[dropcap]నే [/dropcap]వెలిగించిన ఆ చిఱుదీపాలు !
మా బతుకుల పాలిట శాపాలు!
మా పాపాలకు ప్రతి రూపాలు !
తన నెచ్చెలి మెచ్చగ మము జూచి
మా ముంగిట ఆమని కాజేసి
మా ఆస్తే
నా ఆస్తంతా దోచేస్తే
కర్కోటకులై మము కాటేస్తే
నిర్దాక్షణ్యంగా బయటకు నెట్టేస్తే
మా మోములపై తలుపులు మూసేస్తే
కూడు కోసం
గూడు కోసం
కడుపు చేత బట్టి
జోడు నూత బట్టి
చేసేందుకు ఏమీ తోచక
మా చేతులు ఎపుడూ చాచక
కూడు దొరికే దారి లేక
గూడు దొరికే జాడ లేక
గోడు విన నే తోడు లేక
నీడ చూపే చేయి కాన రాక
మండు టెండలో
మండే గుండెలతో
విచారమే తోడై వస్తే
వికారమే మము వరియిస్తే
తోడుగ యిద్దరమూ చస్తే
రెండు కన్నీటి బొట్లు రాల్చే
ఒక్క పేగైన ప్రక్కన లేక
పిలిచేందుకు ఎవరూ లేక
లోకం విడచి మేము రోడ్డున బడితే
శోకం మము విడచి పరుగులు పెడితే
అనాథ లెవ్వరూ కాదంటూ
సనాథలే మీరూ నంటూ
కనబడని ఏదో శక్తి
కడదాకా మము సాగనంపే
మహాత్ములను మా దరి కంపిస్తే
నిర్వికారులై నిర్విచారులై
నిరహంకారులై నిశ్చల మనస్కులై
కడదాకా మము సాగనంపితే
చితిమంటల చల్లని కౌగిటలో
కడు హాయిగ నిదురిస్తే
వెతలన్నియు మము మరచే
వడివడిగా మము విడచే
దివి సీమకు మము పిలచే
కడు హాయది మము వలచే