ఒక్క పుస్తకం-4

20
3

[box type=’note’ fontsize=’16’] తోట సాంబశివరావు గారు వ్రాసిన నవల ‘ఒక్క పుస్తకం‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది నాలుగవ భాగం. [/box]

19

నా దీనావస్థను గతకొద్ది రోజులుగా గమనిస్తుడున్న మిత్రుడొకడు ఒకరోజు నాకేదో సాయం చేయాలని,

“మిత్రమా! నీకు ఉద్యోగం కావాలి కదూ… పద మా బాస్ దగ్గరకు ఇప్పుడే వెళ్దాం… నీకు తప్పకుండా మంచి లాభసాటి ఉద్యోగం అక్కడ దొరుకుతుంది” అన్నాడు.

ఏ పుట్టలో ఏ పాముందో… చూద్దామనుకుంటూ వాడితో బయలుదేరాను.

ఆ ఆఫీసు దగ్గరలోనే వుంది. అదొక మూడంతస్తుల భవనం. చాలా అధునాతనంగా, అందంగా వుంది. మొదటి అంతస్తులోనే ఆఫీసు. లోపల ఖరీదైన ఫర్నిచర్, రంగురంగుల కర్టెన్లు, ఇంపోర్టెడ్ శాండ్లియర్స్! ఆఫీసు అనేకంటే చాలా ధనవంతులు నివసించే బంగళా అంటే సరిగ్గా సరిపోతుంది. హాల్లో వున్న పెద్ద సోఫాలో కూర్చుని ఏదో మ్యాగజైన్ చదువుతూ ఓ స్ఫురద్రూపి కనిపించాడు. బహుశా ఆ ఇంటి యజమాని అయివుండొచ్చు. అంతా నిశ్శబ్ద వాతావరణం. ఎందుకో కొంచెం భయంగా అనిపించింది నాకు.

“సార్”… నెమ్మదిగా పిలిచాడు నా మిత్రుడు.

చదువుతున్న మేగజైన్‍ని టీపాయ్ మీద ఉంచి, నొసలు చిట్లించి నా మిత్రుడి వైపు చూశాడు.

“ఇతను నా స్నేహితుడు. మీ దగ్గర ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మీరు ఒప్పుకుంటే రేపే వచ్చి డ్యూటీలో జాయినవుతాడు సార్” ప్రాధేయపూర్వకంగా చెప్పాడు నా మిత్రుడు.

“మరి ఈ ఉద్యోగంలో చేయాల్సిన డ్యూటీల గురించి చెప్పావా?” గద్దించి అడిగాడు యజమాని.

“లేద్సార్… మీరు చెప్తారు కదా అని నేనేమీ చెప్పలేదు” నసిగాడు నా మిత్రుడు.

“చూడు మిస్టర్. నీ డ్యూటీ చాలా సింపుల్. మేము నీకొక లాక్ చేసిన బ్రీఫ్ కేస్ యిస్తాము. దానిని తీసుకొని మేము చెప్పిన చోటుకు వెళ్ళి అక్కడున్న వ్యక్తికి దానిని అందజేయాలి – అంతే!… పని పూర్తి కాగానే ఇక్కడకు వచ్చి పదివేల రూపాయలు తీసుకొని వెళ్ళు. అలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే చాలు. నీకు బోలెడు డబ్బు. కాకపోతే నువ్ ఆ బ్రీఫ్ కేస్‌తో పారిపోకుండా వుండడానికి నీ కదలికలను మా వాళ్లు ఎప్పటికప్పుడు గమనిస్తూనే వుంటారు. ఒకవేళ ఆ బ్రీఫ్‍ కేస్‌తో నువ్ పోలీసులకు దొరికిపోతే మా గురించి ఏమీ చెప్పకూడదు. అలా చెప్తే నీకూ, నీ కుంటుంబానికీ చాలా ప్రమాదం. మరి ఆలోచించుకో… నీకు ఓకే అయితే రేపే డ్యూటీలో చేరు” అంటూ గంభీర స్వరంతో చెప్పి లోపలికి వెళ్ళాడు.

అతను చెప్తున్న మాటలు వింటున్న నాకు ముచ్చెమటలు పోశాయ్. బతుకు జీవుడా అనుకుని నా మిత్రుడితో కలిసి బయటపడ్డాను.

బ్రతికుంటే బలుసాకు తిని బతకొచ్చు కాని ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాల జోలికిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం మూర్ఖత్వమే అవుతుందనుకున్నాను.

మరెప్పుడూ ఆ మిత్రుడిని నేను చూడలేదు. కలవాలనే ప్రయత్నం అసలు చేయలేదు…. చేయను కూడా.

20

ఆ రోజు కూడా బాగా లేటుగానే ఇంటికొచ్చాను. తలుపుకు తాళం వేసి వుంది. ఎక్కడికి వెళ్ళి వుంటారు… అని ఆలోచించాను. అలా వెళ్ళవలసి వస్తే నాకు ముందుగా చెప్పేవారేనే… ఏమయ్యుంటుంది… అనుకుంటూ పక్కింటి కాలింగ్ బెల్ నొక్కాను. తలుపు తీసిన ఆంటీ నా వైపు చూసి… “ఇప్పుడెలా వుంది బాబూ మీ నాన్నగారికి?” అని అడిగింది.

ఏం జరిగిందో తెలియని నేను “మా నాన్నకేమయిందాంటీ?” అని అడిగాను.

“మీ నాన్నకు గుండె నొప్పి వస్తే హాస్పిటల్‌కి తీసుకెళ్ళారు. నీకు తెలియదా?” అని ఆశ్చర్యంగా అడిగింది.

“తెలియదాంటీ” అంటూ వెంటనే అక్కడ్నించి పరుగు లంకించుకున్నాను. దారిలో నాకేమీ కనిపించలేదు. నాన్నా, అమ్మా, చెల్లి మాత్రమే నా కళ్ళలో మెదలుతున్నారు. భగవంతుడి దయవల్ల ఏ ప్రమాదమూ జరగకుండానే హాస్పటల్‌కు చేరాను.

నాన్న ఎక్కడున్నదీ రిసెప్షన్‌లో కనుక్కుని ఆ వార్డుకు చేరుకున్నాను. “అమ్మా!” అంటూ భోరున ఏడ్చాను. “అమ్మా… నాన్నకెలా వుందమ్మా? డాక్టర్లేమన్నారు?” ఆదుర్దాగా అడిగాను.

“ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదన్నారు. ఈ రాత్రంతా ఐ.సి.యు.లోనే వుంచుతారట! రేపు ఉదయం జనరల్ వార్డుకు మారుస్తామంటున్నారు” ఏడుపును ఆపుకుంటూ చెప్పింది అమ్మ. అమ్మను ఒడిసిపట్టుకుని గువ్వపిట్టలా చెల్లి. మెల్లగా లేచి తలుపు అద్దాల లోంచి బెడ్‍పై నిద్రిస్తున్నట్లున్న నాన్నను చూశాను. చేతులకు బ్యాండేజీలు, ద్రవపదార్థాలు, రక్తము ఎక్కించే గొట్టాలు, ముక్కుకు మాస్క్, పెరిగిన గడ్డం, చెదిరిన తలజుట్టు, కోడినిద్ర కళ్ళు, నీరసించిన శరీరం, వెల్లకిలా పడుకుని స్పృహలో లేని నాన్నను చూస్తే కళ్ళ వెంట నీళ్ళు జాలువారాయి. ఆ స్థితిలో వున్న నాన్నను చూస్తే… ఒళ్ళంతా చల్లబడింది. చలి జ్వరం వచ్చినట్లు వణుకు ఆరంభమయింది. ఇక చూడలేక అమ్మ పక్కనే ఖాళీగా ఉన్న కుర్చీలో కూలబడ్డాను.

ఆ రాత్రంతా మేము ఒకరికొకరం ధైర్యం చెప్పుకుంటూ అక్కడే వున్నాము. గంటకొకసారి అద్దంలోంచి నాన్నను చూస్తూనే వున్నాము. తెల్లారింది. నాన్నను పరీక్షించిన డాక్టర్లు, ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. తనని మానసికంగా ఒత్తిడికి లోను కానివ్వవద్దని, మరోసారి స్ట్రోక్ రాకుండా చూసుకోవాలని చెప్పారు డాక్టర్లు. ఆ తరువాత నాన్నను జనరల్ వార్డుకు మార్చారు. నిర్ణీత సమయాల్లో మందులు వాడుతూ, ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా కంటికి రెప్పలా చూసుకున్నాము నాన్నను. బాగా నీరసించి వున్నారు. కొంచెం తక్కువ స్వరంతో పట్టి పట్టి మాట్లాడుతున్నారు.

21

అలా మరో రెండు రోజులు వున్న తరువాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. బాగానే కోలుకున్నారు. ఎప్పటిలానే మాట్లాడుతున్నారు. కాని, ఇంకా సుస్తీ మనిషిలాగా కనిపిస్తున్నారు. మరో మూడు రోజులు నాన్నను అంటిపెట్టుకుని ఇంటిపట్టునే వున్నాను. ఒక్కోసారి అనిపించేది, నాన్న మా మధ్య నుండి మరో లోకానికి వెళ్తే… అమ్మో! తలచుకుంటేనే భయం వేస్తుంది. నాన్న లేకుండా నేను, అమ్మ, చెల్లి…. ఊహించుకోడానికి కూడా ధైర్యం చాలడం లేదు. అలా జరక్కూడదు. నాన్న మాతోనే వుండాలి. నా ఉన్నతిని చూడాలి. చెల్లి పెండ్లి చూడాలి. అమ్మా నాన్న చెల్లిని నేను బాగా సుఖపెట్టాలి. వాళ్ళకు ఏ లోటూ రాకుండా పువ్వులో పెట్టి నేను చూసుకోవాలి. భగవంతుడా! ఆ భాగ్యాన్ని నాకు త్వరగా ప్రసాదించు తండ్రీ… అంటూ మనసులోనే ప్రార్థించాను.

రోజురోజుకి నాన్నగారి ఆరోగ్యం మెరుగవుతోంది. కాని ముఖంలో కనిపించే దిగులు, బాధను మాత్రం దాచుకోలేకపోతున్నారు. టేబుల్ దగ్గర నిల్చుని పండ్ల రసం తీస్తున్నాను.

“బాబూ” చిన్నగా పిలిచారు నాన్న.

“ఏంటి నాన్నా?” అంటూ పండ్ల రసంతో నింపిన గ్లాసును నాన్న చేతికందించాను.

“ఏం లేదు బాబూ! ఒకవేళ ఏదైనా జరిగి నేను చనిపోతే…” అని ఏదో చెప్పబోతుండగా, నాన్న నోటిపై, నా అరచేతిని అడ్డుపెట్టి…

“నాన్నా! దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి… మీకేం కాదు… నా మాట విని మీరు దిగులుపడకండి” అంటూ ఆయన మాటలకు అడ్డు తగిలాను.

“నా గురించి నాకేం దిగురులు లేదు బాబూ… అమ్మ, చెల్లి, నువ్వు నేను లేకుండా ఎలా బ్రతుకుతారు? అని తలచుకుంటేనే బాధగా వుందిరా” అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారు నాన్న.

ఆ మాటలు విన్న నేను నిజంగా తట్టుకోలేకపోయాను. నన్నెవరో పాతాళానికి తోసేసినట్లనిపించింది. ఏం మాటలు చెప్పి నాన్నకు ధైర్యం చెప్పాలి? ఒక్కసారిగా నాన్నను కౌగిలించుకుని బావురుమన్నాను. వెంటనే తేరుకుని ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాను.

“లేదు నాన్నా… నువ్వెప్పుడూ అంటూంటావు కదా… నాన్న… ప్రతి మనిషికీ మంచి రోజులు వస్తాయి అని, దేనికైనా టైం రావాలి అని చెప్తుంటావు కదా నాన్నా! నా విషయంలో అ టైం వచ్చే సమయం ఆసన్నమైందనిపిస్తోంది నాన్నా… నువ్వు ధైర్యంగా వుండు… నీకు, అమ్మకు, చెల్లికి ఏ కష్టం రాకుండా… నా ప్రాణప్రదంగా చూసుకుంటాను నాన్నా! ఇకముందు మనకన్నీ సుఖాలే… కష్టాలు మన దరికి రావు. అన్నీ సవ్యంగా, సంతోషంగా, సాఫీగా విజయవంతంగా జరుగుతాయ్. మీరు ధైర్యంగా ఉండండి” అని చెప్తూ లేచి నిలబడ్డాను.

నా మాటలు విన్న నాన్న ముఖంలో ఆనందోత్సాహాలు నాట్యం చేస్తున్నట్లనిపించింది.

“నాన్న! కొంచెం సేపు అలా బయటకు వెళ్ళొస్తాను నాన్నా!”

“అలాగే బాబూ! వెళ్ళి రా! కాస్త పెండలాడే ఇంటికి రావాలి మరి” అన్నాడు నాన్న.

22

గత వారం రోజులుగా బాహ్య ప్రపంచానికి దూరమైన నేను అలా అలా నడుచుకుంటూ యన్.టి.ఆర్. స్టేడియం వైపు వచ్చాను. అక్కడ బుక్ ఫెయిర్ జరుగుతోంది. బయట ఉన్న బ్యానర్ చూశాను.

“ఒక్క పుస్తకం మీ జీవితాన్నే మార్చేస్తుంది.”

నిజంగానే నా జీవితంలో మార్పు కావాలని కోరుకునే నేను ఆ పుస్తకం కొనుక్కుని చదువుకొందామని 123వ స్టాల్ దగ్గరకి వచ్చాను. అక్కడే మిమ్మల్ని కలుసుకోవడం జరిగింది” చెప్పడం ఆపి పెద్దగా నిట్టూర్చాడు శ్రీకాంత్.

గుండెల మీద బరువును దించేసిన అనుభూతికి లోనయ్యాడు శ్రీకాంత్.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here