[dropcap]య[/dropcap]థాప్రకారం ‘యాత్ర’ 5వ ఎపిసోడ్ కూడా ఒక రైలుని, స్టేషన్లో రైల్వే సిబ్బందినీ, ప్లాట్‌ఫామ్ మీద ప్రయాణీకులని చూపిస్తూ, రైల్వేలందిస్తున్న సేవల గురించి ఒకటి రెండు వ్యాఖ్యలతో ప్రారంభమవుతుంది. రైలు ఈ రాత్రికి ఆంధ్రప్రదేశ్ దాటి మధ్యప్రదేశ్ అడవుల గుండా ప్రయాణిస్తుందని నాయర్ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది.
చీకటి పడుతుంది. నెమ్మదిగా ఒక్కొక్కరు నిద్రకి ఉపక్రమిస్తారు. నాయర్ పడుకోబోతూ… లోయర్ బెర్త్‌లో ఉన్న అతనితో.. “నీకేం పర్వాలేదు. ఇంకెవరూ రారు. నిద్రపో…” అంటాడు. “నాకు నిద్ర రావడం లేదు” అంటాడతను. కాసేపాగి, “నేను ఢిల్లీలో కొన్ని కాగితాలు ఇవ్వడానికి వెళ్తున్నాను. అవసరమైతే నేను కొన్ని పేపర్స్ మీకిస్తాను. మీరు అందజెయ్యగలరా?” అని నాయర్‌ని అడుగుతాడు.
“పేపర్సా? ఏం పేపర్స్?” అడుతుతాడు నాయర్.
“నా బ్యాగ్‌లో కొన్ని పేపర్లున్నాయి. వాటిపై అడ్రస్ రాసిస్తాను…”
“ఈ పేపర్ల కోసమే వాళ్ళు నీ వెంటబడ్డారా?” అని నాయర్ అడిగితే అవునంటాడతను.
“వివరాలు చెప్పాలనుకుంటే చెప్పు, నీ ఇష్టం…” అంటాడు నాయర్.
తన పేరు వేణుగోపాల్ అనీ, తమది నెల్లూరు జిల్లాలో ఓ చిన్న గ్రామంలో ఉద్యోగమనీ; తనకీ భార్యా పిల్లలు ఉన్నారని చెబుతాడు. స్కూల్‌కి వెళుతున్నారు. తానో సేవా సంస్థలో పని చేస్తానని చెప్తాడు. తాను రైతు కూలీలకు కనీస వేతనం ఇప్పించడం వల్ల పెద్ద రైతుల దృష్టిలో విలన్ అయిపోయాననీ, వాళ్ళంతా తనకి వ్యతిరేకమయ్యారనీ, ముగ్గురు ఆదివాసులను చంపేసారనీ, ప్రభుత్వం వాళ్ళని ఏమీ చేయలేకపోయిందని చెబుతాడు.
“అదెలా?” అడుగుతాడు హరీష్.
“మిస్టర్ నాయర్, మీకు జనాల సంగతి తెలీదు. నేను ఒత్తిడి చేస్తేనే మూడు నాలుగు వ్యాసాలు ఇప్పుడు ప్రచురితమయ్యాయి. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి వీటిని ఆపించాలనుకుంటున్నారు. అందుకే నా వెంటబడ్డారు.”
“అయినా ఇదంతా నీకెందుకు? దీనివల్ల నీకేం లాభం?” అని అడుగుతాడు నాయర్.
“నాకేమీ లాభం లేదు. పేదవాళ్ళకి ప్రయోజనం కలుగుతుంది” అంటాడతను.
“నీకేదైనా అయితే నీ భార్యాబిడ్డల పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా? నీ కుటుంబాన్ని కూడా కాపాడుకోవాలి కదా” అంటాడు నాయర్. శిష్యుడు వీళ్ళ సంభాషణని వింటూ ఆలోచిస్తూంటాడు
తాను ఎలాగైనా పోరాడవలసిందే అంటాడతను. కాసేపు మాట్లాడుకుంటారు.
***
తాగిన మైకంలో ఉన్న హరీష్ బోగీ తలుపుల దగ్గరకి వెళ్తాడు.
“తలుపులు ఎవరు వేసేసారు? నేను రిహార్సల్స్ చేసుకోవాలి?” అంటు తలుపు తీసి కూర్చోబోతాడు… మైకంలో కాలు జారి రాడ్ పట్టుకుని వేలాడుతుంటాడు. అతి కష్టం మీద లేచి బోగీలోకి వస్తాడు.
***
నీనాగుప్తా నొప్పులతో బాధపడుతుంది. ‘ఈ బాధ కన్నా చచ్చిపోవడం మంచిది’ అనుకుంటుంది.
మరాఠీ మహిళ లేచి “ఏమయింది? ఒంట్లో బాగోలేదా?” అని అడిగితే, నీనా గుప్తా ఏడుస్తూ, “చాలా ఇబ్బందిగా ఉంది” అని చెబుతుంది.
“కంగారు పడకు. ఇలాంటి సమయంలో ఇలాగే అవుతుంది” అని ధైర్యం చెబుతూ, “ఎవరి దగ్గరైనా సోడా ఉందా?” అని అడుగుతుంది మరాఠీ వృద్ధురాలు. మరాఠీ వృద్ధుడు లేచి కూర్చుని వీళ్ళ కేసే చూస్తూంటాడు.
“నాకు భయంగా ఉంది, నాకింతకు ముందోసారి గర్భం పోయింది” అంటుది నీనాగుప్తా బాధతో.
“మీ ఆయనేమీ చేయలేదా?” అని అడిగితే, “మా ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం” అంటుంది నీనా. అతనికి కూడా ఇప్పుడు ధైర్యం పోయిందని, ఈసారి బిడ్డ దక్కకపోతే అతను తట్టుకోలేడని అంటుంది. ఏడుస్తుంది.
ముసలావిడ ధైర్యం చెబుతూ, “ఈ సమయంలో ఏడవడం మంచిది కాదు” అంటుంది.
“ఈ పరిస్థితులలో మీ అత్తగారు నిన్నెలా ఒంటరిగా వదిలేసిందో నాకర్థం కావడం లేదు” అంటుంది.
“వాళ్ళు అడిగినవేవీ మా వాళ్ళు ఇవ్వలేకపోయారని మా అత్తగారికి కోపం. పైగా నేనేం చేసినా ఆవిడకి తప్పులానే అనిపిస్తుంది” అంటుంది నీనా గుప్తా.
“మరి మీ ఆయనేమీ అనడా?”
“పాపం ఆయనేం చేయగలడూ? నాకోసం అమ్మని ఎదిరించలేడు…”
మరాఠీ వృద్ధుడు తన కూతురి గురించి చెప్తాడు. వాళ్ళ అత్తగారి కోరికలను తాను తీర్చలేకపోవడం వల్ల ఆ అమ్మాయి ఎలా బలైపోయిందో చెబుతాడు.
భార్యభర్తలిద్దరూ నీనా గుప్తాని ఓదారుస్తారు.
రైలు చీకట్లను చీల్చుకుంటూ ముందుకుసాగుతుంది.
***
అప్పటిదాక పేకాడుకుంటున్న ఆగంతకులు గడియారం చూసుకుని సమయం ఆసన్నమైందని లేస్తారు.
బోగీలోంచి నెమ్మదిగా నడుస్తూ ప్రయాణీకుల బ్యాగ్‌లు, నగలు దొంగిలించడం మొదలుపెడతారు. ఒక మహిళ మెడలోంచి మంగళసూత్రం లాగబోతుంటే ఆమెకి మెలకువ వచ్చి, “దొంగలు, దొంగలు పట్టుకోండి” అని అరుస్తుంది (ఇక్కడ కేకలు తెలుగులోనూ వినబడతాయి).
అందరూ లేస్తారు. కొందరు దొంగలని పట్టుకోడానికి ముందుకొస్తే, దొంగలు జేబుల్లోంచి తుపాకులు, కత్తులు బయటకి తీస్తారు.
“జాగ్రత్త! ఎవరైనా ముందుకు వస్తే…. ప్రాణాలు పోతాయ్” అంటూ బెదిరిస్తారు. ముందుకు వెళ్ళబోయిన ఒకతన్ని నాయర్ ఆపుతాడు.
దొంగల్లో ఒకడు ప్రయాణీకులకు తుపాకీ చూపిస్తూ బెదిరిస్తూంటే మరొకడు చైన్ లాగి రైలుని ఆపుతాడు. అందరూ దోచుకున్న వస్తువులతో రైలు దిగి పారిపోతారు.
నాయర్‌తో పాటు కొంతమంది ప్రయాణీకులు కూడా కిందకి దిగి దొంగల వెంట పడతారు. “గార్డుకి సమాచారమివ్వండి” అంటూ కొందరిని గార్డు దగ్గరికి పంపిస్తాడు నాయర్.
గార్డు వచ్చి ఏమయిందని అడిగితే మరాఠీ వృద్ధుడు జరిగింది చెబుతాడు. అదే సమయంలో నలుగురు పోలీసులు పరిగెత్తుకొస్తే, “బోగీలో దొంగతనం జరిగితే మీరేం చేస్తున్నారు?” అంటూ గార్డు వాళ్ళని మందలిస్తాడు. దొంగలు వెళ్ళిన దిశగా వాళ్ళని పంపిస్తాడు.
ఈలోపు డ్రైవర్ వచ్చి ఏమయిందని అడుగుతాడు. దొంగతనం జరిగిందని చెప్పి, “దొంగలు దొరికి ఎవరి వస్తువులు వాళ్ళకి వచ్చేదాకా రైలు ఇక్కడ్నించి కదలదు” అంటాడు గార్డు.
ప్రయాణీకులు పోలీసులు దొంగల్ని తరుముతూంటారు.
***
ఈ హడావిడిలో – వేణుగోపాల్‌ని అంతకు ముందు తరిమిన ఇద్దరు ఆగంతకులు వచ్చి, అతన్ని నోరు మూసి, క్రిందకి దింపేస్తారు. కొడుతూ, దూరం లాక్కుపోతారు. శిష్యుడు వారించినా వారు పట్టించుకోరు.
***
గార్డు తర్వాతి స్టేషన్‌కి ఫోన్ చేసి తమ రైల్లో దొంగతనం జరిగిందనీ, కాస్త ఆలస్యమవుతుందని స్టేషన్ మాస్టర్‌కి చెబుతాడు.
ఈలోపు ప్రయాణీకులు పోలీసులు కలిసి దొంగల్ని పట్టుకుని వాళ్ళతో సహా సామన్లనీ, నగలనీ వెనక్కి తెస్తారు.
ఎవరి బ్యాగ్‌లు వాళ్ళని తీసుకోమని చెప్పిన గార్డు నగలని మాత్రం తదుపరి స్టేషన్‍లో పోలీస్ ఎంక్వైరీ అయ్యాక తీసుకోమని చెబుతాడు. తన బ్యాగ్ కనిపించడం లేదంటూ మైకంలో ఉన్న హరీష్ గోల చేస్తాడు.
***
నాయర్ బోగీలోకి వచ్చి లోయర్ బెర్త్ ఖాళీగా ఉండటం చూసి “వేణుగోపాల్ ఏడి?” అని శిష్యుడిని అడుతాడు. అతన్ని వెంబడించిన వాళ్ళొచ్చి అతన్ని లాక్కుపోయారని శిష్యుడు చెబుతాడు.
“ఎప్పుడు?”
“ఇప్పుడే మీరు దొంగల్ని తరమడానికి దిగినప్పుడు…” అని చెప్తూ తాను వాళ్ళని అడ్డుకోడానికి ప్రయత్నించి విఫలమయ్యానని శిష్యుడు చెప్తాడు.
వేణుగోపాల్ తనకిచ్చిన కవర్‌ని శిష్యుడికిచ్చి భద్రంగా ఉంచమని చెప్పి బోగీ తలుపు దగ్గరికి వెళ్ళగానే గార్డు కనిపిస్తాడు. జరిగినది చెప్పి, కాస్త వెతికితే వేణుగోపాల్ జాడ తెలుసుకోవచ్చు అని అంటాడు.
“ఇప్పటికే ఇక్కడ రైలు చాలాసేపు ఆగింది, ఇంక ఆగడానికి వీల్లేదు. వెనకాల స్పెషల్ ట్రైన్ ఉంది. మనం బయల్దేరాల్సిందే. అతని పేరేంటి? వివరాలు చెప్పండి” అంటాడు గార్డు.
“అతని పేరు వేణుగోపాల్. నెల్లూరు జిల్లా…” అంటూ తనకి తెలిసిన వివరాలు చెప్తాడు.
“ముందు స్టేషన్ మాస్టర్ గారికి చెప్తాను, ఆయన వెతికిస్తారు” అంటూ గార్డు వెళ్ళిపోతాడు.
నాయర్ లోపలికి వచ్చి బోగీ తలుపు వేస్తాడు.
వేణుగోపాల్‌ని కాపాడలేకపోయినందుకు శిష్యుడు బాధపడ్తాడు. తల వంచుకుని కూర్చుంటాడు. నాయర్ కూడా తాను పొరపాటు చేశానని అనుకుంటాడు. అతనికేమవుతుందో అని బాధపడతాడు.
“నిన్ను నీవు ఎందుకు నిందించుకుంటావు నాయనా? నీకెంత వీలయిందో నువ్వంత సాయం చేశావు” అంటారు స్వామీజీ.
ఇది తననెంతో బాధించే విషయమని నాయర్ అంటాడు. “బోగీలో ఇంతమంది ఉన్నా కూడా ఇద్దరు లోపలికి వచ్చి ఒక్కడిని ఎత్తుకుపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది” అంటాడు.
ముందు ముందు ఇలా ఎవరికైనా జరగచ్చు కదా అని అంటాడు. శిష్యుడు బాధపడ్తూనే వేణుగోపాల్ ఇచ్చిన కవర్‌ని నాయర్‌కి ఇచ్చేస్తాడు.
నాయర్ నిట్టూర్చి ఆ కవర్‌లోని కాగితాను పరిశీలిస్తాడు.
***
నీనాగుప్తా బాధపడ్తూ ఉంటుంది.
నిద్ర పట్టడం లేదా అని మరాఠీ మహిళ అడుగుతుంది. నీనాని నిద్రపుచ్చడానికి ఆమె ఓ పాటందుకుంటుంది. చిన్న పిల్లని తల్లి జోలపాడి నిద్ర పుచ్చినట్టు పాడుతూ నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తుంది.
రైలు ముందుకు సాగుతూండగా, తెల్లవారుతుంది.
***
నీనా గుప్తాకి ఏదో పీడకల వచ్చి గట్టిగా అరుస్తూ నిద్ర లేస్తుంది. మరాఠీ వనిత ఓదారుస్తుంది. గడ్డం చేసుకుంటున్న నాయర్ నీనా మాటల్ని వింటుంటాడు.
“ఈ ఘటన వల్ల ప్రయాణంలో మీకు ఇబ్బందిగా ఉందేమో! అవసరమైతే మనం మన ఢిల్లీ ఆశ్రమంలో ఒకటి రెండు రోజులు ఆగుదామా?” అని శిష్యుడు స్వామీజీని అడగగా… తన వద్ద అంత సమయం లేదని, తన యాత్ర ముగిసిపోవచ్చిందని, ఏదైనా చదివి వినిపించమని అంటారు స్వామీజీ. శిష్యుడు సరేనని స్వామి వివేకానంద జీవిత చరిత్ర నుంచి కొన్ని వాక్యాలు చదువుతాడు.
ఆ వాక్యాలు నచ్చిన నాయర్, అదేం పుస్తకమో తెలుసుకుని అడిగి తీసుకుంటాడు. తానే పైకి చదవడం ప్రారంభిస్తాడు. కొంత సేపు చదివాక, “మంచి పుస్తకం” అని అంటాడు.
“నీకు నచ్చితే, ఆ పుస్తకాన్ని నీవే ఉంచేసుకో నాయనా” అంటారు స్వామీజీ.
“ముందు మీరు చదివించుకోండి. తర్వాత తీసుకుంటాను. మీరు దీని మీద మీ పేరు రాసివ్వండి” అంటూ పుస్తకం వెనక్కి ఇచ్చి పెన్ ఇస్తాడు నాయర్.
స్వామీజీ నాయర్ పేరు అడిగి పుస్తకం మీద రాస్తుండగా… ఆయనకి ఆయాసం వచ్చి ఇబ్బంది పడతారు. నాయర్, శిష్యుడు కలసి ఆయన్ని విశ్రాంతిగా పడుకోబెట్టడంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.
***
33 ఏళ్ళ క్రితం లానే ఇప్పటికీ రైళ్ళలో దొంగతనాలు జరుగుతున్నాయి. కాకపోతే ప్రయాణీకులు సంఘటితంగా దొంగల్ని వెంబడించడం అనేది అరుదైపోయింది. పోతే పోయిందని పోలీస్ కంప్లయింట్ ఇచ్చి ఊరుకుంటున్నారు.
శ్రామికులు, రైతుకూలీల వంటి అల్పాదాయ వర్గాల సంక్షేమం కోసం పనిచేసేవారు ఇప్పుడు ఉన్నట్టే అప్పుడూ ఉండేవారు. తమని ఎదిరించినవారిని అడ్డుతొలగించుకోడానికి ప్రయత్నించే భూస్వాములు ఎంతకైనా తెగించడం అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది.
తోటి వారికి సాయం చేయాలనుకునే వారు ఉన్నట్టే, మనకెందుకులే అనుకునే వారూ ఉంటారని ఈ ఎపిసోడ్ తెలుపుతుంది.
ఈ ఎపిసోడ్… అలనాటి సామాజిక స్థితిగతులను కళ్ళకు కడుతుంది.
“It’s not getting from A to B. It’s not the beginning or the destination that counts. It’s the ride in between…This train is alive with things that should be seen and heard. It’s a living, breathing something — you just have to want to learn its rhythm” అన్న David Baldacci మాటలను మననం చేసుకుంటూ మనం ఇక్కడ ఆపుదాం.
***
ఈ అయిదవ ఎపిసోడ్‌ని ఇక్కడ చూడచ్చు.
వచ్చే వారం ఆరవ ఎపిసోడ్‌తో కలుద్దాం!
(సశేషం)