[box type=’note’ fontsize=’16’] “నవమి” అనే ఖండకావ్యంలో మొత్తం తొమ్మిది ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో చక్కని పద్యాలు ఉన్నాయి. ‘చేతన’ అనే కలం పేరుతో ఈ ఖండకావ్యాన్ని అందిస్తున్నారు కవి మేడిపల్లి వేంకట లక్ష్మీ నారాయణ. ఇది 9వ ఖండిక ‘తెలుగువాడ!’. [/box]
[dropcap]‘తె[/dropcap]లుగువాడ!’ – ‘నవమి’ ఖండకావ్యంలోని 9వ ఖండిక.
***
వినయవంతునకును విశ్వంబువశమగు
వినయవంతునకును విత్తమబ్బు
వినయమునకు సాటి ఘననీయ మిలలేదు
తెలుసుకొనగదయ్య తెలుగువాడ! (1)
విద్యగలుగువాడు విన్నాణయుతుడౌను
విద్యగలుగువాడు వేత్తయగును
విద్యగలుగువాడు విశ్వబూజితుడౌను
తెలుసుకొనగదయ్య తెలుగువాడ! (2)
తనదు ధర్మమెపుడు దానాచరించుచు
పరులధర్మములకు వశుడుగాక
ఉండు మనుజుడెపుడును ర్విలోబూజ్యుండు
తెలుసుకొనగదయ్య తెలుగువాడ! (3)
దేశబాషలందు దెలుగులెస్సని చాటె
ఆంధ్రభోజు డిలను నాదరమున
అట్టిభాషయందు బుట్టినాడువు నీవు
తెలుసుకొనగదయ్య తెలుగువాడ! (4)
సుందరమనితెల్గు డెందముల్ ద్రవియింప
అరవకవులు జెప్పిరద్భుతముగ
అట్టి తెలుగునీది యవనిలో సోదరా!
తెలుసుకొనగదయ్య తెలుగువాడ! (5)
తేటయైనదంచు దేనెమయమ్మంచు
తెలుగుభాషగూర్చి దివ్యమతిని
కన్నడిగులుధాత్రి మిన్నగాజెప్పిరి
తెలుసుకొనగదయ్య తెలుగువాడ! (6)
ఆంధ్రభాషపట్ల నాదరభావాన
దానివృద్ధిగోరి తగినరీతి
ఆంగ్లుడైన ‘బ్రౌను’ నధికసేవనుజేసె
తెలుసుకొనగదయ్య తెలుగువాడ! (7)
తెలుగునందుబుట్టి తెలుగుతేజమునంద
గొప్పపుణ్యమంచు గోవిందుండు
అరవకవియునప్పయాభ్యుడుననెనుగా
తెలుసుకొనగదయ్య తెలుగువాడ! (8)
పాలతెట్టు కన్న పరమాన్నమునకన్న
జుంటుతేనెకన్న జున్నుకన్న
తెలుగు నధికమనిరి దివ్యాత్ములెందురో
తెలుసుకొనగదయ్య తెలుగువాడ! (9)
మధురమధురమైన మకరందమయమైన
తేనతీపికన్న తీయనైన
హ్లాదమొసగునట్టి యాంధ్రభాషయునీది
తెలుసుకొనగదయ్య తెలుగువాడ! (10)
నీతినియమములను నిష్ఠలు బోధలున్
వర్తనంపురీతి వాస్తవముల
నిత్యసత్యములను నిపుణతంజెప్పిన
తెలుగుభాషనీది తెలుగువాడ! (11)
కావ్యశాస్త్రములును ఘనపురాణంబులు
ధర్మశాంతి మరియు దైవచింత
నిందుజెప్పబడియె నింపైనవిధమున
దీనిదెలియుమయ్య తెలుగువాడ! (12)
నరునిబ్రదుకుదెఱువు న్యాయజీవనరీతి
జ్ఞానశీలతత్త్వవైనములను
అయిదువిలువలిందు నీమంరంగజెప్పిరి
దివ్యమతినిగనుము తెలుగువాడ! (13)
తెలుగునాగరికత, తెలుగువిజ్ఞానంబు
తెలుగు సంస్కృతియును, తెలుగుభాష
తెలుగుజాతికున్న దీపితసుగుణాలు
తెలుగువాడ! కనుము తెలుగవెలుగు! (14)
ఇంతగొప్పభాష యెందునులేదని
ఎంతమందొ చెప్పనిజ్జగాన
అందుపుట్టిదానినభినుతించని యట్టి
తెలుగుదెలనీకు తెలుగువాడ! (15)
అట్టిభాష గల్గి దిట్టయౌచునునొప్పి
వెలుగుజాతినీది తెలుగువాడ!
దీనిగొప్పదనము దీప్తినింబొందియు
తెనుగునేలమీద దనరవలదె! (16)
తెలుగువానికున్న తెగువయుంజేవయు
తెలుగు భాషకున్న జిలుగుదనము
తెలుగునేలకున్న దీపితదీక్షయు
ఇలను లేవుయెందు తెలుగువాడ ! (17)
అన్నదాత యౌచునందరికిని దిండి
కడుపునిండబెట్టు కష్టజీవి
అవనినందు నెందునాంధ్రుండునొక్కడే
దీనినెఱుగవయ్య తెలుగువాడ! (18)
అటిజాతిబుట్టి నాంధ్రభాషను వీడి
ఆంగ్లభాష మోజునందనేల?
అందనట్టిద్రాక్ష కఱ్ఱుజాచుటదేల?
తెలియలేవసుంత తెలుగువాడ! (19)
నీవు నీపూర్వలందరు నెమ్మితోడ
చదివి బ్రతికిన నీతెల్గు చదువుబ్రీతి
నీదుసంతానమునకును బాదుకొల్పి
తెలుగువాడను నేనంచు తెలుపుమయ్య (20)