[box type=’note’ fontsize=’16’] భువనచంద్ర గారు వ్రాసిన ‘పాదచారి‘ అనే నవలను సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 13వ భాగం. [/box]
[dropcap]అ[/dropcap]ద్బుతమైన నీ
జీవన పయనంలో
అమరంగా!
కొన్ని క్షణాలు! “నేను” “తను”
“ఎప్పటి మాటలోయ్ పాదచారీ అవి?”
“ఇప్పటివేనోయ్… అయినా ఎప్పుడో విన్నట్లుగా ఉన్నాయి.”
“ఎవరివో గుర్తుందా?”
“ఆ మాటలూ నావే! శరీరం మాత్రం నాది కాదు. ఆత్మ, మనస్సూ, కళ్లు, వెలుగూ, కవిత సొంపూ అన్నీ నావే! అక్కడున్నదీ నేనే! నాలోని ఉద్రిక్తతకీ నాలోని భావనకీ, నాలోని బలహీనతకీ, నాలోని ఆరాధనకీ ఆ శరీరాన్ని ఆశ్రయిస్తాను.”
“ఇప్పుడా శరీరం ఏదీ?”
“శరీరం వేరే చోట ఉన్నా “నేను” ‘నా’ లోనే ఉన్నానుగా! నా ఉనికే నా ప్రాణం, నా జీవం కొన్ని క్షణాల అమరత్వం అక్కడేగా మరి ఉన్నదీ!… చూస్తే నిజంగా నాలోనేగా ఉన్నదీ.”
“You are being too emotional. To be emotional is to be foolish.”
“ఆ మాటలు నేను రాసుకున్నవే!”
“నాకు నవ్వు వస్తోంది పాదచారీ! నీ పిచ్చితనాన్ని తెలిసి అనుకునే అమాయకత్వాన్నీ చూసి…!”
“నవ్వవో!”
“ఈ నవ్వు మాత్రం నవ్వు కాదు… కాటుకలాంటి కటికి చీకటి కార్చిన కన్నీరు.. ఆవిరై పొడిలా జాలువారుతోందోయూ!”
“Spare those tears…. I might need them!”
“ఇప్పటి బాధ చాలదనా!”
“ఎప్పటి బాధ అప్పటిదే!”
“నీ అహం చావదు కాదూ!”
“అహం లేని ఇహం లేదు.
ఇహం లేని పరమూ లేదు
అందుకే నా అహం చావదు.’
“గండెల్లో కన్నీరో బాధో ప్రవహిస్తున్నా చావదా? ”
“ఉహూ! నాకో నమ్మకం!”
“మళ్లీ నీ శరీరాన్ని నువ్వు తొడుక్కోగలవన్న నమ్మకమా?”
“శరీరంతో నాకేం పనీ? మిగతాదంతా ఉన్నది నాలోనే కదా! ఎప్పటికీ నాదైన దాన్ని గూర్చిన ఏడుపు నా కెందుకు? ప్రశ్నలు నీ కెందుకు?”
“చింత చచ్చినా పులుపు చావదు కదూ!”
“‘చింత’ లేని మనిషి అంతే మరి!”
“నిజంగా ‘చింత’ లేదా?” ప్రశ్నించాడు సత్యమూర్తి.
నిట్టూర్చాడు పాదచారి.
“నిజం చెప్పు” అన్నట్లు వికృతంగా అరిచింది తీతువు పిట్ట.
“మేమూ వింటాము” రావి ఆకులు గాలికి గలగల్లాడాయి.
“నీవు ఎంతో ఎత్తుకు ఎగిరావు. నిన్ను అభినందించాలనో నీవు అలసిపోయి క్రిందకుదిగి వచ్చాక నిన్ను నా గుండెల కదుముకుని నీ రెక్కలు నిమరాలనో నాకున్నది…
అయినా ఓ విహంగమా! నీవు ఊహల వాయు ప్రవాహంలో తేలియాడుతుంటావు…
మరి నేనా? పాషాణాన్ని…
ఎగరలేను… పిలువలేను… పలుకలేను…”
ఆకాశంలో పక్షిని చూస్తూ అనుకున్నాడు పాదచారి.
విశ్వాసం కుక్క ఓ నిట్టూర్పు విడిచింది.
జాలిగా పాదాన్ని నాకింది.
“అయినా ఒకపుడు, నీవు నాకు తెలియనపుడు నా మీద వాలి విశ్రాంతి తీసుకున్నావు… పాషాణాన్నైనా నేనూ ఇందులో భాగమే.”
ఆలోచిస్తూ అన్నాడు పాదచారి.
ప్రకృతి నవ్వు గాలిలో తేలియాడింది.
పురుషుడి నిర్వికారంలా ఆకాశం నిర్మలంగా నిలిచింది
“బాధ కదూ పాదచారీ!”
ప్రేమగా పలుకరించింది అమృత
ఆమె గొంతు విని ఆశ్చర్యంగా వెనుదిరిగాడు పాదచారి.
“నీవు నన్ను చూస్తూనే ఉన్నావు నా బాధలోనో నా దైన్యంలోనో నేను మునిగిపోతుంటే నన్ను రెక్కపట్టి బయటికి లాగుతూనే ఉన్నావు…. ఎంత దయ నీకూ! ఎంతటి హృదయం నీదీ…”
మనస్సులో అనుకుంటూ ఆమె దరికి చేరాడు పాదచారి.
“కూర్చో! కూర్చో!” మన్నట్లు “క్రీక్ క్రీక్” మన్నాయి పిచ్చుకలు.
ప్రకృతి పరచిన తీవాసీ మీద కూర్చున్న అమృత వడిలో తలదాచుకుని తమకంగా బేలగా కౌగలించుకున్నాడు పాదచారి.
పాదచారి తల పైకెతి నుదుటి మీద ముద్దు పెట్టి అతని ముఖాన్ని గుండెలకు హత్తుకుంది అమృత. తల నిమురుతూ అంది.
“నా పాదచారి ఏం చేసి వచ్చాడూ?” అని.
“నన్ను నేను గిల్లుకున్నాను. నా దారి సరి అనుకుంటూ జారిపడ్డాను… లేచాను. కానీ ప్రాణమా! ఏదో జారిపోయింది గుప్పెటనున్నది వేళ్లసందుల గుండా జారిపోయిందన్న భావన…. ఏం పోతే నాకేమి భయం?”
ఈ వెచ్చ నీ ఒడి ఎప్పటికీ నాదే! ఈ మెత్తని చేతులూ, ఈ వెచ్చని ప్రేమ కురిసే గుండెలూ, ఈ అణువణువూ నాదే… నా విశ్వమూ ఆత్మ ఉన్నది ఇక్కడే… నీలోనే…
ఎంత పిచ్చి వాడిని? ఎక్కడికో వెళ్లానన్న భ్రమలో ఉన్నాను… వెళ్లిందెక్కడికి? ఉన్నది యిక్కడే… ”
చంటి బిడ్డలా అమృతను కౌగలించుకుని నిశ్చింతగా అన్నాడు పాదచారి.
సృష్టిలోని ప్రేమనూ, దయనూ ఆమె అణువణువునా వెదజల్లుతూ అతన్ని ముద్దాడుతూ తల నిమిరింది అమృత…
“అదిగో అద్భుతమైన దృశ్యం చూడు చూడు అక్కడ ఉన్నది. పాదచారీ అమృతా కాదు. ప్రకృతీ పురుషులు…. అది అద్వైతం! అది అనందం”
రివ్వున వీస్తూ, చందమామకూ వెన్నెలకూ మాటలు వినిపిస్తూ వారిని ఆనందంగా స్పృశించి వెళ్లింది చల్లగాలి.
“ఈ ప్రపంచం నాదే అనిపించింది. ఇవన్నీ… అంటే ఈ సృష్టిలోని సమస్తమూ నాకోసమేననీ, (అధికారానికి) అనిపించింది. నా మనస్సు వెలుగుతుంటే, ప్రపంచంలో వెలుగేననిపించింది. నా మనసు దుఃఖమయమైనపుడు దుఃఖమే ప్రవహించింది, శాంతిలో కన్నులల్లార్చినపుడు శాంతి విహంగం చక్రికలు కొడుతూ హయిగా నవ్వినట్లనిపించింది. ద్వేషాన్ని, అహంకారాన్ని నింపుకున్నపుడు, యీ ప్రపంచం భగ భగా జ్వలిస్తూ బూడిదగా అవుపడింది. అయితే అన్నీ భావనా ప్రకంపనలే! అన్న నా ఊహల మాలికలే!” నడుస్తూ నడుస్తూ అనుకున్నాడు పాదచారి.
“ఇంకా!” నవ్వుతూ అంది మానసి.
“అనుభవం నెయ్యిలాంటిది… ఎన్ని పాలనో మథిస్తే ఇంత కొద్దిగా మిగిలింది…. లేకపోతే అసలు సిసలైన బంగారం లాంటిది… టన్నుల టన్నుల ముడి పదార్థాన్ని వేరు చేస్తూ కరిగిస్తూ చివరికంటా మిగిలిన అతి కొద్ది ఇది…”
“నువ్వు మరిగి పోయానంటావా?”
“ఆహా మరిగిపోయానోయ్! కాలంతో కరిగిపోయానోయ్!”
“ఇపుడు నువ్వూ బంగారానివేనా?” అడిగింది మానసి…
“ఊహుఁ! ఇంకా ఇంకా రగిలిపోవాలేమో? సంఘటనల సుత్తి దెబ్బలు తింటూ నా మనోరూపాల్ని మార్చుకోవాలేమో?”
“ఆ కోరిక లెందుకు పాదచారీ?”
“ఈ ప్రపంచం మీద భ్రాంతి తీరలేదా?”
“కోరికలు కావు! బ్రతికి ఉన్న శరీరపు చైతన్యం! గమనిస్తున్న మనస్సు వ్యామోహం. ఇది విద్య ఇది అవిద్య అది జ్ఞానం అవలిది అజ్ఞానం అని నాలో నేనే అనుకుంటూ, గుణిస్తూ హెచ్చిస్తూ, తీసివేస్తూ విడగొడుతూ పరుగులు పెట్టే ఉబలాటంతోనో వేదనతోనో తపిస్తూ, నడచిపోయే జీవనగతిలో గతాల తాలుకు అనుభవ పాఠం.
“శభాష్! ప్రశ్నలు చిన్నవి… జవాబులు పెద్దవి. ఒక్కోసారి అతి పెద్ద ప్రశ్నలకి మౌనం కూడ సమాధానంగా ఉంటుందిగా.”
“సరే! ఇంతకీ నిన్ను గూర్చిన నీ శోధన పూర్తి గాలేదా?”
“ఎలా అవుతుంది మానసీ!”
ఋతువులు రెక్కల్ని పరుస్తూ మళ్లీ గగనంలోకి ఎగురుతూ ప్రకృతి గతుల్ని మార్చటంలేదా? నిన్న వేడిమిలో పగుళ్లు విచ్చిన పుడమని తల్లి శరీరం నేడు పరవశంగా పచ్చని కృష్టాన్ని పూయించటం లేదా?
ఆశల ఆకుల్ని అశ్రువులుగా రాలిన మాహా వృక్షాలు మళ్లీ పచ్చ పచ్చగా కళ కళలాడుతూ పక్షుల్ని అలరించటం లేదా!
మళ్లీ ఋతువు మారుతుంది! మళ్లీ ప్రచండాగ్ని జ్వాలలు వీస్తాయి. ఎంత సహజంగా ఎంత నెమ్మదిగా ఎంత నిశ్శబ్దంగా ‘మార్పు’ మనిషిలో ఒదిగిపోతుందో తెలుసా!
“ప్రకృతి శోధన కాదోయీ!”
“నేనూ ప్రకృతిలోని భాగాన్నే! నేనూ అనంత కోటి జీవరాసుల్లోని అంశాన్నే! నేనూ యూ ప్రకృతిలో శరీరాన్ని అరువు తెచ్చుకుని ప్రకృతికే వదిలి వేసే ప్రకృతి భావాన్నే…”
“You are again to emotional?” అన్నది మానసి నవ్వాడు పాదచారి. నవ్వుతూనే అన్నాడు.
“మానసీ! నేను నేను కాదు. నేను ‘వ్యక్తిగా’ ఉన్నదో ఉండబోయేదో కొద్ది క్షణాలే… కానీ జీవితమంతా పంచుకున్నది అందరిలోనే…. అంటే ప్రకృతితోనే… అనేక మందిని కలిశాను. అనేక ప్రదేశాలలో ఉన్నాను… అవన్నీ చెరిగిపోని గుర్తులు! అవెపుడూ మనస్సుని ఆక్రమించినవే… అనేక వ్యక్తులన్నాను గదూ!… అందరూ మనస్సులోని కాలాన్ని పంచుకున్న వారే!…శరీరం ఒంటరిగా నడచినా మనసుకు తోడైన వారే!… జోడుగా నడచి నడుస్తున్న వారే… so how can I alone be emotional when the whole world is nothing but emotion (or illusion).”
“ఇదంతా మామూలే గానీ మరేదైనా మాట్లాడరాదూ?” గడ్డం నిమురుకుంటూ అన్నాడు విజ్ఞానాచార్యులు.
“ఏవుందీ మాట్లాడడానికి? అసలు మాటలతో పని ఏముందీ!”
“ఇన్నేళ్లూ మాటలతోనే గదా గడిచిందీ!”
“మమ్మల్ని మా దారిన పొమ్మన్నావు. మళ్లీ మళ్లీ నువ్వే పిలుస్తూ మాకు అడ్డం పడుతున్నావు” విసుగ్గా అంది మానసి.
“అవన్నీ పై పై మాటలు. నిజంగా తనని విడిచి వెడతావా మానసీ” నవ్వి అడిగింది ఊహారాణి.
“ఎప్పుడు చూసినా నువ్వూ – మేమా విసుగు పుడుతోంది… మళ్లీ ఓ సారి ఈ ప్రపంచాన్ని చుట్టి వస్తే పోదూ” స్కూటరెక్కి అన్నాడు స్వప్నమూర్తి.
(సశేషం)