[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]
[dropcap]”కా[/dropcap]వ్యం యశసే, అర్థకృతే, వ్యవహార విదే” అన్నారు పెద్దలు. కావ్య నిర్మాణం వలన యశస్సు, ధనలాభము, వ్యవహార దక్షత లభిస్తాయని భావం. వాక్యం రసాత్మకం కావ్యం” అన్నారు లాక్షణికులు. రసస్ఫోరకమైన ఒక్క వాక్యమైనా సరే కావ్యంతో సమానం. వ్యాసవాల్మీకి కాళీదాసాది సంస్కృత మహాకవులు, నన్నయ తిక్కన శ్రీనాథ పోతానాది ఆంధ్ర మహాకవులు, పంపడు, రన్నడు వంటి కన్నడ కవులు, తిరువళ్ళువర్ వంటి తమిళ కవులు, తులసీదాస్ వంటి హిందీ కవులు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. భాషను పరిపుష్టం చేశారు.
తెలుగు కావ్యారంభం నన్నయ ఆంధ్రమహాభారతానువాదంతో మొదలై 21వ శతాబ్ది వరకు ఎందరెందరో, ఎన్నెన్నో మహాకావ్యలు సృజించారు. విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షము, సి. నారాయణరెడ్డి విశ్వంబరలు జాతీయస్థాయిలో కావ్యాల కోవలో జ్ఞానపీఠాధిష్ఠితమయ్యాయి.
తొలి శతాబ్దాలు – అనువాదాలు:
11వ శతాబ్దిలో నన్నయ మొదలు 15వ శతాబ్ది వరకు సంస్కృతానువాదాలే వెలశాయి. 12వ శతాబ్ది వాడైన పాల్కురికి సోమ బసవపురాణం, పండితారాధ్య చరిత్ర ద్విపదలతో రచింపబడిన కావ్యాలు. అభిజ్ఞాన శకుంతల నాటకాన్ని తెలుగులో పిల్లలమర్రి పినవీరన శృంగార శాకుంతల కావ్యంగా వ్రాశాడు. తెలుగులో స్వతంత్ర నాటకం 19వ శతాబ్ది మంజరీ మధుకరీయంగా చెబుతారు.
అనువాదాలు మక్కిమక్కిగా కాకుండా స్వేచ్ఛానువాదాలు చేశారు. భారత, భాగవత, రామాయణాలు ఈ కోవలో నడిచాయి. చంపూ కావ్యాలకే పట్టం గట్టారు. అంటే పద్యగద్యాత్మకంగా సాగాయి. తిక్కన నిర్వచనోత్తర రామాయణం వ్రాశాడు. అయినా, ఆ తర్వాతి కవులు వచనంతో కలిపి పద్యాలు శిల్పాల్లా చెక్కారు.
“కవల కల్పనాకథలు కృత్రిమ రత్నము లాద్యసత్కథల్
వావిరి పెంపు రత్నములు” – అన్నాడొక కవి.
వేదాలను ప్రభు సమ్మితాలనీ, పురాణాలను మిత్ర సమ్మితాలనీ, కావ్యాలు కాంతా సమ్మితాలనీ లాక్షణికులు నిర్దేశించారు. ప్రభువు శాసించినటు వేదాలు – ‘ధర్మం చర, సత్యం వద’ అని గట్టిగా చెబుతాయి. వాటిని అతిక్రమించలేము. స్నేహితుని ఆప్తవాక్యం వలె పురాణాలు అనేక రకాలైన హితోక్తులు చెబుతాయి. కావ్యం ప్రియురాలి నయగారాల మాటల వలె వినసొంపుగా అనిపిస్తాయి. అష్టాదశ పురాణాలు అలానే వెలిశాయి. పురాణాలలో కథల ఆధారంగా అనేక కావ్యాలు వచ్చాయి. స్కాంద పురాణం అనేక గాథలకు నిలయం. ప్రబంధ కాలం వరకు పురాణాంతర్గత కథల మీద కల్పనలు సృష్టించారు.
కళాపూర్ణోదయం ఒక అద్భుత సృష్టి. పింగళ సూరన ఒక స్వకపోల కల్పన చేసి రెండు లోకాల కథలను జోడించి ఆధునిక నవల వలె సృజన చేశాడు. కట్టమంచి రామలింగరెడ్డి వంటి పాశ్చాత్య సాహిత్య ప్రభావం గల విమర్శకుల ప్రశంస లందుకొన్న కావ్యమది. డా. జి.వి. కృష్ణారావు కళాపూర్ణోదయ కావ్యంపై పరిశోధనాత్మక గ్రంథమే వ్రాసారు. అప్పటి వరకు అలాంటి ఆలోచన రాలేదు.
మహాకవులు:
తెలుగు సాహిత్యంలో మహాకవులకు కొదువలేదు. ప్రతిభావ్యుత్పన్నతలతో వారు సాహిత్యాకాశంలో ధ్రువతారలుగా నిలిచిపోయారు. వారి రచనలపై వందలకొద్ది పరిశోధనా గ్రంథాలు వచ్చాయి, వస్తున్నాయి. శ్రీనాథుని వంటి మహాకవి – ‘అరుగుచున్నాడు శ్రీనాథుడమరపురికి’ అని ఢంకా బజాయించి చివరి క్షణంలో పలికాడు. నిజమే. గౌడ డిండిమభట్టు ఢంకా పగలగొట్టిన యశస్వి అతడు. పోతన తెలుగువారి పుణ్యాలపేటి. ఆంధ్ర మహాభాగవతవం అనుదిన పారాయణ గ్రంథమై తెలుగింట నిలిచిపోయింది. ప్రబంధకవులు అవతరించేవరకు అంటే 15వ శతాబ్ది వరకు కావ్యానువాదాలే రాజ్యం చేశాయి. తాళపత్ర గ్రంథాలకు ప్రతులు తయారు చేసి శిష్య పరంపర ప్రచారంలోకి తెచ్చాయి.
కృతిభర్తలు:
కృతిభర్తను అల్లునిగా, కృతికర్తను మామగా సంభావించే సంప్రదాయాన్ని తిక్కన ప్రవేశపెట్టాడు. ‘ఏ నిన్ను మామ యనియెడు దీనికి దగనిమ్ము భారతీ కన్యక’ అని వాపీకూప తటాకాలయ నిర్మాణాలతో పాటు కృతిపతిత్వం కూడా ఫలప్రదము, పుణ్యప్రదము అని పెద్దలు నొక్కి వక్కాణించారు. నన్నయకు రాజరాజనరేంద్రుడు భారతానువాదానికి ప్రేరణ కలిగించినట్లే, తదితర కవులకు కూడా కృతిభర్తలు లభించారు. ఆ యుగాలలో వారే కవి పండిత పోషకులు. పెద్దనకు రాయలు కోకటాద్యగ్రహారాలు బహుకరించాడు. ఎదురైనచో మదకరీంద్రము డిగ్గి కేలూత యొసగి ఎక్కించుకొన్నాడు. భువనవిజయ సభాభవనంలో అష్టదిగ్గజ కవి మండలిని పోషించాడు.
మనుమసిద్ధి, ప్రోలాయ వేమారెడ్డి వంటి ప్రభువుల కోరిక మేరకు తిక్కన, శ్రీనాథాది కవులు కృతులు రచించారు. తిక్కన హరిహరనాథుని కంకితం చేశాడు. పోతన – ‘పలికెడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రండుట, నే పలికెద వేరొండు గాథ పలుకగనేలా’ అని శ్రీరామచంద్రుని కంకితం చేశాడు. నరాంకితం చేయనని శపథం చేశాడు. ‘కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో… హాటకగర్భురాణి! -అల్ల కర్ణాట కిరాట కీచకులు కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!’ అని ఘంటాపథంగా చెప్పాడు.
భగవత్ సాక్షాత్కారం:
తాము కృతి మొదలుపెట్టినప్పుడు తమ ఇష్టదేవతలు కవులకు ప్రత్యక్షం కావడం, తాము రచింప తలపెట్టిన కావ్యాలనే వ్రాయమనడం విశేషం. తిక్కనకు హరిహరనాథుడు సాక్షాత్కరించాడు. శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాకుళం (కృష్ణా జిల్లా)లో నిద్రిస్తున్నప్పుడు ఆంధ్ర మహావిష్ణువు కలలో కనిపించి, తిరుమల వెంకటేశ్వరునికి అంకితంగా ఆముక్తమాల్యద వ్రాయమని సూచించాడు. ఇలా ఎందరెందరో భగవత్ సాక్షాత్కారాన్ని పొందారు. ఆయా క్షేత్రాల మహాత్యాలు వ్రాశారు. అహోబిల నారసింహుని పేర ఎర్రన నృసింహ పురాణము, పండరినాథుని పేర రామకృష్ణుని పాండురంగ మహత్యము, మరో ఘటికాచల మాహత్యము, కాళహస్తి మాహత్యము వెలశాయి.
కృతిభర్తల ప్రశంస:
కావ్యాలను, కవులను పోషించిన రాజులు, చక్రవర్తుల వంశాలను ఆయాకవులు బహుధా ప్రశంసించారు. “నా తమ్ముండు మల్ల రజనీనాథుండు నిన్నా తత శ్రీ సముపేతుజేసి” అని ఎర్రన ప్రశంసించాడు. పెద్దన రాయల వంశాభివర్ణన ప్రత్యేకం. శ్రీనాథుడు తనకు హితుడైన అవచి తిప్పయ్య శెట్టి కంకితంగా హరవిలాస కావ్యం వ్రాశాడు. ఆయన వణిక్ ప్రముఖుడు. అందుకే మరో వైశ్యుడైన చిరుతొండనంబి కథను చెప్పాడు.
రాజులకే గాక సామంతులకు, హితులకు కావ్యాలు అంకితం చేయడం ద్వారా ఉదరపోషణ మాత్రమే గాక ఐశ్వర్యాన్నీ, కీర్తినీ కవులు పొందారు.
కావ్యావతారికలు:
ప్రతీ కావ్యానికి ముందు పీఠిక వంటి అవతారిక వుంది. అందులో కవుల జీవిత విశేషాలు, పూర్వకవుల స్తుతి, దేవతాస్తుతి, కుకవి నింద, కృతిభర్త ప్రశంస కన్పిస్తాయి. ప్రచార మాధ్యమాలు లేని ఆ రోజుల్లో మౌఖికంగాను, తాళపత్ర ప్రతుల రుపంలోను కవ్యాలు ప్రచారంలోకి వచ్చాయి. కొన్ని క్రిమిదష్టమయ్యాయి. నన్నయ అరణ్యపర్వం చివరి భాగం క్రిమిదష్టమైందని కొందరి ఊహ. అది ఎర్రన పూరించి తరించాడు.
అవతారికల ద్వారా ఆనాటి సాహిత్యచరిత్రను పరిశోధకులు సృష్టించారు. కవుల కాలాలను, వారి సమకాలికులను, వారి ప్రతిభా పాండిత్యాలను బయటపెట్టారు. తర్జన భర్జనలు చేశారు. నన్నెచోడుడు ఆదికవి అని చర్చలు జరిగాయి. చివరకు నన్నయ ఆదికవి అని తేల్చారు.
కవులతో బాటు మొల్ల, తాళ్ళపాక తిమ్మక్క, రంగాజమ్మ వంటి కవయిత్రులు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. రామాయణం వంటి కావ్యాలను పలు కాలాలలో పలువురు కవులు ‘తమరుచితనదిగా’ అనువదించడం గమనార్హం. ఆ కవులందరికీ జోహార్లు.