[dropcap]’యా[/dropcap]త్ర’ నాల్గవ ఎపిసోడ్ కూడా… ఒక రైలుని, స్టేషన్లో రైల్వే సిబ్బందినీ, ప్లాట్‌ఫామ్ మీద ప్రయాణీకులని చూపిస్తూ, రైల్వేలందిస్తున్న సేవల గురించి ఒకటి రెండు వ్యాఖ్యలతో ప్రారంభమవుతుంది. రైలు తమిళనాడు దాటి ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంటకి చేరుకుంటోందని నాయర్ వాయిస్ ఓవర్‌తో మొదలవుతుంది.
కూపేలో ఉన్న ఆఫీసర్‌నీ, అతని భార్యని చూపిస్తారు. అక్కడ ఫ్యాన్ తిరగకపోయేసరికి రాహుల్ దాన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తాడు. “తిరుగుతుందా, లేదంటే రైల్వే వాళ్ళని పిలవనా” అంటాడు ఆఫీసర్. ‘ప్రయత్నిస్తున్నానుగా’ అంటాడు రాహుల్. ఫ్యాన్‌ని దువ్వెనతో కదుపుతూ, మీనాక్షి కేసి చూస్తూ ఊహల్లో తేలిపోతాడు. తానో సముద్రం ఒడ్డున ఉన్నట్టు, మీనాక్షి జలకన్యలా తన వైపే వస్తున్నట్లుగా కలల్లో తేలిపోతాడు. ‘బాగయ్యిందా, స్విచ్ వేయనా’ అని ఆఫీసర్ అడిగితే, తలూపుతాడు. స్విచ్ వేస్తే ఫాన్ తిరుగుతుంది.
***
కెమెరా రైల్వే క్యాంటీన్‌లో పిండి రుబ్బడాన్నీ, ఇడ్లీ వడలని త్రాసులో బరువు కొలిచి ప్యాక్ చేయడాన్ని చూపిస్తుంది. రైలు రేణిగుంట స్టేషన్ సమీపిస్తుంటూంది. రైల్వే సిబ్బంది బేస్ కిచెన్ నుంచి ఆహార పదార్థాలను ట్రాలీలో బయటకు తెస్తారు. బండి వచ్చి ఆగుతుంది. దిగేవాళ్ళు దిగుతారు, ఎక్కేవాళ్ళు ఎక్కుతారు. ఫుడ్ ఆర్డర్ చేసిన వారికి కేటరింగ్ వాళ్ళొచ్చి టిఫిన్స్, కాఫీ/టీ అందిస్తుంటారు.
ఇంతలో ఒకతను పరుగెత్తుకుంటూ ప్లాట్‌ఫామ్ మీదకు వస్తాడు. అతన్ని తరుముతూ ఇంకో ఇద్దరు వస్తారు. రైలు కదులుతుంది. పరుగెత్తుకు వచ్చిన అతను వాళ్ళని తప్పించుకుని నాయర్ ఉన్న బోగీలోకి ఎక్కి నాయర్ పక్కన కూర్చుంటాడు. అతన్ని వెతుక్కుంటూ వచ్చిన ఆ ఇద్దరూ కూడా బోగీలోకి ఎక్కుతారు. అతన్ని వెతుకుతూ వచ్చి, నాయర్ పక్కన కూర్చుని ఉండడం చూసి కొట్టబోతారు. ప్రయాణీకులు కంగారు పడతారు. నాయర్ వాళ్ళని ఆపి, ఎందుకు గొడవపడుతున్నారో అడుగుతారు. వాళ్ళు కారణం చెప్పరు. ఇంకా అతన్ని కొడుతూనే ఉంటే, కోపం వచ్చి నాయర్ వాళ్ళని తరిమేస్తాడు. అతనికి ధైర్యం చెప్పి తన పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. శిష్యుడు కూడా అతన్ని కుదుటపరచడానికి ప్రయత్నిస్తాడు.
“ఏంటి గొడవ? ఎవరు వాళ్ళు?” అని అడిగినా, అతడేమీ సమాధానం చెప్పడు. మౌనంగా తల వంచుకుని కూర్చుంటాడు. “ఇక్కడ ఆడవాళ్ళు, పిల్లలూ ఉన్నారు. ఇతను ఇక్కడ ఉండకూడదు. దింపేయండి” అంటాడు మరాఠీ వృద్ధుడు. “ఏం పర్వాలేదు, ఏం కాదు” అంటాడు నాయర్. “పోలీస్ రిపోర్టయినా ఇవ్వాలి” అంటాడా వృద్ధుడు. అక్కర్లేదంటాడు నాయర్. “ఇతనెవరో ఏమిటో, నేరస్థుడిగా ఉన్నాడు” అంటాడు ముసలాయన. “మీరు ఊర్కుంటారా, అనవసరంగా భయపడుతున్నారు. స్టేషన్ వచ్చినప్పుడల్లా, ‘తలుపేసేయండి తలుపేసేయండి’ అని గోల చేస్తున్నారు. నేను సైనికుడ్ని. మరేం ఇబ్బంది ఉండదు” అని నచ్చజెప్తాడు. పారిపోయి వచ్చిన అతడ్ని కుదుటపడనిస్తాడు.
రైలు గమ్యం కేసి దూసుకుపోతూంటుంది.
***
బోగీ తలుపు దగ్గర రాహుల్, మీనాక్షి నిల్చుని ఉంటారు. “కాలేజ్ చదువైపోయాక ఏం చేస్తారు?” అడుగుతాడు రాహుల్. “తెలియదు” అంటుది మీనాక్షి.
“మీకు పెళ్ళి చేసేస్తారా?”
“ఆ సంగతి అమ్మానాన్నా చూసుకుంటారు? మీరేం చేస్తారు?” అడుగుతుంది.
“ఉద్యోగాల వేటలో ఉన్నాను… ఉద్యోగం దొరికాకా నేను…” అని ఇంకా ఏదో చెప్పబోతుంటే మీనాక్షి తల్లి బయటకు వచ్చి, “స్టేషన్ వస్తోంది. మనం దిగాలి, లోపలికి రా మీనాక్షి” అంటుంది.
మీనాక్షి వెనుతిరిగి వెళ్ళిపోతుంది.
కొన్ని క్షణాల తర్వాత రాహుల్ కూడా లోపలికి వెళ్తాడు.
“విజయవాడ స్టేషన్ వచ్చేస్తోంది. నేను బట్టలు మార్చుకోనా? ఇలాగే ఉండనా? గడ్డం చేసుకోనా?” అని ఆఫీసర్ కంగారుగా భార్యని అడుగుతాడు. “అబ్బా, మీరు ఈ రైలుకి వస్తున్నారని అందరికీ తెలుసు కదా, ఎవరేం అనుకోరు లెండి” అంటుంది భార్య. “నన్ను రిసీవ్ చేసుకోడానికి వచ్చినవాళ్ళు నన్నిలా చూస్తే ఏమనుకుంటారో” అంటాడు. “ఏమనుకోరు” అంటుందామె. వాళ్ళు దిగడానికి సిద్ధమవుతుంటే, ఒక చిన్నకాగితం మీద ఏదో రాసి, ఎవరూ చూడకుండా రాహుల్‌కి అందిస్తుంది మీనాక్షి.
రైలు నెమ్మదిగా వచ్చి విజయవాడ స్టేషన్‌లో ఆగుతుంది. మనకెంతో పరిచితమైన ఈ స్టేషన్ 33 ఏళ్ళ క్రితం ఎలా ఉందో తెర మీద చూడడం బావుటుంది. ఆఫీసర్ తలుపు దగ్గరకి వచ్చి చూస్తాడు. అతన్ని రిసీవ్ చేసుకోడానికి ఎవరూ వచ్చినట్టు కనిపించరు. ఆ కుటుంబం క్రిందకి దిగుతుంది. ఇక్కడ కెమేరా పనితనం ఎంత బావుటుందంటే ప్లాట్‌ఫాంమ్‌ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. డిస్‌ప్లే లో ఉన్న ‘అనుభవం’ అనే సినిమా పోస్టర్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మీనాక్షి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూస్తుంది. తలుపు దగ్గరకి వచ్చిన రాహుల్ చేయి ఊపుతాడు. మళ్ళీ కాసేపు ఊహల్లోకి వెళ్ళిపోతాడు.
ప్లాట్‌ఫామ్ మీద టిఫిన్లు, టీలు అమ్ముతున్న వాళ్ళని దాటుకుంటూ కొందరు తెలుగువాళ్ళొచ్చి ఆ బోగీలోకి ఎక్కుతారు. వాళ్ళల్లో ఆడవాళ్ళు పట్టుచీరలు నగలు ధరించి ఉంటారు. మరాఠీ వృద్ధురాలు ఆశ్చర్యపోతుంది. “ఇన్నిన్ని నగలు వేసుకుని ప్రయాణం చేస్తారా? ప్రయాణంలో ఏదైనా జరిగితే ఎవరిది తప్పు?” అంటుంది. “నకిలీవి అయ్యుంటాయ్… అందుకే వేసుకున్నారేమో?” అంటుంది నీనా గుప్తా టిఫిన్ తింటూ.
“కాదు అవి అసలైన నగలే. నేను గుర్తించగలను” అంటుందామె.
“నువ్వేమీ నగలు వేసుకున్నట్టు అనిపించడంలేదు. ఇష్టం లేదా?” అని నీనా గుప్తాని అడుగుతుంది.
“నా పెళ్ళప్పుడు అమ్మానాన్నలు బోలెడు నగలు పెట్టారు… కానీ పెళ్ళయ్యాకా…” అంటూ ఆపేస్తుంది. మరాఠీ వృద్ధురాలికి తన కూతురు గుర్తొస్తుంది. అత్తవారింట ఆరళ్ళు పడడం గుర్తొచ్చి ఆమె వదనం వాడిపోతుంది.
నాయర్ కిందకి దిగి ప్లాట్‍ఫాం మీద నిలుచుంటాడు. రేణిగుంట స్టేషన్లో ఒకతన్ని తరిమిన ఇద్దరూ విజయవాడలో నాయర్ బోగీకి ఎదురుగా నిలుచుని లోపలున్న అతన్నే చూస్తుంటారు. నాయర్ ‘ఏం భయం లేదు, నువ్వు అవతలికి జరిగి కూర్చో’ అంటాడు. కెమెరా ఫ్లాట్‌ఫాంపైకి మళ్ళుతుంది. ప్రయాణీకులు నిల్చుని, కూర్చుని ఎదురుచూస్తూ కనిపిస్తారు. డిస్‌ప్లేలో ‘జయచిత్ర’ వారి మరో పోస్టర్ కనిపిస్తుంది. సినీరంగానికీ, విజయవాడ నగరానికీ ఉన్న అవినాభవ సంబంధాన్ని ఈ పోస్టర్స్ చెప్పకనే చెబుతాయి.
***
రైలు విజయవాడ నుంచి బయలుదేరుతుంది. రాహుల్ తమ కూపేలో తల గోడకి కొట్టుకుంటూ కనిపిస్తాడు. బాధపడ్తూ కూర్చుంటాడు. కొన్ని క్షణాల తర్వాత మీనాక్షి ఉత్తరం రాయడం ప్రారంభిస్తాడు. విజయవాడలో కొందరు అగంతకులు ఎక్కుతారు. కొందరు రాహుల్ ఉన్న కూపేలో తలుపులు తోసి లోపలెవరున్నరో చూస్తుంటారు. మరో వైపు నుంచి రైల్వే పోలీసులు వచ్చి, ‘కూపే తలుపులు ఎందుకు తెరిచావ’ని రాహుల్‍ని అడిగితే, ‘నేను వేశానే’ అంటాడు. మరికొందరు నాయర్ ఉన్న వైపు నుండీ ప్రయాణీకులను, వారి సామాన్లను పరిశీలనగా చూస్తూ ముందుకు నడుస్తుంటారు. వాళ్ళ ప్రవర్తన అనుమానస్పదంగా ఉంటుంది. నగలు ధరించిన ఆడవాళ్ళను చూడగానే ఒకరికొకరు సైగలు చేసుకుంటారు. కూపేల వైపు వెళ్ళినవాళ్ళు, వీళ్ళు అంతా కలుసుకుని లోగొంతులతో మాట్లాడుకుంటారు. తర్వాత జేబులోంచి పేకతీసి ఆడుతూ కూర్చుంటారు.
***
లోపల నాయర్ – “వాళ్ళకీ నీకూ ఏదైనా శత్రుత్వం ఉందా?” అని పారిపోయి వచ్చి తన పక్కన కూర్చున్న వ్యక్తిని అడిగుతాడు. “వాళ్ళెవరో కూడా నాకు తెలియదు” అంటాడతను. “అయితే వేరే వాళ్ళెవరైనా నీ మీద దాడి చేయమని పంపించి ఉంటారా?” అని నాయర్ అడుగుతాడు. కొన్ని క్షణాలాగి, “ఏదైనా ఆస్తిపాస్తుల గొడవా?” అని అడుగుతాడు. కొన్ని క్షణాలు మౌనంగా ఉండి “అలాంటిదేం లేదు” అంటాడతను. “అయితే ఆడవాళ్ళకి సంబంధించి ఏదైనా గొడవైందా?” అని అడుగుతాడు నాయర్. “నేను అలాంటివాడిలా కనిపిస్తున్నానా?” అంటాడతను. శిష్యుడు ఆసక్తిగా వింటూంటాడు. “ఏదో జరిగుంటుంది కదా” అంటాడు నాయర్. “నిజమేంటంటే – నేను ఏదైతే చేస్తున్నానో ఆ పని కొందరికి ఇష్టం లేదు” అంటాడతను. “పనులలో రెండు రకాలుంటాయి… సత్యం కోసేం చేసేవి, బొంకు కోసం చేసేవి” అంటారు స్వామీజీ. “స్వామీజీ, నేను చేసేదంతా సత్యం కోసమేనని నాకనిపిస్తుంది” అంటాడతను.
“అలాంటప్పుడు ఎందుకు పారిపోతున్నావు? కూర్చుని పరిష్కరించుకోవచ్చుగా?” అడుగుతాడు నాయర్.
“నా పోరాటం మీ యుద్ధాల వలె నియమాల ప్రకారం జరగదు. పైగా నా వెనుక సైన్యం లేదు. ఒంటరిని” అంటాడతను.
“ఒకసారి సత్యమార్గంలో అడుగుపెట్టాక, ఇక దేనికీ భయపడకూడదు” అంటారు స్వామీజీ.
“స్వామీజీ మీరిలా చెప్పడం చాలా సులభం. మీరెంతో ప్రపంచం చూశారు… వెనక్కి తిరిగి చూసుకుంటే… మార్గం అంత కష్టం కాదనే అనిపిస్తుంది” అంటాడు నాయర్. వాళ్ళిద్దరి మధ్య కాసేపు చర్చ జరుగుతుంది. ఈలోపు ఒక చిన్న పాప వచ్చి నీనాగుప్తాతో మాట్లాడుతుంది. కడుపెందుకలా వుంది అని అడిగితే, లోపల బిడ్డ ఉన్నాడని చెప్తుంది. వెళ్ళి అమ్మ దగ్గర కూర్చోమంటుంది.
***
కెమెరా డ్రామా ట్రూప్ వారి మీదకు మళ్ళుతుంది. వారంతా సాధన చేస్తుంటారు. ఒకతను ఫ్లూట్ వాయిస్తూంటాడు. రవి అనే నటుడు అతన్ని వేణువు ఊదడం ఆపేయమంటాడు. కెమెరా మళ్ళీ స్వామీజీ, అతని శిష్యుడి వైపు వస్తుంది. శిష్యుడు ఏదో గ్రంథం నుంచి గురువు గారికి చదివి వినిపిస్తుంటాడు. మరో పక్క డ్రామా ట్రూప్ సభ్యుల మధ్య వాదోపవాదాలు జరుగుతాయి.
రైలు మాత్రం యథావిధిగా తన గమ్యం వైపు సాగిపోతుంది.
“When you’re traveling, you are what you are, right there and then. People don’t have your past to hold against you. No yesterdays on the road” అని William Least Heat-Moon చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ మనమూ ఇక్కడ ఆపుదాం.
***
ఈ నాలుగో ఎపిసోడ్‌ని ఇక్కడ చూడొచ్చు.
వచ్చే వారం ఐదో ఎపిసోడ్‌తో కలుద్దాం!
(సశేషం)