ట్విన్ సిటీస్ సింగర్స్-10: ‘సంగీత మహా సముద్రంలో నేనొక బిందువుని మాత్రమే….’ – శ్రీ నేమాని సూర్య ప్రకాష్ – 2వ భాగం

0
3

[box type=’note’ fontsize=’16’] “ట్విన్ సిటీస్ సింగర్స్” శీర్షికన – స్వర కర్తగా, గాయకునిగా, కర్నాటక శాస్త్రీయ సంగీత వోకలిస్ట్‌గా, తబలిస్ట్‌గా, కొన్ని చిత్రాలకు తానే సంగీత దర్శకులుగా పనిచేసి కూడా తానింకా విద్యార్ధినే అనే శ్రీ నేమాని సూర్య ప్రకాష్ గారిని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు ఆర్. దమయంతి. [/box]

***

[dropcap]స[/dropcap]ముద్రమంత సంగీత సాగరంలో తానొక బిందువుని మాత్రమే అంటూ తనని తాను పరిచయం చేసుకునే మహోన్నతులు శ్రీ నేమాని సూర్య ప్రకాష్ గారు. ఈ సంగీత స్రష్టను కలిసి, సంభాషించే అవకాశం కలగడం, ఆ విశేషాలను సంచిక పాఠకులతో పంచుకోవడం ఒక అదృష్టంగా భావిస్తూ… ఇంటర్వ్యూ 2వ భాగం లోకి వెళ్దాం.

***

♣ పాటకి ట్యూన్ కడుతున్నప్పుడు సింగర్‌ని దృష్టిలో పెట్టుకుంటారా? లేక ట్యూన్‌కి తగిన సింగర్‌ని ఎంచుకుంటారా?

* ట్యూన్ చేసేటప్పుడు దృష్టిలో ఎవరూ వుండరు కానీ, కంపోజింగ్ అయ్యాక, ఈ పాట ఈ ఫలాన గాయని పాడితే బావుంటుందనిపిస్తుంది. ప్రొడ్యూసర్‌కి ఒక మాట అయితే చెబుతాను. ఆయనకీ సమ్మతి ఐతే సరే, లేదంటే వారిష్టం వారిది. “సార్ మాకు ఆ ఫలానా సింగర్ కావాలి’ అని అంటారు. ‘అలానే మీ ఇష్టం’ అంటాను. మన ఇష్టాల కంటే కూడా, మార్కెట్ వాల్యూ కూడా చూసుకోవాలి కదా. అయినా మనకు మంచి సింగర్స్ అందుబాటులో వున్నప్పుడు అదేమంత సమస్య లేదు.

♣ అంటే కమర్షియల్ సింగర్స్‌‍ని అడుగుతుంటారా?

* సహజం కదా1 బాలు, సుశీల, ఎస్ జానకి, మను, వాణీ జయరాం, చిత్ర, వీళ్లందరూ కమర్షియల్ సింగర్సే.

♣ సినిమా సంగీతంతో బాటు ఈ సింగర్సే ప్రైవేట్ ఆల్బమ్స్‌లో కూడా కనిపిస్తుంటారు? ఆ స్థాయిలో భక్తి గీతాలు పాడే సింగర్స్ మనకు కొదవగా వున్నరంటరా?

* మంచి సింగర్స్ వున్నారు. కానీ ప్రొడ్యూసర్ ఇష్టాల మీద ఆధారపడి వుంటుంది. ఒక మాటండి. బాల సుబ్రహ్మణ్యం గారికి సంగీతం రాకపోయినా, ఒకసారి పాడి వినిపిస్తే దానికి వెయ్యి రెట్లు అందంగా పాట పాడి వినిపిస్తారు. భగవంతుడు ఆయనకిచ్చిన వరం అది. అది అందరకీ సాధ్యం కాదు. భక్తి గీతాలు పాడటం అంటే కేవలం సంగీతమే కాదు భాష ఉచ్చారణ, భావాన్ని పొందుపరచడం లాంటివి కూడా చాలా ముఖ్యం. సీనియర్ సింగర్స్ ఎలా గొప్ప వాళ్ళయ్యారు అనేది అన్ని కోణాల నించి పరిశీలించి చూస్తే ఎన్నో నిజాలు గ్రహణకు వస్తాయి.

♣ డివోషనల్ సింగర్స్‌కి కూడా సంగీతం వచ్చి వుండాలంటారా?

* ఏ సింగర్‌కైనా పాడాలనే ఉత్సాహం వుంటే తప్పని సరిగా సంగీతం వచ్చి వుండాలి. పాటకి చక చకా నోట్స్ రాసుకునేంత పరిజ్ఞానం వుంటే పాట సులువుగా, స్వర బధ్ధంగా, తప్పుల్లేకుండా పాడగల్గుతారు.

♣ తబలిస్ట్ స్థాయి నించి అసిస్టంట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వుంటూ, గాయకులుగా మారాలని ఎందుకు అనుకున్నారు?

* నేనెప్పుడూ గాయకుణ్ణే. గాయకుడిగా వుంటం వల్ల చాలా ప్రయోజనాలొచ్చి చేకూరాయి. సంగీత దర్శకులు రాజేశ్వర రావు గారి దగ్గర పని చేస్తున్నప్పుడు, సాంగ్ కంపోజింగ్ అయ్యాక, రికార్డింగ్ సమయాలలో గాయనీ గాయకులకు నా చేత పాడించి సూచనలు ఇప్పించేవారు. ఎలా పాడాలో చెప్పే వాణ్ణి. ఫలానా చోట ఈ ఎఫెక్ట్ ఫలానా విధంగా వుండాలి అని చెబుతూ వుండేవాణ్ణి. నేను మ్యూజిక్ చేసేటప్పుడు ట్రాక్ పాడి రెడీగా వుంచే వాణ్ణి. గాయనీ గాయకులొచ్చి పాడేసేవారు. నా సొంత రికార్డింగ్‌లో ఎప్పుడూ నా ట్రాక్ నేనే పాడుకుంటాను. ప్రొడ్యూసర్ ఏ సింగర్స్ చేత పాడించాలంటే ఆ సింగర్స్ ని పిలిపించి ట్రాక్ వినిపించి, నేర్పించి, రికార్డింగ్ కి సిద్ధం చేస్తాను.

ఎస్ రాజేశ్వరరావు గారు, పెండ్యాల నాగేశ్వర రావు, ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం గారు – ఈ మహామహుల దగ్గర పనిచేసేటప్పుడు ట్రాక్ పాడి గాయకులకి అందచేసే వాణ్ణి.

♣ మీకు సొంత మ్యూజిక్ కంపెనీ వుందా సార్?

* ఏమీ లేదు. మ్యూజిక్ చేయడం. పాడుకోవడం. ప్రోగ్రామ్స్ చేసుకోవడం. ఇదే ప్రొఫెషన్. హాపీగా వుంది.

*శ్రీమతి నళిని శ్రీదేవి: (శిష్యురాలు వెంటనే అందుకుని వివరించారు) గురువు గారు పేరొందిన ఎన్నో ప్రముఖమైన మ్యూజిక్ కంపెనీలకు ఆల్బమ్స్ చేస్తుంటారు.

* అవునండి. హెచ్ ఎం వి, లియో, ఆదిత్య ఈ పెద్ద పెద్ద కంపెనీలకు ఆల్బంస్ చేస్తుంటాను. వాళ్ళు నన్ను అడిగి చేయించుకుంటారు. సింగర్స్ ఛాయిస్ వాళ్లదే. నన్ను సజెస్ట్ చేయాలని కోరినప్పుడు మాత్రం తప్పకుండా సహకరిస్తాను. ఈ పాటని – ఈ గాయని లేదా గాయకుడు పాడితేనే రక్తి కడుతుందన్న అంచనా కేవలం ఆ పాటని కంపోజ్ చేసిన సంగీత దర్శకునికి మాత్రమే బాగా తెలుస్తుంది.

కంపోజింగ్ అయ్యాక, పాట పాడించి, ఓకే అయ్యాక, ఆర్కెస్ట్రా బాలన్స్ చేసి, వాయిస్ బాలన్సింగ్, స్టీరియో మిక్సింగ్ , సాంగ్ రికార్డ్ చేసి, అప్పుడు ఫైనల్ టేక్ వాళ్ళకిస్తాం. వాళ్ళు దాన్ని టెలికాస్ట్ చేసుకుంటారు..ఆ పైన ఇక వాళ్ళ ఓపిక.

♣ మీరు కూడా ప్రొడ్యూసర్‌గా మారాలని ప్రయత్నించారా ఎప్పుడైనా?

* అలా మనం చేయకూడదండి. అది చాలా డేంజరస్ ప్రయత్నం (నవ్వులు). మనం మానేజ్ చేయలేం. మెదడెప్పుడూ పాడుకుంటూ, ట్యూన్స్ కంపోజ్ చేసుకోవడంలో వుండాలి. లేకపోతే బుర్ర డైవర్ట్ అయిపోతుంది. ఈ క్రియేటివిటీ నించి దృష్టి పక్కకి మరలే ప్రమాదం వుంటుంది. అందువల్ల నిబద్దత లోపించి, కాన్సన్‌ట్రేషన్ దెబ్బ తింటుంది. పై పెచ్చు, ఇంత డబ్బు ఖర్చు పెట్టేస్తున్నామే, తిరిగి వస్తుందో రాదో అనే పెట్టుబడీదారీతనమొచ్చేస్తుంది. ఇక ఆ దారి పట్టిపోయిందీ అంటే.. సృజనాత్మకత తగ్గిపోయే ప్రమాదముంటుంది. అయినా మనకెందుకొచ్చిన తలనొప్పులు? ఇప్పుడెంత హాయిగా వుందో చూడండి నా ప్రొఫెషన్.. (నవ్వులు)

♣ మీరు మరచిపోలేని ఆల్బం పేరు?..

* నారాయణ స్తోత్రం. మర్చిపోలేని ఆల్బం! – 2002లో నారాయణ స్తోత్రం లియో కంపెనీ రిలీజ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా నాకెంతోపేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన ఆల్బమ్.

♣ చాలా అరుదైన గానం అనిపిస్తుంది వినంగానే భక్తి భావం ఉట్టిపడేలా వుంటుంది. ఈ కంపోజింగ్ వెనక స్ఫూర్తి ఏమైనా వుందా?

* ఒక రోజు లియో అధినేత ఆనంద్ గారు స్క్రిప్ట్ పట్టుకొచ్చి కంపోజ్ చేయాలని కోరారు. సరే అని సిద్ధమయ్యాను. రేవతి రాగంలో కంపోజ్ చేసి పంపాను. వాళ్ళు ఓకే చేసాక, ప్రియా సిస్టర్స్ తో పాడిస్తే బావుంటుందని నిర్ణయించాం. ఫోన్ చేసి చెప్పాను. ఐతే క్లాసికల్ సింగర్స్ శృతి వేరేగా వుంటుంది. మన సినిమా సింగర్స్ శృతి కాదు. తక్కువలో పాడతారు. వారి వారి గాత్ర ధర్మం కూడా కన్సిడర్ చేయాలి. సహకరించాలి. మెలొడీ ముఖ్యం కాబట్టి శృతి అడిగి, వారి కోరిక మీద ఐదున్నర -ఆరు లో ట్రాక్ చేసాను.

♣ శృతి తగ్గించి పాడొచ్చు అంటారా?

* అంటే, క్లాసికల్ సింగర్స్ కానీండీ ఎవరు కానీండీ… సింగర్‌కి వసతిగా వుండే శృతిలో పాటని పాడించడంలోనే సంగీత దర్శకుని ప్రతిభ కనబడుతుంది. వాళ్ళు పాడలేని శృతి నిచ్చి పాడించడం వల్ల కొందరి ఆల్బమ్స్ ఫెయిల్ అయిపోయిన మాట వాస్తవం.

‘నారాయణ నారాయణ జయ గోవింద హర.. నారాయణ నారాయణ జయ గోపాల హరే…’

అన్ని పుణ్య క్షేత్రాలలో, తెలుగు రాష్ట్రాలలో ని ప్రతి దేవాలయంలో, తిరుపతి దేవస్థానంలో ముఖ్యంగా, ఎస్ వీ చానెల్ లో, ఎఫ్.ఎం. రేడియో అన్ని కేంద్రాలలో.. బ్రహ్మోత్సవాల పర్వదినాలప్పుడు వీనుల విందుగ చెవుల మారుమోగిపోయే కీర్తనం స్వర పరచింది నేనే అనీ, మ్యూజిక్ డైరెక్టర్‌గా నాకెంతో గుర్తింపుని, ఆత్మతృప్తిని కలిగించిందీ అని చెప్పుకోడానికి గర్వంగా వుంటుంది.

శ్రీ ఆదిశంకరాచార్య భగవద్ పాదులు గారి సాహిత్యాన్ని స్వరపరిచే అవకాశం కలగడం ఒక మహద్భాగ్యంగా భావిస్తా!

ఆ రోజు పొద్దున్నించి సాయంత్రం దాకా ప్రియా సిస్టర్స్ చేత పాడిస్తూనే వున్నాం.

మంచి ఎఫెక్ట్ కోసం వీణ, సితార, ఫ్లూట్ ఎక్కువ ఇన్‌స్ట్రుమెంట్స్ పెట్టాం. పాట చేసేసి, మ్యూజిక్ స్పెషల్ కంపోజిషన్ చేయాలి. పాట అయ్యాక ఒక రోజు రెస్ట్ ఇచ్చేస్తా. ఆ మర్నాడు కుర్చుని శ్రధ్ధ గా విని, బాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి హం చేసుకుంటూ పాడుకుని, నోట్స్ రాసుకుంటాను. స్టూడియోలో నోట్స్ చెప్పాలి. ఇవన్నీ బాధ్యతతో కూడుకున్న విధులు. పడిన కష్టమంతా ఎలా మరచిపోతానంటే, నా పాటని ప్రజలు భక్తిగా పాడుకుంటూ పరవశిస్తున్నప్పుడు!

* నళిని శ్రీదేవి : గురువు గారు ఎప్పుడూ తన గురించి తాను చెప్పుకోరు మేడం. ఇప్పుడు మీరడుగుతుంటే ఈ మాత్రంగా అయినా చెబుతున్నారు. ఆశ్చర్యం గానూ వుంది, సంతోషంగా కూడా వుంది.

* (నవ్వుతూ) ఈటీవీ ‘పాడుతా తీయగా’కి జడ్జ్‌గా వెళ్ళడం, ఆ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం అదొక అపురూపమైన అనుభవం. వారి అత్యంత గౌరవనీయమైన ఆహ్వానాన్ని అందిపుచ్చుకోవడం ఎంతో ఆనందదాయకం.

♣ అయితే, మన వాళ్ళు ఏ కళలో అయినా ప్రతిభావంతులని గుర్తించి, పట్టం కట్టడంలో వెనకబడి వున్నారు పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే అనే మాట ఒకటి వినిపిస్తూ వుంటుంది.. మీరేమంటారు?

* నేనసలు ఆ సంగతికి ఇంపార్టన్స్ ఇవ్వనండి. గుర్తింపు గురించి పెద్ద పట్టింపులు లేవు నాకు.

* నళిని శ్రీదేవి : గురువు గారి గురి సింప్లిసిటీకి ఉదాహరణ గా మీకొక ఇన్సిడెంట్ చెబుతానండి. ఒక సారి కీస్ హై స్కూల్‌లో శారదా భక్త సమాజం వారు పెద్ద ఎత్తున నిర్వహించే శాస్త్రీయ సంగీత కార్యక్రమానికి నా ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లడం జరిగింది. ఆ రోజు ప్రియా సిస్టర్స్ ప్రోగ్రాం. వాళ్ళు స్టేజ్ మీద పాడుతుంటే, హాజరైన జనం వేలల్లో వున్నారు. అందరూ మైమరచిపోయి వింటున్నారు.

నారాయణ స్తోత్రం పాడుతున్నారు. మేము వెనక కుర్చున్నాము గురువు గారితో కలిసి. ఈ స్తోత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ మీరు కాబట్టి ముందు వరసలో కి వెళ్ళాలి సారి అని మేమందరం కలసి బలవంతంగా సార్‌ని తీసుకుని స్టేజ్ వైపుకి నడిచాం. ఆ పాటకి ప్రత్యేకించి ప్రియా సిస్టర్స్‌కి ప్రపంచ వ్యాప్తంగా ఫాన్స్ వున్నారు. చివరికి మా ప్రయత్నంతో, ఎలా ఐతేనేం ఇంత గొప్ప గానానికి మ్యూజిక్ కంపోజ్ చేసింది శ్రీ నేమాని సూర్య ప్రకాష్ గారు మన మధ్యే వున్నారు, సార్! మిమ్మల్ని స్టేజ్ మీదకి సాదరం గా ఆహ్వానిస్తున్నాం. అంటూ అర్గనైజెర్స్ అనౌన్స్‌మెంట్ ఇచ్చి, గురువు గారిని వేదిక మీదకి ఆనందంగా ఆహ్వానించినప్పుడు చూడాలి.. ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ఆ క్షణాలు మరపురాని క్షణాలు. ప్రియా సిస్టర్స్ ఆటోగ్రాఫ్స్ కోసమని గుమి కూడిన జనం, గురువు గారి ఆటోగ్రాఫ్ కోసం ఇటు మళ్ళారు. ఎంత ఉద్వేగ భరితమైన క్షణాలు అవి!

* (మాస్టార్ చిరునవ్వు నవ్వుతూ వుండిపోయారు)

♣ రాజేశ్వర రావు గారి దగ్గర అసిస్టంట్‌గా వున్నప్పుటి మీ అనుభవాలు..

* అదొక అద్భుతమైన అనుభవమండి. మాటల్లో చెప్పడం కష్టం. అసలేమని చెప్పగలను! కొన్ని వందల పాటలకి అసిస్ట్ చేసాను. ఆయనెప్పుడూ నవ్వుతూనే వుండేవారు. వారి దగ్గర పనిచేయడం ఎంతో ఈజీగా వుండేది. ఏ మాత్రం టెన్షన్‌గా వుండేది కాదు. బాణీలు సమకూర్చేటప్పుడు శ్రధ్ధగా వింటుండేవాణ్ణి. అద్భుతమైన బాణీలు చేసేవారు. ఆయన మ్యూజిక్ చేస్తుంటే నోట్స్ రాసుకోవడం అసిస్టంట్‌గా నా పని. రోజుకి నాలుగైదు పాటలు చేస్తారనుకోండీ, అవి గుర్తుండవ్. ట్యూన్ నెంబర్ వన్, టు, త్రీ.. ఇలా రాసుకునేవాణ్ణి.

‘ఏమోయ్, మార్నింగ్ చేసిన సాంగ్ ఏమిటి?” అని అడిగేవారు. “ట్యూన్ ఇది మాస్టారు” అంటూ ఆ ట్యూన్ పాడి వినిపించే వాణ్ణి. లిరిక్స్ వుండవు. (నవ్వులు) వెంటనే ఆయన కంపోజిషన్ రెడీ చేసేవారు.

♣ పెండ్యాల గారితో మీ అనుభవం..

* ఆయన మహానుభావుడండి. వీళ్ళందరూ మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని పుణికిపుచ్హుకున్న వారండి. సంగీత సామ్రాజ్యంలో మకుటం లేని మహరాజులే అయినా ఇసుమంత గర్వమన్నదే వుండేది కాదు. చాలా సింపుల్‌గా వుండేవారు. ఆయన నడుచుకుంటూ మా ఇంటికొచ్చే వారు.. నేను తత్తరపడి.. ‘సార్, ఇంత శ్రమ తీసుకున్నారెందుకు సార్, పైగా నడిచి వచ్చారు.. కబురుపెడితె నేనొచ్చేవాణ్ని కదా!’ అని అనేవాణ్ణి ఉబ్బితబ్బిబౌతూ! ఆయన తేలికగా నవ్వేసి, “ఏం పర్వాలేదోయ్..” అనేవారు.

నా జీవితం లో జరిగిన అద్భుతమైన సన్నివేశాలు ఇవన్నీ! – తలపుకు వస్తే మనసంతా ఆనందంతో నిండిపోతుంది. అలాటి గొప్ప గొప్ప సంగీత సామ్రాట్టులతో, సంగీత మహా విద్వాంసులతో కలిసి పనిచేయడం ఏ పూర్వజన్మ సుకృతమో! అసలు అంత సింపుల్‌గా సామాన్యుల వలే ఎవరూ వుండరండి.. సంగీతంలో ‘ఓ న మాలు’ రాని వారు సైతం.. అంతా తెలుసన్నట్టు పోజులు కొడుతుంటారు.. అలాటిది ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు, హిట్స్ ఇచ్చిన ఒక చరిత్రని సృష్టించిన పెండ్యాల గారు, రాజేశ్వర రావు గారు – ఆనాటి మహామహులైన గాయనీ గాయకులతో అద్భుతమైన గీతాలను పాడించి జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి పొందిన అత్యున్నత సంగీత దర్శకులు ఎంత సామాన్యంగా వుండేవారు!! – ఆ సంగీత దర్శకులతో ఈ నాటి వారిని పోల్చి చూస్తే ఎందులోనూ పొంతనే వుండదు. ఆకాశానికి భూమికీ వున్న వ్యత్యాసం మనకి స్పష్టంగా కనిపిస్తుంది.

♣ ఈ ఇద్దరి సంగీత దర్శకత్వంలో మీరు పాటలు పాడారా?

* పాడాను. రాజేశ్వరరావు గారు పాడించారు. ప్రైవేట్ ఆల్బంలో భక్తి గీతం పాడాను. రామకృష్ణా నేనూ కలిసి పాడాము. ‘హరోం హర’ అనే పాట (పాడి వినిపించారు పల్లవిని) చాలా హిట్ అయింది. ఆ ఆల్బంలో అందరూ పెద్ద పెద్ద సింగర్సే పాడారు. ‘శ్రీ నివాసము.. నీ హృదయం.. చిద్విలాసం..’ ఈ పాట కూడా పాడాను.

♣ ఫిమేల్ సింగర్స్‌తో కలిసి పాడటం జరిగిందా?

* సుశీల గారితో కలిసి పాడాను. నా స్వీయ సంగీత దర్శకత్వంలో! 1980లో స్వీయ దర్శకత్వ వహించిన తొలి చిత్రం ‘ప్రేమ విజయం’ కొత్త వాళ్లతో తీసారు. చిన్న బడ్జెట్ సినిమానే అయినా, ఆర్కెస్ట్రా కోసం బాగానే వెచ్చించాం. నలభైమంది ఆర్టిస్టులను పెట్టి హిట్ సాంగ్స్ ఇచ్చాను. చాలా పాపులర్ అయ్యాయి. సినీ సంగీత దర్శకునిగా తొలి ప్రయత్నం లోనే విజయాన్ని తెచ్చిపెట్టిందని చెప్పాలి.

ఈ పాటలన్నీ చాలా కాలం విజయవాడ రేడియో కేంద్రం నించి, వివిధ భారతిలో తరచూ ప్రసారమై శ్రోతల మన్ననలు పొందాయి.

‘అందాల సీమలో.. విహరించు సుకుమారి.. ఆనందలహరిలో.. తేల్చుమా ఒక్క సారి’, ‘మనమీ మధులత మనదే ప్రేమ సుధా వలపు వుయ్యాలలో ఆడుతూపాడుదాం..’ (ఈ పాట నేనూ సుశీల గారూ పాడాం), ‘వానకు తడిసిన నీ వొళ్ళు చూస్తే చాలు నా కళ్ళు..’ ఫాస్ట్ బీట్ సాంగ్. ఇలా డిఫెరెంట్ ట్యూన్స్ చేసాను.

ప్రొడ్యూసర్లు నన్నూ పాడమని కోరడం వల్ల పాడాను. ట్యూన్ కంపోజ్ చేసాక, ట్రాక్ చేసి, రికార్డింగ్ లైవ్ చేసాం. అప్పట్లో లైవ్ వుండేది. ఆర్కెస్ట్రా వచ్చింది, ట్యూన్ చెప్పాను, రికార్డింగ్ జరిగింది.

♣ ‘తాండ్రపాపారాయుడు’లో జేసుదాస్ గారికి పాట నేర్పారని విన్నాను..

* మా గురువు గారు కంపోజిషన్ లోని పాట. – అభినందన మందార మాల.. అలివేణీ స్వాగత లీలా..(హృద్యంగా పాడి వినిపించారు)

ఆ రోజుల్లో ఎలా వుండేదంటే, ఎంత పెద్ద సింగర్స్ అయినా, హిపోక్రసీలుండేవి కావు. రికార్డింగ్‌కి ముందు రోజు.. జేసుదాసు గారు, సుశీల గారువచ్చి రిహార్సల్ చేసుకున్నారు. మా గురువు గారు, నాకు అప్పచెప్పారు ఈ పాటని వాళ్ళకి నేర్పమని. నేను పాడుతుంటే వాళ్ళు నోట్స్ రాసుకుని, మర్నాడు రికార్డింగ్‌కి వచ్చారు. పాట పూర్తి అయ్యేవరకు వున్నా. కృష్ణం రాజు గారి గోపీ కృష్ణ కంపెనీ లో జరిగింది. పాటలన్నీ పదిహేను రోజులనించీ నెల వరకు పట్టేది. ఒకో సారి ఒక్క పాటకి ఎంతో సమయం పట్టేది. మేము అసిస్టంట్స్ సింగర్స్ కంటే రెండు మూడు గంటల ముందే స్టూడియోలో వుండాలి. అరేంజర్స్ వుంటారు. కండక్టర్ వుంటారు. మేము అసిస్టంట్స్.

♣ పాటలో ఇన్‌స్ట్రుమెంటల్ బిట్స్ – ఎక్కడ వీణ వుంటే బావుంటుందీ, ఎక్కడ సితార బాగా నప్పుతుందనీ ఎలా నిర్ణయిస్తారు..

* అవన్నీ సంగీత దర్శకుల ముద్రలే.

♣ ముద్రలంటే గుర్తొస్తుంది సార్, కొన్ని పాటల్లో ఆ యా ఆర్టిస్టుల ముద్రలు కొట్టొస్తూ కనిపిస్తాయి. వారి పేర్లు తెలీకున్నా, ఆ వాయిద్య సహకారాన్ని అందించిన కళాకారులని మాత్రం మరచిపోలేమనిపిస్తుంది. వీణ, తబలా..

* మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు కరెక్ట్. పాట కంపోజింగ్ చేసేటప్పుడు ఒక తబలా వున్నా, రికార్డింగ్ సమయంలో ఎక్కువుంటాయి. అందరూ కలిసి ప్లే చేసేవారు. ‘వీరాభిమన్యు’ లో గురువు గారు లక్ష్మణ్ గారు, కోదండపాణి గారి దగ్గర బాబూ రావ్ గారు, ప్రఖ్యాత తబలిస్ట్ రామలింగం గారు, (‘చిగురాకులలో చిలకమ్మా’కి) డోలక్ వాయించారు. అలాగే, ‘మనసు పరిమళించెనె’, ‘నీవు రావు నిదుర రాదు’, ‘దివినుండి భువికీ దిగివచ్చే’.. పాటలకి సహకారమందించిన ఆర్టిస్ట్. అద్భుతమైన తబలిస్ట్. ఆయన ప్లే చేయని సంగీత దర్శకులు అంటూ ఎవరూ లేరని చెప్పాలి. అంత ప్రతిభామూర్తులు. చూడటానికి గాలి వేస్తే పడిపోతారేమో అన్నంత సన్నగా వుండేవారు. తబలా మీద చెయ్యేస్తే మాత్రం స్పీకర్ అదిరిపోయేది. ఆ కళాకారుడి సినిమా ఇండస్ట్రీకి ఒక వరం లాటి వారు.

ఆ రోజుల్లో ప్రొడ్యూసర్లు కూడా వాయిద్య కళాకారులకి సైతం ఎంతో విలువనిచ్చేవారు, గౌరవించేవారు. ఏ కారణం గానో రామలింగం గారు రాలేకపోతే, ఆ రోజు రికార్డింగ్ కాన్సిల్ చేసేవారు. ఆ రోజుల్లో సాధారణంగా ఫిల్మ్ కంపెనీలలోనే కంపోజింగ్ జరుగుతుండేది.

♣ వృత్తిపరంగా మీకు సినీ ఇండస్ట్రీ మీకు తృప్తి నిచ్చిందా, లేక ఈ ఆల్బమ్స్ చేయడం వలన దొరికిందా?

* రెండూ! నా కెరీర్ ని ప్రారంభించింది సినిమాలలోనే కాబట్టి అదీ తృప్తినిచ్చింది. ఒక పెద్ద మలుపు తిప్పి, నాకు ఎనలేని పాపులారిటీని తెచ్చిపెట్టింది ఈ ఆల్బమ్స్. భక్తి గీతాలు చేయడం వల్ల గాయకునిగా కూడా పాపులారిటీ వచ్చింది. పొద్దున మొదలు రాత్రి వరకు ఇటు రేడియోలో అటు టీవీలో ఎఫ్ ఎం చానెల్స్ లో అను నిత్యం నా పాటలు వినిపిస్తూనే వుంటాయి. ఇంత కంటే ఏం కావాలి అనుకుంటా తృప్తిగా.

* నళిని శ్రీదేవి: గురువు గారు పాపులర్ సాంగ్స్ చేసారు. నిత్య సంతోషిణి గానం చేసిన ‘తెల్ల తామర్లలోనూ చల్లగా కొలువుండి’, ఉష పాడిన ‘జయ జయ జగదాంబికే..’ ఆల్బమ్స్ చాలా పాపులర్ అయ్యాయి.

♣ మీ కంపోజింగ్ లో ఎక్కువగా రేవతి వినిపిస్తుంటుంది. మీకిష్టమైన రాగమా?

* ఇష్టమే కానీ, తెలీకుండా అలా వచ్చేస్తుంది. ఎం ఎస్ విశ్వనాథ్ గారు ‘ఏ తీగ పూవును..’, కె వీ మహదేవన్ గారు ‘ఝుమ్మంది నాదం’ ఈ పాటలన్నీరేవతి లోనే వున్నాయి.

♣ సంగీతానికి సాహిత్యమా? సాహిత్యానికి సంగీతమా? దేనికి ప్రాముఖ్యత ఇస్తారు?

* ఒకో సారి లిరిక్స్ చూసాక వెంటనే పాట పరుగుగా వచ్చేస్తుంది. ఆ వెనకే నోట్స్ రాసుకుని చూసాక, ఇది ఏ రాగంలో వుందో తెలుస్తుంది. అలా రేవతిలో చాలా సాంగ్స్ వచ్చాయి.

కళ్యాణి లో కూడా చేసాను. అయితే రేవతిలో ఎక్కువ హిట్స్ ఇవ్వడం వల్ల అని కూడా చెప్పాలి.

♣ సినిమా భక్తి గీతాలలో సంగీత దర్శకుల పేర్లు వినిపిస్తాయి. కానీ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్‌కి అనౌన్స్ చేయరు?

* అది కొంచెం బాధనిపిస్తుందండి. ఒక హిందీ సింగర్ సరిగ్గా ఈ విషయం గానే మనస్తాపం చెంది కోర్ట్ లో కేసు వేసి నెగ్గారు.

రేడియోలో పాట వేస్తున్నప్పుడు కళాకారుల సృజనాత్మకతకి రాయల్టీ ఇస్తున్నారు. అందుకుంటున్నాం. నేను ప్రత్యేకించి ఎక్కువ ఆల్బమ్స్ చేసాను కాబట్టి. ప్రతి యేడాది సంతోషకరమైన మొత్తం లోనే రాయల్టీ వుంటుంది

అయితే ఇవేవీ నేను ఎప్పుడూ ఆశించలేదమ్మా!

సింగర్స్ రాయల్టీ అడుగుతున్నా, కమర్షియల్ సింగర్స్‌కి ఇచ్చే పారితోషికం – ఆల్బం చేసే మ్యూజిక్ డైరెక్టర్ కంటే కూడా ఒక్కోసారి అధికంగా వుంటుంది.

(మిగిలిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, విశేషాలు.. తదుపరి భాగంలో)

***

       

***

Bhaktha Ramadasu || Taraka Manthramu |

vannam konda vennilave…. |

ABHINANDHANA MANDARA MALA |

Sri Annamacharya Nitya Sankeerthanalu || Adivi Alladivo

Listen Nemani Suryaprakash Radio online

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here