[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]
చాణక్యః:
(గృహీత్వా) వృషల దృశ్యతా మిదమ్।
అర్థం:
(గృహీత్వా=తీసుకొని), వృషల=వృషలా! ఇదమ్+దృశ్యతామ్=దీనిని చూడు (చూడబడుగాక!)
రాజా:
(ఆత్మగతం వాచయతి.) స్వస్తి, సుగృహీత నామధేయస్య దేవస్య చన్ద్రగుప్తస్య సహోత్థాయినాం ప్రధానపురుషాణా మితో పక్రమ్య మలయకేతు మాశ్రితానాం ప్రమాణ లేఖ్యపత్రమిదమ్. తత్ర ప్రథమ మేవ తావ ద్గజాధ్యక్షో భద్రభటః అశ్వాధ్యక్షః పురుదత్తః మహా ప్రతీహారస్య చన్ద్రభానో ర్భాగినేయో డిఙ్గిరాతః దేవస్య స్వజన సమ్బన్ధీ మహారాజో బలదేవగుప్తః దేవ స్యైవ కుమారసేవకో రాజసేనః సేనాపతేః సింహబలస్య కనీయాన్ భ్రాతా భాగురాయణో మాలవరాజపుత్రో లోహితాక్షః క్షత్త్ర గణముఖ్యో విజయవర్మేతి. ఏతే వయం దేవస్య కార్యే అవహితాః స్మ-ఇతి. (ప్రకాశమ్) ఆర్య, ఏతావ దేతత్ప త్రకమ్. అథై తేషా మపరాగహేతూన్ విజ్ఞాతు మిచ్ఛామి.
అర్థం:
(ఆత్మగతం+వాచయతి=తనలోనే చదువుకొంటున్నాడు) స్వస్తి=శుభం (మేలగుగాక!), సుగృహీత+నామధేయస్య+దేవస్య+చన్ద్రగుప్తస్య=ప్రసిద్ధ వ్యక్తి అయిన చంద్రగుప్త దేవర వారి (యొక్క), సహ+ఉత్థాయినాం+ప్రధానపురుషాణాం= ముఖ్యులైన సమర్థులలో (స్వపక్షీయులలో), ఇతః+అపక్రమ్య+మలయకేతుం+ఆశ్రితానాం=ఇక్కడి నుంచి తొలగిపోయి మలయకేతుణ్ణి ఆశ్రయించుకున్న వారిలో (వారి యొక్క), ప్రమాణ+లేఖ్యపత్రం+ఇదమ్=ప్రతిజ్ఞాపూర్వకంగా రాసినదీ ఉత్తరం – తత్ర+ప్రథమం+ఏవ+ తావత్=వారందిరిలో తొలుతనే పేర్కొనదగ్గ వ్యక్తులు, గజాధ్యక్షో+భద్రభటః=ఏనుగుల సేనానాయకుడు భద్రభటుడు, అశ్వాధ్యక్షః+పురుదత్తః=అశ్వసేనా నాయకుడు పురుషదత్తుడు, మహా+ప్రతీహారస్య+చన్ద్రభానోః+భాగినేయో+డిఙ్గిరాతః=రాజ్యాంగ ప్రతీహారుల నాయకుడు చంద్రభానుడి (యొక్క) మేనల్లుడు డిఙ్గిరాతుడు, దేవస్య+స్వజన+సమ్బన్ధీ=దేవరవారి బంధువర్గానికి చెందిన, మహారాజః+బలదేవగుప్తః=బలదేవగుప్త మహారాజు, దేవస్య+ఏవ+కుమారసేవకః+రాజసేనః=దేవరవారిని చిన్నప్పటి నుండి సేవించుకుంటున్నవాడే రాజసేనుడు, సేనాపతేః+సింహబలస్య+కనీయాన్+భ్రాతా=సింహబలుడనే సేనాపతి కడగొట్టు తమ్ముడు, భాగురాయణో=భాగురాయణుడు, మాలవరాజ+పుత్రః+లోహితాక్షః=మాలవరాజు కుమారుడు లోహితాక్షుడు, క్షత్త్రగణ+ముఖ్యః+విజయవర్మ+ఇతి=రాజబృందంలో ప్రధానుడు విజయవర్మ – అని – ఏతే+ వయం=ఈ మేమందరం, దేవస్య+కార్యే=దేవరవారి కార్యా నిర్వహణలో, అవహితాః+స్మః=అప్రమత్తంగా ఉన్నాం -ఇతి=అని… (ప్రకాశమ్=పైకి) ఆర్య=అయ్యవారూ, ఏతావత్+పత్రకమ్=ఇంతవరకే ఉత్తరం (లో ఉన్నది). అథ=ఇక, ఏతేషాం+అపరాగ+హేతూన్=వీరు (ఇక్కడ నుండి తొలగి) ద్వేషం పూనడానికి గల కారణాలను, విజ్ఞాతుమ్+ఇచ్ఛామి=తెలిసికోగోరుతున్నాను.
చాణక్యః:
వృషల, శ్రూయతామ్, అత్ర యా వేతౌ గజాధ్యక్షాశ్వాధ్యక్షౌ భద్రభట పురుషదత్త నామానౌ కౌ తౌ ఖలు స్త్రీ మద్యమృగయాశీలౌ హస్త్యశ్వావేక్షణేఽనభియుక్తౌ, మయాధికారాభ్యాం అవరోప్య స్వజీవన మాత్రే ణైవ స్థాపితా వితి పరపక్షే స్వేన స్వేనాఽధికారేణ గత్వా మలయకేతు మాశ్రితౌ. యా వేతౌ డిఙ్గరాత బలగుప్తౌ, తావప్యత్యన్తలోభాభిభూతౌ త్వద్దత్తం జీవన, మబహుమన్యమానౌ తత్ర బహు లభ్యత ఇ త్యపక్రమ్య మలయకేతు మాశ్రితౌ. యో ప్యసౌ భవతః కుమారసేవకో రాజసేన ఇతి, సోఽపి తవ ప్రసాదా దతిప్రభూత కోశహస్త్యశ్వం సహ సైవ త న్మహదైశ్వర్య మవాప్య పున రుచ్ఛేద శఙ్కయా ఽపక్రమ్య మలయకేతు మాశ్రితః. యోఽయ మపరః, సేనాపతేః సింహబలస్య కనీయాన్ భ్రాతా భాగురాయణో ఽసా వపి తత్ర కాలే పర్వతకేన సహ సముత్పన్న సౌహార్దః, తత్ప్రీత్యా చ పితా తే చాణక్యేన వ్యాపాదిత ఇ త్యుత్పాద్య రహసి త్రాసయిత్వా మలయకేతు మపవాహితవాన్. తతో భవదపథ్యకారిషు చన్దనదాసాదిషు నిగృహీతేషు, స్వదోషాశఙ్క యాపక్రమ్య మలయకేతు మాశ్రితః. తే నా ప్యసౌ మమ ప్రాణరక్షక ఇతి కృతజ్ఞతా మనువర్తమానే నాత్మనో ఽన న్తరమమాత్యపదం గ్రాహితః. యౌ తౌ లోహితాక్షవిజయవర్మణౌ, తావప్యతి మానిత్వాత్ స్వదాయాదేభ్య స్త్వయా దీయమాన మసహమానౌ మలయకేతు మాశ్రితౌ. ఇ త్యేషా మపరాగ హేతవః.
అర్థం:
వృషలా!, శ్రూయతామ్=విందువుగాక! (వినబడుగాక), అత్ర=ఈ విషయంలో, యౌ+ఏతౌ+గజాధ్యక్ష+అశ్వాధ్యక్షౌ=గజసేనాపతి, అశ్వదళాధిపతి అనే – భద్రభట+పురుషదత్త+నామానౌ=భద్రభట, పురుషదత్తులనే ఇద్దరు పేరింటి వాళ్ళు, తౌ+స్త్రీ+మద్య+మృగయాశీలౌ+ఖలు=జంటగా – స్త్రీ, మద్యం, వేట – అనే వ్యసనాలు గలవారు కదా! హస్తి+అశ్వ+రక్షణే+అనభియుక్తౌ=వారి వారి గజ అశ్వ దళాల రక్షణ విషయంలో అశ్రద్ధ వహిస్తున్నందువల్ల, మయా+అధికారాభ్యాం+అవరోప్య=నా చేత వారి వారి అధికారాల నుంచి దింపివేయబడి, స్వ+జీవన+మాత్రేణ+ఏవ=బ్రతుకు గడుపుకోవడం పాటిగా, స్థాపితౌ+ఇతి=ఉంచబడ్డారని, స్వేన+స్వేన+అధికారేణ+పరపక్షే+గత్వా=శత్రుపక్షానికి తమ తమ ఉద్యోగాల (పదవుల) తోనే వెళ్ళి, మలయకేతుం+ఆశ్రితౌ=మలయకేతువుని ఆశ్రయించారు. యౌ+ఏతౌ+డిఙ్గరాత+బలగుప్తౌ=(ఇక) డిఙ్గరాతుడు బలగుప్తులనే ఇద్దరి సంగతి -, తౌ+అపి=ఆ ఇరువురు కూడా, అత్యన్త+లోభ+అభిభూతౌత్=అలవిమాలిన లోభత్వం కారణంగా, త్వత్+దత్తం+జీవనం+అబహుమన్యమానౌ=మీరు సమకూర్చిన బ్రతుకుతెరువును లక్ష్యపెట్టకుండా, తత్ర+బహు+లభ్యతే+ఇతి=అక్కడ బాగా దొరుకుతుంది అని, అపక్రమ్య=తొలగిపోయి, మలయకేతుమ్+ఆశ్రితౌ=మలయకేతుని ఆశ్రయించారు. యః+అపి+అసౌ+భవతః+కుమారసేవకః+రాజసేనః+ఇతి=ఇక ఈ రాజసేనుడనే మీ బాల్యాది సేవకుడి సంగతి, సః+అపి=వాడు కూడా, తవ+ప్రసాదాత్= నీ అనుగ్రహం వల్ల, అతిప్రభూత+కోశ+హస్తి+అశ్వం=మిక్కిలిగా వున్న ధనాగారాన్ని, ఏనుగులు, గుఱ్ఱాలను, సహస+ఏవ=అనతికాలంలోనే, తత్+మహత్+ఐశ్వర్యం+అవాప్య=అంతటి గొప్ప సంపదను పొంది – పునః+ఉచ్ఛేదన+శఙ్కయా=మళ్ళీ తెగగోయవచ్చుననే అనుమానంతో, అపక్రమ్య=తొలగిపోయి, మలయకేతుం+ఆశ్రితః=మలయకేతువును చేరుకున్నాడు. యః+అయం+అపరః=ఈ మరొక వ్యక్తి, సేనాపతేః+సింహబలస్య+కనీయాన్+భ్రాతా=సేనాధ్యక్షుడు సింహబలుడి చివరి తమ్ముడు, అసౌ+భాగురాయణః+అపి=యీ భాగురాయణుడనేవాడు కూడా, తత్ర+కాలే+పర్వతకేన+సహ=ఆ సమయంలో పర్వతరాజుతో కూడా, సముత్పన్న+సౌహార్దః=ఏర్పడిన ఆత్మీయతను పురస్కరించుకొని, తత్+ప్రీత్యా+చ= ఆ యిష్టంతోనూ, “తే+పితా+చాణక్యేన+వ్యాపాదిత”+ఇతి=”నీ తండ్రి చాణక్యుడి వల్ల చనిపోయాడు” అని, ఉత్పాద్య=(మాట) పుట్టించి, రహసి+త్రాసయిత్వా=రహస్యంగా భయపెట్టి, మలయకేతుం+అపవాహితవాన్=మలయకేతుణ్ణి పారిపోయేట్టు చేశాడు. తతః=అటు పిమ్మట, భవత్+అపథ్యకారిషు+చన్దనదాసాదిషు+నిగృహీతేషు=నీ పట్ల వ్యతిరేకులైన చందనదాసు మొదలైనవారు బంధితులు కాగా, స్వ+దోషా+అశఙ్కయా=తన తప్పిదాలకు భయపడి, అపక్రమ్య=ఇక్కడినుండి తొలగిపోయి, మలయకేతుం+ఆశ్రితః=మలయకేతువుని ఆశ్రయించాడు. తేన+అపి=ఆ (మలయకేతుని చేత) కూడా, “అసౌ+మమ+ప్రాణరక్షక”+ఇతి=”ఇతడు నా ప్రాణాలు కాపాడినవాడు” అని, కృతజ్ఞతాం+అనువర్తమానేన=కృతజ్ఞతను చూపదలచిన వానిచేత, ఆత్మన+అనన్తరం+అమాత్యపదం+గ్రాహితః=తన మంత్రిపదవి (రాక్షసమంత్రి తరువాత అంతటి) – తన సన్నిధిలో ఉండే పదవిని -కట్టబెట్టాడు. యౌ+తౌ+లోహితాక్ష+విజయవర్మణౌ – (ఇక) ఆ లోహితాక్ష, విజయవర్మల జంట సంగతి; తౌ+అపి=వారిద్దరు కూడా, అతి+మానిత్వాత్=మిక్కిలి ఆత్మాభిమానంతో, స్వ+దాయాదేభ్యః+త్వయా+దీయమానం+అసహమానౌ=నీ చేత ఇవ్వబడే (మర్యాద) చాలక సహించని వారై, మలయకేతుం+ఆశ్రితౌ=మలయకేతువుని ఆశ్రయించారు. ఇతి+ఏషాం+అపరాగ+ హేతవః=ఇవే వారి విద్వేష కారణాలు.
రాజా:
ఏవ మేతేషు పరిజ్ఞాతాపరాగ హేతుషు, క్షిప్రమేవ కస్మా న్న ప్రతివిహిత మార్యేణ?
అర్థం:
ఏవం+పరిజ్ఞాత+అపరాగ+హేతుషు+తేషు=ఈ విధంగా వాని ద్వేష కారణాలు తెలిసినప్పటికీ, క్షిప్రం=వెంటనే, ఆర్యేణ=తమ చే, ప్రతివిహితం+కస్మాత్+న (క్రియేత్)=ప్రతిక్రియ ఏల ఆచరించబడలేదు? (తెలిసిగూడా విరుగుడు ఎందుకు చెయ్యలేదు?)
చాణక్యః:
వృషల, న పారితం ప్రతివిధాతుమ్!
అర్థం:
వృషలా, ప్రతివిధాతుమ్=విరుగుడు చేయడానికి, న+పారితం=సాధ్యపడలేదు.
రాజా:
కి మకౌశలా దుత ప్రయోజనాపేక్షయా?
అర్థం:
కిమ్=ఏమి, అకౌశలాత్=నేర్పు చాలకనా? ఉత=లేక, ప్రయోజన+అపేక్షయా=(ఏదైనా) ప్రయోజనం ఆశించా?
చాణక్యః:
కథ మ కౌశలం భవిష్యతి? ప్రయోజనా పేక్షయైవ।
అర్థం:
అకౌశలం+కథం+భవిష్యతి=నేర్పు చాలకపోవడం ఎందుకుంటుంది? ప్రయోజన+ఆపేక్షయా+ఏవ=ప్రయోజనం కోరడం వల్లనే.
రాజా:
ప్రయోజన మిదానీం శ్రోతు మిచ్ఛామి।
అర్థం:
ఇదానీం=ఇప్పుడే, ప్రయోజనం+శ్రోతుం+ఇచ్ఛామి=ప్రయోజనం ఏమిటో వినాలనుకుంటున్నాను.
చాణక్యః:
శ్రూయతాం, అవధార్యతాం చ. ఇహ ఖలు విరక్తానాం ప్రకృతీనాం ద్వివిధం ప్రతివిధానమ్ – అనుగ్రహో నిగ్రహశ్చ అనుగ్రహ స్తావ దాక్షిప్తాధికారయో ర్భద్రభటపురుదత్తయోః పున రధికారారోపణ మేవ. అధికారశ్చ తాదృ తేషు వ్యసన యోగా దనభియుక్తేషు పున రారోప్యమాణః సకల మేవ రాజ్యస్య మూలం హస్త్యశ్వ మవసాదయేత్. డిఙ్గరాత బలగుప్తయో రతిలుబ్ధయోః సకలరాజ్యప్రదానే నా ప్యపరితుష్యతో రనుగ్రహః కథం శక్యః? రాజసేన భాగురాయణయో స్తుధన ప్రణాశ భీతయోః కుతో ఽను గ్రహ స్యావకాశః? లోహితాక్ష. విజయవర్మణో రపి దాయాద మసహమానయో రతిమానినోః కీదృశో ఽనుగ్రహః ప్రీతిం జనయిష్య తీతి పరిహృతః పూర్వః పక్షః. ఉత్తరోఽపి ఖలు వయ మచిరా దధిగతనన్దైశ్వర్యాః సహోత్థాయినం ప్రధానపురుషవర్గ ము గ్రేణ దడ్డేన పీడయన్తో నన్దకులనురక్తానాం ప్రకృతీనా మవిశ్వాస్యా ఏవ భవామ ఇ త్యతః పరిహృత ఏవ. త దేవ మనుగృహీ తాస్మ త్కృత్యపక్షో రాక్షసోపదేశ ప్రవణో మహీయసా మ్లేచ్ఛబలేన పరివృతః పితృవధామర్షీ పర్వతకపుత్రో మలయకేతు రస్మానభియోక్తుముద్యతః. సోఽయంవ్యాయామకాలో, నోత్సవకాల ఇతి, దుర్గ సంస్కారే ప్రారబ్ధవ్యే. కిం కౌముదీ మహోత్సవే, నేతి ప్రతిషిద్ధః।
అర్థం:
శ్రూయతాం=విందువు గాక, అవధార్యతాం+చ=చిత్తగించగలవు కూడా. ఇహ+విరక్తానాం+ప్రకృతీనాం=ఈ పరిస్థితిలో, వ్యతిరేకంగా ఉండే ప్రజల విషయంలో, ప్రతివిధానమ్+ద్వివిధం+ఖలు=ప్రత్రిక్రియ రెండు విధాలుగా ఉంటుంది కదా! అనుగ్రహః+నిగ్రహః+చ=(అవి) దయ చూపడం, నిరోధించడం అనే రెండూనూ. అనుగ్రహః+తావత్=దయ చూపడమంటే, ఆక్షిప్త+అధికారయోః=అధికారం నుండి తొలగించబడిన, భద్రభట+పురుదత్తయోః=భద్రభట, పురుషదత్తలిద్దరికీ, పునః+అధికార+ఆరోపణం+ఏవ=(మళ్ళీ) వారి వారి పదవులకు ఎక్కించడమే. తాదృతేషు+అధికారః+చ=అటువంటివారికి అధికారమంటే – వ్యసనయోగాత్=వారు వ్యసనపరులు కావడం వల్ల, అనభియుక్తేషు=అజ్ఞానులైనందువల్ల, పునః+ఆరోప్యమాణః+సకలం+ఏవ+రాజ్యస్యమూలం=మళ్ళీ పదవికి ఎక్కించడంతో మొత్తం రాజ్యానికే మూలాధారమైన, హస్తి+అశ్వం=గజబలం అశ్వబలం, అవసాదయేత్=క్షీణించిపోగలదు. అతిలుబ్ధయోః+డిఙ్గరాత+బలగుప్తయో=అత్యాశపరులైన డిఙ్గరాత, బలగుప్తులకు, సకలరాజ్య+ప్రదానేన+అపి=మొత్తం రాజ్యం ఇచ్చినప్పటికీ కూడా, అపరితుష్యతః=సంతృప్తి కలగని వారికి, అనుగ్రహః+కథం+శక్యః=దయచూడడమనేది ఎలాగ సాధ్యం? రాజసేన+భాగురాయణయోః+తు=రాజసేన, భాగురాయణులంటే – ధన+ప్రణాశ+భీతయోః=తమ ధనం పోతుందన్న భయంతో ఉన్నందువల్ల, అనుగ్రహస్య+ఆవకాశః+కుతః=దయ చూపించాల్సిన అవసరం ఏమున్నది? లోహితాక్ష+ విజయవర్మణః+అపి=లోహితాక్షుడు, విజయవర్మల విషయానికి వస్తే కూడా, దాయాదం+అసహమానయోః+అతిమానినోః=(నీతో) బంధుత్వపు అసూయతో కూడిన అత్యంత ఆత్మాభిమానులకు, అనుగ్రహః+కీదృశః=అనుగ్రహం చూపడమనేది ఎలాగ, ప్రీతిం+జనయిష్యతి?+ఇతి=సంతోషాన్ని కలిగిస్తుంది? అని, పూర్వఃపక్షః+పరిహృతః=తర్కసమ్మతమైన దానికి నిలువదు.
ఉత్తర+అపి+ఖలు= (నిగ్రహించడం అనే) రెండవ విషయానికి వస్తే కూడా, అచిరాత్+అధిగత+నన్దైశ్వర్యాః+వయం=ఇటీవలనే నందరాజ్య వైభవాన్ని పొందిన మనం, సహ+ఉత్థాయినం+ప్రధానపురుషవర్గం=మనతో పాటు వృద్ధిలోకి రాదలచే, సమర్థక వ్యక్తులను, ఉగ్రేణ+దడ్డేన+పీడయన్తః=కఠినంగా దండించడం ద్వారా, నన్దకుల+అనురక్తానాం=(ఇంకా) నందవంశం పట్ల ప్రేమగల, ప్రకృతీనాం=ప్రజలకు, అవిశ్వాస్యాః+ఏవ+భవామః=నమ్మకం పోగొట్టినవాళ్ళం అవుతాం. ఇతి+అతః+పరిహృతః= అనే కారణం చేత (ఆ ఆలోచన) విడిచిపెట్టడమైనది.
తత్+ఏవం+అనుగృహీత+అస్మత్+కృత్యపక్షః=అందువల్ల ఈ విధంగా మన పక్షంలోని వ్యతిరేకులను దగ్గరకు తీసి – రాక్షస+ఉపదేశ+ప్రవణః=రాక్షసమంత్రి ఉపదేశం పట్ల ఆదరణ కలవాడై – పితృవధ+అమర్షీ+పర్వతకపుత్రః+ మలయకేతు=తన తండ్రి మరణం పట్ల ఈసు వహించి ఉన్న పర్వతక పుత్రుడు మలయకేతువు, మహీయసా+మ్లేచ్ఛబలేన=గొప్పదైన మ్లేచ్ఛసైన్యంతో, పరివృతః=చుట్టుకొన్నవాడై, అస్మాన్+అభియోక్తుం+ఉద్యతః=మనలను ఎదిరించే తలంపుతో సిద్ధంగా ఉన్నాడు (ఉద్యమించి సిద్ధంగా ఉన్నాడు).
సః+అయం+వ్యాయామకాలః=అట్టి యీ సమయంలో బలం పెంచుకోవలసిన కాలం, న+ఉత్సవకాల+ఇతి=వేడుకలకు కాలం కాదు – అని, దుర్గసంస్కారే+ ప్రారబ్ధవ్యే=దుర్గ రక్షణకు ప్రయత్నాలు ప్రారంభించవలసి ఉండగా, కిం+కౌముదీమహోత్సవేన+ఇతి=కౌముదీమహోత్సవేమిటి – అని, ప్రతిషిద్ధః=నిషేధించడమైనది.
రాజా:
ఆర్య, బహు ప్రష్టవ్య మత్ర
అర్థం:
ఆర్య=అయ్యా, అత్ర=ఇక్కడ, బహు+ప్రష్టవ్యం=చాలా అడగవలసి ఉంది.
చాణక్యః:
వృషల, విస్రబ్ధం పృచ్ఛ. మమాపి బహ్వాఖ్యేయ మత్ర.
అర్థం:
వృషలా, విస్రబ్ధం+పృచ్ఛ=సందేహించకుండా అడుగు. అత్ర=ఇక్కడ, మమ+అపి=నాకు కూడా, బహు+ఆఖ్యేయం=చాలా చెప్పవలసి ఉంది.
రాజా:
సోఽప్యస్య సర్వ స్యానర్థస్య హేతు ర్మలయ కేతుః, కస్మా దపగ్రామన్ను పేక్షితః?
అర్థం:
అస్య+సర్వస్య+అనర్థహేతుః+సః+అపి+మలయకేతుః=ఈ అనర్థాలన్నింటికీ కారణమైన ఆ మలయకేతువు కూడా, అపక్రామన్=తప్పించుకుపోతుంటే, కస్మాత్+ఉపేక్షితః=ఏ కారణం చేత ఉపేక్ష (ఉదాసీనత) వహించారు? (ఉపేక్షించబడ్డాడు?)
చాణక్యః:
అనుపేక్షణే ద్వయీ గతి, నిగృహ్యేతవా ప్రతిశ్రుతం రాజ్యార్ధం ప్రతిపాద్యేత వా. నిగ్రహే తావత్, పర్వతకోఽస్మాభిరేవ వ్యాపాదిత ఇతి కృతఘ్న తాయాః స్వహస్తో దత్తః స్యాత్ , ప్రతి శ్రుత రాజ్యార్ధ ప్రతిపాదనేఽపి పర్వతక వినాశం కేవలం కృతఘ్నతామాత్రఫలః స్యా దితి, మలయకేతు రపక్రామ న్ను పేక్షితః।
అర్థం:
అనుపేక్షణే=ఉపేక్ష చేయకపోవడంలో, ద్వయీ+గతిః=రెండు పద్ధతులు, నిగృహ్యేతవా=నిగ్రహించడం (అడ్డుకోవడం, బంధించడం) లేదా, ప్రతిశ్రుతం=మాట ఇచ్చిన ప్రకారం, రాజ్యార్ధం=సగం రాజ్యం, ప్రతిపాద్యేత+వా=ఇచ్చివేయడమూనూ – నిగ్రహే+తావత్=బంధిచడమే సంభవిస్తే, పర్వతకః=పర్వతకరాజు, అస్మాభిః+ఏవ+వ్యాపాదిత+ఇతి=మన చేతిలోనే చనిపోయాడని (చంపబడ్డాడని), కృతఘ్నతాయాః=కృతజ్ఞతకి సంబంధించి, స్వః+హస్తః+దత్తః+స్యాత్=మనంతట మనమే (అంగీకరించి) దోహదం చేసినట్టు అవుతుంది (చేయూత ఇచ్చినట్టు అవుతుంది), ప్రతిశ్రుత+రాజ్యార్ధ+ప్రతిపాదనే+అపి=వాగ్దానం చేసిన ప్రకారం రాజ్యం ఇవ్వడం విషయంలో కూడా, పర్వతక+వినాశః=పర్వతక రాజు మరణం, కేవలం+కృతఘ్నతామాత్రఫలః+స్యాత్+ఇతి=కేవలమూ కృతఘ్నతకు మాత్రమే ఫలం అవుతుందని, మలయకేతుః+అపక్రామన్+ఉపేక్షితః=మలయకేతువు తప్పించుకుపోతుండగా ఉపేక్షించడం అయింది.
రాజా:
అత్ర తావ దేవమ్। రాక్షసః పున రి హైవ వర్తమాన ఆర్యేణో పేక్షిత ఇత్యత్ర కి ముత్తర మార్యస్య?
అర్థం:
అత్ర+తావత్+ఏవమ్=ఈ సంగతి ఇలా కావడం సరే; రాక్షసః+పునః=రాక్షసుడైతే, ఇహ+ఏవ+వర్తమానః=ఇక్కడే (నగరంలో ఉంటుండగా), ఆర్యేణ+ఉపేక్షితః=తమరి చేత పట్టించుకోబడలేదు (తమరు అతడిని ఉపేక్షించారు), ఇతి+అత్ర=అనే విషయమై, ఆర్యస్య+ఉత్తరం+కిమ్=మీ సంజాయిషీ ఏమిటి?
చాణక్యః:
రాక్షసోఽపి స్వామిని స్థిరాను రాగిత్వాత్ సుచిర మేక త్రవాసా చ్చ శీలజ్ఞానాం నన్దానురక్తానాం ప్రకృతీనా మత్యన్త విశ్వాస్యః ప్రజ్ఞా పురుషకారాభ్యా ముపేతః సహాయసంప దాభియుక్తః కోశవా నిహై వాన్తర్నగరే వర్తమానః ఖలు మహాన్త మన్త కోప ముత్పాదయేత్, దూరీకృత స్తు బాహ్యకోప ముత్పాదయ న్నపి కథ మ ప్యుపాయై ర్వశయితుం శక్య ఇ త్యయ మత్రస్థ ఏవ హృదయేశయః శఙ్కురి వోద్ధృత్య దూరీకృతః।
అర్థం:
రాక్షస+అపి=రాక్షసుడైతే, స్వామిని+స్థిర+అనురాగిత్వాత్=తన ప్రభువు పట్ల (నందరాజు పట్ల) ఉంచుకున్న ప్రేమ కారణంగా, సుచిరం+ఏకత్ర+వాసాత్+చ=చాలాకాలంగా ఒకే చోట నిలిచి ఉండడం చేత కూడా, శీలజ్ఞానాం+నన్దానురక్తానాం=అతడి వ్యక్తిత్వాన్నెరిగిన ఇతర నందరాజు అభిమానులైన, ప్రకృతీనాం=ప్రజలకు, అత్యన్త+విశ్వాస్యః=మిక్కిలి నమ్మదగినవాడు, ప్రజ్ఞా+పురుషకారాభ్యాం+ఉపేతః=ప్రతిభ, మానుష ప్రయత్నంతో కూడినవాడు, సహాయ+సంపద+అభియుక్తః=సహాయ సంపత్తి గలవాడు, కోశవాన్=ధన సమృద్ధి గలవాడు, ఇహ+ఏవ+అన్తర్నగరే=ఇక్కడే ఈ నగరంలో, వర్తమానః+ఖలు=ఉండేటట్టయితే, మహాన్తః+అన్తఃకోపం=లోలోపల (ప్రజలలో) గొప్ప కోపాన్ని(తిరుగుబాటును), ఉత్పాదయేత్=పుట్టించగలడనీ – దూరీకృతః+తు=దూరంగా ఉంచినట్లయితే, బాహ్య+కోపం+ఉత్పాదయన్+అపి=బయటి నుంచి తిరుగుబాటు పుట్టించినప్పటికీ, కథం+అపి+ఉపాయైః=ఏవో ఉపయాల ద్వారా ఎలాగో ఒకలాగున, వశయితుం+శక్య+ఇతి=లొంగదీయడానికి కుదురుతాడని, అయం=ఈ (రాక్షసుడు), అత్రస్థః+ఏవం=ఈ నగరంలోనే ఉండిపోయినవాడిని, హృదయేశయః+శఙ్కుః+ఇవ+ఉద్ధృత్య=గుండెలో మేకు వంటివాడిని, దూరీకృతః=దూరంగా పెట్టడమైనది.
రాజా:
ఆర్య, కస్మా ద్విక్రమ్య న గృహీతః?
అర్థం:
ఆర్య=అయ్యా, విక్రమ్య=పరాక్రమం చూపించి, కస్మాత్+న+గృహీతః=ఎందుకు బంధించలేదు?
చాణక్యః:
రాక్షసః ఖల్వసౌ; విక్రమ్య గృహ్యమాణో యుష్మద్బలాని బహూని నాశయేత్। స్వయం వా వినశ్యేత్। ఏవం స త్యుభయధాపి దోషః, పశ్య…
అర్థం:
అసౌ+రాక్షసః+ఖలు=ఇతడెవరనుకున్నావు, రాక్షసుడు! విక్రమ్య+గృహ్యమాణః=పరాక్రమించి బంధించే సందర్భంలో, యుష్మత్+బలాని+బహూని=నీ చాలా సైనిక బలగాలను, నాశయేత్=అంతం చేస్తాడు. వా=లేదంటే, స్వయం+వినశ్యేత్=తానే అంతమైపోతాడు. ఏవం+సతి=ఇలాగే జరిగితే, ఉభయధ+అపి=రెండు విధాల, దోషః=తప్పే కాగలదు, పశ్య= చూడు….
శ్లోకం:
స హి భృశ మభియుక్తో యద్యుపేయా ద్వినాశం,
నను వృషల వియుక్త స్తాదృశే నాపి పుంసా;
అథ తవ బలముఖ్యాన్ ఘాతయేత్; సాపి పీడా;
వనగజ ఇవ తస్మాత్ సో ఽభ్యుపాయై ర్వినేయః (25)
అర్థం:
సః (రాక్షస)=ఆ రాక్షసుడు, హి=ప్రసిద్ధుడే! అభియుక్తః=ఎదిరింపబడితే, యది+వినాశం+ఉపేయాత్=అంతమైనట్టయితే,- (హే)వృషల= ఓ వృషలా! తాదృశ్యేన+పుంసా=అంతటి వ్యక్తి చేత, వియుక్తః+అసి+నను=విడిచిపుచ్చబడినావు కదా (అతడు నిన్ను విడిచిపెట్టాడని తెలుసు కదా!); అథ=ఇంకా చెప్పాలంటే, తవ+బలముఖ్యాన్+ఘాతయేత్=నీ సైన్యంలో ప్రధానుల్ని చంపివేయవచ్చు. సా+అపి+పీడా=అదిన్నీ బాధాకరమే, తస్మాత్ (కారణాత్)=అందువల్ల – నః+వనగజ+ఇవ=అతడు అడవి ఏనుగు మాదిరి, అభ్యుపాయై+వినేయః=తగు ఎత్తులతో వశపరుచుకోదగిన వ్యక్తి.
వృత్తం:
మాలిని. న – న – మ – య – య గణాలు.
అలంకారం:
ఉపమ. వనగజం మాదిరి ఉపాయంగా లొంగదీయదగినవాడు – అని పోలిక చెప్పడం గమనించదగినది.
వ్యాఖ్య:
రాక్షసుడు సామాన్యుడు కాడు. ఏమైనా చేయగలడు. నిన్ను ఉపేక్ష చేశాడు. తలచుకుంటే నీ సేనా నాయకుల్ని అంతం చెయ్యగలడు కూడా. నగరంలో ఉండనిస్తే తనకున్న పలుకుబడితో తిరుగుబాటును లోలోపల లేవదీస్తాడు. బయటి నుంచి చేస్తే దాని సంగతి చూడవచ్చు. అడవి యేనుగును లొంగదీసినట్టు జాగరూకతతో అతడితో వ్యవహరించాలి – అని చాణక్యుడు తన వాదం చంద్రగుప్తుడికి వినిపించాడు.
రాజా:
న శక్ను మో వయ మార్యస్య మతి మతిశయితుమ్। సర్వథా అమాత్య రాక్షస ఏ వాత్ర ప్రశస్యతరః।
అర్థం:
ఆర్యస్య=అయ్యవారి (రాక్షసుడి), మతిం+అతిశయితుమ్=బుద్ధిబలాన్ని మించగలగడం విషయంలో, న+శక్నుమః+వయం=మనం సమర్థులం కాము. సర్వథా=అన్నింటా, అమాత్య+రాక్షసః+ఏవ=రాక్షసమంత్రే, ప్రశస్యతరః=అధికంగా ప్రశంసించదగినవాడు.
చాణక్యః:
(సక్రోధమ్) న భవా నితి వాక్య శేషః। భో వృషల, తేన కిం కృతమ్?
అర్థం:
(స+క్రోధమ్=కోపంతో) న+భవాన్+ఇతి+వాక్యశేషః=”నీవు కాదు” అని (నీ) మిగిలిన వాక్యం (అంతేకదా!). భోః+వృషల=అయ్యా వృషలా, తేన+కిం+కృతమ్=అతడి వల్ల ఏమి జరిగిందో! (అతడి చేత ఏమి చేయబడింది?)
రాజా:
శ్రూయతామ్ యేన ఖలు మహాత్మనా…
అర్థం:
శ్రూయతామ్=వినబడుగాక!, యేన+మహాత్మనా+ఖలు=అట్టి మహాత్ముడి వల్లనే కదా…
శ్లోకం:
లబ్ధాయాం పురి యావదిచ్ఛ ముషితం
కృత్వా పదం నో గళే,
వ్యాఘాతో జయఘోషణాదిషు బలా
దస్మద్బలానాం కృతః
అత్యర్థం విపులైః స్వనీతివిభవైః
సమ్మోహ మాపాది తా
విశ్వా స్వే ష్వపి విశ్వసన్తి మతయో
న స్వేషు వర్గేషు నః (26)
అర్థం:
పురి+లబ్ధాయాం+నః+గళే=నగరాన్ని వశపరుచుకున్న మన మెడ మీద (లో), పదం+కృత్వా=అడుగు వేసి (మెడ తొక్కి పట్టి), యావదిచ్ఛం+ఉషితం=తన ఇష్టం వచ్చినట్టున్నాడు (ఉండడం అతడి వల్ల అయింది). అస్మత్+బలానాం+జయ+ఘోషణ+ఆదిషు=మన సైన్యాలు మన విజయాన్ని ప్రకటించవలసిన సందర్భం, మొదలైన విషయాల్లో, బలాత్+వ్యాఘాతః+కృతః=బలంగా ఆటంకపరచడం జరిగింది (అతడు అడ్డగించగలిగాడు), అత్యర్థం+విపులైః+స్వనీతి+విభవైః =ఎంతో నేర్పుతో మనకు అంతు చిక్కని విధంగా, తన వ్యూహ వైభవాలతో; సమ్మోహం+ఆపాదితాః=మనం మత్తులో పడిన వాళ్ళమయ్యాం. నః+మతయః=ఇక మన (నీతి) నైపుణ్యాల సంగతికి వస్తే – విశ్వాస్వేషు+అపి=నమ్మదగిన వాళ్ళ విషయంలో కూడా, స్వేషు+వర్గేషు=మనవారి యందు, న+విశ్వసన్తి=నమ్మని పరిస్థితి దాపురించింది (మన వ్యూహాలు మన వారినే నమ్మలేదు).
వృత్తం:
శార్దూల విక్రీడితం. మ-స-జ-స-త-త-గ గణాలు.
అలంకారం:
సముచ్చయాలంకారం. (బహూనాం యుగపద్భావభాజాం గుమ్భః సముచ్చయం – అని కువలాయనందం). ఒకే సమయంలో అనేకమైన విశేషాలు జరగడం కారణం. రాక్షసమంత్రి సాధించిన పనుల క్రమం ఏకత్ర సంపుటీకరించడం గమనించదగినది.
చాణక్యః:
(విహస్య) ఏతత్ కృతం రాక్షసేన! వృషల, మయా పునర్ జ్ఞాతం నన్ద మివ భవన్త ముద్ధృత్య, భవా నివ భూతలే మలయ కేతూ రాజాధిరాజపదే నియోజిత ఇతి.
అర్థం:
(విహస్య=నవ్వి), రాక్షసేన+ఏతత్+కృతం=ఇదంతా రాక్షసుడి వల్ల జరిగిందంటావా?!, వృషల=వృషలా, నన్దం+ఇవ=నందుడి మాదిరిగానే, భవన్తం+ఉద్ధృత్య=నిన్ను ఊడబెరికి, భూతలే=ఈ భూమి మీద, భవాన్+ఇవ=నిన్ను లాగే, మలయకేతుః=మలయకేతువు, రాజాధిరాజ+పదే=చక్రవర్తి పదవిలో, నియోజిత=నియమింపబడ్డాడు, ఇతి =అని, మయా+పునర్+జ్ఞాతం=నేనైతే ఎరిగి వున్న సంగతి (రాక్షసమంత్రి చేసిన పని – అది-).
రాజా:
అన్యే నై వేద మనుష్ఠితమ్; కి మత్రార్యస్య?
అర్థం:
ఇదం+అన్యేన+ఏవ+అనుష్ఠితమ్=ఇది ఇంకొకరి వల్లే జరిగింది; కిం+అత్ర+ఆర్యస్య=అది అయ్యవారికెందుకు?
చాణక్యః:
హే మత్సరిన్।
అర్థం:
హే+మత్సరిన్=ఓ అసూయాగ్రస్తుడా!…
శ్లోకం:
ఆరు హ్యారూఢ కోప స్ఫురణ విషమి తా
గ్రా ఙ్గుళీ ముక్త చూడాం
లోక ప్రత్యక్ష ముగ్రాం సకలరిపుకులో
త్సాదధీర్ఘాం ప్రతిజ్ఞామ్.
కే నాన్యే నావలిప్తా నవనవతిశత
ద్రవ్యకోటీశ్వరా స్తే
నన్దాః, పర్యాయభూతాః పశవ ఇవ, హతాః
పశ్యతో రాక్షసస్య? (27)
అర్థం:
ఆరూఢ+కోపస్ఫురణ+విషమిత+అఙ్గుళీముక్త+చూడాం=పోటెత్తిన కోపం కారణంగా, తడబడే వ్రేళ్ళతో విప్పబడిన జుట్టు ముడి కలదీ, సకల+రిపుకుల+ఉచ్ఛేద+ధీర్ఘాం=సర్వశత్రు వంశాన్ని నిర్మూలించజాలినంత పొడవయినదీ అయిన, ఉగ్రాం+ప్రతిజ్ఞామ్=కఠోరమైన ప్రతిజ్ఞను,
లోక+ప్రత్యక్షం+ఆరుహ్యా=లోకులందరి ఎదుటా (బరి మీదకి) ఎక్కి,
కేన+అన్యేన=మరొకడి ఎవడి (చేత)వల్ల, అవలిప్తాః+తే+నవనవతిశతద్రవ్యకోటీశ్వరాః=గర్వపోతులూ, తొంభై తొమ్మిది వందల కోట్ల ధనవంతులైన, నన్దాః=నందవంశీయులు, పశవ+ఇవ+పర్యాయభూతాః=పశువుల మాదిరి ఒకరి వెంట ఒకరుగా -రాక్షసస్య+పశ్యతః=రాక్షసమంత్రి చూస్తుండగా, హతాః=చంపబడ్డారు?
(ఈ పని నేను తప్ప ఎవరు చేశారు? అని చంద్రగుప్తుడి ఎదుట చాణక్యుడి ఎత్తిపొడుపు).
అలంకారం:
ఉపమ (పశవః ఇవ నన్దా హతాః – అని పోలిక గమనించదగినది).
వృత్తం:
స్రగ్ధర – మ – ర – భ – న – య – య – య – గణాలు.
(సశేషం)