అమెరికా సహోద్యోగుల కథలు-11: అమెరికా హరిశ్చంద్రుడు!

2
3

[box type=’note’ fontsize=’16’] ఇచ్చిన మాటని నిలబెట్టుకోకపోతే ఆ కంపెనీని అసౌకర్యానికి గురిచేసిన వాడవుతాడనీ నమ్మి, ఆ ఉద్యోగంలో చేరిన సహోద్యోగి జెఫ్ బోకా గురించి వివరిస్తున్నారు తాడికొండ కె. శివకుమార శర్మ [/box]

[dropcap]అ[/dropcap]మెరికా అనగానే అందరికీ “నేను, నేను” అనే స్వార్థపరత్వమే మెదడులో ప్రత్యక్ష మవుతుంది. ప్రఖ్యాత రచయిత్రి అయాన్ రాండ్ రాసిన రెండు నవలలు – “అట్లాస్ ష్రగ్డ్”, “ఫౌంటెన్ హెడ్” – గుర్తుకు వస్తాయి. ఈ రెండు నవలలకీ పెద్ద సైజు ఫాలోయింగ్ ఉన్నది. ఉదాహరణకి, ఒకప్పుటి ఫెడరల్ రిజర్వ్ ఛెయిర్మన్ అలాన్ గ్రీన్‌స్పాన్ ఆ రచయిత్రికీ ఆమె నవలలకీ పెద్ద ఫాన్. అమెరికా గూర్చి ఇక్కడి నుంచీ కాక బయట నుంచీ వెలువడే వార్తలవల్ల తెలుసుకునేవాళ్లకి, తను చేసే పనివల్ల ఇంకొకళ్లకి కలిగే అసౌకర్యం గూర్చి ఆలోచించడ మనే ప్రక్రియకే అమెరికాలో ఎవరి మెదడులోనన్నా ఇసుమంత చోటు ఉన్నదంటే ఆశ్చర్యం కలగక తప్పదు. దానికి తోడు, ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారంటే ఆ ఆశ్చర్యం ఇనుమడిస్తుంది కూడా! జెఫ్ బోకా అలా ఆశ్చర్యాన్ని కలుగజేసే వ్యక్తి.

పంధొమ్మిది వందల అరవై దశకంలో మొదలుపెట్టి ఇండియాలో విద్యార్థి జీవిత క్రమం అంటే వీధిబడిలో (ఒకప్పటి సంగతి; ఇప్పుడు ప్రీస్కూల్) చేర్చబడి నప్పటి నించీ డిగ్రీ చేతిలోకి వచ్చే దాకా అలా సాగుతూనే పోవడం. ఆ క్రమానికి అలవాటుపడ్డవాళ్లకి జెఫ్ బోకా ప్రత్యేకుడని తప్పక తెలుస్తుంది. అతను నన్ను సలహా అడగడం ఇంకా ఆశ్చర్యకరం.

హైస్కూల్ పూర్తి చెయ్యగానే జెఫ్ ఒక ప్రింటింగ్ ప్రెస్ తయారుచేసే కంపెనీలో డ్రాఫ్ట్స్‌మన్‌గా చేరాడు. ఆ ప్రెస్సులని కొన్నవాళ్లకి వాటిని చేర్చి అక్కడ వాటిని అమర్చి, అన్నీ సరిగా పనిచేస్తున్నాయని చూపే స్థాయికి ఎదిగాడు. తరువాత, వాటికి సమస్యలు ఎదురయినప్పుడు వెళ్లి పరిష్కరించేవాడుగా మారాడు. ఇదంతా కొన్నేళ్ల కాలంలోనే. అప్పుడు బాచెలర్స్ డిగ్రీ చెయ్యాలని అతనికి బుధ్ధిపుట్టింది. ముందు న్యూ జెర్సీలో కమ్యూనిటీ కాలేజీలో చేరాడు. ఈ కమ్యూనిటీ కాలేజీలు రాష్ట్రప్రభుత్వం వనరులతో నడిచేవే. అయితే, యూనివర్సిటీల్లో కంటే వీటిల్లో చేరడం చాలా తేలిక. రెండేళ్ల తరువాత పూర్తిస్థాయి వున్న యూనివర్సిటీలోకి మారే వెసులుబాటు ఉంటుంది. అయితే, మారిన తరువాత అక్కడి పోటీని చాలామంది తట్టుకోలేరు. ఆ చాలామందిలో జెఫ్ లేడు.

రట్గర్స్ యూనివర్సిటీకి మారి, రెండేళ్ల తరువాత మెకానికల్ ఇంజనీరింగులో నూరు శాతంతో బాచెలర్స్ డిగ్రీని పట్టుకుని, అక్కడే, ఫుల్ స్కాలర్షిప్పుతో మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రాంలో చేరాడు. అక్కడ అతని క్లాస్‌మేట్లు – ఇండియాలోని ఐ.ఐ.టి.ల నించీ వచ్చినవాళ్లు – అతనెంత తెలివయినవాడో చెప్పారు. థీసిస్ చెయ్యడానికి అతను ఎంచుకున్న గైడ్ కూడా నేను పి.హెచ్.డి. చేస్తున్న ప్రొఫెసరే. అప్పటికే ఆయన దగ్గర అతను ఒక కోర్సు చేసివున్నాడు. అతని తెలివితేటలని ప్రత్యక్షంగా తెలిసివున్నాడు గనుక ఆయన కూడా సంతోషించారు. మాస్టర్స్ అవగానే జడత్వంవల్ల కావచ్చు, పి.హెచ్.డి. ప్రోగ్రాంలో చేరి ఒక ఏడాది పూర్తిచేశాడు కూడా.  అయితే, చదివింది ఇంక చాలనుకున్నాడో లేక స్థలమార్పిడి కావాలనుకున్నాడో ఏమో గానీ, ఒక పెద్ద ఏరోస్పేస్ కంపెనీలో ఉద్యోగానికి దరఖాస్తు పెట్టి వాళ్ల దగ్గరనుంచీ ఆఫర్ సంపాదించాడు కూడా. అయితే, అప్పటికి నాకు తెలియనిది ఒకటుంది.

హ్యూస్ అనే ఏరోస్పేస్ కంపెనీ ఆఫర్ చేసిన ప్రత్యేకమయిన ప్రోగ్రాంకి జెఫ్ అప్లైచేశాడు. ఈ ప్రోగ్రాంకి అమెరికాలోని ఎవరయినా అప్లై చెయ్యవచ్చు. దానికి ఎంపిక అయినవాళ్లకి ఆ కంపెనీ సంవత్సరానికి యాభై వేల డాలర్లని స్కాలర్షిప్ కింద ఇవ్వడమే గాక అమెరికాలోని ఏ యూనివర్సిటీలో నయినా పి.హెచ్.డి. ప్రోగ్రాం పూర్తిచెయ్యడానికి అయే ఖర్చు నంతటినీ భరిస్తుంది. 1987 లో మాస్టర్స్ డిగ్రీ చేసినవాళ్లకి నలభైఅయిదు వేల డాలర్ల జీతం అంటేనూ, శ్టాన్‌ఫర్డ్, హార్వర్డ్, M.I.T. ల్లాంటి యూనివర్సిటీలలో ట్యూషన్ ఒక్కటే దాదాపు ముఫ్ఫై వేల డాలర్లు ఉండేదని చెప్పినప్పుడూ ఈ స్కాలర్షిప్ విలువ అర్థమవుతుంది.

ఒక శుక్రవారం నాడు జెఫ్ నన్నడిగిన సలహా దీని గూర్చి: ఆ స్కాలర్షిప్ ఫైనలిస్టు లిద్దరిలో అతనొకడు. ఆ పైవారంలో వాళ్లిద్దరినీ ఇంటర్వ్యూ చేసి ఒకర్ని ఆ కంపెనీ సెలక్ట్ చేస్తుంది. అయితే, అప్పటికే తనకి ఉద్యోగానికి ఆఫర్ నిచ్చిన కంపెనీకి రెండు రోజుల తరువాతి సోమవారంనాడు వచ్చి జాయిన్ అవుతానని జెఫ్ చెప్పి వున్నాడు. ఇప్పుడు అతనికి ఎదురయిన ప్రశ్న, ఉద్యోగాన్ని వదిలేసి ఆ స్కాలర్షిప్ ని ఆఫర్ చేస్తున్న కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్లిరావడమా, లేక మాటమీద నిలబడి ఉద్యోగంలో చేరడమా?

అప్పటికి నేను విద్యార్థినే! పైగా కేవలం స్టూడెంట్ వీసా మీద ఈ దేశంలో వున్న ఫారినర్ని!! జెఫ్‌కి వున్న మూడు, నాలుగేళ్ల ఉద్యోగానుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే అతనికన్నా నాకు ఏమాత్రం ఎక్కువ అనుభవం లేని మాట అటుంచితే, వయసు కూడా ఎక్కువేమీ కాదు. అయినా, ఈ తేడాలేమీ పట్టించుకోకుండా అతను నన్ను, నువ్వే ఈ పరిస్థితిలో వుంటే ఏం చేస్తావని అడిగాడు.

నేను, తనకి ఉద్యోగం ఆఫర్ నిచ్చిన కంపెనీకి ఫోన్ చేసి పరిస్థితిని చెప్పి, ఒక వారం తరువాత వచ్చి చేరడానికి అనుమతిని కోరమన్నాను. అతనికి ఉద్యోగానికి ఆఫర్ ఇచ్చారంటేనే ఆ కంపెనీకి అతని విలువ వాళ్లకి తెలుసని అర్థం. వాళ్లు అతని భవిష్యత్తుకు ఏమాత్రం అడ్డం రారని, తప్పక అనుమతిస్తారని నా నమ్మకం. ఇవ్వని పరిస్థితుల్లో, పోతే పోనీ అన్న ధీమాతో అతను ఇంటర్వ్యూకి వెడితే, అందులో అతను విజేయుడవచ్చు. కాని పక్షంలో, అతని సత్తాని తెలిసిన వేరే ఏ కంపెనీ అయినా అతణ్ణి ఎగరేసుకుపోతుంది. నా ఆలోచనలను అతనికి వివరించాను. ఒకవేళ దీనికి స్వార్థ మని పేరు పెట్టినా, ఎవరి సంగతి వాళ్లు చూసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదన్నాను.

అన్నీ విన్నాడు, నా లాజిక్‌ని ఒప్పుకున్నాడు గానీ, తను సోమవారంనాడు వచ్చి చేరతా నన్నాడు గనుక ఆ ఉద్యోగంలో చెయ్యడానికి పని రెడీగా ఉంటుందనీ, అప్పుడతను వెళ్లకపోవడంవల్ల ఆ పని కుంటుపడుతుం దనీ, అందుకని, ఇచ్చిన మాటని నిలబెట్టుకోకపోతే ఆ కంపెనీని అసౌకర్యానికి గురిచేసిన వాడవుతాడనీ నమ్మి, సోమవారంనాడు వెళ్లి ఆ ఉద్యోగంలో చేరాడు. ఆ కంపెనీలో బాగా పేరు తెచ్చుకున్నాడని వేరే చెప్పవలసిన అవసరం లేదు.  ఇప్పటికీ అక్కడే పనిచేస్తున్నాడు.

దాదాపు ముఫ్ఫయ్యేళ్ల అనుభవంతో వెనక్కు చూసి, ఆనాడు నేను జెఫ్ కిచ్చిన సలహాలో ఏమాత్రం పొరబాటు లేదని చెప్పగలను. ఏ కంపెనీలో నయినా గానీ, ఒక ఉద్యోగి తక్కువవడం వల్ల పని ఆగిపోదు; ఏ ఒక్కరు లేకపోయినా గానీ కంపెనీ మెషినరీలోని గేర్లు పనిచెయ్యకుండా ఆగిపోవు. ఆనాడు హరిశ్చంద్రుడు ఇచ్చిన మాటమీద నిలబడ్డ విషయం ఎంత నిజమో, ఎంత ఇతిహాసం మాత్రమేనో తెలియదు గానీ, “నీ సంగతి నువ్వు చూసుకో!” అని రష్యానించీ వలస వచ్చి, రాసిన రెండు నవలలకీ ఎంతో పేరు సంపాదించుకున్న అయాన్ రాండ్ గడిపిన అమెరికాలో, ఆమె సలహాని తోసిపుచ్చిన జెఫ్ నాకు తారసపడడం చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here