వట్టి మాటలు కట్టిపెట్టోయ్

0
3

[box type=’note’ fontsize=’16’] ఎం.ఆర్.మందారవల్లి గారి కన్నడ కథా సంకలనం ‘బొగసె యొళగిన అలె’ నుంచి ఒక కథను తెలుగులోకి అనువదించి ‘వట్టి మాటలు కట్టిపెట్టోయ్’ పేరిట అందిస్తున్నారు బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి. [/box]

[dropcap]నే[/dropcap]ను రూములో దెయ్యం పట్టినట్టు కూర్చుండిపోయాను. పిల్లలిద్దరూ పరుగెడుతూ వచ్చి చుట్టేసినా, ఊరికే బయటకు పంపేశాను. మధ్యాహ్నం పన్నెండు గంటల్నించి సాయంకాలం నాలుగు గంటలు కొట్టేసినా నేను ఒక్క మాటైనా మాటాడలేదు. బయట మామగారి పచార్లు, అత్తగారి గొణుగుళ్ళు, ఆడపడచు చప్పుడు చేయని పిల్లి నడకలు, గుసగుసలు…. ఏవీ వినిపించుకోకుండా చెవిటినై ఉండిపోయాను. అత్తగారు – ‘అయ్యో…. మన యింటి పరువు ప్రతిష్ఠంతా నాశనమైందే…’ అని అరిచిఅరిచి ఊరంతా గుమిగూడేట్టు చేసినా…. నా కళ్ళల్లో ఒక్కటంటే ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. నా చెవిలో మళ్ళీ మళ్ళీ అవే మాటలు ప్రతిధ్వనిస్తూన్నాయి.- ‘ మీరు చెప్పినట్టే నేను చేసి ఉండొచ్చు. అయితే నాకు నా ఆత్మాభిమానం కన్నామీ బ్రతుకు ముఖ్యం!’
ఔను… నాకేమైందసలు, ఏ మాయ కమ్మింది…. నాన్న, అమ్మ, అన్న, అక్క అని అందరి వల్లా శ్రద్ధగా నేర్చుకున్నది.. ప్రేమ మాత్రమే. కులము, దైవము, పద్ధతులు ఏవీ మా యింటి గడప లోపల ఆధిపత్యం చూపించలేదు. ప్రేమకే ఎప్పుడూ తెరచిఉంచిన తలవాకిలి గలది మా యిల్లు. నాన్న, అమ్మ నాకు చెప్పించింది ప్రేమ మాత్రమే. అయితే…. నేనేం చేశాను….. అతడిని అవమానించానే… ఇదెలా జరిగింది… ఎవరిని అడగాలి…. కంపించి పోయాను. నాకు దేని అక్కరా లేకుండా పోయింది. ఏదో కావలసి ఉండింది. అదేంటి….. నేను పోగొట్టుకున్నది….ప్రశ్నల పరంపరలో పాత జ్ఞాపకాలలోకి జారిపోయాను. ఇద్దరిని కని…. మూడవసారి గర్భం దాల్చిన ఈ సందర్భంలో …. నా కాలేజ్ మధురమైన రోజుల జ్ఞాపకాలు అలల్లా ఎగసి పడుతున్నాయి.
నా కాలేజ్ స్నేహితుడు ప్రసాద్, ఎందుకో అతడిని ఎప్పుడూ ఆటపట్టిస్తుండేదాన్ని. అతడిది విశాలమైన నుదురు. అది కనిపించకుండా సగం ముంగురులతో కప్పేసుకొని వచ్చేవాడు. నాకు ఆటపట్టించడానికి కారణాలు వెదకక్కర్లేదు. కూర్చుంటే … నించుంటే వేళాకోళాలే. అదొక వయసుదో, కాలానిదో ఉన్మాదమేమో? ఒకరోజు ‘ఎందుకండీ ప్రసాద్… మీ తలరాతను అంత దాచుకొనే తిరుగుతారు, దాన్ని దాచుకొంటే తలరాత మారిపోవచ్చు అని నమ్మకమా?’
తన లోతైన, పెద్ద కళ్ళతో నన్నే చూస్తూ ప్రసాద్, ‘అలాంటిదేం లేదండి. దాన్ని మార్చడానికి వీలేం లేదు అని నాకూ తెలుసు. అయితే ఆ తలరాతను అందరికీ చూపిస్తూ ఎందుకు తిరగడం? కదా!’ అని నన్నే ప్రశ్నించి గందరగోళం లోకి నెట్టేశాడు. మేమంతా అంటే నేను, శీల, ప్రసాద్, సుకన్య, ఉదయ, వెంకి… అందరూ ఒకే కుటుంబంలా కలిసిపోయాము. ఎప్పుడూ నవ్వులు, వేళాకోళాలు. మామధ్య కులము, మతము, సంప్రదాయం వీటి ప్రసక్తే లేదు.
ఒకరోజు ఉన్నట్టుండి ప్రసాద్ దూరంగా కనిపిస్తున్న గుడిసెల వైపు చూపించి, ‘అక్కడ మీరు కాఫీ తాగగలరా?’ అన్నాడు. ఉన్నట్టుండి అతడిలా అడగడం విచిత్రంగా అనిపించి, ఒక్కక్షణం అతడి వైపు అలా చూస్తుండిపోయాను. ‘ చెప్పండి… తాగడానికి కుదరదు కదా?’ అని రెట్టించాడు.
‘ఇదో పెద్ద క్విజ్ ప్రశ్నా? నన్ను ఓడించాలనా ‘ అని జోక్ చేశాను.
‘జవాబివ్వడానికి కష్టమైతే…. ఒప్పుకోవాలి. డొంకతిరుగుడు మాటలు నాకిష్టం ఉండవు.’ అన్నాడు కఠినంగా.
నేను వెంటనే చెప్పాను-‘ తాగగలను. … అయితే నాకు క్లీన్ గా ఉండాలి అంతే నాక్కావలసింది.’
నా మాట ముగిసేలోపే వాడు ‘క్లీన్ గా ఉండాలి!! క్లీన్ గా ఉండాల్సింది మనసండీ. … మనస్సు. మనిషి మనసులో ఉండాలి శుభ్రత. ప్రేమ ఎంత మురికినీ కడిగేస్తుందండి. అది లేనప్పుడు తిరస్కరించడానికి నూటొక్క కారణాలు దొరుకుతూనే ఉంటాయి.’ అనంటూ లేచి వెళ్ళిపోయాడు. శీల,’ఏంటి , నీతో మరీ ఎగిరిపడుతున్నాడు’ అంది. ‘అతడికి నా దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఉంది కదా అందుకే’ అని బదులిచ్చాను.
మరుసటి రోజు టిఫిన్ డబ్బాలో దోసె పెట్టుకొని తీసుకెళ్ళి వాడికిచ్చాను. అది కొంతకాలంగా ఎక్కడో అటక మీద పడేసుంచినది కావడంతో లోపల… బయట… పైన అంతా నల్లబడి మరకలతో ఉంది. లోపల పాత కమురు వాసన. ‘ప్రసాద్ దయచేసి నాకోసం ఇది తినండి ప్లీజ్’ అననయించినట్టుగా చెప్పాను. వాడు ముఖం చిట్లించుకుంటూ ఆ డబ్బా వైపు చూశాడు. మూత తీయగానే దాంట్లోంచి వాసన కొట్టేసరికి ముఖం తిప్పుకున్నాడు. ‘ప్లీజ్’ అనునయంగా అన్నాను.
‘ఏంటిదంతా?’ గంభీరంగా అన్నాడు.
‘ప్రేమండీ… ప్రేమ ఉంటే అంతా సాధ్యమే. లేకుంటేనే నూటొక్క కారణాలు.. కదా! క్లీన్ గా ఉండాల్సింది మనస్సు…’ అంటూ ఓరకంటితో చూశాను… ‘ఛ.. ‘ అని ఓడిపోయినట్టుగా వెళ్ళిపోయాడు. అయితే మరుసటిరోజు పొద్దున్న రాగానే ‘నాకేంటో నా ఆదర్శాలన్నీ అబద్ధాలే అనిపిస్తుందండి… ఏదో చేయబోతాను, అది ఇంకేదో అయిపోతుంది.. ఏమో అనుకుంటాను.. అయితే అది అలా జరగడానికి వాస్తవంగా కుదరదు.’ అని బాధపడసాగాడు. వాడికి ఏదో పోగొట్టుకున్నట్టు… తన ఆదర్శం నీరుగారిపోయినట్టు అనిపిస్తోంది.
‘ప్రసాద్… మనము అసహజమైనదాన్ని సహజంగా ఉండాలి అని కోరుకుంటాము. మన ఏ ఆకాంక్ష అయినా అతిగా ఉండకూడదు. మన ఆసక్తులకు మనమే ఒక మితి పాటించాలి కదా?’
‘అయితే కులము, గిలము.. అన్నీ అలాగే ఉండిపోవాలి అని… మీరు ఎడ్యుకేటెడ్ కూడా అంటుంటే ఏంటండీ అర్థం?’ వ్యగ్రతతో అన్నాడు.
‘చూడండి… మనము ఎవరినీ అవమానించకూడదు అనుకోవడం తప్పుకాదు. మన ఎదురుగా జరిగే అవమానాలకు ప్రతిస్పందించడమూ తప్పు కాదు. అయితే.. ఊరూర్కే ఏదో ఊహించుకొని.. అలా జరగాలని మనకు మనమే ఒత్తిడి పెంచుకొని.. అలా జరగడం కుదరకపోతే మనను మనమే వాస్తవం నుంచి వెలివేసుకున్నట్టుగా … ఎందుకండీ ఇదంతా? ఇదే సరైనది, ఇది తప్పే అని ఊరూర్కే తీర్మానించుకుంటూ పోవడం అసహజం కదా? ‘ అన్నాను విసుగ్గా.
‘చాలా బాగుందండీ మీరు చెప్పేది. అది కాదండీ, మనకు విద్య, బుద్ధి అన్నీ అబ్బింది ఉన్నది ఉన్నట్టుగా అలాగే అంగీకరించడానికి కాదు. సమాజంలో సంస్కరణ తేవడానికి ఎందరు శ్రమిస్తున్నారు. వాళ్ళతో పాటు మనమూ చేయి కలపాలి కదా. మీలా ఊరుకుంటే, శతాబ్దాలు గడిచినా ఎవరూ సంస్కరింపబడరు.’ రోషం ధ్వనించింది అతని గొంతులో.
నేను మెల్లగా చెప్పాను. ‘చూడండి.. నిన్న నేను కాఫీ తాగుతాను అని చెప్పేసి ఉంటే మీకు సంతోషం కలిగేదంతే. వాళ్ళిచ్చేదీ లేదు.. మనం అక్కడికి వెళ్ళేదీ లేదు. కానీ మీ సంతోషం కోసం నేను ఊరికే ఏదేదో చెప్పడం కుదరదు. కాదండీ… మార్పు తేవాలి అంటే దానికోసం ఇలాగా ప్రయత్నించేది? మనము మానసికశాస్త్రం చదువుతున్నాం. మొదట సహనం నేర్చుకోవాలి. లేకుంటే మనమే రోగులమై పోతామంతే.’ చిన్నగా నవ్వాను.
తర్వాత ఒకరోజు ‘చూడండి…. మీరు చెప్పినట్టు ఈరోజు నాకు సరైన శాస్తి జరిగింది.’ అన్నాడు.
‘ఏమైంది?’
‘మీరేమన్నారు, సహనంగా ఉండాలి అని కదా. ఉపన్యాసాలు ఇవ్వడం కాదు అనే కదా. ఈరోజు ఇంద్ర వాళ్ళింట్లో అందరినీ విందు అని పిలిచారు.’
‘ఔనా, మరి నన్ను పిలువలేదే… ఉండండి ముందు ఇంద్రకు క్లాస్ పీకి తర్వాత మీ మాటలు వింటాను.’ అని వెళ్ళబోతే చేయి పట్టి ఆపి కూర్చోబెట్టాడు.
‘ఊర్కే వినండి చెప్పేది.’ ఓర్పు నశించినట్లుగా, ‘ వాళ్ళింట్లో తినడం అయ్యాక అన్నీ కడిగి అక్కడే పెట్టండి, తర్వాత నీళ్ళు చల్లి లోపలికి తీసుకెళ్తామన్నారు వాళ్ళ అమ్మ. అక్కడే ఉన్నారు ఇంద్ర… ఒక్క మాట కూడా మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారండీ..’ పళ్ళు కొరుకుతున్నాడు. ‘మీరే చెప్పారు కదా సహనంగా ఉండాలి అని. అదే సహనంతో అన్నీ కడిగి అక్కడే పెట్టి వచ్చాము. ఒక్కరూ ఏమీ మాట్లాడలేదు. ‘ ముఖం కోపంతో ఎఱ్ఱబడింది. ‘మేమెవ్వరం మనుష్యులం కాదాండీ… ఇలాగంతా అవమానం చేయడానికే పిలుస్తారా, ఛీ…’ అవమానం మ్రింగుకున్న ధ్వని తీక్ష్ణంగా అనిపించింది. నాకూ ఎంతో కష్టంగా అనిపించింది ఇందు ఎలా ఎందుకు చేసింది అని. అయితే వాతావరణం తేలిక పరచాలి కదా.
‘వదిలేయండి… ఎవరు తిన్న కంచాలు వాళ్ళే కడగడం మంచి అలవాటే. కావాలంటే మీ యింటికి అందరినీ పిలిచి, మాకూ అలాగే కడగమని చెబ్దురు గాని..’ నవ్వేయాలని చూశాను. నవ్వు రాలేదు. ‘ పోనీండి.. వద్దనిపిస్తే కడగకుండా అలాగే వదిలి వచ్చేయాల్సింది. అన్నీ పారేసుకుంటారా ఏం? వాళ్ళే కడుక్కునే వాళ్ళు. అప్పుడు వాళ్ళకే తెలిసేది. ‘ సమాధానపరుస్తున్నానని అనుకున్నాను. అతను సమాధాన పడలేదు.
‘కాదండీ, నాకు కావలసింది మనిషి మనిషిని మనిషిగా చూడడం మాత్రమే. ఊర్కే వాళ్ళు చేసిందాన్ని మనం రిపీట్ చేస్తే వాళ్ళకూ మనకూ తేడా ఏముంటుంది చెప్పండి? పగ తీర్చుకోవడం కాదు నాక్కావాలసింది. అర్థం చేసుకోవడం కావాలి. పులి మరొక పులిని, గాడిద, హైనా.. అన్నీ తమ గుంపుకు చెందిన ఇంకోప్రాణిని తమలాగే చూస్తాయి. అయితే మనిషి మాత్రం కులము, భాష, ప్రాంతము, మతము ఇలా వేరు చేసుకుంటూ పోతాడు. ఎప్పటికి ఇదంతా ఆగేది?’ తనకు తాను చెప్పుకుంటున్నట్టుగా అని ఊరుకుండిపోయాడు. తర్వాత ‘సరే, నేనింక వెళ్తాను’ అని లేచాడు. వెళ్ళేముందు నేను అతనితో అన్నాను, ‘ప్రసాద్, మనకు ఆకాశంలో నక్షత్రాలన్నీ దగ్గరదగ్గరగా కనిపిస్తాయి. అయితే వాటిదగ్గరికి వెళ్ళి చూస్తేనే వాటి మధ్య ఎన్నెన్ని అగాధాలున్నాయో తెలుస్తుంది. జంతువులు, పక్షులు అన్నీ అంతే. గాడిదల్లో గుంపులున్నాయి. హైనాలు, కుక్కలు అన్నిట్లో ఉన్నాయి. మనకు మాత్రం అవన్నీ ఒకటే అనిపిస్తాయి. ఎందుకంటే మనకు నక్షత్రాల దూరం ఎంతో వీటి ప్రపంచమూ అంతేదూరం. భాషనో దైవాన్నో బోధించినంత సులభంగా ప్రేమించడాన్ని బోధించలేము. ఇదే వాస్తవం. మనము తెలుసుకోవాలి ఈ వాస్తవాన్ని.’
ఆ తర్వాత పరీక్షల హడావిడి. తర్వాత నా పెళ్ళి. మెల్లగా పక్కకు ఒత్తిగిలి ఆ రోమాంచితమైన సమయాలను గుర్తుతెచ్చుకున్నాను. ప్రతిక్షణమూ నాలో ఒక పోరాటం. ప్రతి పోరాటంలో ఒక గెలుపు. ఓటమి కూడా గెలుపే. ఎంత తేలిగ్గా గడిచేవి ఆరోజులన్నీ. నా ఇష్టప్రకారమే నాన్న నాకు పల్లెటూరి అబ్బాయిని చూశారు. అబ్బాయి అక్కడే ఒక కాలేజ్ లో లెక్చరర్. అమ్మ మాత్రం బాధపడింది. ‘ ఏమే చిన్నీ, ఇలా చేసుకుంటున్నావేమే? నీవు, మీ నాన్న కలిసి ఇలాంటి అబ్బాయిని ఒప్పుకున్నారే? ఆ యిల్లు, అతడు.. నీకు కుదరదు చిన్నీ. నీవు పక్షిలా ఎగిరేదానివి. ఇక్కడ రెక్కలు చాపే వీలు కూడా ఉండదు చిన్నీ.. నీవు చాలా ఇబ్బందిపడాల్సి వస్తుంది. నా మాట విను.’ అమ్మ మాటలు నా చెవికెక్కనే లేదు. నేనప్పటికే నా ఫియాన్సీ తో పంటపొలాల్లో వెన్నెల్లో కొండదారుల్లో నర్తిస్తున్నాను.
ప్రసాద్ కు విషయం తెలిసి షాక్ తిన్నాడు. ‘మీరేంటండీ…. నిజంగా పల్లెటూళ్ళో ఉంటారా? నేనసలు నమ్మలేకపోతున్నాను. ఏదీ నన్నోమారు గిల్లండి.’ అన్నాడు.
‘ఏం? ఎందుకు ఉండకూడదు?’
మీసాల వెనుక గుంభనమైన నవ్వు.’ఏం లేదు… అంతా సహజంగా ఉండాలి. ఏదీ అతి కాకూడదు అని చెప్పారెవరో. అందుకే అంటున్నా.’ కొంటెనవ్వు.
‘కాదండీ, మీరెవరేం చెప్పినా వెళ్ళి అక్కడ ఉండబోయేది నేను. నా యిష్టమండీ. అందరికీ నా మీదే కన్ను. అమ్మ, అన్న, మామ అందరిదీ అయింది. ఇక మీరు ఒకరు బాకీ. అందరూ వద్దు అనేవారే.’ ఉక్రోషంతో నా కంట్లో తడి చేరింది. ‘నా సంతోషాన్ని పంచుకొనే మనసే ఎవరికీ లేదు. ఇష్టం ఉంటే పెళ్ళికి రండి. లేకపోతే వద్దు. నేనిక వస్తాను.’వెనక్కి తిరిగాను. వెనుక నుంచి నా తల నిమురుతూ, సారీ అండీ.. మీరు మెచ్చిన ఇల్లు, నచ్చిన అబ్బాయి, మీ జీవితం మీ కలలంతే అందంగా ఉండాలని నేనెప్పుడూ కోరుకుంటాను.’ నిండు మనసుతో పలికాడు. పెళ్ళిలో కూడా ఒక కార్డ్ ఇచ్చాడు. దాంట్లో
‘జీవితం బంగారుపంటగా ముందుకు సాగేటప్పుడు ఏ శోకం, ఏ బాధ ఆపకూడదు. మీ జీవితం ఎప్పుడూ కళకళలాడుతూ పచ్చగా ఉండాలి – ప్రసాద్’ అని వ్రాశాడు.
దిగ్గున లేచాను. ట్రంక్ పెట్టె వెదికితే అడుగున అతడు వ్రాసి యిచ్చిన కార్డ్ నా కాలేజ్ నోట్ బుక్ లో భద్రంగా ఉంది. దాన్ని బయటకు తీశాను. కార్డ్ చుట్టూ పల్లె చిత్రం, అందులో పల్లెపడచులు నీటికడవలు మోస్తున్న దృశ్యం. మధ్యలో అతని వ్రాతలు. దాన్ని దిండుక్రింద పెట్టుకొని మళ్ళీ పరుపు మీద వాలిపోయాను.
పెళ్ళైన కొన్నే రోజులలో పల్లెటూరి ఇంటి పట్టు ఏమిటో తెలిసి వచ్చింది. చీర కట్టడానికి కూడా ప్రత్యేక పద్ధతులు పాటించాలి. కొంచెం తప్పితే అత్తగారి కేకలు. జుట్టు ఎప్పుడూ దువ్వి గట్టిగా అల్లుకోవాలి. భర్త ఎదురుగా జుట్టు వదిలేసి తిరగకూడదు. అతగాడు పైన కూర్చుంటే నేను క్రింద కూర్చోవాలి. అతనితో గట్టిగా మాట్లాడరాదు. మొదట ఇవన్నీ షాకింగ్ గా ఉండేవి. అక్కడ అత్తగారి ఆశలన్నీ ఆచరణలే, విన్నపాలన్నీ సంప్రదాయాలే అని మనసు గట్టిపడసాగింది. ఇవేవీ వైజ్ఞానిక సత్యాలు కావు. పారంపర్య సత్యాలూ కావు. చింతన మూసలో బయల్పడిన ఆధ్యాత్మిక ఆలోచనలూ కావు. ప్రతి ఒక్కటీ ఇంటిలో పెద్దవాళ్ళను సంతృప్తి పఱచే యుక్తులు. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళను ఎప్పుడూ తమ పిడికిట్లో పెట్టుకొనే ఒక ఉపాయం. ఈ దిగ్ర్భాంత్రి గొలిపే సత్యానికి మొదట తత్తర పడ్డా నెమ్మదిగా అలవాటుపడిపోయాను. నాకెందుకు, వాళ్ళిష్టప్రకారం నడచుకొంటే చాలు కదా, పల్లె పడచులు తెచ్చి ఇచ్చే పాల గిన్నె, పూల బుట్ట, అన్నీ మా చేతి నీళ్ళ ప్రోక్షణ తో శుద్ధమయ్యాకే లోనికొచ్చేవి. నేటికీవేళకు నేను ఎంతగా ఈ యింటిమనిషిని అయిపోయానంటే, అందరూ సమానమే, అందరూ మనుషులే అనే భావనను మరచేపోయానసలు. ‘ ఏయ్ నింగీ, తగలకుండా దూరం జరుగటు, నేను గుడికి వెళ్ళాలి.’ ఏయ్ లచ్చమ్మా, నీ కంచం తీసుకురా, టిఫిన్ పెడతాను, ఏంటీ కుక్కెత్తుకుపోయిందా.. సరే ఒక కాగితం తీసుకురా, అందులో పెడతాను… ఏంటీ ఇంకో కంచమా? ఊరికే వస్తుందనుకున్నావా? మీకంతా ఎక్కువైంది.. ఏంటి అరిటాకా? పూతకొచ్చిన చెట్టు నుంచి ఆకులు కోస్తారటే? ఇవ్వాళ అరిటాకంటావు, రేపు ఇంకోటేదో అంటావు…’ ఇట్లాంటి మాటలన్నీ నా నోటి నుంచి ధారాళంగా వచ్చేస్తున్నాయి. ఊరెళ్ళినా రెండు రోజుల్లో పరుగెత్తి వచ్చేయడమే. అమ్మ ఇంకా ఉండి వెడుదువు గాని, నీ స్నేహితురాళ్ళని కలిసి వెడుదువు గాని అంటున్నా, ‘లేదమ్మా, అదంతా కుదరదు. ఆ యింట్లో ఊడ్పులూ, తుడుపులూ ఎక్కువ. ఇక్కడున్నట్టు కాదు. అక్కడంతా మడితో చేయాలి. అత్తగారికి చేతకాదు. ఇక్కడేంటి మీకు ఎట్లున్నా జరిగిపోతుంది. మడి మైల అనేమీ లేదు.’ అని అమ్మనే లోకువకట్టి మాట్లాడి వచ్చేయడమే. ఇద్దరు వంశోద్ధారకులను ఇచ్చానన్న గొప్ప నాది. అత్త మెచ్చిన కోడలినన్న ఘనత. ఇప్పుడు అత్తగారి కోసమే కీర్తికి కొడుకులైనారు, ఆర్తి కి కూతురు కావాలని కడుపులో మోస్తున్నానన్న భ్రమలో కొట్టుకుంటున్నదాన్ని. అత్తగారి కలలన్నీ నిజం చేయడమే నాకు భాగ్యం అని జీవిస్తున్నవేళ ఈ ప్రసాద్ ఆగమనం!!
గడపలో నుంచుని ‘ఎవరండీ లోపల?’ అన్నది విని, ‘ఎవరు కావాలి మీకు?’ అంటూ బయటకొచ్చాను. ఇద్దరూ ఒకరినొకరం చూసుకొని మూగబోయినట్టైంది. అతడే సర్దుకొని ‘ లోపలికి రావచ్చా?’ అంటే, ‘రండి’ అన్నదాన్ని వెంటనే, ‘ వద్దు, వద్దు… అక్కడే చాప వేస్తాను. కూర్చుందాం. ‘ అంటూ బయటకే త్రోసినంత పని చేశాను. నా కట్టూ బొట్టూ చూసి ఆశ్చర్యపోయి, నా ప్రవర్తనతో నొచ్చుకొని ఊరికే కూర్చున్నాడు. తర్వాత అన్నాడు, ‘ఇప్పుడు ఊరికి పోయి మీరు ఇలా ఉన్నారని చెప్తే ఎవరూ నమ్మరు.’ అన్నాడు. తల కొద్దిగా వంచి నన్నే గమనిస్తూ, ‘అసలు ఒకవేళ మీరు కాలేజ్ లో ఎలా ఉండేవారని తలచుకుంటే అసలు నేనే నమ్మలేను. చెప్పండి. ఏది సత్యం?’ గొంతు మృదువుగానే ఉన్నాగంభీరంగా ఉంది. ప్రామాణికంగా ఉంది.
నన్ను ఒక్కసారిగా కొట్టి లేపినట్టైంది ఆ ప్రశ్న. అదొక్కటే ప్రశ్న. నన్ను తొమ్మిదేళ్ళ వెన్నకి తీసికెళ్ళి వదిలేసింది. అదొక్కటే ప్రశ్న. నా మరిచిపోయిన జీవితాన్ని మళ్ళీ కళ్ళెదుట నిలబెట్టినట్టైంది. ‘ఏది సత్యం?’
ప్రసాద్ ను చూసిన ఆ క్షణంలోనే నా హృదయంలోని మూసేసిన తలుపేదో తెరచుకున్నట్టైంది. చెప్పండి, నిజం చెప్పండి. ఏది సత్యం? నన్ను కొట్టినట్టుంది ఆ ప్రశ్న. మనసులో కలవరంగా అనిపిస్తోంది. మనసులోనే కంపించిపోతున్నాను.
‘చెప్పండి. మనిషి మనిషిని అవమానించేది ఇప్పుడు మీకు చాలా సహజంగా అనిపిస్తోంది కదా?’ మృదువుగా, స్పష్టంగా అడుగుతుంటే .. ఆ ప్రశ్న నా గుండెలో గుచ్చినట్టుంది. లేదు…. ఎక్కడో , ఏదో తప్పుదారి పట్టానా నేను? అల్లాడిపోతున్న మనసును కష్టం మీద ఆపుతున్నాను. నన్ను నేను నియంత్రించుకుంటూ అడిగాను.
‘ఏంటి ఇటువైపు?”
‘ఎందుకు, రావడం తప్పంటారా?’ మళ్ళీ గంభీరధ్వని.
‘అలాంటిదేం లేదు. సహజంగా అడిగానంతే.’ నేరుగా చూడలేక ముఖం తిప్పుకున్నాను.
‘ఏం లేదు. ఒక కౌన్సిలింగ్ సెంటర్ ఓపెన్ చేశాను. చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి. దాంట్లో మీ పల్లె కూడా ఒకటి. ఇక్కడివరకూ వచ్చాను కదా, అలాగే మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను.’ అన్నాడు. అంతలో మరదలికి జడ వేయమంటూ అత్తగారి పిలుపు. ఆమె ముఖంలో దాగని చిరాకు. ‘ఎవరు వాడు? పంపించెయ్యకూడదూ?’ అసహనంగా మరదలికి జడవేసి వీపుమీద గుద్దుతూ, ‘అతడు నాతో కలిసి చదివినవాడు.’ చెప్పాను. వీపు మీద గట్టిగా తగిలిందేమో మరదలు అరిచేసరికి అత్తగారి కోపంగా చూశారు. మామగారు ‘ఏమైంది?’ అని కేకేశారు.
ప్రసాద్ ను చూడగానే కాలేజ్, మా గ్యాంగ్, అమ్మ, నాన్న, వాళ్ళందరితో నా ప్రవర్తన, మేమంతా ఒకే కుటుంబంలా సరదాగా ఉండడం, అన్నీ ఒక్కసారి గుర్తొచ్చినట్టైంది. సముద్రంలా అల్లకల్లోలంగా ఉన్న మనసును నియంత్రించుకుంటూ కాఫీ చేసి, నిన్న వేయించిన గింజలు, చక్కిలాలు ప్లేట్ లో పెట్టుకొని తీసుకొచ్చాను. ప్రసాద్ పైకప్పు వంక చూస్తూ కూర్చున్నాడు. తింటూ అడిగాడు, ‘మీ అమ్మ , నాన్న ఎవరూ ఇక్కడికి రాలేదా?’
‘వస్తారు. ఒకరోజు ఉండి వెళ్ళిపోతారు.’ నేరుగా చూడకుండా చెప్పాను. గట్టిగా నవ్వాడు. ‘ఇంకేం చేస్తారు మరి? ఊపిరాడొద్దా ఇక్కడ?’
మా కాలేజ్ రోజుల్లోకి జారుకున్నాము మాటల్లో. మా గ్యాంగ్ వాళ్ళంతా ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అన్నీ మాట్లాడాము. గట్టిగా నవ్వుతూ మాట్లాడుకుంటున్నాము. ‘ఇంకా ఎంత సేపు’ అని మామగారు గదిరించినపుడు గానీ తెలీలేదు. మా చుట్టు పక్కల ఇళ్ళ ఆడవాళ్ళ ముఖాలన్నీ మా కిటికీల్లో.
‘ప్లేట్ కడిగిపెట్టమను’ అత్తగారి ఆజ్ఞ. ప్రసాద్ నా ముఖం వైపు చూశాడు. మౌనంగా లేచి అక్కడే ఉన్న బకెట్ లోని నీళ్ళతో ప్లేట్ కడిగాడు. నాలో ఏదో అదురుపాటు. కాదు…. అలాక్కాదు అనుకుంటుండగానే, ‘ తర్వాత ఆ వరండా కడిగెయ్యమని నింగితో చెప్పు.’ అత్తగారి మాట. నా మనసు ముక్కలైపోయింది. ప్రసాద్ స్థిరంగా నిలుచున్నాడు. అతడి లోతైన కళ్ళు నన్నే తీక్ష్ణంగా చూస్తున్నాయి. ‘అదికాదు ప్రసాద్…. అది …. ‘ తడబడ్డాను.
‘థాంక్స్, మీరానాడు చెప్పినట్టు నేను ప్రవర్తించి ఉండొచ్చు. కానీ నాకు నా స్వాభిమానం కన్నా మీ జీవితం ముఖ్యం.’ సూటిగా చెప్పాడు. తర్వాత జేబు లోంచి ఒక కాగితం తీసి దాంట్లో ఏమో వ్రాసి నా చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు. దాన్ని తీసుకొని నేను రూం లోకి వచ్చి ఆ కాగితం తీసి చూశాను. అందులో,
‘భ్రాంతులతో నిండిన భూమిని దున్ని, కొత్త కావ్యం మొలకెత్తేవేళ, తపన బ్రదుకు కాదు, ప్రలాపాలు జీవితం కాదు. దైవం మీకు మేలు చేయుగాక – ప్రసాద్’
నా మనసు లో గంటలు మ్రోగాయి. హృదయం ఢమరుకనాదం వినిపిస్తోంది. ‘జీవితం సులువైనది, అందమైనది. ఎలా ఉంటే అలాగే స్వీకరించడమే జీవితం అనే ‘ నా జీవన సిద్ధాంతాలన్నీ నిస్సారంగా కనిపిస్తున్నాయి. నేను కట్టింది ఇసుక పునాది. దాన్ని ప్రసాద్ ఎత్తి చూపాడు. ‘మనిషిగా పుట్టిందే అందరినీ ప్రేమించడానికి. మల్లె విరిసినంత సహజంగా ఇంటి తలుపులు తెరుచుకోవాలి. చీకటిని తరమడానికి ఇంట్లో దీపం వెలిగించాలి. ఇల్లంటే బాధ, దుఃఖం, కష్టం అన్నిటినీ తొలగించి నవ్వులను , సంతోషాలను పూయించే ప్రదేశం.’ నాన్న ఫిలాసఫీ ఇది. అమ్మ ధ్యేయమది. అలాంటి చోట పెరిగిన నాకు ‘జీవితం ఎలా వస్తుందో అలా స్వీకరించాలి’ అనే తత్త్వం చాలా సులువుగా కనిపించింది. ఆ భ్రమలో నేను పోగొట్టుకున్నది కేవలం నా వ్యక్తిత్వాన్నే కాదు, మానవత్వాన్ని కూడా. ఛీ… ధిక్కారమే సరి అనిపించింది.
అప్పుడే చీకటి పడుతోంది. ఆయన ఇంటికి వచ్చే వేళయింది. లేచి ముఖం కడుక్కొని తలదువ్వుకుంటూ ఇకమీదట ఈ ఇంట్లో ‘నా’తనం అమలు చేసే ప్రయత్నం చేయాలి. ఆయన సహాయం తీసుకోవాలి అని అనుకున్నాను. అయితే బయట నుంచి వినిపిస్తున్న మాటలు నా చెవిన బడే సరికి దిగ్భ్రమ కలిగింది. అత్తగారు అంటున్నారు ‘ ఎవడో రావడమేమిటీ… వరండాలో కూర్చొని కబుర్లాడడమేమిటీ… అదీ ఈ ఇంటి కోడలు… అంతేనా, వాడు చీటీ ఏదో వ్రాసివ్వడంలో ఆంతర్యం ఏమిటి?’ ఆయనతో ఎవరేమేం చెప్పారో ….. నేను అవేవీ అడిగే పనే పెట్టుకోలేదు. దేవునికి దీపం పెట్టి మౌనంగా కూర్చున్నాను. ఆయన గదిలోకి వచ్చారు. ఎప్పట్లా నావైపు నవ్వుతూ చూడలేదు. నేనూ అంతే. ‘ఏంటిదంతా?’ అన్నారు.
‘ఏది?’ అన్నాను. ‘ వాడెందుకు వచ్చాడు?’
‘ఊర్కే. ఇక్కడేదో పనిమీద వచ్చి ఇలా వచ్చాడట.’ నేను మెల్లగా చెప్పాను.
‘పనిమీద వస్తే పని చూసుకొని వెళ్ళిపోవచ్చు కదా, ఒక వేళ ఇక్కడికి వచ్ఛినా, అదేంటి నవ్వులు, కబుర్లు? యోగక్షేమాలు కనుక్కొని పంపాల్సింది కదా. ఇదంతా నీకవసరమా?’ కొంచెం గద్దించారు.
‘ఏంటి? నా కాలేజ్ ఫ్రెండ్ తొమ్మిదేళ్ళతర్వాత మొదటిసారి వచ్చాడు. అతడిని ఆదరించకుండా, పలకరించకుండా, ఇంట్లో వాళ్ళు ఊరుకుండిపోయారు. ఇప్పుడు కోప్పడాల్సింది నేను. పైగా అతడిని అవమానించారు. ఇప్పుడు నన్నే తిడుతున్నారు’ మొదటిసారి ఆయనతో వాదానికి దిగాను.
నన్ను ఆశ్చర్యంగా చూశారు. ‘నీవేనా ఇలా మాట్లాడుతోంది. లేక వాడా? ఏదో చీటీ కూడా ఇచ్చాడంట??’ ఆయన గొంతులో ధ్వనించిన వ్యంగ్యం నాకు గుచ్చుకుంది. ‘ఏం వ్రాశాడు? చెప్పేదైతే చెప్పు. పట్నం వాళ్ళ నీతి ఏంటో మేమూ తెలుసుకుంటాం.’ ఆ పదును గది నుంచి బయటివరకూ వినిపిస్తోంది. అందరూ చెవులిటే పెట్టి ఉంచారనడంలో నాకే సందేహమూ లేదు. మౌనంగా లేచి చీటీ తీసి ఆయనకు ఇచ్చాను. చదువుతున్న ఆయనలో తడబాటు. ‘మీ తనిఖీ ముగిసిందా?’ చిన్నగా అడిగాను. ‘మన పెళ్ళై తొమ్మిదేళ్ళయింది. ఇద్దరు పిల్లల తల్లిని నేను. మూడోదాన్ని మోస్తున్నా. ఇప్పుడు… ఛీ… మీ మనసుల్లో ఏముంది? మీరు ఎడ్యుకేటెడా? మీ కాలేజ్ లలో ఇదే నేర్పుతారా? ‘ చిన్నగా అంటున్నపుడు జుగుప్స తెలుస్తోంది.
ఆయనకిప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ‘అలాక్కాదు. అమ్మ నాన్నకు అలా అనిపిస్తుంది. పిల్లలేమనుకుంటారు?’ తడబడ్డారు. ‘నీవు ఇలా మొదలుపెడితే రేపు పిల్లలు కూడా ఇదే కరెక్ట్ అనుకోరా , ఆలోచించు.’ అనునయంగా చెప్పబోయారు.
‘ఏంటి? పిల్లలా? అయితే మీరనేది మనిషి మనిషి తో మాట్లాడితే మీరు మీక్కావలసిన సంబంధం కల్పిస్తారా దానికే? ఇదే సంప్రదాయం అంటారా?’
ఆరోజు భోజనం చేయలేదు. ఇంకో రెండు రోజులు పూర్తి మౌనంగా ఉండిపోయాను. నా మనసులో ఒకటే ప్రశ్న. ‘ఏది సత్యం?’ ప్రసాద్ వ్రాసిచ్చిన చీటీని మళ్ళీ మళ్ళీ చదవడం మొదలుపెట్టాను. ఎక్కడో ఒక లింక్ ను నేనే తెంపేశానేమో అని అనిపిస్తోంది. ఔను. కొత్త కావ్యం అంకురించాలి. లేకపోతే నా పిల్లలు కూడా ఇలాంటి సంప్రదాయాలకు పల్లవి పాడడం దూరం లో లేదు అనిపించసాగింది. మూడో రోజు పొద్దున్న లేవగానే పిల్లలకు ‘తాతగారి దగ్గరకు వెళ్దాం’ అని చెప్పి తయారుచేశాను. కోపంగా ఉన్న అత్త, మామ గార్లతో ఏం చెప్పలేదు. ఆయనను ఐదువందలిమ్మని అడిగాను. ఎందుకు అన్నారు. అమ్మ వాళ్ళింటికి వెళ్తున్నాను అని చెప్పాను. ఏంటిది సడెన్ గా అని, ఇంకేం మాట్లాడకుండా డబ్బిచ్చారు. మార్పుగా ఉంటుంది నీకు ఒక రెండు రోజులాగి రా అన్నారు. నేనేం మాట్లాడలేదు. అత్త, మామగార్లతో ఊరెళ్ళొస్తాను అని మాత్రం చెప్పాను. పిల్లల చెయి పట్టి బయల్దేరినప్పుడు చిన్నడిని పిలిచి సామాన్లు బస్ లో పెట్టమని ఆయన చెప్పారు. అంతేకాక నాతో పాటు నడిచారు. పిల్లలు హుషారుగా చిన్నడితో పాటు ముందుగా వెళ్ళారు. ‘నీవు ఇలా బయల్దేరితే ఊర్లోవాళ్ళు ఏమనుకుంటారు? త్వరగా వచ్చేయ్.’ ఏదేదో చెప్తున్నారాయన. బస్సు దగ్గరకొచ్చాక చెప్పాను. ‘నేను మళ్ళీ ఇక్కడికొస్తే నాకు కావలసినట్లు బ్రతకాలి. లేదంటే మీరే అక్కడికి వచ్చేయండి, అక్కడే ఉందాం. నిర్ణయం మీది.’ బస్సెక్కాను.
ఊరికి చేరాక నాన్న అమ్మతో చెప్పాను.’ నాన్నా, మళ్ళీ వచ్చేశాను. పోగొట్టుకున్నది దొరికితే మనం బాధపడడం ఎందుకు? కదా?’ నాన్న మౌనంగా చూసి చిరునవ్వు నవ్వారు. అమ్మ , ‘ఆ యిల్లు నీకు తగింది కాదు అని మొదటే చెప్పాను. ఇప్పుడు… ఇన్నేళ్ళయ్యాక ఇలా చేస్తున్నావే, నీకేం చెప్పాలి? ఎలాగో సర్దుకొని పోతున్నావు కదా?’ అన్నది.
‘ఎందుకమ్మా? నా పిల్లలు రేపు నిన్ను కూడా ఇంట్లోకి రానివ్వని పరిస్థితి రావాలనుకుంటున్నావా? నేను పెరిగినట్టు నా పిల్లలు కూడ స్వేచ్ఛగా రెక్కలతో ఎదగకూడదా?’ అన్న మాత్రం,’ నీ ఇష్టం చిన్నీ. నీకేం అడ్డం లేదు. నాకైతే సంతోషమే.’ అన్నాడు.
ప్రసాద్ కు ఫోన్ చేశాను. ‘అయ్యో, ఏంటండీ, నావల్ల ఏదేదో జరిగిపోయిందేంటండీ?’ పశ్చాత్తాపంతో అన్నాడు.
‘అలాంటిదేం లేదు. ఆయన ఇక్కడికి వస్తారని నాకు నమ్మకం ఉంది. అందుకు మీకే మొదట థాంక్స్. నేను పోగొట్టుకున్నదాన్ని నాకు మళ్ళీ ఇచ్చినందుకు. ఇప్పుడు నాకు మీ ప్రాజెక్ట్ లో పని ఇవ్వడానికి కుదురుతుందా?’
‘అదంతా సరే, కానీ మీరంత త్వరగా ఎలా నిర్ధారణకు వచ్చారు?’ అయోమయంగా అడిగాడు.
‘కార్బన్ డై ఆక్సైడ్ నే ఆక్సిజన్ అనుకుంటూ ఉండిపోయానండీ.’ గట్టిగా నవ్వాను. అతడూ నవ్వేశాడు.

కన్నడ మూలం: ఎం.ఆర్.మందారవల్లి
అనువాదం: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here