నవ్వేజనా సుఖినోభవంతు -4: రభస సభలు

2
4

[box type=’note’ fontsize=’16’] ‘నవ్వేజనా సుఖినోభవంతు!‘ శీర్షికన భావరాజు పద్మిని గారు సంచిక పాఠకులకు అందిస్తున్న హాస్యరచనలివి. ఈ రచనలో సభలను రసాభాస చేసే ఎందరెందరి గురించి వివరిస్తున్నారు. [/box]

[dropcap]‘మ[/dropcap]డిసన్నాకా కూసింత కలాపోసన ఉండాల, లాప్పోతే మడిసికీ గొడ్డుకీ తేడా ఏముంటుంది?’ అని అల్లప్పుడో ముత్యాలముగ్గు సినిమాలో రావుగోపాలరావు గారన్నారు కదండీ. అందుకే నేడు యుద్ధ ప్రాతిపదికన అంతో ఇంతో పేరుపడాలని అంతా తహతహలాడుతున్నారు. అందుకోసం నచ్చిన కళల్లో నాని తేలుతున్నారు. కాని తేలాకా ఊరికే ఉంటే ఊరా, పేరా? సభలు, సమావేశాలు పెట్టాలి, లోకానికి తమ కీర్తిని ఎలుగెత్తి చాటాలి. అందుకే జీవశక్తినంతా క్రోడీకరించుకుని, శాయశక్తులా ప్రయత్నించి సభలకు బాహుబలి సినిమా సెట్టింగ్‌లా ఒక రంగం సిద్ధం చేస్తారు. కాని, సభల కోసం ఎవరు ఎంతగా మాప్‌లు వేసుకున్నా, చివరి నిముషంలో వచ్చే గాప్‌లతో సభలలో రభస నెలకొంటుంది. ఆ గాప్ లనే విపత్తులు(Disaster) గా భావించి సరదాగా కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాము.

పేర్లు పేర్కొనే డిసాస్టర్ : ప్రసంగాలు మొదలపెడతాయి కొన్ని విపత్తులు. వేదిక మీదున్న గౌరవనీయులు ‘నేనే చదువుని’ గారు, జీడీపీ, డిటిపి, కెడియం, జిఆర్డి, యుఎస్ఏ … ఇలా మనకు అర్ధమే కాని ఆయన డిగ్రీలు ఓ డజనుడు చెప్పాకా… గారికి, అలాగే గతంలో ఆమ్యామ్యా పార్టీలో ఉండి, ‘మురికివాడలకు మరుగుదొడ్లు’ కార్యక్రమం ద్వారా ఖ్యాతి కెక్కి, ఆ తర్వాత దండుకోరాదా పార్టీలోకి దూకి, హైదరాబాద్‌లో ట్రాఫిక్ సంరక్షణ కోసం కృషి చేసి, ప్రస్తుతం పదవికోసం పార్టీలోకి ఉరికి, ‘వాడవాడకూ అవినీతి’ అనే నినాదంతో దేశాన్ని అధోగతి పధంలో నడిపిస్తున్న జంప్ జిలాని గారికి… అలాగే, ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసిన… ఇలా కొనసాగుతుంది వీరి తంతు. ఇలా పేర్లు పేర్కొనే సరికి, పుణ్య కాలం కాస్తా పూర్తయిపోతుంది.

మల్టిపుల్ పేజెస్ డిసాస్టర్ : మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ లాగానే ఇదీనూ. సభలకు పిలిచిందే తడవుగా ఓ పది పేజీల స్క్రిప్టు రాసుకుని వచ్చేస్తాయి కొన్ని విపత్తులు. వాటిలో తవికలు, పజ్జాలు, పాటలు కూడా ఉంటాయి. చూస్తుండగానే ఒక జీవితకాలం గడిచిపోతుంది, మనం ఎక్కాల్సిన రైళ్ళు, బస్సులు వెళ్ళిపోతాయి. కాని, వీళ్ళ ప్రసంగం ముగియదు. అక్కడికీ ఇలాంటివాళ్ళను పక్కకు లాగెయ్యాలని ప్రేక్షకులు వాచీలు, మొబైల్లు చూసుకున్నా, వేదిక మీద ఉన్న ఇతర అతిథులు సైగలు చేసినా, వీళ్ళకేం పట్టదు. నాలాంటి మర్కట వంశ సంజాతులకైతే, లోకకల్యాణం కోసం ఆ పేపర్లు లాక్కుని పారిపొయినా తప్పులేదనిపిస్తుంది. ఇక ఈ బతుకిలా ఈడ్చేస్తూ, శేషజీవితం ఈ సభలోనే గడపాలన్న కోరికలు అందరిలో అంకురించి, మొక్కలై, చెట్లుగా మారి, మాను కట్టాకా, చివరాఖరుకు ఎప్పుడో వీళ్ళ పేజీలు పూర్తవుతాయి.

వైట్ అండ్ వైట్ డిసాస్టర్ : అంతో ఇంతో పేరున్న వారి సభల్లో తెల్ల జండా రెపరెప లాడకుండా ఉంటే ఎలా? ఇంతకీ ఈ తెల్ల జండాలు ఏ పార్టీవో తేల్చుకోవడానికే నాలాంటి వాళ్లకు తెహెల్కా పరిశోధన అంత క్లిష్టమవుతుంది. ఇక వీరి ప్రసంగాలకయితే… బాబోయ్, కామాలే తప్ప ఫుల్‌స్టాప్‌లు ఉండవు. ఎడారిలో ఒయాసిస్సు నన్నా వెతికి పట్టవచ్చునేమో కాని, వీళ్ళ మాటల్లో భూతద్దం పెట్టి వెతికినా ఒక ఫుల్‌స్టాప్ పట్టలేము. ఈ మధ్యన పెయింటింగ్ పోటీల్లో గెల్చిన పిల్లలకు బహుమతులిచ్చేందుకు ఒక సభకు వెళ్లాను. అక్కడికి ఒచ్చిన ఒక తెల్లసారు ప్రసంగం మచ్చుకు మీకోసం…

‘వేదిక మీదున్న… అంటూ ఓ పది నిముషాలు గడిచాకా, ముఖ్యంగా పిల్లల్లో సృజనాంతకమైన (ఎలాగెలాగ?) ఇటువంటి కలలల్ను, అలాగే సునితసమైన (సున్నిపిండేమీ కాదూ, హవ్వా!) ఇటువంటి పక్రియల్ని, మా పార్టీ (ఇంతకీ ఏ పార్టీ?) బాగా ప్రోత్సహించి, ముందుకు సాగుతూ ఉండడంతో, ముక్యంగా ఈనాడు పిల్లలు మొబైల్ లకు, టాబ్లెట్ లకు అలవాటు పడుతున్న సమయంలో ఈ నిశితశమైన (అయ్యా, సునిశితమైన అనే పదంపై మీకెందుకంత కక్ష్య?), సృజం… బా… ఆ… సుజనాంతకమైన (కాస్త జీవకారుణ్యం చూపిస్తే, మీ సొమ్మేం పోయిందో)బొమ్మలేసేలా పెద్దలు ప్రోత్సహించాలని, ఎందుకంటే, ఇందువల్ల వాళ్ళ చిన్న మెదడు చితకకుండా చురుగ్గా పని చేస్తుందని, మనవి చేసుకుంటూ (సరిగ్గా ఇలాంటి మలుపుల్లోనే, హమ్మయ్య, ఇక ప్రసంగం అయిపోయిందేమో అన్న ఆశ మనలో మొలకెత్తుతుంది… కాని అది అడియాసే అవుతుంది), ఈ విధంగా ముందుకు సాగుతూ ఈ పోటీలు పెట్టడం చాలా ఆరోగ్యహరమైన ప్రయత్నమని, ఇలా తెలియజేస్తూ, అదే విధంగా…’

ఈ లోగా పోటీలలో గెల్చి, అవార్డులు పుచ్చుకోవడానికి వచ్చిన పిల్లలు ఆరున్నొక్క రాగం తీసి, ఆ రోదనా బలంతో ఎంచక్కా అమ్మల ఒళ్లోనే నిద్దరోయి, కాసేపటికి ఆవలిస్తూ లేచారు. అయినా ఫుల్‌స్టాప్ రాలేదు!

తొందరపడకు తుమ్మెదా డిసాస్టర్: ‘తిరిగే కాలూ వాగే నోరూ ఊరుకోదని’ ఓ సామెత! అసలంత బిజీగా ఉంటే, సభలకు వస్తామని ఒప్పుకోవడం ఎందుకంట? కనీసం రోజు ఒక్కింటికీ నాలుగైదు సభలు కవర్ చేసి, దినపత్రికల్లో మెరవాలని ఈ తళుకు తారల జీవిత ధ్యేయం! వీళ్ళు సభలకు వచ్చిన దగ్గరనుంచీ త్వరగా వెళ్ళాలని నిర్వాహకులని తొందర పెడుతూ ఉంటారు. దానితో నిర్వాహకులు తయారుచేసుకున్న ప్రణాళికను తుంగలో తొక్కి, వీళ్ళకు ముందు అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇవ్వడం వలన మిగతా అతిథులకు అలకలు మొలకెత్తుతాయి. ఆ గడబిడలో, రసాభసలు, విసవిసలు తలెత్తి, నిర్వాహకుల నెత్తిన గుదిబండలా మారతాయి.

చీటీ పాట డిసాస్టర్: ఉన్న తిప్పలే చాలక చస్తుంటే, తమకున్న వాక్పటిమను ప్రేక్షకుల మీదకు శారాఘాతాల్లా సంధించాలనే అమితోత్సాహంతో, ప్రేక్షకుల్లోనే కూర్చున్న కొందరు ‘మాకు 5 నిముషాలు మాట్లాడే అవకాశం ఇవ్వాలి’ అని ఎవరో ఒకరితో చీటీలు పంపుతారు. ఆ సరికే నవరసాలు పులుసు కారిపోయి ఉన్న ప్రేక్షకుల మొహాలు చూస్తూ, చీటీ పంపిన వారివైపు చూసి, నిర్వాహకులు ఒక వెర్రి నవ్వు నవ్వి ఊరుకుంటారు. వీరికి మైకిచ్చామా, ఐదు నిముషాలు యాభై నిముషాలౌతుంది.

ఆకస్మిక సన్మాన సమరాంగణ సార్వభౌములు: సభకు వచ్చి సన్మాన గ్రహీతల గొప్పతనాన్ని తెలుసుకున్న వీరికి ఆకస్మికంగా వారికి సన్మానం చెయ్యాలనిపిస్తుంది. కాని, అప్పటికప్పుడు శాలువాల వాన ఆకాశం నుంచి కురవదు కదా. అందుకే నేరుగా స్టేజి వద్దకొచ్చి, ఒక శాలువా ఇస్తారా, అని నిర్వాహుకులను అడుగుతారు. లేదా మరికొంతమంది అతిచొరవ ఉన్నవారు, పక్కనున్న సంచీలోంచి అడగాపెట్టకుండా లాక్కుని మరీ కప్పేస్తారు. లెక్కగా శాలువాలు తెచ్చుకున్న నిర్వాహకులు తత్తరపడి నీళ్ళు నములుతుంటారు. మరికొందరు అంతకు ముందు సన్మాన గ్రహీతకు కప్పిన శాలువానే లాక్కుని, తిరిగి కప్పేసి, సెల్ఫి దిగి, సోషల్ మీడియాలో వేసి, తమ కళా పిపాసను లోకానికి చాటుతారు. వీరితో మాగొప్ప చిక్కు మారాజా !

చివరాఖరికి ‘ఏం చేసారండి సభ?’ అని ఎవరైనా పొగడబోయినా, నిర్వాహకులకి ‘ఇంతకీ ఏం చేసాను?’ అన్న అనుమానం వస్తుంది.

ఇవండీ మచ్చుకు కొన్ని ఇక్కట్లు. ఇంతేనా? అంటే ఇంకా చాలా ఉంది… ఆమ్యామ్యా జర్నలిష్టులు, ఫ్రీగా పుస్తకాలు ఇమ్మనేవారు, సభ టాపిక్‌తో సంబంధం లేకుండా సెల్ఫ్ డబ్బా కొట్టుకునేవారు, సభలతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్లో కూర్చుని గ్రూప్ డిస్కషన్ పెట్టుకునేవారు… ఇలా సభలను రసాభాస చేసే ఎందరెందరినో మీ ఊహకే వదిలేస్తున్నాను. నవ్వేజనా సుఖినోభవంతు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here