[dropcap]మూ[/dropcap]డవ ఎపిసోడ్ ప్రారంభంలో రైలు తన ప్రయాణాన్ని కొనసాగించి నెమ్మదిగా వచ్చి ‘ఎర్నాకుళం జంక్షన్’ స్టేషన్‌లో ఆగుతుంది. హరీష్ గబగబా దిగి తమ ట్రూప్ ఉన్న బోగీవైపు వెళ్ళబోతాడు. బియ్యం బస్తాల ఆసామి ఇక్కడ దిగిపోతాడు.
ఇంతలో రైల్వే పోలీసులు తమ వైపు రావడం చూసి, “నేను కూలీని తెచ్చుకుంటాను, ఈలోపు నా బియ్యం బస్తాలను చూస్తూండండి” అని హరీష్‌ని అడుగుతాడు. సరేనంటాడు హరీష్.
పోలీసులొచ్చి హరీష్‌ని అడ్డగిస్తారు. ‘ఎక్కడ్నించి వస్తున్నావ్, ఈ బియ్యం ఎక్కడ్నించి తెస్తున్నావ్’ అంటూ ఆరాలు తీస్తారు. “ఇవి నావి కావు, అదుగో అతనివి, నేను నాటకం ట్రూప్ వాడిని, ఢిల్లీ వెళ్తున్నాను” అని వాళ్ళకి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. పోలీసులు నమ్మరు, అరెస్టు చేయబోతారు. హరీష్ వాళ్ళతో వాదిస్తాడు. ఈ లోపు పోలీసులు అసలు దొంగని పట్టుకుంటారు, అతను బియ్యం స్మగుల్ చేస్తుంటాడని తెలుస్తుంది.
హరీష్ వచ్చి నాయర్ ఉన్న బోగీలో ఎక్కుతాడు.
కూపేలో ఉన్న రాహుల్ స్టేషన్ బయటకొచ్చి గులాబీ పూలు కొనుక్కుని వెళ్తాడు.
***
“నేను సిగరెట్ తాగితే మీకు అభ్యంతరం లేదు కదా?” అని నాయర్ స్వామీజీ శిష్యుడిని అడుగుతాడు. తాగచ్చు అన్నట్టుగా స్వామీజీ సైగ చేస్తారు. నాయర్ సిగరెట్ వెలిగిస్తాడు.
తన లగేజ్‌తో హరీష్ తన బృందాన్ని చేరేసరికి వారంతా అతనిపై విరుచుకుపడతారు. వాళ్ళకి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ… తనని ఆర్‌పిఎఫ్ సిబ్బంది ఎలా అటకాయించిందీ, తానెలా వాళ్ళనుంచి బయటపడింది చెప్పబోతాడు. కానీ ఎవరూ వినరూ… ‘ముందు మనకొచ్చిన సమస్య విను’ అంటూ బొంబాయి వెళ్ళిపోయిన ఆర్టిస్టు గురించి చెప్పబోతారు. “కాసేపయితే నేను ఆర్.పి.ఎఫ్ వాళ్ళ జైల్లో ఉండేవాడిని, నా గురించి మీకెవరికి పట్టడం లేదు” అంటాడు హరీష్. అశ్వత్థామ పాత్రని హరీష్‌నే పోషించమని ఒకతను అంటాడు. ‘అదేలా ఇప్పటిదాక అంత గంభీరమైన పాత్రలను మనవాడు వేయలేదు కదా’ అని ఇంకొకతను అంటాడు. ‘నేను అతనితో చేయించుకుంటాను’ అంటాడు దర్శకుడు. ‘ఇప్పుడే మొహం కడుక్కుని వస్తానం’టూ టాయ్‌లెట్ లోకి వచ్చి కాస్త మద్యం తాగుతాడు హరీష్.
***
అక్కడ సైడ్ బెర్త్ పై గర్భిణి నీనాగుప్తా అస్తిమితంగా కదులుతుంది. అది గమనించిన మరాఠీ వనిత భర్తకి కనుసైగ చేస్తుంది.
భర్త లేచి వెళ్ళి, నీనాగుప్తాని పలకరించి, “అమ్మా, నీకు అసౌకర్యంగా ఉన్నట్టుంది. ఇక్కడుంటే వచ్చేపోయేవాళ్ళతో నీకు ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఎదురు లోయర్ బెర్త్ నాదే. అక్కడ పడుకో” అని అంటాడు. దంపతులిద్దరూ మెల్లిగా సాయం పట్టి ఆమెను బెర్త్ మారుస్తారు. చీకట్లను చీల్చుకుంటూ రైలు తన గమనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది.
***
రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు తెల్లవారడాన్ని గమనిస్తే అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి ప్రయాణాల్లో జనాలు ముసుగు కప్పి నిద్రపోతుంటారు లేదా మొబైల్స్‌లో తల దూరుస్తుంటారు. చాలా దూరం ప్రయాణించే రైళ్ళల్లో రాత్రి నిద్రపోయి ప్రొద్దున్నే లేచి మనకి తెలియని ఊరిలో సూర్యోదయాన్ని చూడడం, ప్రకృతిని ఆస్వాదించడం గొప్పగా ఉంటుంది. మా చిన్నప్పుడు మేం రైల్లో వెళ్తుంటే గాత్రం బావుండేవారు ఉదయాన్నే గొంతు సవరించుకుని ఓ ప్రార్థనా గీతమో ఓ చక్కని పాటో అందుకునేవారు. మొదట మెల్లగా మొదలై, ముగిసే సమయానికి అటు రెండు వరుసలు ఇటు రెండు వరుసల వరకు పాట వినిపిస్తుంటే లేవడానికి బద్దకించేవాళ్ళు సైతం ఆ స్వర మాధుర్యానికి లేచి కూర్చునేవారు.
ఈ ఎపిసోడ్‍లో కూడా అలాగే జరుగుతుంది.
తెల్లారుతుంది. నాటక బృందంలోని ఒక్కొక్కరుగా లేచి బ్రష్ చేసుకుంటారు. “వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం” అంటూ నేపథ్యంలో కీర్తన వినబడుతుంది. ‘లేవండి లేవండి బ్రష్ చేసుకుని టిఫిన్ తినాలి’ అంటూ ఒకరికొకరు చెప్పుకుంటారు. కెమెరా ముందుకు కదిలేకొద్దీ ఆ పాడుతున్నది ‘ఇలా అరుణ్’ అని తెలుస్తుంది.
***
మరో పక్క నీనాగుప్తాకి దగ్గు వచ్చి మెలకువ వస్తుంది. మరాఠీ మహిళ మంచినీళ్ళు తాగించి బాత్‌రూమ్‌కి తీసుకువెళుతుంది.
స్వామీజీ కూడా నిద్ర లేచి, “నాయనా! పరమానందా! లే. తెల్లవారింది” అంటూ శిష్యుణ్ణి నిద్ర లేపుతారు.
ఈలోపు వాష్ బేసిన్ దగ్గర నాయర్ షేవింగ్ చేసుకుంటూ కనబడతాడు.
‘వీరంతా తమ తమ వేర్వేరు పనులపై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్నారు. ఒకరేమో కొద్దిరోజులలో ఈ లోకాన్ని విడిచిపోనున్నారు, అయినా హిమాలయాలు చూడాలన్న కాంక్ష! మరోవైపు ఓ ప్రాణికి ఈ లోకంలోకి వచ్చేందుకు ఆరాటం! ఈ వృద్ధులు బహుశా తీర్థయాత్రలకి వెళ్తున్నారేమో’ అనుకుంటాడు నాయర్.
రైలు ముందుకు పోతూనే ఉంటుంది.
***
బ్రష్ చేసుకోడానికి గాను కూపే నుంచి బయటకొస్తాడు బదిలీ అయిన ఆఫీసర్. వాళ్ళ అమ్మాయి మీనాక్షికి, మీనాక్షి వాళ్ళ అమ్మకి కూడా మెలకువ వస్తుంది. మీనాక్షి కళ్ళు అప్పర్ బెర్త్ వైపు తిరుగుతాయి. తల్లి కూడా కూతురు చూపులను గమనిస్తుంది. ఇంతలో ఆఫీసర్ లోపలికి వస్తాడు. కూతురు లేచి నిల్చుని పై బెర్త్ కేసి చూస్తుంది. మెలకువ ఉన్న రాహుల్ తనతో చూపులు కలిపి చిన్నగా నవ్వుతాడు. ఆమె బయటకి రాగానే అతనూ దిగి మెల్లిగా బయటకు వస్తాడు.
టాయ్‌లెట్ దగ్గర వేచి ఉంటాడు
స్నానం చేసి తయారై వచ్చిన మీనాక్షి “మిస్టర్ అద్వానీ” అని పిలుస్తుంది. “రాహుల్” అంటాడతను.
“మా నాన్న మాటలని తప్పుగా అనుకోవద్దు” అంటుంది.
“నాకు మీ నాన్నగారితో పని లేదు, మీరంటే ఇష్టం” అంటాడు.
ఇద్దరూ ఒకరికొకరు – తమకు కావలసిన వ్యక్తిని పొందామని చెప్పుకుంటారు.
కానీ ఇంతలో టాయ్‌లెట్ తలుపు తెరుచుకోవడంతో ఈ సంభాషణ అంతా అతని ఊహగా తేలుతుంది!
మీనాక్షి అతనికేసి చూసి, “రైలు ఆగి ఉన్నప్పుడు టాయ్‌లెట్ వాడద్దు” అని చెప్పి వెళ్ళిపోతుంది. తెల్లబోయి టాయ్‌లెట్ లోకి వెళ్ళి తలుపేసుకుంటాడు.
***
మరాఠీ వనిత నీనాగుప్తాతో మాటలు కలుపుతుంది. పేరడిగి, ఎన్నో నెల నడుస్తోందో కనుక్కుంటుంది. తొలి చూలా అని అడుగుతుంది. అవునన్నట్టు తలూపుతుంది నీనా గుప్తా.
“అమ్మా…” అనుకుంటూ బాధగా అంటుంది.
“ఏమైనా నొప్పిగా ఉందా?”
“కాదు, భయంగా ఉంది”
“భయమా, ఎందుకు?”
“ఆడపిల్ల పుడితే….” అంటుంది నీనాగుప్తా.
“ఆడపిల్ల పుడితే అందులో భయపడాల్సిందేముంది?” అని అడుగుతుంది ఆవిడ. “అబ్బాయి అయినా, అమ్మాయినా ఇద్దరూ సమానమే” అంటుంది.
“మీకు అర్థం కాదు… మా పరిస్థితులు వేరు”
“మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు?”
“అత్తగారు, మావగారు…. ఆయన…”
“మీ అత్తగారు ఎలాంటివారు?”
అందుకు సమాధానంగా తల పక్కకి తిప్పుకుంటుంది నీనాగుప్తా. ఓ చుక్క కన్నీరు జారుతుంది.
***
ఇక్కడ నాటక బృందం సభ్యులు డైలాగ్ పేపర్స్ చేతుల్లో ఉంచుకుని మాట్లాడుకుంటూంటారు. ‘ఇలా’ హరీష్‌కి సీన్ వివరిస్తుంది. ‘నటించేడప్పుడు ఈ వివరాలన్నీ మనసులో ఉంచుకోవాలి’ అని చెప్తుంది. డైలాగ్ చెప్పడంలో సహచరుడొకరు హరీష్‌కి సహకరిస్తాడు. ‘కాన్‌సన్‌ట్రేట్ చెయ్యి’ అంటూ అతన్ని హెచ్చరిస్తాడు. హరీష్ అశ్వత్థామ వేషం వేస్తే, తాను నటించనంటాడు రవి అనే నటుడు. వాదోపవాదాలు పెరుగుతాయి. ఓ కళాకారుడు వేణువు వాయించడం మొదలుపెడతాడు.
హరీష్ టాయ్‌లెట్ దగ్గరకొచ్చి మళ్ళీ మద్యం తాగుతాడు. నాటకం వేయనని అలిగిన రవి వచ్చి తలుపు దగ్గర నిలబడతాడు. అతని వద్దకు వెళ్ళి దర్శకుడు గుప్తా అతన్ని సముదాయిస్తాడు. బాగా నచ్చజెప్పి, ‘పద వెళ్దాం’ అంటాడు. “మీరు వెళ్ళండి, నేను వస్తాను” అంటాడతను.
రైలు ముందుకు సాగుతూండడంతో మూడో ఎపిసోడ్ ముగుస్తుంది.
***
ఆనాటి రైస్ స్మగ్లర్ల అతి తెలివితేటలని ఈ ఎపిసోడ్ వెల్లడిస్తుంది.
ఆడపిల్లలను కనే తల్లుల పట్ల అప్పట్లో సమాజంలో ఉన్న వ్యతిరేకతని రేఖా మాత్రంగా చూపించారు. ఆడపిల్ల పుడుతుందేమోనని గర్భవతి భయపడడం, ఓ కన్నీరు చుక్క కార్చడం నాటి సమాజంలోని దురాచారాలను కళ్ళకు కడుతుంది.
అందమైన అమ్మాయి కనబడి కాస్త దగ్గరగా మసలుకుంటే, ఊహల్లో తేలిపోయే కుర్రాళ్ళూ అప్పుడూ ఉన్నారూ, ఇప్పుడూ ఉన్నారని రాహుల్ ఉదంతం గుర్తు చేస్తుంది.
ఓ నాటకం విజయవంతమవ్వాలంటే ఎంతటి కృషి అవసరమో డ్రామా ట్రూప్ సభ్యులు తెలియజేస్తారు.
వీళ్ళందరినీ మోసుకెళ్తున్నా, వీటితో ఏ సంబంధమూ లేనట్టు రైలు తన కర్తవ్యం తాను చేసుకుపోతుంది.
“If you wish to travel far and fast, travel light. Take off all your envies, jealousies, unforgiveness, selfishness and fears” అని Cesare Paves చెప్పిన మాటలని తలచుకుంటూ మనమూ ఆగుదాం.
***
ఈ మూడో ఎపిసోడ్‌ని ఇక్కడ చూడొచ్చు.
వచ్చే వారం నాలుగో ఎపిసోడ్‌తో కలుద్దాం!
(సశేషం)