[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]హ్యూ[/dropcap]స్టన్‌లో ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. రాజేశ్వరి అనే ఆవిడ మా కస్తూరి బా గాంధీ కాలేజ్ స్టూడెంటేట, ఏంకరింగ్ చేసింది. సీతగారిని కలిసాం. రత్నపాప గారి భర్త వున్నారు. ఇంకా సత్యవతి పప్పు అనే అమ్మాయిని చూసి తెగ ఆశ్చర్యపోయాను. ఆ అమ్మాయికి ఓ ముప్ఫై ఐదు ఏళ్ళుండవచ్చు కానీ, పదిహేనేళ్ళ క్రితం వీరేంద్రనాథ్ గారి ఆఫీసులో చూసినప్పుడు ఎంత వుందో ఇప్పుడూ అంతే వుంది. ఆ హైటుకి చిన్నపిల్లలా. నేను “యండమూరి గారి ఆఫీసులో మనం కలుసుకున్నాం” అంటే ఆ విషయం గుర్తు రానట్లూ, అసలు తను కాదన్నట్లూ చూసింది. ఈ అమ్మాయి ప్రబంధాల గురించి రాసేది! వీరేంద్రనాథ్ గారు పరిచయం చేసినప్పుడు ఆ బుగ్గ మీద పుట్టుమచ్చ నాకు గుర్తే! అప్పుడు పొడవాటి జడ వుండేది. ఇప్పుడు బాబ్ కట్ చేయించేసింది. అంతే తేడా!… మళ్ళీ ఫ్రెమాంట్‌లో జరిగిన వంగూరి సదస్సుకి కూడా వచ్చింది. గొల్లపూడిగారికి ఏదో బుక్ కొని తెచ్చి ప్రెజెంట్ చేసింది.
మేం అందరం హ్యూస్టన్ సభలో ప్రసంగాలు చేసాం. ఎవరెవరివో పుస్తకావిష్కరణలు కూడా జరిగాయి. వంగూరి గారు “నేను పుస్తకం ఆవిష్కరించాలంటే ఓసారి కవర్ పేజీ కూడా చింపేసాను” అని ఛలోక్తులు చెప్పారు. మొత్తానికి మంచి భోజనంతో ఆ సభ పూర్తి అయింది. సీతగారు ఇక్కడున్నారు, అనసూయగారు కాలిఫోర్నియాలో వున్నారని తెలిసింది.
సీతా అనసూయా అంటే “మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో” పాట గుర్తొస్తుంది నాకు. అంతే కాక, మా కజిన్ సిస్టర్ శాంతి నండూరి సుబ్బారావుగారి మనవడి పెళ్ళాం. శాంతక్క మావగారు అంటే నండూరి సుబ్బారావు గారి కొడుకు బాలసూర్యారావు గారి ఇంటికి వీళ్ళు ఎంకి పాటల రైట్స్ కోసం వచ్చారట కూడా. పైగా దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి మేనకోడళ్ళు కూడా కదా! మొత్తానికి మంచి జానపద గాయనీమణులు!
ఈ ఫంక్షన్ నుండి మా కామేశ్వరి వదిన కూతురు శిరీషా, భర్త కుమార్ వచ్చి తీసుకెళ్ళారు. ఆ రాత్రి వాళ్ళింట్లో వున్నాను. చిన్న స్టూడియో అపార్ట్‌మెంట్ అయినా, మా శిరి ఎంత బాగా సర్దుకుందో!
వాళ్ళింటి నుండి మర్నాడు మధ్యాహ్నం భోజనాలు అయ్యాకా, తీసుకొచ్చి గొల్లపూడిగారి అన్నగారి అమ్మాయి ఇంట్లో దింపారు. ఆ పాటికే చిట్టెన్‌రాజుగారొచ్చి అక్కడ వున్నారు.
అందరం కారులో మళ్ళీ డల్లాస్ బయలుదేరాము. మా శిరీష “వెళ్ళగానే కాల్ చెయ్యి అత్తా” అని కంగారు పడ్తూ పంపించింది. చిట్టెన్‌రాజుగారి డ్రైవింగులో మళ్ళీ ఐదు గంటలు ప్రయాణం చేసి మళ్ళీ మేం డల్లాస్ చేరాము.
మా బుజ్జి బావ ఇంటి దగ్గర నన్ను దింపి, గొల్లపూడిగారూ వాళ్ళని ఎమ్.వి.ఎల్ గారింట్లో దింపడానికి చిట్టెన్‌రాజుగారు వెళ్ళారు. ఆయన ఆ రోజుకి తన బావమరిది ఇంట్లో వుండి, మర్నాడు ఎయిర్‌పోర్ట్‌లో కలుసుకుందాం, అందరం కాలిఫోర్నియా కిరణ్‌ప్రభ గారింటికి వెళ్ళాలి. అసలు నేను వచ్చిన ‘ఆరవ వంగూరి వార్షికోత్సవం’ అక్కడే అన్నది మా ప్లాన్.
అంతా ఇక్కడి దాకా బాగానే జరిగింది కానీ, ఇక్కడే మా బుజ్జి బావ వల్ల ఓ పొరపాటు జరిగిపోయింది. మా సత్య చీర అదీ పెట్టాక, శారదత్తయ్య వీడ్కోలు ఇచ్చాకా, బుజ్జి బావ “నేను దింపుతా ఎయిర్‌పోర్ట్‌లో” అన్నాడు. తీసుకొచ్చి బయట ‘కర్బ్ చెకిన్’ అన్న చోట నా సూట్‌కేస్ చెకిన్ చేసేసి, క్యాబిన్ లగేజ్‌తో కాలిఫోర్నియా ఫ్లైట్ ఎక్కేయమన్నాడు. తనకి తెలుసు కదా అని నేను బేపూచిగా అలాగే చేసేసి లోపలికెళ్ళాను. లోపల గొల్లపూడిగారూ, ఆంటీ కనిపించారు. వాళ్ళు అప్పుడే లగేజ్ చెకిన్ చేసారు. “నీ సూట్‌కేస్ ఏదమ్మా?” అని ఆయన అడిగారు. నేను “బయటే ‘కర్బ్’ చెకిన్ చేయించేసాడు మా బావ” అని చెప్పాను.
“కర్బ్ లో అన్ని స్టేట్స్‌వీ చేసేస్తారు. స్పెసిఫిక్‌గా మన విమానంలోకి ఎక్కించే చెకిన్ చేయిస్తే బావుండేది” అన్నారు గొల్లపూడిగారు.
నాకు దిగులొచ్చేసింది. మళ్ళీ బయటకి వెళ్ళి అడుగుదామా అంటే, ఈ పాటికే పంపించేసి వుంటారన్నారు. మెక్సికో అతన్ని అడిగితే, ఏదో నాకు అర్థం కాని భాషలో “పంపించాం” అన్నట్లు చెప్పాడు.
సరే, అంతా ఫ్లైట్ ఎక్కాం. కిరణ్ ప్రభ గారినీ, కాంతిగారినీ చూడడం జన్మలో మొదటిసారి నాకు. చాలా ఉత్సాహంగా వున్నాము.
ఫ్లైట్‌లో నేనూ ఆంటీ బోలెడు కబుర్లు చెప్పుకున్నాం. జ్యూస్ కూడ ఇచ్చారు.
మేం దిగాకా, గొల్లపూడి గారి లగేజ్ వచ్చింది, నేను శంకించినట్టే నా లగేజ్ రాలేదు! క్యాబిన్ లగేజ్‌లో రెండు జతల బట్టలున్నాయి, ఒక నైటీతో పాటు, అంతే! అంతా కూడా ఎడ్రస్ రాసిచ్చి, “రేపొచ్చేస్తుందిలే” అనడంతో, దిగులుగానే బయటకొచ్చాను. కిరణ్ ప్రభ గారు రెడీగా వున్నారు.
ఎన్నెన్నో జన్మల నుండీ తెలిసున్నట్లుగా మాట్లాడారు. కారెక్కాం. డుబ్లిన్‌లో వున్న వాళ్ళ కౌముది కుటీరానికొచ్చాం!
నా మనసంతా మాత్రం – నేను బయలుదేరుతుంటే, ఓ పెద్దమనిషి “సూట్‌కేస్ జాగ్రత్త” అనడం, అప్పుడే కీడుగా అనిపించింది నాకు!
నా బాధంతా కాంతికిరణ్ గారికి పెడదామని తెచ్చిన చీర కూడా అందులోనే వుంది, వుట్టి చేతుల్తో వెళ్తున్నానని!
కాంతిగారు గుమ్మంలోనే నిలబడి మా కోసం ఎదురుచూస్తున్నారు. నాకు కొత్త! ఆవిడ గొల్లపూడిగారితో, ఆంటీతో మాట్లాడి నా దగ్గరకొచ్చేదాకా, మొహమాటంగా ఆగాను. ఆవిడ కూడా బెరుకుగానే మాట్లాడారు. లోపలికొచ్చాకా, మంచినీళ్ళిచ్చి, “మీ ‘రేపల్లెలో రాధ’ నవల చదివేదాన్ని, మీ ‘మధుమాసం’ తాలూకు సినిమా ఫంక్షన్స్ ఫొటోస్ అన్నీ నేను ఫాలో అయ్యాను. మీ చీరలు బావుండేవి” అని చెప్పారు. అవే మొదటి మాటలు.
ఇప్పుడు గుర్తు చేసుకుంటే చాలా నవ్వొస్తుంది. ఎందుకంతే ఇప్పుడు దగ్గర స్నేహితులం మేము. నేనూ మల్లాది గారి భార్య పద్మజా, కాంతిగారూ, కువైట్‌లో వుండే లిల్లీ అనే అమ్మాయి అందరం ఓ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని కనెక్టెడ్‌గా వుంటాం. అప్పుడు చాలా కొత్త!
కిరణ్‌ప్రభ గారూ, కాంతిగారూ అద్భుతమైన హోస్ట్‌లు. అతిథులను ఎంతో బాగా చూసుకుంటారు. కిరణ్‌ప్రభ గారికి ఇద్దరు అబ్బాయిలు. జీవన్ సియోటిల్‍లో వుంటాడు. అతని భార్య రీమా జైనుల అమ్మాయి. అప్పటికింకా పిల్లలు లేరు. తర్వాత ఓ పాపా, బాబూ పుట్టారు. రెండో అబ్బాయి సుమన్, ‘వెన్నెల’ సినిమాకి కో-డైరెక్టర్‌గా చేసి, సినిమా ప్రయత్నాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారింట్లో వున్నాడు అప్పట్లో.
మర్నాడు మేం లివర్‌మోర్ గుడికి వెళ్ళే ముందు నా సూట్‌కేస్ వచ్చింది. కానీ అది నాది కాదు! గ్రీన్ కలర్‌లో వుంది. నాది రెడ్ సూట్‌కేస్. చూడగానే “ఇది నాది కాదు” అన్నా. వెంటనే వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. నా మనసంతా చేదు తిన్నట్లు అయింది. అలాగే గుడికి వెళ్ళాం. ‘నా సూట్‌కేస్ రాగానే వచ్చి మూడు డాలర్లు వేస్తా స్వామీ’ అని వెంకటేశ్వరస్వామికి మొక్కుకున్నాను లివర్‌మోర్ గుడిలో.
పూజార్లు గొల్లపూడిగారిని చూసి హంగామాగా పూజలవీ జరిపించారు. ఆ గుడిలో ప్రసాదాలు చాలా బావున్నాయి. నిమ్మకాయలు దబ్బకాయల సైజులో వున్నాయి. ఆ చెట్టుకింద నిలబడి ఫొటోలు తీసుకున్నాం.
(సశేషం)