జీవన రమణీయం-80

0
3

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

గిరిజగారెళ్ళిపోయాక, చిట్టెన్‌రాజు గారు వంట చేసారు. నేను స్నానం చేసి తయ్యారు అయి వచ్చేసరికి మావిడికాయ పప్పూ, గుత్తి వంకాయ కూరా చేసారు. నేను చెప్పాను, “నేను ఏదైనా తినేస్తాను, ఇవన్నీ చెయ్యక్కరలేదు” అని.

ఆయన ఇంట్లో పుస్తకాల లైబ్రరీ, శ్రీశ్రీగారు స్వదస్తూరీతో రాసిన వాక్యాలు, ఆయన సరోజిని గారిని ఇక్కడే ‘భార్య’గా స్వీకరించిన వైనం అన్నీ ఆయన చెప్తుంటే విన్నాను. శైలజతో సహా ఎస్.పి.బీ. వాళ్ళింట్లో వుండడం, ఆయనకి ఈయన యందున్న ప్రేమాభిమానాలూ, అలాగే కొందరు అతిథులు పిలిచి అందలం ఎక్కిస్తే, ఇక్కడే వుండి, ఈయన ఇచ్చిన మందే తాగి వదరిన అనుభవాలూ, అన్నీ ఆయనదైన చమత్కార శైలిలో వర్ణిస్తే విని నవ్వుకున్నాను.

ఆయన “వంగూరివాళ్ళం తొమ్మండుగురం అమెరికా అంతటా వున్నాం, నీకేం చూడాలనుందో చెప్పు, ఏర్పాటు చేస్తా” అన్నారు.

నేను “ఎల్.ఎ. వెళ్తే యూనివర్సల్ స్టూడియో చూడాలనుంది” అన్నాను. “మా తమ్ముడున్నాడుగా… చెప్తాను” అన్నారు. ఈయన తమ్ముడు ఎంత బిజీనో, ఆయనకి అన్నగారి ఫ్రెండ్ వచ్చింది వూరు చూపించమంటే, ఏం కేర్ వుంటుందీ? ఈ అమెరికా పద్ధతులవీ చూసాగా, ఒక్క క్షణం టైం వుండదు వీక్ డేస్‌లో, హడావిడిగా లేచి మైళ్ళకు మైళ్ళు పరిగెడ్తునే వుంటారా, శలవు రోజుల్లో ప్రశాంతంగా వీకెండ్స్ ఇళ్ళల్లో గడపరు! మళ్ళీ హాలిడేస్‍కి ఔటింగ్ అనో, సమావేశాలనో పరిగెడ్తుంటారు.

మన దేశాన్ని, మన సంస్కృతినీ మరిచిపోతున్నాం ఏమో, మిస్ అయిపోతున్నాం ఏమో! అని కొంచెం ఎక్కువగానే ‘తెలుగు అసోసియేషన్లు’ పండగలవీ చేస్తుంటాయి. ఇవన్నీ నా భావాలు!

కానీ నాకు ఆశ్చర్యం కలిగించేట్టు ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు కానీ, ఇంకో అన్నగారి అబ్బాయి కాని ఈ తమ్ముడు కొడుకు గానీ, ‘పెద్దన్న చిట్టెన్‌రాజు గారి మాటంటే వేదవాక్కు’ అన్నట్టు మాట్లాడారు!

వాళ్ళ అన్నగారి అబ్బాయి, కాలిఫోర్నియాలో వుండే చిన్న చిట్టెన్‍రాజు గారి మాటల్లో అయితే, “తెలుగువాళ్ళు ఎవరైనా సాయం అడగాలే కానీ చొక్కాలు చింపేసుకుని చేసెయ్యమూ?” అన్నాడు. చమత్కారం అందరికీ వంశపారంపర్యం.

రాజుగారి ఇంట్లో వుండగా జరిగిన ఇంకో విశేషం ఏంటంటే, క్లీనర్స్ వచ్చారు. మెక్సికో వాళ్ళు. కార్లో మహారాణుల్లా వచ్చి ఇల్లు క్లీన్ చెయ్యడం నేను మా శేషు ఇంట్లో కూడా చూసాగా, బోస్టన్‌లో.

నేను కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటుంటే, ఆ అమ్మాయొచ్చి నాతో, “అది క్లీన్ చేసాను, ఇది క్లీన్ చేసాను… మా ఇంట్లో ఫలానా తారీఖు ఫంక్షన్ వుందీ…” ఇలాంటివేవో చాలా చెప్పింది. నేను బిత్తరబోయి, అన్నింటికీ తల వూపాను.

ఇంతలో రాజుగారొచ్చారు. “ఏంటి?” అన్నారు. విషయం మొత్తం మళ్ళీ చెప్పింది. ఆయన “Ok… Ok… She is our guest” అన్నారు. ఆ తర్వాత పెద్దగా నవ్వింది. ఈయనా నవ్వేసారు.

“Have a good day” అని ఆవిడ వెళ్ళిపోయాక, ఈయన నాతో చెప్పారు.. “నిన్ను గిరిజ అనుకుందిట, అందుకే అవన్నీ చెప్పింది. నేను కాదు, మా ఫ్రెండ్ ఫ్రం ఇండియా అంటే, అదేమిటీ? ఇద్దరూ ఒక్కలాగే వున్నారు, ఆవిడ సిస్టరా? అని అడుగుతోంది” అని.

నేనూ నవ్వేసాను. మనకి చైనా వాళ్ళూ, జపాన్ వాళ్ళూ అంతా ఒక్కలాగే కనిపించినట్లు, వాళ్ళకి ఇండియన్స్ అంతా ఒక్కలాగే కనిపిస్తారేమో అనుకున్నాను.

నేను చిట్టెన్‌రాజు గారూ భోజనం చేసి బయలుదేరాం. వాళ్ళింట్లో ఇండియా నుంచి వాళ్ళ అక్కగారు పంపిన ఊరగాయలు అన్నీ ప్లాస్టిక్ కవర్లలో, చిన్న చిన్న పాకెట్లలో ఫ్రిజ్‌లో వున్నాయి. తెలుగువాళ్ళు ఎక్కడున్నా ఆవకాయ వదిలిపెట్టలేరుగా!

చిట్టెన్‌రాజుగారు ముందుగా గేల్వస్టైన్ (Galvestine) బీచ్‌కి తీసుకెళ్ళారు. చాలా ఎంజాయ్ చేసాను. బీచ్ అన్నా సముద్రం అన్నా నాకెంతో ఇష్టం. ఆ తర్వాత “రేపు నిన్ను ‘నాసా’కి తీసుకెళ్తాను. అక్కడ ‘వసంత’ అని మనకి తెలిసిన అమ్మాయి పని చేస్తోంది” అన్నారు. నేనెంతో సంతోషపడ్డాను. కల్పనా చావ్లా లాంటి ఆస్ట్రోనాట్స్ పని చేసిన ప్లేస్ చూడడం ఎంత భాగ్యం? అనుకున్నాను. కల్పన పోయిందన్న వార్త విన్నప్పుడు నేనెంతో బాధపడ్డను కూడా! స్త్రీలు అన్ని రంగాల్లో అలా పై పదవులకి సాహసోపేతంగా రావడం, పాలు పంచుకోవడం, మా తరంలో చూడగలగడం ఎంత అదృష్టం!

ఆ రోజు మళ్ళీ గొల్లపూడి గారున్న వాళ్ళ అన్నయ్యగారి అమ్మాయి ఇంటికి వెళ్ళాం. ఆంటీ, ఆయన భోజనాలు చేసి రెడీగా వున్నారు. అందరం స్వామీ నారాయణ్ టెంపుల్‌కి వెళ్ళాం. ఎక్కడికెళ్ళినా నేను ‘మధుమాసం’ షూటింగ్‌కి మలేషియా వెళ్ళినప్పుడు కొన్న కెమెరాతో ‘టిక్కు టిక్కూ’ ఫొటోలు తీసేస్తూ వుండేదాన్ని. అసలు స్వామీ నారాయణ్ టెంపుల్‌లో ఆ అందం, వైభోగం చూసేటప్పడికీ ఒళ్ళు తెలీలేదు! నేను ఫొటోలు తిసునే వున్నాను. దూరంగా వున్న గొల్లపూడిగారు అక్కడి నుండి రెండు చేతులూ పైకెత్తి గాల్లో వూపుతున్నారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. తర్వాత తెలిసింది, ఫొటోస్ తియ్యకూడదని ఆయన ఆపుతున్నారని. ఆ పాటికే తీసేసా!

మళ్ళీ వాళ్ళని వాళ్ల చుట్టాల ఇంట్లో దింపేసి నేనూ, చిట్టెన్‌రాజుగారూ, వీళ్ళ ఇంటికొచ్చాం. గిరిజ గారు అప్పటికే ఇంట్లో వున్నారు. ఆవిడ మళ్ళీ అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళాలని చెప్పారు.

మర్నాడు శనివారం. ఆ తరువాత రోజు సీతా, అనసూయ గార్ల కూతురు రత్నపాప గారి స్టూడియోలో వంగూరి గారి నెల నెలా వెన్నెల ప్రోగ్రామ్. దానికి మళ్ళీ గొల్లపూడిగారూ హ్యూస్టన్‌లోని తెలుగువాళ్లూ అందరం కలుస్తాం. అదీ ప్రోగ్రామ్.

శనివారం రాజుగారు నాకు ప్రామిస్ చేసినట్లే ‘నాసా’ టూర్‍కి తీసుకెళ్ళారు. అదంతా ఒక అద్భుతమైన ప్లానెట్‌లా వుంది. ప్రతి చోటా టికెట్స్ కొనడం, లైన్‌లో నిలబడడం ఇవన్నీ నాకు అలవాటవుతున్నాయి. కాఫీ కొనాలన్నా లైన్ పద్ధతి, రెస్ట్‌రూమ్‌కి వెళ్ళినా లైన్‌లో నిలబడే పద్ధతీనూ!

‘కల్పనా చావ్లా’ స్మృత్యర్థం పాతిన చెట్టు కూడా చూసాం. ఓ దణ్ణం పెట్టుకున్నాం. వసంత గారిని కలిసాం. అదంతా టూర్ తిప్పి చూపించారు. మళ్ళీ లంచ్ టైమ్‌లో ఫ్రెంఛ్ ఫ్రైస్, శాండ్‌విచెస్ తిన్నాం. బాగా అలసిపోయాం. మళ్ళీ మర్నాడు ప్రోగ్రామ్ కూడా వుంది, అని వచ్చేసాం. గొల్లపూడిగారిని,  నన్నూ ఆయన ముందు రోజు వాళ్ళ ఫ్యాక్టరీకి కూడా తీసుకెళ్ళి చూపించారు. రాకెట్‌లో ఉపయోగపడే ఏవో పార్ట్స్‌కి వీళ్ళ దగ్గర పేటెంట్స్ వున్నాయి అని చెపినట్టు గుర్తు! వాళ్ళ కాకినాడ ఆయనే ఈయన శిష్యుడు ఒకాయన ఆ ఫ్యాక్టరీ బాధ్యతలు చూస్తున్నారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here