ఎండమావులు-7

0
3

[box type=’note’ fontsize=’16’] గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘ఎండమావులు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 7వ భాగం. [/box]

16

మానవ జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ఆ బలహీనత ముందు ఒక్కొక్క పర్యాయం మనం తలవొంచవల్సిందే. ‘తన బలహీనత ఎవరి మాట కాదనలేక పోవడం. ఈ పని నా వల్ల కాదు అని చెప్పడం’ అని అనుకుంటాడు సారధి.

ఒక్కొక్క సారి సుమిత్రను చూస్తుంటే జాలి కలుగుతుంది.

బాధ కూడా వేస్తుంది ఏ ఆడదీ చేయని త్యాగం చేసింది అని తను అనుకుంటాడు. తనకి ఏక్కడ పిల్లలు పుడ్తే సుధాకర్‌ని సరిగా చూసుకోలేనేమో అనుకున్న పిచ్చి సుమిత్ర తనకి పిల్లలు పుట్టకుండా ఆపరేషను చేయించుకుంది. ఆ తరువాత సుధాకర్ ప్రవర్తన చూసి ఒక్కడినే నమ్ముకునే కన్న సుమిత్రకి కూడా పిల్లలుంటే ఎంత బాగుండును? ఒకళ్ళు కాకపోతే మరొక్కళ్ళేనా తమకి చేదోడు వాదోడుగా నిలిచేవారు కదా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది.

ఈ ఒక్క విషయం ఏంటి? అన్ని విషయాల్లో ఆమెకి ఎదురు దెబ్బలే. ఈ ఇంటికి వచ్చిన తరువాత సుమిత్ర ఏఁ సుఖపడింది? చాకిరీ చాకిరీ చాకిరీ. మోహమాటానికిపోయి లేనిపోని బాధ్యతలు నెత్తిమద వేసుకుని సుమిత్ర జీవితం యాంత్రిక జీవితంగా మార్చేసేడు తను.

“అన్నయ్యా! నీవు ఉపాధ్యాయుడివి. నా కొడుకుని నీ దగ్గర ఉంచి చదివిస్తే వాడికి మంచి భవిష్యత్తు ఉందనుకుంటున్నాను” తమ్ముడు అన్నాడు.

“సారధి! నా పెద్ద కొడుక్కి నా దగ్గర భయం లేదు. నీ దగ్గర వాడికి భయం భక్తి రెండు ఉన్నాయి. వాడ్ని నీ దగ్గర చదువుకి ఉంచితే వాడు ఓ దార్లో పడ్తాడు” అన్నయ్య అన్నాడు.

వాళ్ళ కోరికల్ని తను కాదనలేకపోయాడు. అవి తన బలహీనత అవచ్చు మరేదేనా అనుకోవచ్చు. తన బలహీనతల ఫలితం సుమిత్ర మీద పడింది. ఆమె ఆర్థికంగానే కాకుండా మానసికంగా శారీరకంగా కూడా ఆ తరువాత తరువాత బాధపడింది. తనకి మాత్రం ఎదురు చెప్పలేదు.

అన్నకొడుకు, తమ్ముడు కొడుకుతో పాటు తన కొడుకు బాధ్యత కూడా తన మీద పడింది. ఓ పర్యాయం జరిగిన సంఘటన అతనికి గుర్తుకొచ్చింది. ఓ మారు తను సుమిత్రా బంధువులింటి పెళ్ళికి వెళ్ళారు తన మరదలు కూడా వచ్చింది. పెళ్ళికొచ్చిన ఆడ వాళ్ళందరూ ఒక చోట చేరారు.

నలుగురు ఆడవాళ్ళు ఒక చోట చేరారంటే నగల గురించి, చీరలు, ఆధునిక సామగ్రి గురించి ముచ్చటించుకుంటారు.

సారధి సుమిత్రా పిల్లల్ని ఇంటి దగ్గర వదిలి ఇద్దరే వచ్చారు.

“అక్కయ్యా! నరేశ్‌ని కూడా పెళ్ళికి తీసుకురావల్సింది. పాపం చిన్న వెదవ? ఎలా ఉన్నాడో ఏంటో? బాగా చిక్కిపోయాడు” మరిది భార్య అన్న మాటలకి సుమిత్ర మనస్సు చివుక్కుమంది. తను నరేశ్ సంరక్షణ సరిగా చేయడం లేదు, తిండి కూడా సరిగా పెట్టటం లేదు అన్న భావం తోడికోడలు మాటల్లో సుమిత్రకి స్ఫురించింది. అయితే ఆ భావం పైకి కనబడనీయకుండా “అబ్బే! మళ్ళీ వెంటనే వెళ్ళిపోతామని పిల్లల్ని తీసుకురాలేదు” అంది నవ్వుతూ. అయినా “నీ పిల్లడిని నా పిల్లడనుకో, వాడి గురించి ఏఁ దిగులుపడకు” తిరిగి అంది.

సుమిత్ర మాటలు తోడి కోడలికి చురుక్కు మనిపించాయి. ముఖం ముడుచుకుని విసురుగా అచటినుండి కదిలిపోయింది. పెళ్ళిపందిర్ల అందరి ఆడవాళ్ళల్లో కలవకుండా సుమిత్ర దూరంగా కూర్చున్న సారధి ప్రక్కకి వెళ్ళి కూర్చుంది. ఎందుకంటే అందరి ఆడవాళ్ళలాగే తనకి తగినన్ని బంగారు నగలు లేవు. ఖరీదైన పట్టుచీర కట్టుకుని రాలేదు. తమ దగ్గర ఆధునిక విలువైన సామగ్రి కూడా అంత కన్నా లేదు. అలాంటప్పుడ తను ఏ విషయం గురించి చర్చింగలదు ఆ ఆడవాళ్ళ గుంపులో.

భోజనాల సమయంలో ఓ ముసలావిడ తన తోడికోడల్తో “అవునే అమ్మాయ్! నీ కొడుకుని మీ బావ గారి దగ్గర ఉంచి చదివిస్తున్నారుట కదా!” అని అడిగింది.

“ఆఁ…! చదివిస్తున్నాం. ఆయన నా మాటవింటే కదా, మన పిల్లల్ని మన దగ్గరే ఉంచి చదివించుకుంటే మంచిది అని నేను అంటూ ఉంటాను. అయినా ఆయన నా మాట వింటే కదా! అందుకే ఇన్ని పాట్లు”

ఆ మాటలు విని సుమిత్ర తృళ్ళిపడింది. వారి సంభాషణ ఆమె చెవుల్లో పడుతోంది.

“అదేఁటే అలా అంటావు?” ఆ ముసలావిడ సాగదీసింది.

“ఏఁ చెప్పమంటావు పిన్నీ! మా బావగారి దగ్గర మా వాడ్ని చదివిస్తు నెలనెలా చాలా డబ్బే పంపిస్తూ ఉంటారు మీ అల్లుడు. అయినా వాడికి సరియైన తిండి పెట్టరట. పాపం వెర్రినాగన్న మొన్న సెలవులకి వచ్చినప్పుడు నా చేత అన్నీ చేయించుకుని తిన్నాడు. మా తోడికోడలు ఉంది చూశావూ వాళ్ళ కొడుక్కి పెరుగు వేస్తుందిట. మావాడికి మజ్జిగా వేస్తుందట”.

“అయ్యో పాపం? అంత స్వార్థమేంటే ఆ సుమిత్రకి” ముసలావిడ సానుభూతి మాటలు.

వాళ్ళ మాటలు సుమిత్రకి చాలా బాధకలిగించాయి. ఆమెలో ఉద్వేగం, ఆవేశం, ఆందోళన. ఆమె కళ్ళల్లో కన్నీరు పై కుబుకుతోంది అక్కడ ఉండ బుద్ధివేయక బయటకు నడిచింది. ఆత్మవిమర్శ చేసుకుంటోంది. తను నిజంగా అలా తప్పుగా నడుచుకుందా? అందర్నీ తను ఒక్కలాగే చూసుకుంది. నిజం చెప్పాలంటే బావగారి కొడుకుని, మరిది కొడుకుని తన కొడుకు సుధాకర్ కంటే బాగా చూసుకుంది. అలాంటప్పుడు తనకేంటి ఈ నిందలు ఇలా ఆలోచిస్తోంది సుమిత్ర.

పెళ్ళిపందిర్లో కూడా రాజకీయ పార్టీల్లా వర్గాలే. బంగారు నగలు కట్టలు కట్టలు దిగేసుకున్న వాళ్ళది అదే సంపన్నులది ఓ వర్గం. ఆ మాత్రం కొద్దీ గొప్పో నగలు ఉన్న వాళ్ళది మరోవర్గం. కొద్దిపాటి నగల్తో సరిపెట్టుకున్న వాళ్ళది మూడోవర్గం. మొదటి వర్గానికి రెండో వర్గం పై చిన్న చూపు అయితే రెండో వర్గానికి మూడో వర్గం వారిపై చిన్నచూపు చూపిస్తారు. అందుకే సుమిత్ర నాలుగో వర్గానికి చెందినది అయితే ఆమె బయటకు నడిచినా ఎవ్వరూ పట్టించుకోలేదు.

పెళ్ళిపందిరి ఎదురుగా మామిడి చెట్టు ఉంటే అక్కడున్న ఒక బండరాయి మీద కూర్చుని శూన్యంలోకి చూస్తోంది సుమిత్ర. ఆమె మనస్తాపానికి గురయింది. కళ్ళల్లో కన్నీళ్ళు చిప్పిల్లాడుతోంది. దాన్ని బట్టి ఆమె మనస్సు ఎంత కలత బారిందో తెలుస్తోంది.

“సుమిత్రా!” సారధి పిలిచాడు. చాలా సేపటి నుండి పెళ్ళి పందిర్లో జరుగుతున్న సంఘటనలు, సంగతులూ – సుమిత్ర – వాలకం అతను గమనిస్తూనే ఉన్నాడు. ఆమె అసలే సున్నితమనస్కురాలు. ప్రతీ చిన్న సంఘటనకి స్పందిస్తుంది. కలత చెందుతుంది. తను ఎన్నో సార్లు బోధపరిచాడు. నేటి సమాజంలో ఇలాంటి సంఘటనలు సున్నిత మనస్సు ఉన్నవాళ్ళకి ఎదురుదెబ్బ మనం కూడా పరిస్థితులు, పరిసరాలు ననుసరించి మారాలి. ‘అయితే పుట్టుకతో వచ్చిన గుణం అంత తొందరగా మారదుకదా!’ అని అనుకంటాడు సారధి తిరిగి.

“సుమిత్రా! ఒక్క విషయం. అందరూ అన్న మాటలు నిన్ను ఎంత మనస్తాపానికి గురి చేశాయో నేను ఊహించగలను. అయితే ఒక్క విషయం తెలుసుకో, ఈ నిష్ఠూరాలు, అపనిందలూ అన్నీ తాత్కాలికమే, ఓర్పు-సహనం మనిషికి విలువైన సంపద అవి మనలో పుష్కలంగా ఉన్నప్పుడు మనం ఎటువంటి కష్టాన్ని అయినా, నిష్ఠూరాన్ని అయినా ఇట్టే ఎదుర్కోగలం. ఎవరో ఏదో అన్నారని బాధపడేకన్నా మన సాక్షిగా మనలో ఏఁ తప్పులేదు అని సరిపెట్టుకోవాలి.”

సారధి మాటలు సుమిత్రకి స్వాంతన చేకూరుస్తున్నాయి. అంతవరకూ హృదయంలో గూడు కట్టుకున్న ఆవేదన దూదిపింజలా ఎగిరిపోయింది. ఆమె మనస్సు తేలికపడింది. కన్నీటిని, చేతి రుమాలో తుడుచుకుని భర్త వెంట పెళ్లిపందిరి వేపు అడుగు వేసింది.

17

రైలు ముందుకు దూసుకుపోతుంటే సారధి ఆలోచన్లకి బ్రేకు పడింది. ఆలోచన్లకి స్వస్తి చెప్పి ఓ మారు సుమిత్ర వేపు చూశాడు. ఆమె తననే గమనిస్తోందని అతనికి తెలియదు చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ‘మీకు ఇప్పుడు కూడా ఆలోచన లేనా’ అన్నభావం స్పురించింది.

టి.టి. టికెట్ చెక్ చేయడానికి వచ్చాడు తమ టిక్కెట్లు చూపిస్తున్నాడు అతను. టి.టి. సారధిని గుర్తుపట్టాడు “మాష్టారూ! నమస్కారం బాగున్నారా?” అని అడిగాడు.

“ఎవరు?” సారధి ప్రశ్నవేశాడు.

“నేను మాష్టారు! మీ అబ్బాయి, నేనూ చదువుకున్నాం. మీరు నాకు బాగా తెలుసు. మీ ఇల్లు ఉంటున్న వీధిలోనే మేము ఉండే వాళ్ళమి. నా పేరు సూర్యం” అని అన్నాడు.

“అలాగా! మంచిది బాబూ! క్షేమమే కదా!”

“ఆఁ!!!!”

“మరోలా అనుకోవద్దు మీ అబ్బాయి ప్రవర్తన ఆ సమయంలో మీ యడల నెగిటివ్‌గా ఉండేది. ఇప్పుడు మారాడా? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?”

చెప్పాడు సారధి.

“మా అబ్బాయి దగ్గరికే వెళ్తున్నాం” తిరిగి అన్నాడు.

ఉపాధ్యాయ వృత్తి మిగతా వృత్తులు కన్నా ఎంత ఉత్తమమయినది? ఉపాధ్యాయడుకి దేశ నలుమూలలా శిష్యులుంటారు. ఏదో సందర్భంలో తారసడి ఇలా పలకరిస్తారు. అయితే ఉపాధ్యాడ్ని శిష్యులు గుర్తించిన్నంత తేలికగా శిష్యుల్ని ఉపాధ్యాయుడు గుర్తించలేడు. దానికి కారణం శిష్యుల శరీరాకృతిలో వచ్చిన మార్పులవచ్చు.

“మీ అబ్బాయి మారాడా?” అని సూర్యం అడిగిన మాటలు ముల్లులా గుచ్చుకుని అతని మనస్సుకి కొద్దిగా బాధకలిగించాయి. సూర్యం చెప్పిన విషయం నిజమే. తన కొడుకు సుధాకర్ ప్రవర్తన, స్వభావం, భావోద్వేగాలు తెలిసిన వాళ్ళు అలా అడగటంలో తప్పులేదు. ఒకనాడు తన కొడుక ప్రవర్తన తన యడల నెగిటివ్ గానే ఉండేది.

తన దగ్గర చదువుకుంటే తమ పిల్లలకి చదువు లబ్బుతాయి. క్రమశిక్షణ అలవడుతుందని తన అన్నయ్య కొడుకుని, తమ్ముడు కొడుకుని చదువుకి తన దగ్గర ఉంచి చదివించారు. వారు తన దగ్గర వినయంగా ఉండేవారు. క్రమశిక్షణతో చదువుకున్నారు అయితే తన కొడుకు మాత్రం కొద్దిగా క్రమశిక్షణ తప్పుతున్నాడా అని తనకి అనిపించేది. అందుకే అంటారు పెరటి చెట్టు మందుకు పనికి రాదని.

తను ఎందుకు బాధపడున్నాడంటే మొదట్నించి తన కొడుకు ప్రవర్తన నెగిటివ్‌గా లేదు. వయస్సు పెరుగుతూ ఉంటే పరిసరాలు, పరిస్థితుల ప్రభావం వల్ల తన కొడుకు అలా తయారయ్యాడు అని తను అనుకుంటాడు.

ఒక్క పరిసరాల ప్రభావమే కాదు తన వల్ల కూడా అలా తయారయ్యాడేమో! తన తమ్ముడు కొడుకుని, అన్న కొడుకుని, తన దగ్గర ఉంచుకుని చదివించడం వల్ల తనకేదో మంచి పేరు వస్తుందని అలా చేస్తున్నానని అందరూ అనుకోవచ్చు కాని ‘నా వల్ల కాదు. మీ పాట్లు ఏవో మీరే పడండి’ అని తన వాళ్ళకి తను చెప్పలేక పోవడం తన బలహీనత.

ఆ బలహీనత వల్లనే తన కొడుకు అవసరాలు తీర్చలేకపోయాడు. సరదాలు నెరవేర్చలేక పోయాడు. అందుకే కొడుక్కి విముఖత తన మీద ఏర్పడింది. భావ మనోవికారలయిన కోపం, అసహ్యం, ద్వేషం తన మీద కలిగాయి. లేకపోతే కొడుక్కి తనంటే ఎంత ప్రేమ. ఎప్పుడూ తనని వదిలి ఒక్కక్షణ ఉండేవాడు కాదు. తను స్కూలు నుండి రావడం లేటయితే తన కోసం ఎదురు చూసేవాడు. అలాంటి సుధాకర్ ప్రవర్తన నెగిటివ్‌గా మారిపోయింది.

తరానికి తరానికి మద్యనున్న తేడాలు కూడా దీనికి కారణం అవచ్చు అని తను ఒక్కొక్క పర్యాయం అనుకుంటాడు. తను సరస్వతితో మాట్లాడితే తమ వేపు అనుమానంగా చూసేవాడు తన తండ్రి. అతని ఆ స్వభావం తనకి చిరాకనిపించేది. తన తరంలోనే అలాగున్నప్పుడు కొడుకు తరంలో తన ప్రతీచర్య కొడుక్కి చిరాకు తెప్పిస్తోంది. తన అస్తిత్వాన్ని సహించలేకపోతున్నాడు. పరోక్షంగా నిశితంగా విమర్శిస్తున్నాడు. రేపొద్దున్న తన కొడుక్కి కొడుకు పుట్టినా అంతే తన తండ్రి పద్ధతిని అలవాట్లని విమర్శించవచ్చు. ఇది తరాలలో ఉన్న తేడా. సమాజంలో వచ్చిన మార్పుల వల్ల తేడా.

సుమిత్ర అదృష్టమో, లేక మరేదైనా అవచ్చు తన అన్నయ్య కొడుకుని, తమ్ముడు కొడుకుని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుపోయారు. ఏదైనా మన మంచికే ఇప్పుడేనా తన కొడుకు సరదాలు తీర్చాలి. కోరికలు తీర్చాలి. లేకపోతే డొక్కు సైకిలేస్కూలుకి తీసుకు వెళ్తున్నాడు. వాడికి ఓ మంచి సైకిలు కొనాలి. ఇది తన ఆలోచనలు. అయితే జరగవల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది. కొడుక్కి ఎన్ని సదుపాయాలు చేసినా తన మీదున్న నెగిటివ్ థింకింగు పోలేదని తెలిసిన నాడు తనెంతో తల్లడిల్లిపోయాడు.

వయస్సు ప్రభావం కూడా కొడుకు మీదుంది. కిశోరావస్థ వచ్చేవరకూ తనని ఎంతో అభిమానించిన కొడుకు. తనని ఒక్క క్షణం వదిలి పెట్టని కొడుకు ఆ వయస్సు వచ్చేప్పటికి ఇలా తయారయ్యాడని తను చింతించాడు. తనకి తెలియనిదేఁ ఉంది. బాలమనో విజ్ఞాన తెలిసిన తను ఆ అవస్థను అర్థం చేసుకో గలడు. ఈ అవస్థలో ప్రతీ బాలబాలికల్లో శారీరకంగా – మానసికంగా అనేక మార్పులు సంతరించుకుంటాయి. అప్పుడే వారిలో నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్ అయినా చోటు చేసుకుంటాయి.

ఈ వయస్సు గల వారికి సరిస్థితులు, పరిసరాలు సక్రమంగా ఉంటే పాజిటివ్ థింకింగ్, అనుకూలంగా లేకపోతే నెగిటివ్ థింకింగ్‌కి అవకాశముంది. వాస్తవంగా చూస్తే తన క్లాసుమేట్సు దర్జాగా ఉండడం. వాళ్ళకి పేరెంట్స్ పాకెట్ మనీ రూపంలో డబ్బులు దండిగా ఇయ్యడం, పార్టీలకి, ప్రెండ్సుకి వాళ్ళు ఆ డబ్బు విరివిగా ఖర్చు పెట్టడం… ఇవన్నీ చూసిన కొడుకు మనస్సులో అసంతృప్తి చోటు చేసుకుంది. అసహనానకి గురయ్యేవాడు. కొడుకు చిన్న పాటి కోరిక కూడా తీర్చలేని అసమర్థుడయ్యాడు తను ఆ సమయంలో.

క్లాసుమేట్సు టూర్లకి, పిక్నిక్‌లకి వెళ్ళున్నప్పుడు తను కూడా వెళ్తానని అడిగేవాడు. అయితే కొడుకు ఆ కోరికను కూడా తను తీర్చలేదు. ఆర్థిక లోటే కాకుండా అభద్రతా భావం కూడా తనలో ఉండేది. చెడు స్నేహాలు, ఖరీదైన స్నేహాలు చేసి కొడుకు పాడవుతాడన్న భావన. అంతే కాక ఒక్క పిల్లాడు, ఒంటరిగా పంపకూడదు. ఎక్కడ ఎప్పుడు ఏ ఆపద వస్తుందో అన్న మమకారంగా భావం ఇవన్నీ తమమీద కొడుక్కి నెగిటివ్ థింకింగ్ ఏర్పడడానికి కారణమయ్యాయి.

ఇలా విశ్లేషించుకుంటూ ఉంటే కొడుకు ప్రవర్తన అనేక కారణాలు అగుపిస్తాయి. మంది ఎక్కువయితే మజ్జిగ పలచనవుతుంది అంటారు. అలాగే అప్పటి ఇంటి ఆర్థిక పరిస్థితులు కూడా కొడుకు అసహనం ఎక్కువ చేశాయి. ఆ అసహనం ఎంత వికృత రూపం దాల్చిందంటే ఇంటి వాతావరణాన్ని ఇంట్లో వాళ్ళని అసహ్యించుకునే స్థాయికి వచ్చాయి.

ఒకానొక దశలో ‘మీకూ, నాకూ ఏ సంబంధం లేదు’ అని కూడా అన్నాడు కొడుకు ఆ మాటలకి తన మనస్సు విలవిల్లాడింది. సమాజంలో మానవతా విలువలు పడిపోతున్నాయి అని బాధపడుతున్న సమయంలో రక్తసంబంధాలు కూడా మసక బారిపోతున్నాయి అని బాధపడ్డాడు. తను కొడుకు ప్రవర్తన తమిద్దర్నీ చాలా బాధించేది. అయితే ఏఁ చేయలేని పరిస్థితి. కాలమే సమస్యని పరిష్కరించాలి అని తను సుమిత్ర అనుకునేవారు. కొడుకు వ్యవహారం తనమీద ఎలా ఉన్నా తండ్రిగా తన బాధ్యత తీర్చాలి… అనుకున్న తను కొడుకు చదువు విషయంలో డబ్బు ఖర్చు పెడ్తూ తన బాధ్యత తీర్చుకుంటున్నాడు.

తన విషయం అలా ఉంచితే మరి సుమిత్ర విషయమో కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది అనుకుని సుధాకర్‌ని అపురూపంగా చూసుకునేది. అయితే సుధాకర్ ప్రవర్తనకి చాలా బాధపడేది. కొడుకు ఇలా తయారవడాన్ని తట్టుకోలేక పోయేది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here