్లుడు కాబోయే అల్లుడు మోహన్‌కి తన పలుకుబడి. తన దగ్గరున్న డబ్బుతో మెడిసన్ సీటు తెప్పించడంలో సఫలీకృతుడయ్యాడు. అతడ్ని అలా చదివించడంలో సత్యమూర్తి స్వార్థం కూడా ఉంది.

తన అవిటి కూతురు సుందరిని మేనల్లుడికి అంటగట్టాలన్న ఆలోచన అతని చేత ఆ పని చేయించింది. కానీ నిస్వార్థంతో మాత్రం కాదు. పైసా ఖర్చు పెడే రెండు పైసలు లాభం వస్తుందా రాదా? ఈ కేసు టేకప్ చేసి గెలిపిస్తే తనకి లాభం ఉందా లేదా? అని వ్యాపారి మనస్తత్వంతో ఆలోచించే సత్యమూర్తి నిస్వార్థంతో, బంధుప్రీతి, అనురాగం, ఆప్యాయత అనే భావనతో మనో వికారాల్లో ఈ పని చేస్తున్నాడా? అంటే ఆ పనిని ఎవ్వరూ నమ్మరు, నమ్మలేరు కూడా.

ఏదో విధంగా చదువు పూర్తిచేసి డాక్టరు అనిపించుకున్నాడు మోహన్. అవిటితనం, దానికి తోడు అందవిహీనంగా అగుపిస్తున్న మేనమామ కూతురు సుందరికంటే అతనికి మేనమామ సిరిసంపదలు, సమాజంలో అతని కున్న పలుకుబడి ఇవే అందంగా కనిపించేవి. వాటిని తలుచుకోగానే అందవిహీన సుందరి అతని కళ్ళకి అందంగా అతి సుందరంగా కనబడేది. అలా కనిపించనప్పటికీ కనిపించినట్టు నటించేవాడు.

“నర్సింగ్ హోమ్ కట్టించాలా?” మెడిసన్ పూర్తిచేసిన మేనల్లుడ్ని అడిగాడు సత్యమూర్తి “మీ ఇష్టం మామయ్యా! నేను మీకు చెప్పాలా? మీకే అన్ని విషయాలు తెలుసు” లౌక్యంగా మాట్లాడేవాడు మోహన్.

అతని మాటలకి ప్రవహించే సెలయేరులా గలగల నవ్వాడు సత్యమూర్తి “అబ్బాయ్! నీవు ప్రాక్టీసు పెడ్తే దేశంలో సగం జనాభా తరిగి పోతుందిరా!” తిరిగి ఉరుము ఉరిమినట్లు గలగల నవ్వుతూ తిరిగి అన్నాడు సత్యమూర్తి,

“మంచి జోక్‌గా మాట్లాడుతావు మామయ్యా! ఎంతేనా మీది లాయర్ బుర్ర. అబద్దాన్ని నిజంగా నిజాన్ని అబద్దంగా నిరూపించగల ప్రముఖ లాయరుగా పేరు తెచ్చుకున్న మీకు మేనల్లుడినైన నేను మీ బాటలోనే నడుస్తానని మాట ఇస్తున్నాను” మందస్మిత వదనుడై అన్నాడు మోహన్.

“అది జోక్ కాదు రా అబ్చీ! సీరియస్‌గానే చెప్తున్నాను – లాయరైనా, డాక్టరైనా మొదటి కేసులోనే విజయం పొందితే వారికి ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. అనుభవపూర్వకంగా చెప్తున్నాను మొదటి కేసే ఫీలైతే వారి భవిషత్తు శూన్యం. ఒకసారి అప్రయోజకుడు అన్న ముద్ర పడితే దానిని చెరుపు కోవడం చాలా కష్టం” ఇలా హితోపదేశం చేస్తున్న సత్యమూర్తి ఆనాడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునికి గీతోపదేశం చేసిన శ్రీకృష్ణపరమాత్మునిలా కనిపించాడు మోహన్‌కి.

“ఒరే అబ్బీ! నీవు చేత్తో కత్తి పట్టుకుంటే ఎవ్వరూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోనక్కర్లేదు. జనాభా తరిగిపోతుందన్న భయంగా ఉందిరా. ఎందుకంటే డొనేషన్లు కట్టి డాక్టరు కోర్సులో జాయినైన నీవు దండయాత్రలు చేసి చేసి చివరికి డాక్టర్ననిపించుకున్నావు” మేనల్లుడి సమర్థత మీద నమ్మకం కుదరక అన్నాడు సత్యమూర్తి.

“పో మామయ్యా! నీకంటికి నేను అంత దద్దమ్మలా కనిపిస్తున్నానా? నేను ఎంత పేరు తెచ్చుకుంటానో చూడు. అప్పుడే నీవంటావు నామేనల్లుడు ఎంత సమర్థుడు. నేనే తప్పుగా అంచనా వేసుకున్నానని”.

అయితే సత్యమూర్తికి మోహన్ మాటల మీద కాన్సిడెన్స్ లేదు. అపనమ్మకమే. అయితే పిల్లనిచ్చుకుంటున్న తండ్రి కాబట్టి నమ్మకం కుదిరినట్టు నటించాలి అని అనుకున్నాడు.

“సరేలే!” తలపంకించి తిరిగి కోర్టుకి అవసరమైన కాగితాలు చూడ్డంలో లీనమయ్యాడు సత్యమూర్తి. అతను ఇంకేమైనా విషయాలు చెప్తాడేమో అని ఎదురు చూసిన మోహన్‌కి నిరాశే ఎదురైంది. కొంతవరకూ అక్కడ తచ్చాడిన తరువాత అతను బయటకు నడిచాడు.

8

సాయంత్ర సమయం నీరెండ పుడమి పైకి ప్రసరిస్తోంది. బయట నీరెండ సోయగం చూపరుల్ని ఆకట్టుకుంటూ ఉంటే ఎ.సి.రూమ్‌లో చల్లదనం సరస్వతి కోమలమైన చేతివ్రేళ్ళు వీణ తీగల్ని సుతారంగా మీటుతున్నాయి.

ఆమె సన్నని కంఠం నుండి ‘నీ దయ రాదా………..రామా!’ అంటూ త్యాగరాయ కృతి ఒకవైపు కోమలత్వం, మరోవైపు కరుణపూరితమైన స్వరంతో వినిపిస్తోంది. ఆమె కంఠ స్వరంతో తన కంఠ స్వరం మిళితం చేసి సుందరి కూడా పాడుతోంది.

మోహన్‌కి సరస్వతి స్వరం కోకిల కంఠ స్వరంలా అనిపిస్తే సుందరి గొంతుక కప్పలు బెకబెకమన్నట్లు అనిపించింది. ‘ఈ సుందూ పాడడం ఆపు చేసినా బాగుండును, ఈ సంగీతం మాష్టారమ్మా ఎంత చక్కగా పాడుతోంది. ఆ పాటకు తగ్గట్టు ఆమె రూపం కూడా ఎంత అందంగా ఉంది? కళ్ళు తిప్పుకోలేనంతగా, చూసినా చూడాలనుకునేటంత అందం ఈమెది’ మనస్సులో అనుకుంటున్నాడు మోహన్.

“వండర్‌ఫుల్!” గట్టిగా చప్పట్లు కొడ్తూ ఆనందం ఆశ్చర్యంలో మునిగితేలుతున్న మోహన్ అన్నాడు. ఒక్కసారి పాట ఆగిపోయింది, ఆ పాటతో పాటు వాయిద్యాలు కూడా ఆగిపోయాయి. చప్పున సరస్వతి లేచి నిలబడింది.

“ఎక్స్యూమీ!” అపరాధిలా అన్నాడు మోహన్.

ఆమె నోటివెంట మాట రాలేదు. ఓమారు తల పైకెత్తి అతడ్ని చూసిన సరస్వతి తిరిగి తలదించుకుంది. మెత్తని తివాచీ మీద కాలి బొటన వేలితో సున్నాలు చుడ్తోంది.

“మీకు అంతరాయం కలిగించాను” తిరిగి అన్నాడు, సరస్వతి మాట్లాడలేదు. సుందరి మాత్రం తన్మయత్వంగా మోహన్ వంక చూస్తూ ఉంటే మోహన్ చూపులు మాత్రం సరస్వతి మీదే నిలిచాయి.

సరస్వతి స్వరంతో స్వరం కలిపి సుందరి త్యాగరాయకృతి పాడుతోంది కాని ఆమె ఆలోచనలు అన్నీ మోహన్ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఆనాడు త్యాగరాజు రాముణ్ణి ఆరాధిస్తూ తనపై కరుణ దయచూపించమని పాడి ఉంటాడు కానీ! ఈనాడు సుందరి ‘రామా!’ అని పాడుతున్నా తన మదిలో బావ రూపాన్నే నింపుకుంది. ఆమె మదిలో మోహన్ గురించి ఆలోచనలు చోటు చేసుకున్నాయి.

సరస్వతి త్యాగరాయకృతి పాడుతుంటే తననే ఆమె పిలుస్తోందా అని అనిపించింది మోహన్‌కి. ఈనాడు రాముడు కాదు కృష్ణుని స్థానంలో తానుండి ఆ భక్తురాలి స్థానంలో గోపికగా ఈ సంగీతం మాష్టారమ్మ ఉంటే ఎంత బాగుండును? అని ఆలోచిస్తున్నాడు మోహన్.

అతను అసలే జల్సా పురుషుడు. సరదా మనిషి. చిల్లర తిరుగుళ్ళు తిరిగినవాడే, గ్రంథసాంగుడనుకుంటారు అతని వాలకం చూసిన వాళ్ళు. అలాంటి వాడు సరస్వతిని చూడగానే ఇలా స్పందించడంలో విచిత్రమేమీ లేదు. అందమైన దాన్ని ఆస్వాదించాలనేదే అతని అభిమతం.

సరస్వతి తనని చూడగానే అలా బిగుసుకు పోవడం అతనికినచ్చలేదు. ‘మొదట తనే ఆమెతో మాటలు కలపాలి’ అని అనుకున్నాడు.

“క్షమించండి, మేడమ్! నేనెవరో మీకు తెలియదు కదూ! అందుకే మీరు అలా కంగారుపడున్నారు. ఈ సుందూ, అదే మీ శిష్యురాలు నాకు మామయ్య కూతురు, అంతే కాదు త్వరలో నాకు కాబోయే శ్రీమతి. నేను మెడిసన్ పూర్తిచేసి వచ్చాను. ఈ సుందరాంగిని చేపట్టేముందు మొదట నర్సింగ్ హెూమ్‌ను చేపట్టి మొదటి దాన్ని నా సహధర్మచారిణిగా చేసుకుని పేరు ప్రఖ్యాతలు గడించిన తరువాత ఈ సుందూని అర్ధాంగిగా చేపడుదామని నా అభిలాష” గలగల నవ్వుతూ అన్నాడు మోహన్.

“ఎంత అందంగా నవ్వుతున్నాడు ఇతను, అందమైన రూపానికి తోడు ఆ పేరు – ఆ నవ్వు ఎంత అందంగా అమరాయి? ఆస్తి అంతస్తు, రూపం – హెూదా అన్ని ఉన్నా ఇతడ్ని చేపట్టే ఆడది చాలా అదృష్టవంతురాలు”

ఇలా ఆలోచిస్తున్న సరస్వతి వదనంలో సుందరి తలంపుకి రాగానే అసూయలాంటి భావం తొంగి చూసింది. ఆమె కూడా మానవ మాత్రురాలే. ఇలాంటి భావ వికారాలకి లోనవడం సహజమే. అయితే మరుక్షణంలో ఆమెలో వివేకం ఆమెను తట్టిలేపింది… ఛీ… ఛీ….! నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను. పెళ్లయి భర్త, బిడ్డ ఉన్న ఆడది తను పరాయి మగాడు గురించి ఇలా ఆలోచించడమేఁటి? తిరిగి ఆలోచిస్తోంది సరస్వతి.

“అన్యాయం…. అన్యాయం….! ఇంతలా నేను వాగుతున్నా మీ నోటి వెంబడి ముత్యాలు రాలిపోతాయా? మీ నోటి వెంబడి ఒక్కమాట కూడా రావటం లేదు” నిష్ఠూరంగా అలిగినట్టు ముఖ భంగిమ పెట్టి అన్నాడు అతను.

అతని అతిచనువు సరస్వతికి ఒకప్రక్క చిరాకు కలిగిస్తున్నా అతని మనోహరమైన రూపాన్ని, హోదాని గమనిస్తున్న ఆమె హృదిలో ఆమెకి తెలియకుండానే అజ్ఞాతంగా శ్రద్ధ అనే భావం తొంగి చూసింది.

“మిమ్మల్ని చూడ్డం ఇదే మొదటి పర్వాయం. నా పేరు సరస్వతి. ఈ సుందరి గారికి రెండు నెలల నుండి సంగీతం నేర్పుతున్నాను” బిడియపడ్తూనే అంది.

“సంగీతమంటే నాకు చాలా ఇష్టమండీ, అయినా సంగీతమంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు కనుక. నా చిన్నతనంలో కొద్ది కాలం నేను సంగీతం నేర్చుకున్నాను కూడా. కొన్ని అసాధ్యమైన రోగాలు కూడా సంగీతంతో తగ్గుతాయి అంటారు. మానసిక రోగులకి చికిత్స ఈ సంగీతమే. ఈ సంగీత విద్యకి అంత ప్రాముఖ్యత ఉంది. ప్లీజ్! నాకు ఆ విద్యను నేర్పించుతారా?” అతను చిలిపిగా కనులు చిట్లించి నవ్వుతూ సరస్వతితో అన్నాడు.

అతని అతి చనువు ఆమెకి ఇబ్బందికరంగా ఉంది. సమాధానం ఇవ్వకుండా నవ్వింది.

“ఎంత అన్యాయం బావా! సంగీతం నువ్వు నేర్చుకుంటే సరస్వతి గారు నాకు నేర్పించక్కర్లేదా?” మూతి వంకర్లు త్రిప్పుతూ అంది సుందరి.

“మరయితే మనిద్దరం నేర్చుకుందాం” కొంటెగా సుందరివేపు చూస్తూ అన్నాడు మోహన్. “పోనీ ఒక పని చేయండి”

“ఏంటది?” ఒక్కసారే అన్నారు మోహను, సుందరి సరస్వతి వేపు చూస్తూ “సుందరి నా దగ్గర సంగీతం నేర్చుకుంటుంది. ఆమెను చేపట్టిన తరువాత జీవితాంతం ఆమె దగ్గర శిష్యరికం చేస్తూ సంగీత సాధన చేయండి” సరస్వతి నవ్వుతూ అంది.

“గుడ్ ఐడియా!” చిటికేస్తూ అంది సుందరి,

“చంపేరు. ఆ సలహా మాత్రం ఇవ్వద్దు. మీకు పుణ్యం ఉంటుంది. ఇప్పటికే సుందూ గడుగ్గాయి. నా మీద పెత్తనం చలాయిస్తోంది. శిష్యుడిగా చేరితే ఇంకేమేనా ఉందా…?” రెండు చేతులూ జోడించి ప్రాధేయపడున్నట్లు అన్నాడు మోహను.

అతని అభినయానికి ఆడవాళ్ళిద్దరికీ నవ్వు వచ్చింది. పెదాలు బిగపెట్టి నవ్వును బలవంతాన్న ఆపుకోడానికి సరస్వతి ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ ప్రయత్నంలోనే విఫలం చెందిన సుందరి పకపక నవ్వింది.

“చిన బాబుగారూ! పెద్దయ్యగారు పిలుస్తున్నారు” నౌకరు గోవిందు మాటలు సరస్వతి వంక తన్మయత్వంగా చూస్తున్న మోహను విన్నాడు. ఉలిక్కిపడి “ఆ… ఆ… ! వస్తున్నాను..” అని అన్నాడు తన చూపులు ఆమె మీద నుండి మరల్చుకుని..

“సరస్వతి గారూ! నా అభ్యర్థన మాత్రం మరిచిపోకండేఁ” అంటూ పక పక నవ్వుతూ అచటి నుండి కదలిపోయాడు. ‘అమ్మయ్యా!’ అని గుండెల మీద చేయి వేసుకుని సంతృప్తిగా నిట్టూర్పు విడిచింది సరస్వతి.

“బావ తీరే అంత. మరేఁ అనుకోకండి, ఒక్కోక్క సమయంలో తమాషాగా మాట్లాడుతూ చిన్న పిల్లవాడిలా ప్రవర్తిస్తాడు. తను నవ్వుతాడు నలుగుర్నీ నవ్విస్తాడు. గంభీరంగా ఉన్నవాళ్లని కూడా క్షణంలో నవ్విస్తాడు. ఒక్క క్షణం కూడా నోరు మూత పడదు. చాలా సందడి మనిషి సరస్వతి మనోభావాల గమనించిన సుందరి ఆమెతో అంది. సుందరి మాటల్లో బావమీదున్న ఆపేక్ష బయట పడింది. ఇక పాట సాగలేదు, సుందరి ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటే సరస్వతి ఆలోచన్లు మరోలా సాగిపోతున్నాయి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here