ఓ మంచి పాత కథ – త్రిపురనేని గోపీచంద్ గారి ‘సంపెంగ పువ్వు’

0
3

[box type=’note’ fontsize=’16’] త్రిపురనేని గోపీచంద్ గారు వ్రాసిన ‘సంపెగ పువ్వు’ అనే చక్కని కథని విశ్లేషిస్తూ ఈ వ్యాసం అందిస్తున్నారు అంబడిపూడి శ్యామసుందర రావు. [/box]

[dropcap]ప్ర[/dropcap]ముఖ సంఘసంస్కర్త, కవి అయిన త్రిపురనేని రామస్వామి చౌదరిగారు పున్నమాంబ దంపతుల  కుమారుడు అయిన గోపీచంద్ ప్రముఖ తెలుగు రచయిత, సాహితీవేత్త, హేతువాది, సినిమా దర్శకుడు. ఈయన సెప్టెంబర్ 8, 1910 న కృష్ణా జిల్లా అంగలూరు గ్రామములో జన్మించాడు. ఈయన తన తండ్రి దగ్గరనుంచి పొందిన గొప్ప ఆయుధము ‘ఎందుకు’ అని ప్రశ్నించే తత్వము. దీనివలన తన జీవితములో చాలా సంఘర్షణలను అనుభవిస్తూ అనేక వాదాలతో వివాదాలతో, తత్వాలతో దాగుడు మూతలు ఆడుతూ సంతృప్తిలోను అసంతృప్తి లోను ఆనందాన్ని అనుభవిస్తూ జీవయాత్ర సాగనిచ్చిన మహోన్నత వ్యక్తి గోపీచంద్. ప్రశ్నించే తత్వము అతన్ని నిరంతరము పరిణామానికి గురిచేసేది. ఎందుకు అనే ప్రశ్న అతన్ని ఒక నిత్యాన్వేషిగాను, తత్వవేత్తగాను తయారు చేసింది. ఈ క్రమములో ఆయనలో చెలరేగిన సంఘర్షణ అయన కథలలో, నవలలలో ప్రతిబింబించేది. తెలుగు సాహిత్యములో మొదటి మనో వైజ్ఞానిక నవలగా పేరుగాంచిన ‘అసమర్ధుని జీవయాత్ర’ రచయిత గోపీచంద్. అలాగే 1963లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’ కూడా ఈయన కలము నుండి వచ్చినదే.

ఈ రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యముగా గమనించదగ్గది. తండ్రి నాస్తికత్వపు భావజాల, ప్రభావము సహజముగానే గోపీచంద్ పైన ఉండేది. కానీ తరువాతి కాలములో ఆస్తికుడిగా మారాడు. 1932లో వివాహము చేసుకొని 33లో బి.ఏ. పట్టా ఆ తరువాత లా పట్టా తీసుకొని న్యాయవాద వృత్తిలో ప్రవేశించి ఎక్కువ కాలము న్యాయవాదిగా కొనసాగలేక పోయినాడు. ఆ దశలోనే కమ్యూనిజము (మార్కిజము) పట్ల ఆకర్షితుడైనాడు కానీ అక్కడ కూడా పార్టీలోని అరాచకత్వము నాయకుల ధోరణి నచ్చక బయటకు వచ్చేశాడు.

ఈ పరిణామ క్రమములో ఎం.ఎన్. రాయ్ మానవతా వాదము గోపీచంద్‌పై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఆ కాలములోనే ఆంధ్ర రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శిగా పనిచేశాడు. తొలుత 1928లో ‘శంబుక వధ’ అనే కథ ద్వార సాహితీ రంగములో ప్రవేశించాడు. కథా సాహితీ రంగములో స్థిరపడ్డ గోపీచంద్ 1943లో ‘పరివర్తన’ అనే నవల ద్వారా నవలా సాహితీ రంగములో కూడా అడుగు పెట్టాడు. 1939లో చలన చిత్ర రంగములో దర్శక నిర్మాతగా ప్రవేశించి కొన్ని చిత్రాలను నిర్మించాడు. కానీ అవి ఆర్థికంగా విజయాన్ని సాధించలేదు. 1953లో ఆంధ్ర రాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గాను, 1956లో ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ సహాయ డైరెక్టర్ గాను పనిచేశాడు. 1957-62 మధ్యకాలములో ఆకాశవాణిలో పనిచేశాడు. ఈ కాలములోనే అరవిందుని భావాల పట్ల నమ్మకము ఏర్పడటంతో ఆధ్యాత్మికవాదము వైపు ప్రయాణించాడు. ఈయన నాస్తికత్వము నుండి ఆస్తికత్వము వైపు మళ్ళటానికి కారణము ఉన్నవ లక్ష్మీ నారాయణ గారి ప్రభావము. ఉన్నవ లక్ష్మీనారాయణ గారు త్రిపురనేని రామస్వామి చౌదరిగారు భిన్న ధృవాలకు చెందిన వారైనప్పటికీ మంచి స్నేహితులు. ఇద్దరు గాంధేయవాదులే.  గోపీచంద్ వ్రాసిన ‘మెరుపు మరకలు’ అనే గ్రంధములో గాంధీ రామయ్య అనే పాత్ర అన్ని విధాలా ఉన్నవ లక్ష్మి నారాయణ గారిని పోలి ఉంటుందని అందరు ఆరోజుల్లో చెప్పుకొనేవారు.

ఒకరోజు లక్ష్మీనారాయణ గారు రామస్వామి గారిని కలవటానికి తెనాలి వెళితే స్నేహితులిద్దరికి గోపీచంద్ భోజనము వడ్డిస్తున్నప్పుడు లక్ష్మీనారాయణ గారు “ఏమయ్యా రామస్వామి, ఉద్యమాల గొడవల్లో పడి కొడుకు వివాహము సంగతి మరచి పోయినట్లు ఉన్నావు”అని అంటాడు. “మీరే ఎవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేయండి” అని మిత్రుడిని రామస్వామిగారు కోరాడు. అప్పుడు లక్ష్మీనారాయణగారు గోపీచంద్‌తో, “నీవు మద్రాసు వెళ్ళే ముందు పదిరోజులు ఉండేటట్లు గుంటూరు రావోవ్ “అని చెప్పాడు. ఆ విధముగా గోపీచంద్ గుంటూరు రావటము తటస్తించింది. ఆ రోజుల్లో గుంటూరులోని శారదా నికేతన్ అనే వితంతు శరణాలయం నిర్వహణ లక్ష్మీ నారాయణ గారే చూసేవారు. ఆ శరణాలయములో ఎక్కువ మంది బాల వితంతువులే. గోపీచంద్‌ను లక్ష్మీనారాయణగారు ఒక పదిరోజులపాటు వాళ్లకు పాఠాలు చెప్పామన్నారు. క్రమముగా  వితంతు శరణాలయాన్ని పంతులు నడుపుతున్న తీరు, బాల వితంతుల దీన పరిస్థితి గోపీచంద్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. జీవితములో పెంచి పెద్ద చేసిన నాన్న కంటే లక్ష్మీనారాయణ గారి  ప్రభావం గోపీచంద్ మీద చాలావరకు ఉంది.

గోపీచంద్ నెమ్మదిగా మార్క్సిస్టు సిద్ధాంతం నుండి బయటపడి, చివరి రోజులలో ‘తత్వవేత్తలు’ అనే తాత్విక గ్రంథాన్ని వ్రాయటం జరిగింది. ‘పోస్ట్ చెయ్యని ఉత్తరాలు’, ‘అసమర్థుని జీవయాత్ర’, ‘మెరుపుల మరకలు’ – ఈ గ్రంథాలలో కూడా చాలావరకు తాత్విక చింతన కనపడుతుంది. ఆయనే, ఒక చోట ఇలా అంటాడు “మానవులు జీవనదుల లాగా ఉండాలి కానీ, చైతన్యంలేని చెట్లు, పర్వతాల లాగా ఉండకూడదు”.

మానవ జీవితం ఒక చైతన్య స్రవంతి. ఎన్నో మలుపులు తిరుగుంది. అలాగే మనం కూడా నిరంతర అన్వేషణలో ఉండాలి. అప్పుడే మనకు సత్యమంటే ఏమిటో తెలుస్తుంది. నిన్న మనం నమ్మింది ఈ రోజు సత్యం కాదని తెలిసిన వెంటనే దాన్ని వదలి మళ్ళీ అన్వేషణ సాగించాలి. ఇదే విషయాన్ని జిడ్డు కృష్ణమూర్తి, చలం కూడా చెప్పారు. జీవితం అంటే నిరంతర అన్వేషణ. ఒక పుస్తకాన్ని ఆయన తండ్రిగారికి

అంకితం ఇస్తూ- ‘ఎందుకు’ అని అడగటం నేర్పిన నాన్నకి అని వ్రాసాడు. అలా నేర్చుకోబట్టే స్వతంత్ర భావాలు గల ఒక గొప్ప రచయిత స్థాయికి ఎదిగాడు. 1962 నవంబర్ 2 నాడు గోపీచంద్ మరణించారు. భారత ప్రభుత్వము 2011 సెప్టెంబరు 8న గోపీచంద్ శతజయంతి సందర్భమున తపాలా బిళ్ళ విడుదల చేసింది.

***

అయన కథలలో ఒక కథ ‘సంపెంగ పువ్వు’ గురించి చెప్పుకుందాము. చదువుకున్న స్త్రీ నవీన విధానములో ఉత్సాహముగా సాంఘిక వ్యవహారాల్లో పాల్గొంటూ ఉంటే ఆమె నడవడి కార్యక్రమాలు పట్టణాలలో నగరాలలో ఏమంత వింతగా ఉండవు. కానీ పల్లె కాక పట్నము కానీ ఊరికి  ఆవిడ వచ్చి మగవారితో కలుపుగోలుగా ఉంటూ ఆధునిక విధానములో క్లబ్బు స్థాపించి వెళ్ళిపోతే  ఆ ఊళ్ళో మిత్రుల మధ్య ఏర్పడ్డ వివాదాలు, ఆ స్త్రీ మీద అభిమానము గల పురుషులు ఎలా ప్రవర్తిస్తారు, వారి ప్రవర్తన తెలుసుకున్న ఆ స్త్రీ ఎలా రియాక్ట్ అవుతుంది అన్న అంశాల మీద ఈ కథ సాగుతుంది. ఈ కథలో స్త్రీని అస్తిగా చూడటం నచ్చని రచయిత ఒక స్త్రీ పాత్ర ద్వారా తన అభిప్రాయాలను తెలియజేస్తాడు. ఇది కూడా ఒక రకమైన మానసిక విశ్లేషణకు సంబంధించిన కథ. ఈ కథలో రచయిత ఒక పాత్ర. రచయిత స్నేహితుడు శాస్త్రితో బొంబాయి నుంచి ఆవిడను రీసివ్ చేసుకోవటానికి రైల్వే స్టేషన్‌కు వెళతాడు ఆ వెయిటింగ్ సమయములో శాస్త్రి  వచ్చే ఆవిడ గురించి ‘భలే మనిషి’ అని చెపుతుంటాడు. “అటువంటి ఆడవాళ్లు రష్యాలో ఉంటారేమో గాని ఇక్కడ ఉండరు, భర్తను కామేశ్వరుడు అని పేరు పెట్టి పిలుస్తుంది, ఆవిడకు నలుగురు పిల్లలు” అని శాస్త్రి ఆవిడ గురించి రైలు వచ్చే లోపల ఇంట్రడక్షన్ ఇస్తాడు. మామూలు స్త్రీ ఆకారము కోసము వెదుకుతున్న రచయితకు ఓవర్ కోట్‌లో ఉన్న బొంబాయి స్త్రీ దర్శనము ఇస్తుంది శాస్త్రి రచయితను స్నేహితుడుగా, మంచి రచయితగా పరిచయము చేస్తాడు. మరునాడు ఉదయము శాస్త్రి రచయితను ఆమె పిలుచుకు రమ్మన్నది ఆని చెప్పి తీసుకు వెళతాడు అప్పటికే ఇతర స్నేహితులు కొంతమంది కుర్రాళ్ళు అక్కడికి చేరుకుంటారు. అందరితో మాట్లాడే ఆవిడ, “వయస్సు మాట ఎట్లావున్న మీ అందరికి నేను తల్లిని” అనే బాంబు వేసింది. “నేను స్త్రీని” అనే భావన ఆమెకు చచ్చినా గుర్తుకు రావటము లేదు. అందరితో కాఫీ హోటల్ కు వెళుతుంటే ఆ ఊరిలోని జనము ఆశ్చర్యముగా చూడటము మొదలు పెట్టారు. అలాగే పార్క్, శాస్త్రి  ఇంట్లో శాస్త్రి భార్య ఆడిగే ప్రశ్నలకు జవాబు చెప్పటానికి సిగ్గు పడేది. ఎందుకంటే ఆవన్ని ఆడవాళ్ళ కబుర్లు. భోజనాలు అయినాక రాత్రి సినిమాకు రచయితతో బయలుదేరింది. “మీ ఊరు చాలా వెనకబడి ఉంది” అన్న అభిప్రాయాన్ని తెలియ జేసింది.

కాబట్టి స్త్రీల క్లబ్బును ప్రారంభించి ఆడవాళ్ళలో మార్పు తీసుకు రావాలని సలహా ఇచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు మ్యాస్కులైన్ హీరోలంటే తనకిష్టము అని చెపుతుంది. తనను వాళ్ళ ఊళ్ళో ఒక మహిళా సంఘము వాళ్ళు సభ్యురాలిగా చేర్చుకోమని చెప్పారుట. పైపెచ్చు ఈ సంఘము మహిళలకు మాత్రమే అని కూడా చెప్పారని నవ్వుతు చెపుతుంది. రెండు రోజుల తరువాత, “ఇక నేను మీ వూరులో ఉండలేను, మీరంతా ప్రిమిటివ్ పీపుల్. రేపే బొంబాయి వెళ్ళిపోతాను” అని తన నిర్ణయాన్ని తెలియజేస్తుంది.

రైలు ఎక్కించి అందరు ఇళ్లకు చేరారు కానీ ఆమె రచయిత జీవితాన్ని మార్చి వేసింది. రచయితకు హుషారు ఎక్కువ అయింది. కథలు వ్రాయాలని, ఉపన్యాసాలు ఇవ్వాలని పది మంది మెప్పు పొందాలని అపేక్ష పెరిగింది. ఒక సాయంత్రము ఆవిడ గురించి మాట్లాడటానికి శాస్త్రి ఇంటికి వెళ్ళాడు. అప్పటికే ఇతర మిత్రులు ఉన్నారు. వాళ్లందరు ఆమె వెళ్ళిపోగానే దిగాలు పడ్డారు. అందరు రచయితా చేత ఆవిడకు ఉత్తరము వ్రాయించి మహిళా సంఘము ఆర్గనైజ్ చేయిద్దామని తమ ఉద్దేశాన్ని చెప్పారు కానీ ఇతరులు రచయితకు ఆవిడకు ఉన్న స్నేహాన్ని అవహేళనగా మాట్లాడేసరికి రచయితకు కోపము వచ్చి శాస్త్రిని కొడతాడు.

జరిగిన సంఘటనను ఆవిడకు వ్రాద్దామనుకొని మొహమాటపడి వ్రాయలేదు.ఈ సంఘటన జరిగిన ఐదు రోజులకు ఆమె దగ్గర నుంచి  రచయితకు ఉత్తరము వస్తుంది. ఆ ఉత్తరములో సంగతులు చదివేటప్పటికీ రచయిత గుండె ఆగినట్లు అయింది

“శాస్త్రి వ్రాసిన ఉత్తరము ద్వారా విషయాలు తెలిసినాయి. అతడు అబద్దాలు ఏమి రాయలేదు. మీకు అతనికి జరిగిన పోట్లాటను తన తప్పును కప్పిపుచ్చుకోకుండా విఫులంగా వ్రాశాడు. నా హానర్ డిఫెండ్ చేయటానికేనా శాస్త్రిని కొట్టింది? గాలి పటము మీద ప్రయాణము చేసి మీ ముందు కూర్చుని మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటా.. ముందు మిమ్మల్ని ఒకమాట అడగాలని ఉంది. ఏమిటి అంటే నేను నంగనాచి నని అనుకోవటానికి ఆధారాలు ఏమిటి? శాస్త్రి మీకు యథార్ధమే చెప్పాడు. నేనేమి నంగనాచిని కాదు. కావాలని ఆపేక్ష కూడా లేదు. మీరు నన్ను అపార్థము చేసుకోవద్దు, ఆడవాళ్ళ గౌరవ మర్యాదలను కాపాడవలసిన భాద్యత పురుషుల మీద ఉన్నది అన్న అభిప్రాయముతో శాస్త్రితో పోట్లాడి ఉంటారు బహుశా. నేను ఒక రోజు మీతో తిరిగినందుకు ఒక రాత్రి సినిమాకు వచ్చినందుకు మీరు నా హానర్‌ను కాపాడుకోవాలనుకోవటం చాలా అన్యాయము. మీకు శాస్త్రి లాంటి వాళ్లకు తేడా ఏముంది? నేను మీతో చనువుగా మాట్లాడాను కాబట్టి శాస్త్రి ఇతరులు నన్ను మీ ఆస్తిగా భావించి అసూయతో నోటికి వచ్చినట్లు మాట్లాడారు. మీరు మీ ఆస్తిని హేళన చేస్తున్నారని వాళ్ళతో దెబ్బలాడారు. ఇద్దరికీ తేడా ఏమి లేదు. మీరు మారాలి. మీలో బలహీనతలు ఉన్నా మీరంటే నాకు ఇష్టము. మిమ్మల్ని బాగు చేయాలనే కోర్కె నాలో గాఢముగా ఉంది. మీరు లేడీస్ క్లబ్ స్టార్ట్ చేసి దానికి మీరే సెక్రెటరీగా ఉండండి. అశ్రద్ధ వద్దు కుదరని చెప్పకండి. సహజముగా మాట్లాడుదాము, యదార్ధాలు మాట్లాడుదాము అని మీకు ఎందుకు అనిపించదు? సంఘానికి జడిసి మీరు పతివ్రతగా ఉండటం నాకిష్టము లేదు రాయదలచుకున్నది అంతా రాశాను. మీకు కూడా అలా అనిపిస్తే జవాబు రాయండి. సినిమాలో సంపెంగ పువ్వు ఇస్తే సినిమా అయ్యేదాకా వాసన చూస్తు కూర్చుంటారా? సంపెంగ పువ్వు వాసన చూడ్డానికేనా? నేను ప్రీమిటివ్ గా ఉండాలనా మీ అపేక్ష?

P.S:- శాస్త్రి వ్రాసిన ఉత్తరము కామేశ్వరుడు చూసి గుక్కలు పెట్టి నవ్వుకున్నాడు. ఆ ఉత్తరము చూసినప్పటినుండి కామేశ్వరుడికి మీ మీద చాలా ప్రేమ కుదిరింది.

ఈ ఉత్తరము చదివిన తరువాత రచయిత ఒక నెల రోజులు ఖాయిలా పడ్డాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here