ముద్రారాక్షసమ్ – తృతీయాఙ్కః – 5

0
3

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

కఞ్చుకీ: 

(ప్రవిశ్య) – కష్టం ఖలు సేవా.

శ్లోకం:

భేతవ్యం నృపతే, స్తతః సచివతో, రాజ్ఞస్తతో వల్లభా,

దన్యేభ్యశ్చ వసన్తి యేఽస్య భవ నే లబ్ధ ప్రసాదా విటాః,

దైన్యా దున్ముఖ దర్శ నాపలపనైః పిణ్డార్థ మాయస్యతః

సేవాం లాఘవకారిణీం కృతధియఃస్థానేశ్వవృత్తిం విదుః (14)

అర్థం:

(ప్రవిశ్య=ప్రవేశించి), కష్టం=క్లేశం, సేవ=నౌకరి, ఖలు=నిశ్చయము;

నృపతే+భేతవ్యం=(తొలుత) రాజుకు భయపడాలి, తతః=వాని తరవాత, సచివతః+(భేతవ్యం)=మంత్రికి భయపడాలి, తతః= ఆ మీదట,  రాజ్ఞః+వల్లభాత్+(భేతవ్యం)=రాజుకి ఇష్టుడైన వాడికి భయపడాలి, (తతః) అస్య+భవనే=అతడి ప్రాసాదంలో, లబ్ధప్రసాదాః=రాజు అనుగ్రహానికి ప్రాప్తులైన, యే+విటాః+వసన్తి=ఏ కోడెగాళ్ళు ఉంటూంటారో (వారికీ), అన్యేభ్యః+చ=ఇతరులెవరైనా ఉంటే వారికీ (భేతవ్యం=భయపడాలి). దైన్యాత్=లేమి కారణంగా, పిణ్డార్థం=అన్నం ముద్ద కోసం, ఉన్ముఖ+దర్శన+అపలపనైః=వారి ఎదుట ముఖం చూపించి, మనసులో భావాలు బయటపడకుండా జాగ్రత్త పడుతూ, ఆయస్యతః=శ్రమించేవాడి (యొక్క), లాఘవకారిణీం=చులకన పరిచే, సేవాం=సేవ చేయవలసిన స్థితిని, స్థానే=సమంజసంగానే,   కృతధియః=బుద్ధిమంతులు, శ్వ+వృత్తిం+విదుః=కుక్క చేసే పని – అని తెలుసుకుంటారు (యజమాని ముందు తోక ఊపుకుంటూ సంతోషపెట్టే తాపత్రయం – అని సారాంశం).

వ్యాఖ్య:

రాజుని, అతడి ఆశ్రితుల్ని, మంత్రుల్ని మెలకువ కలిగి సేవించడమంటే భయం బతుకులనీ, లేమి కారణంగా తప్పనిసరిగా చేసే ‘కూటి సంపాదన’ అనీ – కుక్క చాకిరి అని కంచుకి తన వృత్తిని యీసడిస్తున్నాడు. అవతల చంద్రగుప్తుడు, యివతల చాణక్యుడు తన బతుకు కుక్క బతుకు చేసేశారని దుఃఖపడుతున్నాడు.

వృత్తం:

శార్దూల విక్రీడతం – మ – స – జ -స – త – త – గ – గణాలు.

అలంకారం:

అర్థాంతరన్యాసం. (ఉక్తి రర్థాంతర న్యాసస్స్యాత్ సామాన్య విశేషయోః – అని కువలాయనందం).

కఞ్చుకీ: 

(పరిక్రమ్యావలోక్య చ) ఇద మార్య చాణక్య గృహమ్. యావత్ప్రవిశామి, (ప్రవి శ్యావలోక్య చ) అహో! రాజాధి రాజ మన్త్రిణో విభూతిః! తథా హి.

శ్లోకం:

ఉపలశకల మేత ద్భేదకం గోమయానాం,

వటుభి రుపహృతానాం బర్హిషాం స్తూప మేతత్,

శరణ మపి సమిద్భిః శుష్యమాణాభి రాభి

ర్వినమిత పటలాన్తం దృశ్యణే జీర్ణ కుడ్యమ్. (15)

అర్థం:

(పరిక్రమ్య=ముందుకు నడిచి, అవలోక్య+చ=చూసి) ఇదం+ఆర్య+చాణక్య+గృహమ్=ఇది చాణక్య అయ్యవారిల్లు. యావత్+ప్రవిశామి=ఇప్పుడే లోపలికి వెళతాను, (ప్రవిశ్య+అవలోక్య+చ=ఆవరణలోకి వెళ్ళి చూసి) అహో=ఆహా! రాజాధిరాజ+మన్త్రిణః =చక్రవర్తికే మంత్రి అయిన చాణక్యుడి, విభూతిః= వైభవం (సంపద), తథా హి=అంతే కద!

ఏతత్=ఇది, గోమయానాం+భేదకం+ఉపల+శకలమ్=ఆవు పేడ ఉండలను పగలగొట్టే రాతి ముక్క (రాతి గుండు), ఏతత్=ఇదేమో, వటుభిః+ఉపహృతానాం+బర్హిషానాం+స్తూపం=బ్రహ్మచారి శిష్యుల చేత తీసుకురాబడిన దర్భగడ్డి మోపు, శరణం+అపి= (చూస్తేనా) ఇల్లు కూడా, – శుష్యమాణాభిః+ఆభిః+సమిద్భిః = ఎండబెట్టబడిన హోమాలకు వాడే సమిధలతో (నిండి వుంది), జీర్ణ కుడ్యమ్+వినమిత+పటలాన్తం+దృశ్యణే=(ఇది) శిథిలమైన గోడలతో, ఇంటి చూరు వాలిపోయి కనిపిస్తున్నది.

వ్యాఖ్య:

ఐచ్ఛికంగా – పేదరికం వరించి – చాణక్యుడు ఋషి జీవితం గడుపుతున్నాడని ఇక్కడ ఉద్దేశం. అతడు శ్రోత్రియుడు. అధ్యయన, అధ్యాపనాలే వృత్తి అనీ, సంపద పోగు చేయడంలో ఏమీ ఆసక్తి లేని వాడనీ సూచన.

వృత్తం:

మాలిని. న – న – మ – య – య గణాలు.

అలంకారం:

స్వభావోక్తి. (స్వభావోక్తిస్స్వభావస్య జాత్యాదిస్థస్య వర్ణనమ్- అని కువలయానందం).

ఇక్కడ ఒక శ్రోత్రియుడి ఇంటి పరిసరాలను సహజంగా వర్ణించడం జరిగింది.

కఞ్చుకీ:   

తత్ స్థానే ఖ ల్వస్య వృషలోద్య శ్చన్ద్రగుప్త ఇతి, కుతః

అర్థం:

తత్=అందువల్ల, చన్ద్రగుప్తః=చంద్రగుప్తుడు, వృషలోద్య=శూద్రుడు అని పిలవబడడం (తక్కువ జాతి వాడని), అస్య+స్థానే+ఖలు=అనేది తగినదే కదా! కుతః=ఎందుకంటున్నానంటే…

వ్యాఖ్య:

ఇక్కడ వాడిన ‘వృషలోద్యః’ అనే పదం గురించి వివరణ చెప్పవలసి ఉంది. ‘వృషలీ’ అంటే శూద్ర స్త్రీ – లేదా – తక్కువ జాతి స్త్రీ అని అర్థం. ‘వృషలః’ అంటే అట్టి స్త్రీకి పుత్రుడు. నందరాజుకి ముర అనే శూద్ర స్త్రీ వల్ల చంద్రగుప్తుడు జన్మించాడని చరిత్ర. చాణక్యుడు చంద్రగుప్తుణ్ణి ఎంత ఇష్టపడినా ‘వృషల’ అని మాత్రమే సంబోధించేవాడని యీ నాటకాన్ని బట్టి తెలుస్తోంది. మన తెలుగు నుడికారంలో చెప్పాలంటే “ఏమయ్యా పెద్దకాపూ!” అని పిలిచేవాడని చెప్పుకోవచ్చు. ఆనాటి (క్రీ.పూ.320) కుల కట్టుబాట్ల పరిమితుల్లో ఇట్టి పిలుపును తప్పుపట్టడం వుండేది కాదనుకోవాలి.

ఇక: ‘వృషలోద్యః’ – అనే ప్రయోగం గురించి ఢుండిరాజు తన వ్యాఖ్యలో – “వృషల శబ్దేన వదితుమర్యః” (శూద్ర పదంతో వ్యవహరించడానికి తగినవాడు – జాతి తక్కువవాడు) అని అర్థం చెప్పాడు. ఇంకా వ్రాస్తూ, చాణక్యుడు లౌకిక జీవితం పట్ల అనాసక్తి గలవాడు కనుక రాజునైనా తృణీకార బుద్ధితో, ఒక భృత్యుణ్ణి చూసే విధంగా భావించేవాడని విశదం చేశాడు (నిస్పృహత్వాత్ రాజానమపి తృణీకృత్య భృత్యవత్ వ్యపదిశతీత్యర్థః).

వృషల+వద్+క్యప్ (వదః సుపిక్యప్ చేతిక్యప్ – చకారత్ యచ్ఛ। వృషలస్య వదనమ్ కధనమిత్యర్థః) – అని ఎన్.సి. చక్రవర్తి వివరణ. “అందుకేనయ్యా, శూద్రుడని పిలవడం!” అని సారాంశం (వృషల వద్యః అని కూడా ప్రయోగం).

ఇక్కడ కంచుకి ‘వృషలోద్యః’ అని యీసడించడంలో ఉద్దేశం “అంతటి వైభవం అనుభవిస్తూ – యీ బ్రాహ్మణ్ణి యీ స్థితిలో ఉండనిచ్చాడంటే – అతడిని తక్కువజాతివాడు అనడం తగినదే కదా” అని.

శ్లోకం:

స్తువన్తి శ్రాన్తాస్యాః క్షితిపతి

మభూతై రపి గుణైః

ప్రవాచః కార్పణ్యాద్య ద్యవితథ

వాచో ఽపి పురుషాః

ప్రభావ స్తృష్ణాయాః స ఖలు

సకలః స్యా; దితరథా,

నిరీహాణా మీశస్తృణ మివ

తిరస్కార విషయః (16)

అర్థం:

అవితథ+వాచః+పురుషాః+అపి=సత్యవాక్కుకు కట్టుబడిన వ్యక్తులైనప్పటికీ, కార్పణ్యాత్=దీనస్థితిలో ఉన్న కారణంగా, ప్రవాచః=మాట నేర్పు కలవారై, శ్రాన్త+అస్యాః=నోరు నొప్పెట్టేలాగా (పొగిడి అలసిపోయేలాగా), అభూతైః+అపి+గుణైః=లేని గుణాలను కూడా (అతడిలో లేని సుగుణాలను ఆపాదిస్తూ), క్షితిపతిం=రాజును, స్తువన్తి+యత్=పొగడడమనేది ఏది ఉందో, స+సకలః=అది అంతా, తృష్ణాయాః=అతిశయించిన ఆశ యొక్క, ప్రభావః+స్యాత్+ఖలు=ప్రభావమే అయి ఉంటుంది కదా!

ఇతరథా=వేరే విషయం (సందర్భం) అయితే, నిరీహాణాం=ఏ కోరికలు లేని వారికి, ఈశ=రాజు, తృణమ్+ఇవ=గడ్డిపోచ మాదిరిగా, తిరస్కార+విషయః=అంగీకారం కానిది -.

వ్యాఖ్య:

దైన్యం వల్ల, సత్యసంధులు కూడా, తాము సేవించే రాజుల్లో లేని గుణాలు కూడా పొగిడి పబ్బం గడుపుకుంటారేమో కాని, ఏ విధమైన కోరికలు సొంతానికి లేని నిర్లిప్తులు రాజుల్ని గడ్డిపరకగా గణించి – తిరస్కార బుద్ధితో ఉండడం సహజమే కదా! – అని కంచుకి తీర్మానిస్తున్నాడు.

వృత్తం:

శిఖరిణి – య – మ – న – స – భ – లగ – గణాలు.

అలంకారం:

“తృణ మివ  తిరస్కార విషయః” (ఈశః) అన్న చోట ఉపమ.

ఆఖరిపాదంలో – అర్ధాంతరన్యాసం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here