[dropcap]కా[/dropcap]గితపు ఆటస్థలంలో అక్షరాలు
ఓ క్రమంలో కదులుతూ ఉన్నాయి
ఆగే మూఢ్, పీఛే మూఢ్
దాయే ముఢ్, బాయే మూఢ్
పీఛే మూడ్… తేజ్ చల్ అంటూ, అరుస్తూ
గుంపులు గుంపులుగా
పదాల కవాతు చేస్తూనే ఉన్నాయి
కళ్ళ వలవేసి వాటిని పట్టేసుకుని
మస్తిష్కం మందసంలో పెట్టేసుకుని
పద్ధతిగా ఒక్కోపదాన్ని భద్రపరుస్తూనే ఉన్నాను
అంతలో
నా ఏకాంతాన్ని భంగం చేస్తూ
నా ఏకాగ్రతను భగ్నం చేస్తూ
ఎదురుగా ఎవరో ఏమాత్రం తెలియని ఇద్దరు…
పదానికి పదానికి మధ్య
నిటారుగా నిలుచున్న ఖాళీని నేను
నన్నెప్పుడైనా గమనించావా
వాక్యానికి వాక్యానికి మధ్య
నడిచొచ్చిన నిడుపైన ఖాళీని నేను
నా వంకెప్పుడైనా ఓ కన్నేశావా
అని గద్దిస్తూ, తర్జనితో బెదిరిస్తూ
పలుకరింపుల ప్రహసనానికి తెరతీస్తూ
అడిగేస్తుంటే అవాక్కయ్యాను
జవాబివ్వలేని ఆ జబర్దస్తీ ప్రశ్నకు
జవాబేమిటా అని తడబడుతుంటే,
తలగోక్కుంటుంటే తటాలున తట్టేసింది
తల ఇంకా నెరవలేదుగా
తరువాతెప్పుడైనా రండి, తప్పక చెబుతాను
అని నేర్పుగా తప్పించుకుంటుంటే
తెల్లమొహాలేసి వెళ్ళిపోయాయి జంటఖాళీలు
కాగితంలోకెళ్ళి కరిగి కనుమరుగైపోయాయి